రామ్ చరణ్ తేజ, కాజల్ అగర్వాల్, అమలాపాల్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు సినిమా నాయక్, 2013 జనవరి 9 న ఈ సినిమా విడుదలయ్యింది. ఈ సినిమా దర్శకుడు వి.వి.వినాయక్.
కథ
చెర్రీ (రామ్ చరణ్ తేజ) సరదా కుర్రాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అనుకోకుండా బాబాయ్ జిలేబి (బ్రహ్మానందం) కారణంగా హీరోయిన్ మధు (కాజల్ అగర్వాల్) పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో మునిగి తేలుతున్న తరుణంలో, సమాంతరంగా మరో కథ నడుస్తుంటుంది. రౌడీలను, డిఐజిని చెర్రీ చంపడం, అతగాడి కోసం సిబిఐ వెదుకుతుండడం. తీరా విశ్రాంతికి వచ్చేసరికి చంపుతున్నది చెర్రీ కాదని, అతగాడిలాగే వుండే సిద్ధార్థ నాయక్ (చరణ్) అని తేలుతుంది. దీంతో కథ ఫ్లాష్బ్యాక్లో కలకత్తాకు చేరుతుంది. కలకత్తాలో డాక్టర్గా పనిచేస్తున్న రాజీవ్ కనకాల బావమరిది ఈ సిద్ధార్థ. అనుకోని పరిస్థితుల్లో రావత్ (ప్రదీప్ రావత్) అనుచరుడి చేతిలో హతమవుతాడు రాజీవ్. దాంతో సిద్దార్థ ఆ అనుచరుణ్ణి చంపేస్తాడు. అప్పటికే రావత్ అతగాడి అనుచరుల చేతుల్లో విలవిలలాడుతున్న కలకత్తా జనం అతగాడిని తమ నాయకుడిగా భుజాలకెత్తుకుంటారు. దీంతో సిద్దార్ధ తన జనంతో, బలంతో రావత్ ఆటలు కట్టించేందుకు ప్రయత్నిస్తాడు. దానికి ప్రతిగా అతగాడు సిద్దార్ధను తీవ్రంగా గాయపరిచి, మరణించాడనుకుని, గంగానదిలో పారేస్తాడు. బతికొచ్చిన సిద్దార్థ మరోసారి రావత్ను చంపాలని ప్రయత్నించడంలో, చెర్రీ పాత్రతో జతకలుస్తుంది. చివరకు ఏం జరిగిందన్నది మిగిలిన కథ.
ఎస్. ఎస్. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. కొండవీటి దొంగ చిత్రం నుంచి ఇళయరాజా స్వరపరిచిన "శుభలేఖ రాసుకున్నా" పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ చేసారు. ఈ సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా హైదరాబాదులో రామానాయుడు స్టూడియోసులో 2012 డిసెంబరు 17న విడుదలయ్యాయి. విడుదలయిన తర్వాత ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభించింది.