మిర్చి 2013, ఫిబ్రవరి 8 న విడుదలైన తెలుగు చిత్రం. కొరటాల శివ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రం లో ప్రభాస్, అనుష్క, సత్యరాజ్, రీచా గంగోపాధ్యాయ్ మొదలగు వారు నటించగా, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చారు .
కథ
దేవా (సత్యరాజ్), లత (నదియా) ఏకైక సంతానం జై (ప్రభాస్). దేవా సొంత ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. వూరి ప్రజల కోసం దేవా అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకుని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకుని తండ్రి దగ్గరికి వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల (అనుష్క) ప్రేమని గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ వూరికి జై వల్ల మళ్లీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్ళి నిశ్చయమై పెళ్ళి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య (నాగినీడు) మనుషులు దేవా కుటుంబం మీద కాపు కాశీ దాడి చేస్తారు. ఈ గొడవల్లో లత హత్యకు గురై చనిపొతుంది. లత చావుకు జై కారణమని భావించి దేవా జైని వెళ్ళగొడతాడు.
ఆపై కథ ఇటలి దేశంలోని మిలన్ నగరంలో ప్రారంభమౌతుంది. స్వతహాగా గొడవలంటే పడని జై అక్కడ ఆర్కిటెక్ గా తన జీవితాన్ని వెళ్ళదీస్తుంటాడు. అదే సమయంలో తనకి మానస (రిచా గంగోపాధ్యాయ) పరిచయమౌతుంది. మానస రాజయ్య కుటుంబంలో ఒక వ్యక్తి. తను జైని తొలిచూపులోనే ప్రేమిస్తుంది. జై కూడా ప్రేమించినట్టు నటించి తన ద్వారా రాజయ్య కుటుంబాన్ని కలుస్తాడు. అక్కడి బ్యాంకు మేనేజరు వీరప్రతాప్ (బ్రహ్మానందం) సహాయంతో అందరినీ అహింసా మార్గనికి చేరుస్తాడు. కానీ తను ఉమ (సంపత్ రాజ్) ని మార్చలేకపోతాడు. ఉమ ఒక సందర్భంలో జై దేవా కొడుకన్న విషయాన్ని కనిపెట్టి తీవ్రంగా గాయపరుస్తాడు. ఐతే తన తండ్రిని చంపుతానన్న మాట విన్న జై ఉక్రోషాన్ని ఆపుకోలేక తిరగబడి చివరలో తన ఆంతర్యాన్ని అందరిముందూ బయటపెడతాడు. కత్తి పట్టి నరుక్కోవడం కంటే ఒకరికి ఒకరు ప్రేమను పంచుకోవడం మంచిందన్న వాదనని ముందుంచుతాడు. ఉమకి తన పగ తీర్చుకునే అవకాశం జై ఇచ్చినా ఉమ మారి తన తప్పు తెలుసుకుంటడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న దేవా కూడా తన కొడుకు ఈ పగలకు స్వస్తిపలికించడం చూసి తన తప్పు తెలుసుకుని జైని తనతో తీసుకెల్తాడు. ఊరి చివర కూర్చున్న వెన్నెలను తనతో పెళ్ళీకి జై ఒప్పించడంతో కథ సుఖాంతమౌతుంది.