శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు, తమన్నా కథానాయక-నాయికలుగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాం ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన సినిమా "ఆగడు". సోనూ సూద్ ప్రతినాయకుడిగా నటించగా శ్రుతి హాసన్ ఒక ప్రత్యేక గీతంలో నర్తించింది. వీరు కాక ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, ఎం. ఎస్. నారాయణ, ఆశిష్ విద్యార్థి, పోసాని కృష్ణమురళి ముఖ్యపాత్రలు పోషించారు. ఎస్. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి కే.వి. గుహన్ ఛాయాగ్రాహకునిగా, ఎం.ఆర్. వర్మ ఎడిటరుగా పనిచేసారు. రాయలసీమలోని అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ప్రాంతం నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు పోలీస్ అధికారిగా నటించాడు.[2]
ఈ కథ శంకర్ అనే తెలివైన అనాథని రాజానరసింగరావు అనే పోలీస్ చేరదీయడంతో మొదలవుతుంది. అనుకోని కారణాల వల్ల శంకర్ ఒక కుర్రాడిని చంపేయడంతో రాజానరసింగరావు అతనితో తెగతెంపులు చేసేసుకుంటాడు. మర్డర్ కేసులో అరెస్ట్ అయిన శంకర్ బోస్టన్ స్కూల్ లో చదివి పోలీస్ అవుతాడు. అప్పుడే అనతపురం జిల్లాలోని తాడిపత్రి దగ్గర బుక్క పట్టణంలో దామోదర్ చేస్తున్న అరాచకాలను అరికట్టడానికి శంకర్ ని బుక్క పట్టణం సిఐగా పంపిస్తాడు. అక్కడ సరోజ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. మధ్యలో శంకర్ కి ఓ నమ్మలేని నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏమిటి ? దామోదర్ ఆగడాలను ఎలా అడ్డుకున్నాడు ? అలాగే శంకర్ చేసిన మర్డర్ వెనకున్న నిజా నిజాలేమిటి ? అనేది మిగిలిన కథ.
ఈ సినిమా హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్ భవనంలో 2013 అక్టోబరు 25న అధికారికంగా ప్రారంభించబడింది.[3] ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాదులో 2013 నవంబరు 28న మొదలయ్యింది.[4] ఈ సినిమా చిత్రీకరణ 2014 సెప్టెంబరు 5న ఊటీలో ముగిసింది.[5] ఈ సినిమా భారీ అంచనాల నడుమన దాదాపు 2000 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా 2014 సెప్టెంబరు 19న విడుదల అయ్యింది.[6][7][8]
కథ
చైన్ స్నాచింగ్ ముఠాని తన తెలివితేటలతో పోలీసులకు పట్టించిన శంకర్ అనే అనాథని రాజారావు అనే పోలీస్ అధికారి దత్తత తీసుకుంటాడు. తను, తన కొడుకు భరత్ శంకర్ ని తమ సొంతవాడిగానే చూసుకుంటారు. ఒకసారి భరత్ ఒక కుర్రాడి చావుకు కారణమవుతాడు. ఆ నింద తనమీద వేసుకుని జైలుపాలై రాజారావుకి శాశ్వతంగా దూరమవుతాడు శంకర్. జైల్లోని బాస్టన్ స్కూల్లో చదివి సర్కిల్ ఇన్స్పెక్టరుగా మారుతాడు. ఎంకౌంటర్ శంకర్ అని పోలీస్ శాఖచేత పిలువబడుతూ తను పనిచేసే చోట ఎక్కడా నేరస్తులకు నిద్రలేకుండా చేస్తుంటాడు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో బుక్కపట్నంలో దామోదర్, అతని అనుచరుల అరాచకాలు ఎక్కువవుతున్నాయని తెలుసుకున్న కమిషనర్ మానవ హక్కుల సంఘం కార్యదర్శి ప్రకాష్, జిల్లా కలెక్టర్ మరియూ అతని భార్య హత్యల నేపథ్యంలో శంకర్ని అక్కడికి బదిలీ చేస్తాడు. ఈ హత్యలకు కారణం దామోదర్ కట్టాలనుకుంటున్న పవర్ ప్రాజెక్ట్ పర్యావరణానికి, జనాల ప్రాణాలకి అత్యంత హానికరం అని ప్రకాష్ నివేదిక ఇవ్వడమే. దామోదర్, అతని తమ్ముడు దుర్గ దుబాయిలో హాలిడేలో ఉండగా అక్కడికి టూరిస్ట్ గైడుగా ఒక పోలీస్ అధికారిని పంపి ఈ ప్రాజెక్టుకు ఎవరు సహకరిస్తున్నారనే సాక్ష్యాలు సంపాదిస్తాడు.
ఇక్కడ అనంతపురంలో దామోదర్ నడుపుతున్న అక్రమ మద్యం, బెట్టింగ్, కల్తీ వ్యాపారాలను మూయించేస్తాడు. ఇదంతా జరుగుతుండగా శంకర్ సరోజ అనే స్వీట్ షాప్ ఓనరుని ప్రేమిస్తాడు. డబ్బిస్తే ఒక వ్యక్తి గురించి ఎలాంటి సమాచారమైన ఇవ్వగలిగే డేటాబేస్ దానయ్య సహాయంతో సరోజ గురించి తెలుసుకుని కొంత కాలం తర్వాత ఆమె మనసును గెలుచుకుంటాడు. దామోదర్ దుబాయి నుంచి తిరిగి రాగానే తన కళ్ళ ముందే తన వాళ్ళని కొట్టి న్యాయస్థానం ఆదేశాలతో ప్రాజెక్టుపై స్టే తీసుకొస్తాడు. శంకర్ ఇచ్చిన ధైర్యంతో ఎస్పీ మల్లిఖార్జున్ దగ్గరికి వెళ్ళి శేఖర్ అనే సాక్షి ప్రకాష్ హత్య గురించి వివరాలిస్తాడు. మరుసటిరోజు దామోదర్ బెదిరించడం వల్ల శేఖర్ చివరి నిమిషంలో మాట మారుస్తాడు. మల్లిఖార్జున్ వివరణ ఇవ్వకుంటే నిన్ను సస్పెండ్ చేయ్యాల్సివస్తుందని శంకర్‌తో చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కుర్రాడి హత్య వెనకున్న నిజం తెలుసుకున్న రాజారావు ద్వారా చనిపోయిన కలెక్టర్ రాజారావు కొడుకు భరత్ అని, ప్రాజెక్ట్ ఆపేందుకు ప్రయత్నించడంతో దామోదర్, అతనితో కుమ్మక్కైన మల్లిఖార్జున్, కేంద్రమంత్రి నాగరాజు భరత్, అతని భార్యపై నిందలెయ్యడంతో ఒక రాత్రి శంకర్ గురించి నిజం చెప్పి విషం తాగి భరత్, అతని భార్య చనిపోతారు.
పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్న శంకర్ దామోదర్ దగ్గరికెళ్ళి నేను మీ మనిషిగా పనిచేస్తానని నమ్మిస్తాడు. ఆ ప్రాజెక్టుకి ఫైనాన్స్ చేసే ఢిల్లీ సూరి గురించి దానయ్య ద్వారా తెలుసుకుని అతన్ని ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అడిగేలా పరోక్షంగా ఉసిగొలిపి అతని ద్వారా నాగరాజు చావుకి కారణమవుతాడు. దామోదర్ ప్రేయసి సుకన్య ఒకప్పుడు బి-గ్రేడ్ సినిమాల్లో పనిచేసిందని, ఆమెపై కన్నేసిన మల్లిఖార్జున్ నపున్సకుడని దానయ్య ద్వారా తెలుసుకున్న శంకర్ సూరి సహాయంతో మల్లిఖార్జున్ సుకన్యపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని దామోదర్ ని నమ్మించి సూరి ద్వారా విషం కలిపిన ఆహారాన్ని మల్లిఖార్జున్ చేత తినిపించి చంపుతాడు. ఈలోపు శంకర్, సరోజల నిశ్చితార్థం జరిగిపోతుంది. సరైన సమయం చూసి భరత్ బావమరిది సహాయంతో దుర్గ దామోదర్ ని ఆస్తి కోసం చంపాలని చూస్తున్నాడని దామోదర్ ని నమ్మించి దుర్గని చంపేలా చేస్తాడు. ఇలా తను శంకర్ చేతిలో ఇరుక్కోడానికి కారణమైన దానయ్య ఆఫీసును ధ్వంసం చేసిన సూరిపై పగ పెంచుకున్న దానయ్య దామోదర్‌కి ఫోన్ చేసి సూరి మిమ్మల్ని మోసం చేసాడని చెప్తాడు. సూరిని చంపబోతుండగా శంకర్ అక్కడికొచ్చి తను చేసిన మాయని వివరిస్తాడు. శంకర్, దామోదర్ మధ్య జరిగిన పోరాటంలో బుక్కపట్నం జనం చూస్తుండగా శంకర్ దామోదర్ని చంపేస్తాడు. భరత్ సేవలకి ప్రభుత్వం పురస్కారం అందజేయగా సూరిని పోలీస్ శాఖ శంకర్ కింద నిఘా వ్యవస్థలో అధికారిగా నియమిస్తారు.
బాద్‍షా సినిమా విజయం సాధించాక కోన వెంకట్, శ్రీను వైట్లల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. వారిద్దరూ ఇక మళ్ళీ కలిసి పనిచెయ్యమని తేల్చి చెప్పేసారు.[9] ఆ తర్వాత బాద్‍షా తర్వాత తన తదుపరి సినిమా మహేష్ బాబుతో చెయ్యబోతున్నాని ప్రకటించిన శ్రీను వైట్ల గోపీమోహన్ సహకారంతో ఈ సినిమాకి తన సొంత స్క్రిప్ట్ రాసుకున్నాడు.[10] ఈ సినిమా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించబడుతుందని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో కూడా దూకుడు సినిమాకి పనిచేసిన సాంకేతికవర్గం పనిచేస్తుందని వెల్లడించారు.[11] ఒక స్థితిలో ఈ సినిమా దూకుడుకి కొనసాగింపుగా వస్తున్న సినిమా అని వార్తలొచ్చాయి. కానీ వాటిని పుకార్లుగా దర్శకనిర్మాతలు కొట్టిపారేసారు.[12] మొదట 2013 అక్టోబరు 16న సినిమా ముహూర్తం నిర్వహించాలనుకున్నా[13] నటుడు శ్రీహరి హఠాన్మరణం వల్ల ఆయనకు నివాళిగా ఈ సింజిమా ముహూర్తం 2013 అక్టోబరు 25కి వాయిదా పడింది.[14] అదే తేదిన ఈ సినిమా రామానాయుడు స్టూడియోస్ లోపల ప్రారంభించబడింది. దగ్గుబాటి రామానాయుడు, శ్యాం ప్రసాద్ రెడ్డి ఈ ప్రారంభోత్సవానికి హాజరై, క్లాప్ కొట్టి ముహూర్తం సన్నివేశాన్ని చిత్రీకరించారు.[3]
నటీనటుల ఎన్నిక
ఈ సినిమాలో మొదట ఎన్నుకోబడ్డ నటుడు మహేష్ బాబు. ఈ సినిమాలో ఆయన తన కెరియర్లో మూడోసారి పోలీస్ అధికారిగా కనిపించనున్నారని వార్తలొచ్చాయి.[16] చాలా మంది హీరోయిన్ల పేర్లు పరిశీలించాక తమన్నా కథానాయికగా ఎంపికయ్యిందని వార్తలొచ్చాయి.[17] ఆగస్టు నెలచివర్లో తమన్నా స్థానంలో కథానాయికగా శ్రుతి హాసన్ ఎంపికయ్యారని వార్తలొచ్చాయి.[18] సెప్టెంబరు నెలలో ప్రముఖ హిందీ నటుడు అనీల్ కపూర్ కూతురు, నటి అయిన సోనమ్ కపూర్ మహేష్ బాబు సరసన నటించడం తన కల అని అనడం గతంలో తను ఈ సినిమాలో కథానాయికగా ఎన్నికయ్యిందన్న వార్తలకు బలం చేకూర్చింది.[19] అయితే తను ఆ సినిమాలో నటించడం లేదని తనే స్వయంగా స్పష్టం చేసింది.[20] ఆ తర్వాత అక్టోబరు నెలమధ్యలో శ్రీహరి చనిపోవడం వల్ల ఆయన చేయాల్సిన పాత్రని ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ నటిస్తారని వార్తలొచ్చాయి.[21] అక్టోబరు నెలమధ్యలో ఆగడులో బ్రహ్మానందం నటించడం లేదని వార్తలొచ్చాయి.[22] కానీ ఆయన సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు అధికారికంగా వెళ్ళడయ్యింది.[23] అక్టోబరు నెలచివర్లో తమన్నా ఈ సినిమాలో కథానాయికగా ఎంపికయ్యిందని వెళ్ళడించారు. తద్వారా మహేష్ బాబు సరసన తమన్నాకి ఇది తొలిచిత్రంగా మారింది.[24] ఈ సినిమాలో తమన్నా పూర్తి స్థాయి మాస్ పాత్రలో కనిపించనుందని వార్తలొచ్చాయి.[25]
నవంబరు నెలమొదట్లో నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రిగా నటించనున్నారని వార్తలొచ్చాయి.[26] నవంబరు నెలమధ్యలో తమన్నా డేట్స్ సద్దుబాటు చెయ్యలేక తప్పుకుందని వార్తలొచ్చాయి. వాటిని ఖండిస్తూ ఆగడులో తప్ప ఆ సమయానికి తమన్నా వేరే సినిమాలో నటించడంలేదని, బల్క్ డేట్స్ ఇచ్చిందని, ఆ సినిమా తనకి టాఫ్ ప్రయారిటీ అని తమన్నా మేనేజర్ స్పష్టం చేసాడు.[27][28] డిసెంబరు నెలచివర్లో నదియా ఈ సినిమాలో మహేష్ బాబుకి అక్కగా నటిస్తోందని,[29] తమన్నా ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తోందని వార్తలొచ్చాయి.[30][31] జనవరి 2014 నెలచివర్లో ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పాత్ర చాలా డిఫెరెంట్ గా ఉండనుందని సమాచారం. ఇందులో తొలిసారిగా ప్రకాశ్ రాజ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, ఆ రెండు పాత్రల్లో ఒకటి నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని, ఈ రెండు పాత్రలు మధ్యా వైవిధ్యం చూపెడుతూ శ్రీనువైట్ల స్క్రిప్టుని రూపొందించాడని, సినిమా హైలెట్స్ లో ఇది ఒకటి అని వార్తలొచ్చాయి.[32] అయితే తను ఈ సినిమాలో ప్రతినాయకుడిగా మాత్రమే నటిస్తున్నాని, ద్విపాత్రాభినయం చెయ్యడంలేదని తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసారు ప్రకాశ్ రాజ్.[33] ఏప్రిల్ నెలమొదట్లో సోనూ సూద్ ఈ సినిమా తారాగణంలో ఒకరయ్యారని శ్రీను వైట్ల తన ట్విట్టర్లో స్పష్టం చేసారు.[34]
అయితే సోనూ సూద్ ప్రకాష్ రాజ్ చెయ్యాల్సిన పాత్రకు ఎన్నుకోబడ్డారని, ప్రకాష్ రాజ్ ప్రతీ చిన్న విషయానికీ చిరాకు పడటం, మాటిమాటికీ అసిస్టంట్ డైరెక్టర్లపై అరవడం, ఆప్రిల్ 2న చిత్రీకరణ మొదలుపెట్టి 3వ తేదీన రాననడం వంటి చర్యలే ఆయన స్థానంలో సోనూ సూద్ ను ఎన్నుకునేలా చేసాయని వార్తలొచ్చాయి.[35] మే 11న తమన్నా తన వేషధారణను ట్విట్టర్ ద్వారా బయటపెట్టింది. ఆ ఫొటోల్లో తమన్నా సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని, జడలో పూలు పెట్టుకుని కనిపించింది.[36] తమన్నా ఫొటోలకు మంచి స్పందన లభించింది.[37] జూన్ నెలమొదట్లో ఈ సినిమాలో శ్రుతి హాసన్ ఐటెం సాంగులో నటించబోతోందని, ఇందుకోసం నిర్మాతలు తనని సంప్రదిస్తే తను మొదట నిరాకరించినా తర్వాత ఒప్పుకుందని వార్తలొచ్చాయి. ఈ విషయమై సంగీత దర్శకుడు తమన్ ట్వీట్ చేస్తూ " ఆగడు ఐటం సాంగ్ గురించి ఓ సెన్షేషనల్ న్యూస్ మరి కొద్ది రోజుల్లో చెప్తాం. మా టీమ్ మొత్తం చాలా ఎక్సైంటింగ్ గా ఉన్నాం" అని అన్నాడు.[38] 2014 జూన్ 4న తమన్ ఈ సినిమాలో శ్రుతి హాసన్ ఐటెం సాంగులో మహేష్ సరసన నర్తిస్తోందని తన ట్విట్టర్లో స్పష్టం చేసాడు.[39]తనికెళ్ళ భరణి ఈ సినిమాలో తమన్నా తండ్రిగా, హాస్యభరితమైన ప్రతినాయక పాత్రలో నటిస్తున్నట్టు జూలై నెలలో తెలిసింది.[40]
చిత్రీకరణ
మొదట ఈ సినిమా చిత్రీకరణ నవంబరు 2013 నెలలో మొదలుపెట్టాలని భావించారు.[41] నవంబరు 15న మొదలుపెట్టి ఏప్రిల్ 2014 కల్లా చిత్రీకరణ పూర్తిచేసి మే నెలలో విడుదల చెయ్యాలని భావించారు.[42] అయితే మహేష్ 1 - నేనొక్కడినే సినిమా చిత్రీకరణ చివరి దశలో పాల్గొనడం వల్ల చిత్రీకరణ నవంబరు 28 నుంచి మొదలుపెట్టాలని భావించారు.[43] ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం చిత్రీకరణ 2013 నవంబరు 28న హైదరాబాదులో మొదలయ్యింది.[4] ఆపై డిసెంబరు నెలమొదట్లో అక్కడే మహేష్, ఎం. ఎస్. నారాయణ, వెన్నెల కిశోర్ లపై హాస్యసన్నివేశాలు చిత్రీకరించారు.[44] మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుని 1 - నేనొక్కడినే సినిమా చివరి షెడ్యూల్లో పాల్గొన్న మహేష్ 2013 డిసెంబరు 27 నుంచి పోలీస్ స్టేషను సెట్లో ఈ సినిమా చిత్రీకరణను కొనసాగించారు.[45] జనవరి 2014 మొదటివారంలో శ్రీను వైట్ల, ఛాయాగ్రాహకుడు కె.వి.గుహన్ లోకేషన్ల కోసం గుజరాత్ వెళ్ళారు. సంక్రాంతి తర్వాత రెండో షెడ్యూల్ మొదలవుతుందని స్పష్టం చేసిన దర్శకనిర్మాతలు జనవరి 18 నుంచి హైదరాబాదులో కొత్త షెడ్యూల్ మొదలవుతుందని వెళ్ళడించారు.[46] మహేష్ తాడిపత్రి శివార్లలో చిత్రీకరణలో పాల్గుంటే అక్కడికి తనని చూడటానికి వచ్చే అభిమానులని ఆపడం కష్టమని భావించి గుజరాత్ పరిసరాల్లో తాడిపత్రి సెట్స్ నిర్మాణం చేపట్టారు.[47] సంక్రాంతి పండగ వల్ల షూటింగ్ వాయిదా వేసిన తర్వాత జనవరి 18 నుంచి మహేష్ షూటింగులో పాల్గుంటాడని వార్తలొచ్చాయి.[48] జనవరి 18 నుంచి హైదరాబాదులోని సారథి స్టూడియోసులో కోర్ట్ సెట్లో చిత్రీకరణ కొనసాగింది.[49] జనవరి 22న తమన్నా సినిమాలో తన పాత్ర చిత్రీకరణను మొదలుపెట్టింది.[50] ఆపై నానక్రామ్ గూడాలో పోరాట సన్నివేశాలతో కలిపి మరికొన్ని ముఖ్యసన్నివేశాలు అక్కడ నిర్మించిన ఒక సెట్లో చిత్రీకరించారు.[51] ఆపై ఫిబ్రవరి నెలమొదట్లో మహేష్, తమన్నాలపై హైదరాబాదు శివార్లలో సన్నివేశాలు చిత్రీకరించారు.[52] రామోజీ ఫిల్మ్ సిటీలో మండువా హౌస్ ప్రాంతంలోని సెట్లో ఫిబ్రవరి 5న తమన్నా, గిరిధర్ నిశ్చితార్థం జరిపేందుకు రెండు కుటుంబాలు సిద్ధమవుతున్నప్పుడు మహేష్ వచ్చి ఆ నిశ్చితార్థాన్ని ఆపి తన ప్రేమను తెలియజేసే సన్నివేశాన్ని చిత్రీకరించారు.[53][54] ఆపై ఫిబ్రవరి 23 నుంచి చిత్రీకరణ గుజరాత్ పరిసరాల్లో కాకుండా బళ్ళారిలో జరుగుతుందని, ఆ షెడ్యూల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, హీరో ఇంట్రడక్షన్ పాట తెరకెక్కిస్తామని స్పష్టం చేసారు.[55] మొదట బళ్ళారి షెడ్యుల్లో భాగంగా ఫిబ్రవరి 23 నుంచి ఇంట్రడక్షన్ పాట చిత్రీకరణ అక్కడున్న జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీలో మొదలయ్యింది.[56]
అక్కడ బాగా దుమ్ము, ధూళి నడుమ కూడా మహేష్ చిత్రీకరణ కొనసాగించాడు.[57] అయితే ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన సన్నివేశం ఒకటి లీకైంది. బ్యాక్ గ్రౌండులో ఓ గనికి సంబంధించిన బ్లాస్టింగ్ జరుగుతుండగా ఫుల్ హ్యాండ్స్ షర్టు మడత పెట్టుకుంటూ మహేష్ నడుచుకుంటూ వస్తున్న సన్నివేశం ఆ వీడియోలో ఉంది.[58] ఆపై మార్చి నెలమొదట్లో బళ్ళారి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తులూరులోని ప్రకృతి అందాల నడుమ మహేష్, తమన్నా మరియూ 50 డాన్సర్లు ప్రేమ్ రక్షిత్ నృత్యదర్శకత్వంలో ఓ పాటను చిత్రీకరించారు. ఆ పాటలో ఇద్దరూ చాలా అందంగా ఉన్నారని ప్రొడక్షన్ వర్గాలు చెప్పారు.[59] ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించారు.[60] అయితే చిత్రీకరణ జరుగుతుండగా మహేష్ కాలిలోని కండరాలకు బలమైన గాయమయ్యిందని, అందువల్ల వారం పాటు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సలహా ఇవ్వడం వల్ల షూటింగ్ ఆగింది అని వార్తలొచ్చాయి.[61] అక్కడ చిత్రీకరణ పూర్తయ్యాక బళ్ళారి నుంచి సినిమా బృందం మార్చి 6న హైదరాబాదుకు తిరిగొచ్చింది.[62][63] వారం పాటు విశ్రాంతి తీసుకొమ్మని వైద్యులు సలహా ఇచ్చిన మాట నిజమే అయినా మహేష్ కాలికి ఎలాంటి గాయాలు తగల్లేదని, కాకపోతే బాగా అలిసిపోయి శక్తి కోల్పోయాడని, మార్చి 10 నుంచి హైదరాబాదులో జరగబోయే షెడ్యూల్లో మహేష్ పాల్గుంటాడని దర్శకనిర్మాతలు స్పష్టం చేసారు.[64] మార్చి 16 నుంచి మహేష్, తమన్నా ఇద్దరూ చిత్రీకరణలో పాల్గొంటారని వార్తలొచ్చాయి.[65] ఈలోపు హైదరాబాదులో చిత్రీకరణ జరుగుతుండగా ఏప్రిల్ నెలలో చిత్రీకరణ గుజరాత్ పరిసరాల్లో జరుగుతుందని, అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తారని వార్తలొచ్చాయి.[66] ఇంతలో మార్చి నెలచివర్లో చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలోని ఒక సెట్లో కొనసాగింది. అక్కడ తమన్నా స్వీట్ షాప్ యజమానిగా కనిపించే దృశ్యాలు కూడా తెరకెక్కించారు.[67] అయితే భారీ ఎండల దృష్ట్యా గుజరాత్, రాజస్థాన్లకు బదులుగా ఏప్రిల్ 10 నుంచి చిత్రీకరణ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జరుగుతుందని వార్తలొచ్చాయి.[68] మార్చి నెలచివర్లో రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణలో రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.[69] సోనూ సూద్ ముంబైలో షారూఖ్ ఖాన్ "హ్యాపీ న్యూ ఇయర్" చిత్రీకరణ పూర్తి చేసుకుని ఏప్రిల్ 3న హైదరాబాదులో ఈ సినిమా షూటింగులో పాల్గొని మళ్ళీ సాయంత్రం ముంబై వెళ్ళి "హ్యాపీ న్యూ ఇయర్" చిత్రీకరణలో పాల్గొన్నాడు. దాదాపు ఒక వారం పాటు ఇదే చర్య కొనసాగింది. ఆ వారం రోజుల్లో మహేష్, సోనూ సూద్ లపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.[70]
ఆ తర్వాత హైదరాబాదులోని చిరాన్ ఫోర్ట్ క్లబ్ భవనం దగ్గర సినిమా యొక్క ఫ్లాష్ బ్యాక్ సీన్లను తెరకెక్కించారు.[71] కొంత విరామం తర్వాత తదుపరి షెడ్యూల్ హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఎండల మధ్య ఏప్రిల్ 27 నుంచి మొదలయ్యింది.[72][73] ఆపై శంషాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ కొనసాగింది.[74] మే 7న రామోజీ ఫిల్మ్ సిటీలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రబృందం రానున్న కాలంలో తమ తదుపరి షెడ్యూల్ గుజరాత్ రాష్ట్రంలో మొదలుపెట్టనున్నారని, అక్కడ కొన్ని పోరాట సన్నివేశాలు, పాటలు చిత్రీకరిస్తారని వెళ్ళడించారు.[75] ఈలోపు హైదరాబాదులో చిత్రీకరణ జరుగుతుండగా మే 11న తమన్నా సెట్లో అడుగుపెట్టింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసిన తమన్నా ఒక వర్కింగ్ స్టిల్ పోస్ట్ చేసి తద్వారా సినిమాలో తన వేషధారణను విడుదల చేసింది.[76] కొన్ని రోజుల తర్వాత చిత్రబృందం హైదరాబాదులో షెడ్యూల్ పూర్తవ్వగానే మే 20 నుంచి తదుపరి షెడ్యూల్ లడఖ్ ప్రాంతంలో మొదలవుతుందని స్పష్టం చేసింది. రెండు పాటలు, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్న ఈ షెడ్యూల్లో మహేష్, తమన్నా పాల్గుంటారని దర్శకనిర్మాతలు స్పష్టం చేసారు.[77] లడఖ్ లోని పన్గాంగ్ లేక్ వద్ద మహాష్ బాబు, తమన్నాలపై ఓ పాటని చిత్రీకరించారు. ఈ పాటకి దినేష్ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేసాడు. లడఖ్ షెడ్యూల్ మే 30 వరకు అక్కడ కొనసాగింది. ఆ షెడ్యూల్ పూర్తయ్యాక మరలా చిత్రీకరణ జూన్ మొదటి వారంలో రామోజీ ఫిల్మ్ సిటీలో కొనసాగుతుందని చిత్రబృందం స్పష్టం చేసింది. ఈ షెడ్యూల్ లో సినిమాలోని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తారని వార్తలొచ్చాయి.[78][79] ఆ తర్వాత జూన్ రెండోవారంలో చిత్రీకరణ ముంబైలో కొనసాగింది. అక్కడ కొన్ని పోరాట సన్నివేశాలను తెరకెక్కించాక సినీబృందం కొన్ని కీలకమైన ప్రేమ సన్నివేశాలను 15 రోజుల పాటు కేరళలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరిస్తారని వార్తలొచ్చాయి.[80][81] ముంబై షెడ్యూల్ జూన్ 18న పూర్తవ్వగా తదుపరి షెడ్యూల్ బళ్ళారి, కేరళలో జూన్ 22 నుంచి జరుగుతాయని వార్తలొచ్చాయి.[82] బళ్ళారిలోని జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ పరిసరాల్లో కొన్ని ముఖ్యమైన పోరాట సన్నివేశాలను తెరకెక్కించారు. విపరీతమైన దుమ్ము-ధూళి మధ్య చిత్రీకరణ జరపడం వల్ల మహేష్ అనారోగ్యానికి గురయ్యాక వైద్యులు జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడని ధ్రువీకరించడంతో కొంతసేపు షూటింగ్ ఆగింది.[83][84] బళ్ళారిలో చిత్రీకరణ ముగించుకుని హైదరాబాదు తిరిగొచ్చాక 2014 జూలై 3 నుంచీ ఒక ప్రత్యేకమైన సెట్లో మహేష్, శ్రుతి హాసన్ లపై ఒక పాటను తెరకెక్కించారు.[85]
చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట శివారులోని సుచిరిండియా వెంచర్‌లోని మైదాన ప్రాంతంలో పవర్ ప్రాజెక్ట్ సెట్ వేశారు. భారీ క్రేన్‌లతో పవర్ ప్రాజెక్ట్ వద్ద వందల మంది కూలీలు పనిచేసే సన్నివేశాలను, ప్రాజెక్ట్ నిర్మాణం సన్నివేశాలను చిత్రీకరించారు. మహేష్ గన్‌పేల్చుతూ రౌడీలను అడ్డుకోవడం; సోనూసూద్, రౌడీలతో ఫైటింగ్ సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న అభిమనులు, పరిసర ప్రాంత ప్రజలు భారీగా తరలివచ్చారు.[86] ఆ తర్వాత హైదరాబాదులో చిత్రీకరణ పూర్తికాగానే 2014 ఆగస్టు 12 నుండి నార్వే దేశంలో మహేష్, తమన్నాలపై ఒక పాటను చిత్రీకరిస్తారని వార్తలొచ్చాయి. నార్వే వెళ్ళేముందు హైదరాబాదులో కొన్ని సన్నివేశాలు, శ్రుతి హాసన్ ఐటెం సాంగ్ తెరకెక్కించాలనుకున్నారు.[87] అందులో భాగంగా రామానాయుడు స్టూడియోలో పరిసరాల్లోని ఓ భవంతిలో టాకీకు సంబంధించి ప్యాచ్ వర్క్ పూర్తిచేశారు. శ్రుతి హాసన్ ఐటెం సాంగును 2014 జూలై 18 నుండి చిత్రీకరించాలని ప్రయత్నించి హైదరాబాదులో ప్రత్యేకంగా వేసిన సెట్లో నాలుగు రోజులపాటు రిహార్సల్స్ చేసారు.[88] పాట కోసం శ్రుతి హాసన్ 3 రోజుల కాల్ షీట్లు కూడా ఇచ్చింది. కానీ అప్పుడు దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డుల ప్రదానం చెన్నైలో జరగడంతో ఆ 3 రోజులు వృధా అయ్యాయి.[89] దాంతో రామోజీ ఫిల్మ్ సిటీలో 2014 జూలై 18న మహేష్, సోనూ సూద్, మరికొందరిపై ఇంటర్వెల్ ఫైట్ తెరకెక్కించడం మొదలుపెట్టారు. అది పూర్తయ్యాక జూలై 25 నుండి శ్రుతి హాసన్ ఐటెం సాంగ్ తెరకెక్కించాలని భావించారు.[90] ఆ పాటను రామోజీ ఫిల్మ్ సిటీలోని ఒక ప్రత్యేకమైన సెట్లో 2014 జూలై 26 నుండి చిత్రీకరించారు.[91][92] పాట చిత్రీకరణ పూర్తయ్యాక సినిమా పతాక సన్నివేశాలను హైదరాబాదులో తెరకెక్కించారు.[93] 2014 ఆగస్టు 11 ఉదయం పతాక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసిన మహేష్ ఆ రాత్రి ఐరోపా బయలుదేరాడు. అక్కడ కొన్ని అందమైన ప్రదేశాల్లో తమన్నాతో కలిసి రెండు పాటల చిత్రీకరణలో పాల్గొన్నాడు. 2014 ఆగస్టు 23న ఈ షెడ్యూల్ ముగించాలనుకున్నా ఆగస్టు 25న ఈ షెడ్యూల్ ముగిసింది. తద్వారా చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది.[94][95][96][97] ఊటీలో మిగిలిన ఒక్కపాట చిత్రీకరణ పూర్తవడంతో 2014 సెప్టెంబరు 5న సినిమా షూటింగ్ ముగిసింది.[98]
నిర్మాణానంతర కార్యక్రమాలు
ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు 2014 మే 19 ఉదయం మొదలయ్యాయి. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలలో హీరో మహేష్ బాబు, చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాతలు పాల్గొన్నారు.[99] ఆడియో విడుదల అయ్యిన తర్వాత మూడు రోజుల పాటు ఏకథాటిగా తన పాత్రకోసం మహేష్ డబ్బింగ్ చెప్పాడు. శ్రీను వైట్ల కూడా దగ్గరుండి డబ్బింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు.[100] 2014 సెప్టెంబరు 9న మహేష్ తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసాడు. మరోవైపు మిగిలిన ఆర్టిస్టులందరూ తమ తమ పాత్రలకు డబ్బింగ్ పూర్తి చేసారు. తమన్ రీ-రికార్డింగ్ పనులు వేగంగా కానిచ్చారు. త్వరలోనే డీటీయస్, డీ.ఐ. పనులను పూర్తిచేయాలని యూనిట్ భావించింది.[101]
సంగీతం
అభివృధ్ధి
ఎస్. తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా సినిమా ప్రారంభం కాకముందే ఎన్నుకోబడ్డాడు. ఆగడు సినిమాలో మరలా ఎంచుకోబడ్డ దూకుడు సినిమా సాంకేతిక వర్గంలో తమన్ కూడా ఒకడు. ఈ సినిమా సంగీత దర్శకుడిగా తమన్ కి 50వ సినిమా. 2013 అక్టోబరు 28న తమన్ ఈ సినిమా పాటలను కంపోజ్ చెయ్యడం మొదలుపెట్టాడని, మొదట టైటిల్ సాంగ్ కంపోజ్ చేస్తాడని వార్తలొచ్చాయి.[102] ఏప్రిల్ 2014 నెలమొదట్లో మహేష్ బాబు ఈ సినిమాలో ఒక పాట పాడుతున్నారని వార్తలొచ్చాయి.[103] తమన్, దర్శకనిర్మాతలు వెళ్ళి అడిగితే మహేష్ బాబు ఆలోచించి చెప్తానన్నారని కథనాలు వచ్చాయి.[104] కొన్ని రోజుల తర్వాత శ్రీను వైట్ల మహేష్ బాబు ఈ సినిమాలో పాట పాడుతున్నారని స్పష్టం చేసాడు.[105] 2014 జూలై 25న హైదరాబాదులో తమన్ స్టూడియోలో శ్రుతి హాసన్ తను డాన్స్ చెయ్యబోయే ఐటెం పాటను తనే పాడి రికార్డింగును పూర్తిచేసింది. ఈ విషయాన్ని శ్రుతి హాసన్, తమన్ స్వయంగా తమ ట్విట్టర్ పేజీల్లో పోస్ట్ చేసారు. "తమన్ తో మ్యూజిక్ రికార్డ్ చెయ్యడం చాలా సరదాగా ఉంటుంది. ఇలాంటి పాట పాడడం ఒక డిఫరెంట్ అనుభూతి" అని శ్రుతి హాసన్ తన ట్విట్టర్ పేజిలో పోస్ట్ చేసింది.[106]
మార్చి 2014 నెలచివర్లో లహరి మ్యూజిక్ కంపెనీ అధినేత మనోహర్ నాయుడు ఆగడు సినిమా ఆడియో రైట్స్ మేము సంపాదించామని ఒక ప్రెస్ మీటులో స్పష్టం చేశారు.[107] మే 2014 నెలచివర్లో ఈ సినిమా పాటలు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా 2014 ఆగస్టు 9న విడుదల చేస్తారని వార్తలొచ్చాయి.[108] కానీ మహేష్ ఈ సినిమా పాటలను తన కొడుకు గౌతం కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా 2014 ఆగస్టు 31న విడుదల చెయ్యాలని కోరుకున్నాక ఆ తేదీ ఖరారయ్యింది.[109] తొలుత 2014 ఆగస్టు 28న ఆడియో విడుదల చెయ్యాలని భావించిన నిర్మాతలు 2014 ఆగస్టు 30న శిల్పకళా వేదికలో విడుదల చేస్తామని ప్రకటించారు.[110] శిల్పకళా వేదికలో భారీ ఏర్పాట్లు జరిపారు. ఝాన్సీ ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు.[111] దర్శకుడు శంకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల, శ్యాంప్రసాద్‌రెడ్డి, సురేష్‌బాబు, భాస్కరభట్ల, శ్రీమణి, సుధీర్‌బాబు, రాజు, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ సూపర్‌ఫ్యాన్ పోటీలో గెలుపొందిన 12 మందిలో ఫైనల్స్‌లో గెలిచిన నలుగురికి మహేష్‌బాబు సంతకం చేసిన మొబైల్‌ను బహుమతిగా అందించారు.[112]
స్పందన
విమర్శకులు
ఆగడు పాటలకు విమర్శకుల నుండి సానుకూల సోందన లభించింది. 123తెలుగు.కామ్ తమ సమీక్షలో "తమన్ స్వరపరిచిన రాకింగ్ ఆల్బమ్స్ ‘ఆగడు’. సంగీత దర్శకుడిగా తన 50వ సినిమాకు పూర్తి న్యాయం చేకూర్చాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే పాటలను తమన్ అందించారు. ‘ఆగడు’ ఆడియో సినిమా క్రేజ్ పెంచడంలో, విజయంలో ముఖ్య భూమిక పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మహేష్ బాబు, తమన్ కాంబినేషన్లో మరొక సూపర్ హిట్ & ఎంటర్ టైనింగ్ ఆల్బం ‘ఆగడు’" అని వ్యాఖ్యానించారు.[113] గ్రేట్ ఆంధ్ర తమ సమీక్షలో "ఫస్ట్ ఇంప్రెషన్‌ని బట్టి ‘ఆగడు’ ఆడియోలో కనీసం మూడు పాటలైనా పాపులర్ అయ్యేట్టున్నాయి. పాడుకునే పాటలు కాకపోయినా కానీ వింటున్నంతసేపు ఎంటర్‌టైన్ చేసే టిపికల్ థమన్ పాటలివి. సినిమా విజయానికి దోహదపడినా లేకున్నా విజయంలో పాత్ర పోషించడానికి అనువైన బాణీల్నే అందించాడు" అని వ్యాఖ్యానించారు.[114] తెలుగుమిర్చి.కామ్ తమ సమీక్షలో "ఈ మద్య తమన్ మ్యూజిక్ అన్ని సినిమాలలో ఒకే విధంగా ఉంటుంది అని ప్రేక్షకులు ముఖం చాటేస్తున్నారు. కానీ ఈ ఆగడు లో మాత్రం కొత్తగా మ్యూజిక్ అదించాడు. ఒకటి, రెండు కొంచం బోర్ కొట్టించిన మిగతా నాలుగు సాంగ్స్ మాత్రం చాలా బాగా మ్యూజిక్ అదించాడు. ఓవరాల్ గా చెప్పాలంటే ఆగడు సాంగ్స్ మార్కెట్ లో స్టాక్ ఉండవు" అని వ్యాఖ్యానించారు.[115]
ప్రేక్షకులు
ఆగడు పాటలకి ప్రేక్షకుల నుండి కూడా అపూర్వ స్పందన లభించింది. రికార్డ్ స్థాయిలో సీడీలు, డిజిటల్ అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది విడుదలైన ఆడియోల్లో సంచలనాత్మక విజయం సాధించిన వాటిలో ఒకటిగా నిలిచింది.[116] "ఈ ఏడాది మా సంస్థ విడుదల చేసిన ఆడియోలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. ఆ కోవలో ‘ఆగడు’ చిత్రం ఆడియో కూడా సంచలనం సృష్టిస్తుంది. థమన్ సంగీతం అందించిన ఈ పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. మేం విడుదల చేసిన ఆడియోల్లో ఈ ఏడాది ‘ఆగడు’ నెంబర్‌వన్‌గా నిలిచింది. అలాగే, డిజిటల్‌గా కూడా చాలా డౌన్‌లోడ్స్ వచ్చాయి. ఇంతమంచి అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం" అని లహరి మ్యూజిక్ కంపెనీ అధినేత మనోహర్ నాయుడు అన్నారు.[117] ఆగడు, నారి నారి, జంక్షన్ లో, ఆజా సరోజా పాటలు శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సంవత్సరం తమన్ పాటల్లో ఈ సినిమా పాటలు ఉత్తమమైనవిగా ప్రశంసలు అందుకున్నాయి.[118]
విడుదల
సినిమా ప్రారంభించినప్పుడు మే 2014లో సినిమాని విడుదల చెయ్యాలని దర్శకనిర్మాతలు భావించారు. కానీ తర్వాత ఈ సినిమా రాం చరణ్ తేజ నటిస్తున్న గోవిందుడు అందరివాడేలే సినిమాతో పాటు 2014 సెప్టెంబరు 26న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయ్యాలనుకున్నారు.[119] అయితే గోవిందుడు అందరివాడేలే 2014 అక్టోబరు 2కి వాయిదా పడగా జూన్ మొదటి వారంలో మహేష్ బాబు ఈ సినిమా 2014 సెప్టెంబరు 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని స్పష్టం చేసారు.[120][121] జూలై నెలమొదట్లో ఈ సినిమాని మొదట అనుకున్నట్టుగా సెప్టెంబరు 26న కాకుండా ఒక వారం రోజుల ముందే అనగా సెప్టెంబరు 19న విడుదల చేస్తామని నిర్మాతలు స్పష్టం చేసారు.[122] మహేష్ సినిమాలు విదేశాల్లో ఆడే తీరుని సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో యూఎస్ లోని ప్రతీ యూనివర్శిటీకి వెళ్ళి ఒపీనియన్ పోల్ పెట్టి 100 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఈ సినిమాను చూస్తామని కోరితే స్పెషల్ షో వేస్తామని నిర్మాతలు స్పష్టం చేసారు. తద్వారా తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త సంప్రదాయానికి త్రలేపినట్టవుతుందని వార్తలొచ్చాయి.[123] ఈ చిత్రాన్ని సబ్ టైటిల్స్ తో అమెరికాలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అనిల్ సుంకర వెల్లడించారు. అమెరికాలోని కొన్ని సినిమా థియెటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని తెలుగువారితో పాటు అక్కడి స్థానికులు ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని చెప్పారు.[124][125] గతంలో కొంతమంది అభిమానులు ఇదే విషయాన్ని మహేష్ దగ్గర ప్రస్తావించడంతో అక్కడ సెటిల్ అయిన తెలుగు వారి పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.[126]
ఎరోస్ ఇంటర్నేషనల్ రికార్డ్ స్థాయిలో నాలుగు దక్షిణాది భాషల్లో 2000 థియేటర్లలో విడుదల చెయ్యడానికి ప్లాన్ చేసారు.[127] ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ 2014 సెప్టెంబరు 13న యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.[128] సెన్సార్ వారు ఈ సినిమాలో 5 కట్స్ విధించడమే కాకుండా కొన్ని పదాలను మ్యూట్ చేయమన్నారు, అల్లాగే కొన్ని పదాలను వేరే పదాలతో రీప్లేస్ చేయమన్నారు.[129] విడుదలకి రెండు రోజులు ముందే అమెరికాకి డిజిటల్ ప్రింట్స్ పంపేశారు. తద్వారా ప్రీమియర్ షోలకు ఎలాంటి అంతరాయం కలుగలేదు.[130] ఒక ప్రెస్ మీట్ లో నిర్మాతలు ఈ సినిమా అమెరికాలో 159 థియేటర్లలో, ఎరోస్ సహకారంతో ఉత్తరభారతదేశంలో 100కు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నామని స్పష్టం చేసారు.[131] యూకేలో 9, ఆస్ట్రేలియాలో 9, దుబాయిలో 30, కువైట్ లో 2 థియేటర్లలో విడుదలయ్యింది.[132][133] సినిమా విడుదల సందర్భంగా ఇరు రాష్ట్రాల్లోనూ అభిమానులు పలు కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో ఉదయాన్నే అభిమానులు సినిమాపై ఉన్న దిష్టి పోయేలా పూజలు చేసి అక్కడి నుంచి ర్యాలీగా బయలు దేరి థియేటర్స్ కి చేరుకోనున్నారని, దీనికోసం ఇప్పటికే అభిమాన సంఘాలు ఆయా ప్రాంతాల్లో పలు ప్లాన్స్ చేసుకున్నారని తెలిసింది.[134] సినిమా విజయం కోసం మహేష్ కడపలోని అజ్మీర్ దర్గాని సందర్శించి ఖ్వాజా మొయినుద్దీన్ చస్తీ వద్ద ప్రార్థనలు నిర్వహించాడు.[135] దేశంలో 1,160 స్క్రీన్లు, అమెరికా 159 స్క్రీన్లు, తమిళనాడులో 55 స్క్రీన్లు, కర్ణాటకలో 80, ముంబైలో 65 షో ఉంటుందని ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ ట్రాకర్ శ్రీధర్ పిళ్లై ట్వీట్ చేశారు.[136]
2014 సెప్టెంబరు 15న బుకింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే ఈ సినిమా మొదటి రోజు షోలకి సంబంధించి దాదాపు అన్ని టికెట్స్ అమ్ముడు పోయాయి. ఒక్క హైదరాబాదు లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ క్రేజ్ కొనసాగింది. ఇది కాకుండా రిలీజ్ రోజు ఉదయం వేసిన ఫ్యాన్స్ షో టికెట్స్ కోసం కూడా భారీ పోటీ నెలకొంది.[137] తదుపరి రోజు, ఆపైనున్న మూడు రోజుల టికెట్లు కూడా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అమ్ముడుపోయాయి.[138] హైదరాబాదులో 2014 సెప్టెంబరు 19 ఉదయం 4 గంటలకు వేసిన షోకి సంబంధించిన బాల్కనీ టికెట్స్ ₹2500 పలుకగా, మిగిలిన టికెట్స్ ₹2000 పలికాయి.[139] అమెరికాలోని మిచిగాన్‌లోని నోవి లోకేషన్లో ఆగుడు చిత్రాన్ని ఐమాక్స్ స్క్రీన్ (సాధారణ 70 ఎంఎం స్క్రీన్ కంటే నాలుగు రెట్లు పెద్దగా ఉంటుంది)లో ప్రదర్శించారు. ఈ స్క్రీన్ పై ప్రదర్శించబడిన తొలి తెలుగు సినిమా ఇదే. ఫస్ట్ టికెట్ వేలం పాట నిర్వహించారు. ప్రనీష్ రెడ్డి అనే ఓ అభిమాని టికెట్‌ను ఏకంగా 1500 డాలర్లు (దాదాపు ₹90 వేలు)కు సొంతం చేసుకున్నాడు. రెండో టికెట్‌ను హిరేన్ రెడ్డి అనే అభిమాని 1000 డాల్లర్లకు సొంతం చేసుకున్నాడు. ఎగ్జిబిటర్లు అజయ్ రెడ్డి, వంశీ చేతుల మీదుగా విజేతలు టికెట్స్ అందుకున్నారు.[140]
ప్రచారం
మొదటి నుంచీ ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్ మహేష్ బాబు తండ్రి కృష్ణ పుట్టినరోజైన మే 31న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలొచ్చాయి. గతంలో మహేష్ బాబు హీరోగా 14 రీల్స్ నిర్మించిన దూకుడు, 1 - నేనొక్కడినే సినిమాలకు కూడా ఇదే చర్యలు జరిగాయి.[141] 2014 మే 31న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, 45 సెకండ్ల టీజర్ విడుదలయ్యాయి. కొన్ని వివాదాలకు దారితీసినప్పటికీ వాటికి భారీ సానుకూల స్పందన లభించింది.[142] సినిమా టీజర్ 4 రోజుల్లో 1 మిలియన్ హిట్స్ పొంది సంచలనం సాధించింది.[143] రెండో టీజర్ 2014 ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తారని జూలై నెలమధ్యలో తెలిసింది.[144] రెండు పోస్టర్లతో పాటు 37 సెకండ్ల తీజరును కూడా విడుదల చేసారు. టీజరులో మహేష్ చెప్పిన సంభాషణలకు మంచి స్పందన లభించింది. ముఖ్యంగా "డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందుకొచ్చి తొడ కొట్టిందట... అయినా నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ ఇవ్వడానికి నేనేమైనా రైటర్నా... ఫైటర్ని" అంటూ మహేష్ చెప్పిన సంభాషణకి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో విశేషంగా ఆదరించబడింది.[145] సినిమా పాటలను విడుదల చేసిన రోజున ఈ సినిమా ట్రైలరును విడుదల చేసారు. దాంట్లో మరిన్ని పంచ్ డైలాగ్‌లున్నాయి. విలన్ హీరోని ఉద్దేశించి, ‘వీడ్ని ముక్కలు ముక్కలుగా..’ అని అంటోంటే, మధ్యలోనే అందుకుని మరీ, హీరో విలన్‌ని ఉద్దేశించి ‘కాకులకి గద్దలకి వేసెయ్యాలా.. అప్ డేట్ అవరేంట్రా..’ అని అంటాడు. ఇదొక్కటే కాదు, ఇలాంటి సంభాషణలు సినిమాలో ట్రైలరులో ఉన్నాయి.[146] ప్రసాద్ మల్టిప్లెక్స్ లో మహేష్ పోలీస్ యూనిఫార్మ్ వేసుకున్న నలభై అడుగుల పోస్టర్ పెట్టారు.[147]
సెప్టెంబరు 12న కొత్త ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ యూట్యూబులో కూడా విడుదల చేసారు 14 రీల్స్ వారు. మంచి స్పందనను రాబట్టిన ఆ ట్రైలరును రవితేజ నటించిన పవర్ సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్లలో కూడా ప్రదర్శించనున్నామని అనీల్ సుంకర ప్రకటించారు.[148][149] ఆగడు పోస్టర్ తో సికిందరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు సూపర్‌స్టార్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ఓ ట్రైన్ ఏర్పాటు చేసారు. ఈ ట్రైన్ ఏ ఏ స్టేషనులలో ఆగుతుంది? ఏ స్టేషనులో ఎన్ని గంటలకు ఆగుతుందనే వివరాలను అనిల్ సుంకర త్వరలో వెళ్ళడిస్తామని 2014 సెప్టెంబరు 13న అన్నారు.[150] 2014 సెప్టెంబరు 13న సికిందరాబాద్ రైల్వే స్టేషనులో 160 అడుగుల భారీ హోర్డింగ్ ఏర్పాటు చేసారు.[151] మరుసటి రోజు శ్రుతి హాసన్ ఐటెం సాంగ్ స్టిల్ ఉన్న పోస్టరును విడుదల చేసారు.[152] ఈ సినిమాకి రేడియోసిటీ 91.1 ఎఫ్.ఎం. వారు 2014 సెప్టెంబరు 20న బ్లూకార్పెట్ స్క్రీనింగ్ నిర్వహించారు. నిబంధనల ప్రకారం టికెట్లు గెలుచుకునేందుకు శ్రోతలు రేడియో సిటీ ప్రసారాలను ఆలకించి, తేలికపాటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. రేడియో కార్పెట్ స్పెషల్ కాంటెస్ట్‌లో పాల్గొనేందుకు సాక్షి దినపత్రిక పాఠకులు సెప్టెంబరు 15 నుంచి 19 వరకు ‘సిటీప్లస్’లో రేడియో సిటీ ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు పంపాల్సి ఉంటుంది. ఈలోపు మహేష్ ఉపయోగించిన బుల్లెట్ వాహనంతో ఫొటోలు దిగేందుకు రేడియో సిటీ అభిమానులకు అవకాశం కల్పించింది.. కూకట్‌పల్లిలోని మంజీరా మాల్‌లో ఉండే ఈ వాహనంతో ఫొటోలు దిగే అవకాశం 2014 సెప్టెంబరు 20న ముగిసింది.[153] ఈలోపు 2014 సెప్టెంబరు 17న విశాఖపట్నం బీచ్ లో 12వేల అడుగుల పోలీస్ బెల్టును ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదిగా చెప్పబడింది.[154][155]
పంపిణీ
నిజాం ప్రాంతం పంపిణీ హక్కుల కోసం నిర్మాత్ దిల్ రాజు, నటుడు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి పోటీపడ్డారని వార్తలొచ్చాయి.[156] దిల్ రాజు మాత్రం ఈ సినిమా ఉత్తరాంధ్ర పంపిణీ హక్కులను గెలుచుకున్నారు.[157] సెప్టెంబరు నెలలో ఈ సినిమా పంపిణీ హక్కులను గతంలో 1 - నేనొక్కడినే హక్కులను సొంతం చేసుకున్న ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కొనుగోలు చేసింది.[158] ఎన్.ఆర్.ఏ క్రియేషన్స్ ఈ సినిమా గుంటూరు ప్రాంతం హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలిసింది.[159]
ప్రీ-రిలీజ్ బిజినెస్
జూన్ మొదటి వారంలో 14 రీల్స్ ఆగడు సినిమా శాటిలైట్ హక్కులు జెమిని టీవీకి 9.75 కోట్లకు అమ్మేసింది. అప్పటికి కేవలం ఒక్క టీజర్ మాత్రమే రిలీజ్ చేసిన ఈ సినిమాకి ఇంత రేటు పలకడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.[160] తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఇప్పటి వరకు ఇదే పెద్దది. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది 9 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా దాని రికార్డును బద్దలు కొట్టి ఆగడు మొదటి స్థానాన్ని సంపాదించింది.[161] దిల్ రాజు ఈ సినిమా ఉత్తరాంధ్ర పంపిణీ హక్కులను 5 కోట్లకు కొనుగోలు చేసారు.[162] గుంటూరు ప్రాంతం పంపిణీ హక్కులు ₹4.25 కోట్లకు అమ్మేశారు.
వివాదం
ప్రకాష్ రాజ్
సెట్స్ పై ఒక అసిస్టంట్ డైరెక్టర్ సూర్యతో వాగ్వివాదం పెట్టుకున్నందుకు మరియూ చిత్రీకరణకి సరిగ్గా హాజరు కానందుకు ప్రకాష్ రాజ్ ని తప్పించి ఆయన స్థానంలో సోనూ సూద్ ని తీసుకున్నారు. ఈ వివాదం రాను రానూ పెద్దదై ప్రకాష్ రాజ్ పై నిషేధం విధించే అవకాశాలున్నాయని వార్తలొచ్చాయి. అంతేకాక ప్రకాష్ రాజ్ కి 14 రీల్స్ వారు ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని కూడా మీడియాలో కథనాలు వచ్చాయి.[163] వీటికి సమాధానంగా ప్రకాష్ రాజ్ స్వయంగా 2014 ఏప్రిల్ 25న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ వివాదంలో ఒకరు నన్ను కావాలనే ఇరికించారని, త్వరలో ఆ పేరు బైట పెట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తనకు ఆ చిత్ర యూనిట్‌లో ఎవరితో గొడవలు లేవంటూ దర్శకుడు శ్రీను వైట్ల పేరు దాటేశారు.[164][165] వివాదం బాగా ప్రాచుర్యం పొందాక ప్రకాష్ రాజ్ క్షమాపణ చెప్పడంతో మా డైరెక్టర్స్ అసోసియేషన్స్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఇతర సంఘాలు శాంతించి ఆయన్ను హెచ్చరించి వదిలేశారు అని తర్వాత చెప్పబడింది.[166]
టీజర్
2014 మే 31న విడుదలైన టీజరులో మహేష్ బాబు రెండు డైలాగులు చెప్తారు. "సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలియదుగానీ, పంచ్ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది" అంటూ పంచ్‌లపై ఓ పంచ్ వేశారు. "ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలంటూ ఎదవ కంపేరిజన్‌లు, ఒళ్లు వులపరం వచ్చేస్తోంది" అంటూ ఇంకో పంచ్ డైలాగ్ వేశారు. ఈ డైలాగులు పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాపై, పవన్ కళ్యాణ్ పై సెటైర్లని పవన్ కళ్యాణ్ అభిమానులు భావించారు. వీటిపై వివరణ ఇస్తూ మహేష్ బాబు "మేము టీజర్ లో ఎవరినీ టార్గెట్ చేయలేదు. అలాంటి ఇంటెన్షన్ కూడా లేదు. నేను కూడా దూకుడులో అలాంటి పంచ్ డైలాగులే చెప్పాను. ఆగడులో ఈ డైలాగు అక్కడ నుంచి టేకాఫ్ అయ్యింది. ఈ డైలాగు కేవలం ఆ పాత్ర ఏటిట్యూట్ మాత్రమే. వేరే వారి గురించి అన్న ప్రశ్నే లేదు" అని తేల్చి చెప్పారు.[167] ఇవే కాక మరో మూడు చిన్న వివాదాలకు కూడా ఆ టీజర్ దారితీసింది. శ్రీను వైట్లతో విభేదించిన కోన వెంకట్ కూడా తన ట్విట్టరులో "కొంతమంది సొంతపనిని పక్కనపెట్టి పక్కవాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు... త్వరగా అవుట్ ఫోకస్ అయ్యిపోయెది కూడా వీళ్ళే !!" అని ట్వీట్ చేసాడు. శ్రీను వైట్లను ఉద్దేశించి ఈ ట్వీట్ చేసాడనీ, ఆగడు టీజర్ లో పంచ్ డైలాగులుపై మహేష్ వేసిన పంచ్ కోన వెంకట్ కే తగిలిందని మీడియాలో కథనాలు వచ్చాయి.[168] ఆగడు పోస్టర్లు, టీజరులోని సన్నివేశాలు పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాని పోలి ఉన్నాయని కొందరు అనుకుంటున్న సమయంలో కొంతమంది ఆకతాయిలు సమంత "ఈ టీజర్ కాపీ" అని ట్వీట్ చేసినట్టు ఇంటర్నెట్లో వార్తలు సృష్టించారు. వెంటనే విషయం తెలుసుకున్న సమంత తను ఆగడుపై ట్వీట్ చెయ్యలేదని స్పష్టం చెయ్యడంతో ఆ వార్తలు అబద్ధాలని తేలి వివాదం సద్దుమణిగింది.[169] గాయకుడు బాబా సెహ్గల్ ఈ సినిమా టిజర్ చూస్తుంటే తనకి గబ్బర్ సింగ్ గుర్తొస్తుందన్నాడు. దానితో మహేష్ బాబు అభిమానులు ఆగ్రహానికి గురయ్యాక తన వ్యాఖ్యలని వెనక్కి తీసుకుంటూ ఆగడు మంచి బిజినెస్ చేస్తుందని, తనకి మహేష్ బాబు సినిమాల్లో ఓ పాట పాడాలనుందని ట్వీట్ చేశాడు. దానితో ఆ వివాదం కూడా సద్దుమణిగింది.[170]
ఆనంద్ రవి
నారా రోహిత్ నటించిన ప్రతినిథి సినిమాకి రచయితగా పనిచేసి ఆ సినిమా విజయానికి గల కారణాల్లో ఒకరిగా నిలిచిన ఆనంద్ రవి ఈ సినిమాకి సంభాషణలు రాసాడని, అయితే శ్రీను వైట్ల తనకి క్రెడిట్ ఇవ్వలేదని వార్తలొచ్చాయి. ఇవన్నీ వట్టి పుకార్లే అని ఆనంద్ రవి కొట్టి పారేసాడు. ఈ విషయంపై తన ఫేస్ బుక్ లో స్పందిస్తూ "గత కొద్ది రోజులుగా ఆగడు సినిమాకి నేను పనిచేశానని దానికి నాకు భారీ అమౌంట్ ఇచ్చారని, ముందుగా అనుకున్నట్టు కాకుండా టైటిల్స్ లో నా పేరు వెయ్యాలని డిమాండ్ చేస్తున్నానని వస్తున్నా వార్తల్లో నిజం లేదు. నాకు శ్రీనువైట్ల గారి వర్క్ అంటే ఇష్టం. నాకు ఈ ప్రాజెక్ట్ కి అసలు ఎలాంటి సంబందం లేదు. అలాగే శ్రీను వైట్ల గారిని ఇప్పటి వరకూ కలవలేదు. ఇక ఇలాంటి పుకార్లు ఆపేయండని" పోస్ట్ చేసాడు.[171][172]
కటౌట్ వివాదం
విజయవాడలోని అలంకార్ థియేటర్ వద్ద 2014 సెప్టెంబరు 14న ఆగడు సినిమా విడుదల సందర్భంగా అభిమానులు ఏర్పాటు 90 అడుగుల మహేష్ కటౌట్‌ను అనుమతి లేదని తొలగించేందుకు అధికారులు ప్రయత్నించారు. వాళ్ళ ప్రయత్నాలను అభిమానులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. తమ అభిమాన హీరో కటౌట్ ఏర్పాటు చేయాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. అధికారుల వైఖరికి నిరసనగా మహేష్ అభిమాని ఒకరు పక్కనే ఉన్న ఏలూరు కాల్వలోకి దూకడంతో స్థానికులు అతనిని కాపాడారు.[173][174]
స్పందన
విమర్శకుల స్పందన
సాక్షి దినపత్రిక తమ సమీక్షలో "ముందే దసరా పండుగ జరుపుకోవాలనుకునే ప్రిన్స్ అభిమానుల్లో పూర్తి స్థాయి సంతృప్తిని కలిగించలేకపోయారనేది స్పష్టంగా కనిపిస్తుంది. భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉన్నా అభిమానులకు పూర్తి స్థాయి సంతృప్తిని పంచిన చిత్రంగా 'ఆగడు' నిలువడం కష్టమే. కథ, కథనం గాలికి వదిలి కేవలం మహేశ్ ను నమ్ముకుని నేల విడిచి సాము చేసిన చిత్రం 'ఆగడు' అని చెప్పవచ్చు" అని వ్యాఖ్యానించారు.[175]123తెలుగు.కామ్ తమ సమీక్షలో "మహేష్ బాబుకి తోడుగా తమన్నా గ్లామర్, కొంతమంది కమెడియన్స్ కామెడీ, కొన్ని పంచ్ సంభాషణలు, శృతి హాసన్ స్పెషల్ సాంగ్ సినిమాకి హెల్ప్ అయ్యాయి. సెకండాఫ్ ని యాసిటీజ్ దూకుడు ఫ్లేవర్ లో కాకుండా, కొంతైనా కొత్తగా ట్రై చేసి ఉంటే అనుకున్న స్థాయి కంటే పెద్ద హిట్ అయ్యేది. మహేష్ బాబుకి మంచి మార్కెట్ ఉండడం, ప్రస్తుతం ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అందించే పెద్ద హీరోల సినిమాలు ఏమీ లేకపోవడం వలన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కమర్షియల్ గా స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టుకునే అవకాశం ఉంది" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3.25/5 రేటింగ్ ఇచ్చారు.[176]వన్ఇండియా తమ సమీక్షలో "తనదైన శైలిని తెలుగు తెరపై పరుస్తున్న దర్శకుడు శ్రీనువైట్ల. ఆయన చిత్రం రాబోతోందంటే ఖచ్చితంగా అది నవ్వుల విందే అని ఫిక్స్ అయిపోతారు. అలాంటిది మహేష్ వంటి స్టార్ హీరోతో ఆయన కలిస్తే అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ఆ విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు. అందుకేనేమో టైటిల్ కు తగ్గట్లే ఎక్కడా తన పంచ్ లను, కామెడీ ఎపిసోడ్స్ ని మిస్ అవకుండా కథ లేకపోయినా పరుగెత్తే కథనంతో తన దూకుడు మరోసారి చూపించాడు. మసాలా కామెడీ ఎంటర్టైనర్ ని అందించాడు" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 2.5/5 రేటింగ్ ఇచ్చారు.[177]వెబ్ దునియా తమ సమీక్షలో "స్క్రీన్‌ప్లే పరంగా మొదటిభాగం చాలా సరదాగా సాగుతుంది. రెండో భాగంలో కథ భారీగా మారి గందరగోళంగా వుంది. ఏవరేజ్‌గా సాగే ఈ సినిమాను దసరా వరకు మరే సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు చూసినా ఆశ్చర్యంలేదు" అని వ్యాఖ్యానించారు.[178]తెలుగువన్ తమ సమీక్షలో "ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఆగడు' లో మహేష్ తన సరికొత్త యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నప్పటికీ రొటీన్ కథ, కథనాలు ప్రేక్షకులకుబోర్ కొట్టిస్తాయి. శ్రీనువైట్ల మార్క్ కామెడీ, బ్రాహ్మీ డాన్స్ ఎపిసోడ్ సినిమాని కాపాడతాయేమో చూడాలి. ప్రస్తుతం రెండు వారాల వరకు పెద్ద హీరోల సినిమా ఏవి లేకపోవడం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఏ స్థాయిలో నిలబడుతుందో వేచి చూడాల్సిందే" అని వ్యాఖ్యానించారు.[179]
బాక్సాఫీస్
భారతదేశం
విశాఖపట్నంలో మొదటి రోజున ₹0.82 కోట్లు, తూర్పు గోదావరిలో ₹0.96 కోట్ల వసూళ్ళను రాబట్టింది.[180] గుంటూరులో ₹1,57,47,274 షేర్; పశ్చిమ గోదావరిలో ₹1,01,33,576 షేర్; భీమవరంలో ₹23,04,951 గ్రాస్; ఒంగోలులో 15, 26,785 షేర్ రాబట్టింది.[181] నైజాంలో మొదటిరోజు ₹3.45 కోట్లు కలెక్ట్ చేసిన ఆగడు రెండవ రోజు కూడా రికార్డు కలెక్షన్స్ సాధించింది. నైజాంలో రెండవ రోజు ₹1.63 కోట్లు కలెక్ట్ చేసింది.[182][183] తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కలిసి దాదాపు 25 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెళ్ళడించాయి. వారి అంచనాల ప్రకారం తొలి రోజు ₹11.20 కోట్లు, రెండోరోజు ₹7.20 కోట్లు, మూడోరోజు ₹6.60 కోట్లు వసూలు చేసింది.[184] సోమవారం నుండి కలెక్షన్స్ భారీగా పడిపోయాయి.[185] సోమవారం నాడు ఆగడు నైజాంలో ₹42 లక్షలు వసూళ్ళను రాబట్టగా రవితేజ నటించిన పవర్ సినిమా ₹80 లక్షలు సంపాదించింది.[186] దానితో నైజాంలో ఆగడు ప్రదర్శించిన థియేటర్లలో 50 థియేటర్లు పవర్, గీతాంజలి సినిమాలకు కేటాయించారు. మిగిలిన థియేటర్లలో ఆగడు విజయవంతంగా ప్రదర్శించబడింది.[187] ఈ నేపథ్యంలో బాగా నష్టపోతామనుకున్న ఈ చిత్రం ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తమ డబ్బుని వెనక్కి ఇవ్వమని ఒత్తిడి తెస్తున్నట్లు, ఈ భారీ చిత్రాన్ని భారీ మొత్తాలు ఇచ్చి సొంతం చేసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ 14 రీల్స్ వారిని రికవరీ చేయమని అడుగుతున్నట్లు వార్తలొచ్చాయి.[188]
విదేశాలు
ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ వరకే 5.81 లక్షల యుఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి అప్పటివరకూ ప్రీమియర్ షో పరంగా రికార్డ్ సృష్టించిన సల్మాన్ ఖాన్ కిక్ సినిమా రికార్డులను ఆగడు బద్దలుకొట్టింది.[189] గురువారం వేసిన ప్రీమియర్ షోలతో కలుపుకుని 1 మిలియన్ మార్కుని సొంతం చేసుకుని టాలీవుడ్ లో కొత్త రికార్డ్ సృష్టించింది.[190] ఓవర్సీస్ లో ఓ తెలుగు సినిమా ప్రీమియర్స్ కి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఇదే ప్రథమం.[191] దుబాయిలో మొదటి రోజు ₹35 లక్షల వసూళ్ళను సాధించింది. దుబాయి పంపిణీ హక్కులను ₹35 లక్షలకు కొన్న పంపిణీదారులకు మొదటిరోజే తమ పెట్టుబడిని రాబట్టగలిగినందుకు ఆశ్చర్యం వ్యక్తం చేసారు.[192] రెండోరోజు కూడా అమెరికాలో సినిమా హౌస్ ఫుల్ వసూళ్ళతో కొల్లగొట్టింది.[193]