శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన చిత్రం "ఎవడు". వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాంచరణ్ తేజ, శృతి హాసన్, యమీ జాక్సన్, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ముఖ్యపాత్రలు పొషించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సి.రామ్ ప్రసాద్ ఛాయాగ్రాహకుడిగా, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటరుగా పనిచేసారు. వక్కంతం వంశీ కథను రూపొందించగా అబ్బూరి రవి సంభాషణలు రచించారు. సెల్వం, పీటర్ హెయిన్స్ పోరాట సన్నివేశాలు తెరకెక్కించారు. ఆనంద్ సాయి కళ విభాగంలో పనిచేసారు.
ఈ సినిమా కథ సత్య, చరణ్ అనే ఇద్దరి వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఒక ప్రమాదంలో ముఖం కాలిపోయి తీవ్రంగా గాయపడ్డ సత్య ఆ రోజు తన ప్రేయసి దీప్తిని చంపిన వాళ్ళపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. తనకి శైలజ అనే వైద్యురాలు ఒక కొత్త మొహాన్ని ఇస్తుంది. 10 నెలల తర్వాత కోమా నుంచి బయటపడ్డ సత్య తన పగ తీర్చుకుంటాడు కానీ ఆ తర్వాత తనపై కొందరు దాడి చేస్తారు. శైలజ ద్వారా తన కొత్త మొహం శైలజ కొడుకు చరణ్ ది అని తెలుస్తుంది. చరణ్ ఎవడు? చరణ్ గతం తెలుసుకున్న సత్య ఏం చేసాడు? అన్నది మిగిలిన కథ.
ఈ సినిమా డిసెంబర్ 9, 2011న ప్రసాద్ ల్యాబ్స్ కార్యాలయంలో ప్రారంభమైంది. చిత్రీకరణ ఏప్రిల్ 27, 2012న మొదలయ్యింది. హైదరాబాదు, విశాఖపట్నం, విదేశాల్లో స్విట్జర్ల్యాండ్, జురిచ్, బ్యాంకాక్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా దిల్ రాజు నిర్మించిన సినిమాల్లో అతి ఎక్కువకాలం చిత్రీకరింపబడిన సినిమాగా గుర్తింపు సాధించింది. చిత్రీకరణ జూలై 22, 2013న పూర్తయ్యింది.
తెలంగాణా ఆంధ్రప్రదేశ్ విభజన కారణం చేత, మరిన్ని అనుకోని సంఘటనల తర్వాత వరుసగా ఎన్నోసార్లు వాయిదా పడి ఈ సినిమా మహేష్ బాబు నటించిన 1 - నేనొక్కడినే సినిమాకి పోటీగా ఈ సినిమా జనవరి 12, 2014న సంక్రాంతి కానుకగా విడుదలైంది.[1] విమర్శకుల నుంచీ ప్రేక్షకుల నుంచీ సానుకూల స్పందన రాబట్టగలిగిన ఎవడు బాక్సాఫీస్ వద్ద భారీవిజయం సాధించింది.[2] 45 కోట్లు పైచిలుకు కలెక్షన్లు సాధించిన ఈ సినిమా మలయాళంలో భయ్యా మై బ్రదర్ అన్న పేరుతో అనువదించబడింది. అక్కడ కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.[3]
కథ
సత్య (అల్లు అర్జున్), దీప్తి (కాజల్ అగర్వాల్) ఒకరినొకరు ప్రాణానికిప్రాణంగా ప్రేమించుకుంటారు. వీళ్ళిద్దరూ ఉండేది విశాఖపట్నంలో. అక్కడ ఓ పెద్ద డాన్ అయిన వీరూభాయ్ (రాహుల్ దేవ్) దీప్తిని పొందాలనుకుంటాడు. తన తల్లిదండ్రుల (చంద్రమోహన్, సన) సలహా మేరన దీప్తి, సత్య మరుసటి ఉదయం పెళ్ళి చేసుకోవాలని గుడికి వెళ్తే అక్కడికి వీరూభాయ్, అతని మనుషులు వస్తారు. వాళ్ళందరినీ ఓడించినా కొందరు మిగిలి ఉండగానే దీప్తి వద్దనడంతో సత్య ఆగిపోయి ఆ రాత్రి తనతో కలిసి బస్సులో హైదరాబాదు వెళ్ళిపోవాలనుకుంటాడు. ఆ బస్సుని కొన్ని కార్లు చుట్టుముట్టాక కాసేపటికి వీరూభాయ్ అనుచరుడు దేవా (జాన్ కొక్కెన్), వీరూ భాయ్ తమ్ముడు అజయ్ (అజయ్), ఓ పోలీస్ ఆఫిసర్ (శ్రవణ్) ఎక్కుతారు. వాళ్ళతో పోరాడుతుండగా దీప్తిని సత్య కళ్ళముందే చంపేసిన దేవా సత్యని తీవ్రంగా కత్తితో దాడి చేసి గాయపరుస్తాడు. సత్య స్పృహకోల్పోయాక బస్సుకి నిప్పు అంటించి వెళ్ళిపోతారు దేవా మనుషులు. మరుసటి ఉదయం శవాలు తరలించడానికి వచ్చిన సహాయక సిబ్బందికి సత్య ఇంకా బ్రతికే ఉన్నాడని తెలిసి అతన్ని అపోలో హాస్పిటలుకు తీసుకెళ్తారు. అక్కడ సీనియర్ సర్జన్లలో ఒకరయిన డాక్టర్ శైలజ (జయసుధ) ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ ద్వారా సగం కాలిపోయిన సత్య మొహం పైచర్మం తీసి మరొకరి మొహం చర్మం పెట్టి సర్జరీ చేస్తుంది. 10 నెలల తర్వాత కోమా నుంచి లేచిన సత్య తన మొహం ఇంకెవరి (రాంచరణ్ తేజ)లాగో ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. శైలజకి చెప్పకుండా వెళ్ళిపోయిన సత్య దీప్తి చావుకి కారణమయిన వీరూభాయ్, దేవా, వీరూభాయ్ తమ్ముడు, వాళ్ళకు సహకరించిన పోలీస్ అధికారిని చంపాలని నిర్ణయించుకుంటాడు. తన ఇంటికి వెళ్ళిన సత్యకి తన ఇంటిని వేరెవరికో అమ్మేసి ఆ కొన్నవాడికి తను సత్య అని, సత్య స్నేహితుడు రాం అని చెప్పి పరిచయం చేసుకున్న సత్యకి సత్య బాబాయి అని పరిచయం చేసుకుంటాడు ఆ ఇంటిని కొంతకాలం క్రితం కబ్జా చేసిన ఓ వ్యక్తి (బ్రహ్మానందం). మొదట వీరూభాయ్ మోజుపడ్డ శృతి (యామీ జాక్సన్) అనే అమ్మాయిని ట్రాప్ చేసిన సత్య తనతో కలిసి తిరుగుతూ ఉంటాడు. శృతికి హీరోయిన్ అవ్వాలని కోరిక.
వీరూభాయ్ దేవాని తనని తీసుకురమ్మన్నాక ఆ అమ్మాయిని కాపాడిన సత్య దేవా అనుచరుల ఫోన్ నుంచి కాల్ చేసి దేవాని రెచ్చగొట్టి ఓ కన్స్ట్రక్షన్ సైట్ లోపలికి తీసుకెళ్ళి అక్కడున్న విద్యుత్తును వాడుకుని ఆధారాలేమీ లేకుండా చంపుతాడు. అక్కడికి వచ్చిన అసిస్టంత్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (మురళి శర్మ) ఈ విషయాన్ని దృవీకరిస్తాడు. దేవా చావు వీరూభాయ్ మనసుని బాగా ఇబ్బంది పెడుతుంది. ఈలోపు సత్య దేవా మనిషిని అని అజయ్ కి ఫోన్ చేసి శృతి దొరికిందని చెప్తాడు. ఓ రోజు ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో సత్య, సత్య ఇంటిని కబ్జా చేసిన వ్యక్తి శృతి ముందు ఓ సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయి అనీ, వీరూభాయ్ తమ్ముడు అని చెప్పకుండా మన సినిమా హీరో అని చెప్పి వాడిని చూపించి తన దగ్గరికి వెళ్ళి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పమంటారు. తను అలాగే చేస్తుంది. సత్య అజయ్ దగ్గరికి వెళ్ళి మీ ప్రేమను నేను గెలిపిస్తానని చెప్పి తనకి దగ్గరవుతాడు. అజయ్ తో ఇంకా అవసరం ఉంది కనుక అతని చావుని వాయిదా వేసిన సత్య వీరూ భాయ్ మనిషయిన ఆ పోలీస్ అధికారిని చంపాలనుకుంటాడు. ప్లానులో భాగంగా సత్య పోలీస్ స్టేషనుకి వెళ్ళి దీప్తి ఫొటోని చూపించి తను 10 రోజుల నుంచి కనపడటం లేదు, మిస్సింగ్ కేస్ వెయ్యాలని వచ్చానంటాడు. దీప్తి చనిపోవడం కళ్ళారా చూసిన ఆ పోలీస్ అధికారి వీరూ భాయ్ కి ఫోన్ చేసి మాట్లాడే లోపే సత్య బైక్ మీద వెళ్ళిపోతాడు. అతన్ని ఫాలో చేస్తూ వెళ్ళిన ఆ పోలీస్ అధికారిని ఓ షాపింగ్ మాల్ కి తీసుకెళ్ళి అక్కడ తాడుతో మెడను బంధించి ఆ పోలీస్ పిస్టలుతో కాల్చి చంపేసి లిఫ్టునుంచి తోసేస్తాడు. అక్కడికి పోలీస్ కమిషనర్ వచ్చాక సత్య సాక్షిగా ఆయన ఆఫీసుకు వెళ్ళి హంతకుడిని గుర్తుపడతానని చెప్పి తన పాత మొహాన్ని ఓ ఆర్టిస్ట్ ద్వారా గీయిస్తాడు. ఈ సంఘటనల మధ్య రాం అనే పేరుతో పరిచయమయిన సత్యని శృతి ప్రేమిస్తుంది. ఓ రాత్రి అజయ్ ని రెచ్చగొట్టి నువ్వు ప్రేమిస్తున్న శృతి నీ అన్న కోరుకున్న అమ్మాయి ఒకరేనని తెలిసిన తర్వాత నీ స్థానంలో నేనుంటే వీరూని చంపి, అతని స్థానాన్ని శృతిని దక్కించుకునేవాడిని అని సత్య అజయ్ లో విషం నింపుతాడు. అదే రాత్రి వీరూని చంపాలని వెళ్ళిన అజయ్ దొరికిపోతాడు.
తన తమ్ముడు ఏ క్షణంలో నైనా బ్రతకాలని కోరుకుంటానేమోనని వీరూ తన మనుషుల ఫోన్లను స్విచ్చాఫ్ చెయ్యమంటాడు. వాళ్ళు అజయ్ ని తీసుకెళ్ళాక సత్య వీరూకి ఫోన్ చేసి దేవని విద్యుత్తుతో చంపింది, పోలీస్ అధికారిని ఉరేసి చంపింది, నీ తమ్ముడిని శృతిని ప్రేమించేలా చేసింది, ఇప్పుడు అజయ్ ని తన చేత్తోనే చంపించింది నేనేనని చెప్తాడు. చివరికి వీరూభాయ్ పబ్బులో ఉన్నప్పుడు తన మనుషులెవ్వరూ లేని టైం చూసి వీరూభాయ్ శృతిని చంపుతానని బెదిరిస్తున్నప్పుడు రాం ఎదురొచ్చి తనే సత్య అని చెప్పి వీరూభాయ్ ప్రాణాలు తీసి శృతికి క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సత్య పగ తీరిపోయింది. ఎలాంటి లక్షం లేని సత్య ఓ రోడ్డు మీద ఉన్నప్పుడు కారులో వెళ్తున్న ఓ వ్యక్తి (సుబ్బరాజు) సత్యని చూసి భయపడి గన్నుతో దాడి చేస్తాడు. కానీ సత్య తప్పించుకుని ఆ వ్యక్తిని తరుముతుంటాడు. ఈలోపు ఆ వ్యక్తి హైదరాబాదులో ఉన్న డాన్ ధర్మ (సాయికుమార్)కి, ఢిల్లీలో ఉన్న ధర్మ స్నేహితుడి (కోట శ్రీనివాసరావు)కీ ఫోన్ చేసి చరణ్ బ్రతికే ఉన్నాడని చెప్తాడు. సత్య వెనుక ఆ వ్యక్తి, ఓ పెద్ద గ్యాంగ్ ఉంటారు. వాళ్ళందరినీ చంపేసిన సత్య ఇదంతా ఎందుకు జరిగిందని ఆలోచిస్తుండగా అద్దంలో తన కొత్త మొహం చూసుకుంటాడు. అద్దంలో తన కొత్త మొహం ఎలా ఉంటుందో ముందే తెలిసిన సత్యకి ఈ మొహానికీ, ఆ దాడులకీ ఏదో సంబంధం ఉందని శంకిస్తాడు. వెంటనే శైలజకి ఫోన్ చేసి నేను విశాఖపట్నంలో ఉన్నానని చెప్తాడు. విమానంలో విశాఖపట్నానికి వచ్చి సత్యని కలిసిన శైలజకి సత్య ఈ మొహం వెనకున్న రహస్యం అడిగితే ఆ మొహం నా కొడుకుది అని చెప్తుంది. శైలజ కొడుకు పేరు చరణ్ (రాంచరణ్ తేజ). చిన్నపుడే తండ్రిని పోగొట్టుకున్న చరణ్ ధనవంతుడు. తనకి ఇద్దరు స్నేహితులు శశాంక్ (శశాంక్), శరత్. తను మంజు (శృతి హాసన్) అనే అమ్మాయిని ప్రేమించాడు. మంజు కూడా తనని ఇష్టపడ్డాక ఇద్దరి ఇంట్లో విషయం తెలిసి వీళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటారు. శశాంక్ ఉండే బస్తీని ధర్మ కూల్చేసి కబ్జా చెయ్యాలనుకుంటాడు. ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళందరికీ ధర్మ అంటే భయం. ఇదేం న్యాయం అని నిలతీద్దామని వెళ్ళిన శశాంక్ ని క్రూరాతిక్రూరంగా చంపుతాడు ధర్మ.
అతని శవాన్ని ఎవరు తీసుకెళ్తారో నేనూ చూస్తానని హెచ్చరిస్తాడు ధర్మ. చరణ్ ధర్మ ఇంటికి వెళ్ళి తన మనుషులను కొట్టి నీ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తానని బెదిరించి శశాంక్ శవంతో తిరిగి వెళ్తాడు. చరణ్ ని ఆపాలని ధర్మ చేసే ఏ ప్రయత్నం సఫలమవ్వదు. ఆ బస్తీలో ధర్మ అంటే భయపడే జనాలు అతనిపై తిరగబడి రక్తమొచ్చేలా కొట్టడం ధర్మని ఇంకా ఇబ్బంది పెడుతుంది. ఇలా ఉండగా చరణ్, శరత్ విశాఖపట్నం వెళ్ళి అక్కడ ఓ స్నేహితుడి పెళ్ళికి హాజరై హైదరాబాదుకి ఓ బస్సులో తిరిగి వస్తున్నారని తెలుసుకున్న ధర్మ ఆ బస్సుని కార్లతో చుట్టుముడతాడు. యాదృచికంగా అదే బస్సులో సత్య, దీప్తి ఉన్నారు. ఈ విషయం అటు సత్య ఇటు చరణ్ ఇద్దరికీ తెలియదు. చరణ్ ని రాజకీయ భవిష్యత్తు కోసం ధర్మతో చేతులు కలిపిన శరత్ వెన్నుపోటు పొడుస్తాడు. కత్తితో దాడి చేస్తాడు. బయటున్న కార్లలో ఉన్న ధర్మ మనుషులతో పోరాడుతూ చరణ్ చనిపోగా ఇటు బస్సులో దీప్తి శవం, చావుబ్రతుకుల్లో ఉన్న సత్యతో పాటు అందరిని ఒకేసారి చంపేందుకు బస్సుకి నిప్పంటిస్తాడు వీరూ భాయ్ అనుచరుడు దేవా. ఇదంతా విన్నాక సత్య శైలజతో కలిసి హైదరాబాదు వెళ్ళి ఆ బస్తిలో అడుగుపెడతాడు. అక్కడ చరణ్ అనుకుని సత్యపై అభిమానం చూపించిన బస్తీ వాసుల ప్రేమకి సత్య చలించిపోతాడు. వాళ్ళకి న్యాయం చెయ్యాలనుకుంటాడు. బస్తీ వాసుల మధ్య రాజకీయ నాయకుడిగా ప్రచారం కోసం వచ్చిన శరత్ సత్యని చూసి చరణ్ అనుకుని భయపడి ధర్మ దగ్గరికి వెళ్ళి చెప్తాడు. ధర్మ ఇంటికి సత్య బస్తీ వాసులని తీసుకుని రాగానే అక్కడ ధర్మ శారదని చంపుతానని బెదిరిస్తాడు. బస్తీ వాసులందరితో కలిసి చొరబడిన సత్య పైకెళ్ళి ధర్మతో పోరాడుతున్నప్పుడు శరత్ చరణ్ కి వెన్నుపోటు పొడిచినట్టే సత్య బెదిరింపు వల్ల ధర్మని గాయపరిచి ధర్మ చేతిలో చస్తాడు. కిందకి నెట్టాక జనం చేతిలో చచ్చిన ధర్మ ఇంట్లో నుంచి సత్య శైలజతో కలిసి బయటకు వెళ్తుండగా మంజు ప్రస్తావన తీసుకొస్తుంది శైలజ. చరణ్ చనిపోయాడన్న వార్త జీర్ణించుకోలేకపోయిన మంజుని శైలజ వేరొక చోటికి పంపిస్తుంది. అక్కడికి చరణ్ రూపంలో ఉన్న సత్య వెళ్ళి మంజుని కలిసిన ఘట్టంతో సినిమా ముగుస్తుంది.
అక్టోబర్ 2011 నెలమొదట్లో రాం చరణ్ తేజ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఒక సినిమాని నిర్మిస్తున్నారని స్పష్టం చేసారు. అప్పటికి సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, కథ విని చరణ్ ఉద్విగ్నతకి లోనయ్యాడని వంశీ పైడిపల్లి చెప్పాడు.[5] అక్టోబర్ నెలచివర్లో ఈ సినిమాకి వాడే అన్న టైటిల్ పెట్టాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారని వార్తలొచ్చాయి.[6][7] డిసెంబర్ 9, 2011న ఈ సినిమా టైటిల్ ఎవడు అని ఖరారు చేసిన దర్శకనిర్మాతలు అదే రోజున ఈ సినిమాని ప్రసాద్ ల్యాబ్స్ ఆఫీసులో ప్రారంభించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఎన్నుకోబడ్డాడు. అదే రోజు ఈ సినిమాలో అల్లు అర్జున్, సమంత ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారని, చిత్రీకరణ జనవరి 2012లో మొదలుపెడుతున్నామని స్పష్టం చేసారు.[8] కొంతకాలానికి జూన్ 2013 నెలచివర్లో అల్లు అర్జున్ ఈ సినిమాలో చనిపోతాడని, ఈ సినిమా ఆంగ్ల చిత్రం ఫేస్ ఆఫ్ ఆధారంగా రూపొందుతోందని వార్తలొచ్చాయి.[9]
నటీనటులు
సినిమా ప్రారంభం అయినప్పటినుంచీ రాం చరణ్ తేజ, అల్లు అర్జున్, సమంత ఈ సినిమా తారాగణంలో ఖరారయ్యారు. ఆరోగ్య సమస్యల వల్ల సమంత ఈ సినిమా నుంచి తర్వాత తప్పుకుంది.[10] ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ని తీసుకోవాలని భావించినా డేట్స్ ఖాళీ లేక తను తప్పుకుంది.[11] ఆ తర్వాత శ్రుతి హాసన్ ఈ సినిమాలో కథానాయికగా ఎన్నుకోబడింది. ఆపై అమీ జాక్సన్ ఈ సినిమాలో రెండో కథానాయికగా ఎంచుకోబడింది.[12] అయితే అనతికాలంలో కాజల్ అగర్వాల్ అల్లు అర్జున్ సరసన ఈ సినిమాలో ఒక ముఖ్యమైన అతిథి పాత్రలో నటిస్తున్నానని, ఈ సినిమాలో నా పాత్ర చనిపోతుందని స్పష్టం చేసింది.[13][14] ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా చరణ్, అల్లు అర్జున్, వంశీ పైడిపల్లిలతో తన స్నేహం కోసం ఫ్రీగా నటించింది.[15] అదే సమయంలో సాయి కుమార్ ఈ సినిమాలో నేను ప్రతినాయకుడిగా నటిస్తున్నానని, నేను చేస్తున్న ధర్మ పాత్ర చరణ్ కి దీటుగా ఉంటుందని చెప్పారు.[16] తన 40 ఏళ్ళ కెరియర్లో తను మర్చిపోలేని సినిమాల్లో ఎవడు ఒకటని ఒకసారి జనవరి 2014లో ఒక ప్రెస్ మీట్లో సాయి కుమార్ అన్నారు.[17] స్కార్లెట్ మెల్లిష్ విల్సన్ ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ కోసం ఎంపికచెయ్యబడింది.[18]
చిత్రీకరణ
మొదట జనవరి 2012లో చిత్రీకరణ మొదలుపెట్టాలని భావించినా జనవరి 2012 నెలమధ్యలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 23, 2012 నుంచి మొదలవుతుందని వార్తలొచ్చాయి.[19][20] అనుకోని కారణాల వల్ల రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 27, 2012న మొదలయ్యింది. చరణ్ చిత్రీకరణలో ఏప్రిల్ 30, 2012 నుంచి పాల్గున్నాడు.[21] మే 2012 నెలచివర్లో చరణ్, సమంతలపై అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంతంలో నిర్మించిన భారీ సెట్లో ఒక మాస్ పాట తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసారు.[22] ఆ తర్వాత కొంత విరామం తర్వాత చిత్రీకరణ హైదరాబాదులో కొనసాగింది. అమీ జాక్సన్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాక షూటింగ్ సెప్టెంబర్ 14, 2012 నుంచి విశాఖపట్నంలో కొనసాగింది.[23] మార్చి 2013 నెలమొదట్లో చరణ్, రఘు కరుమంచిపై హైదరాబాదులోని మేడ్చల్ ప్రాంతంలో కొన్ని కామెడీ సన్నివేశాలను తెరకెక్కించారు.[24] మార్చి 2013 నెలమధ్యలో చిత్రీకరణ హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో రోడ్ నెం. 45 లోని ఒక బూతు బంగ్లాలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అప్పటికి చిత్రీకరణ 60% పూర్తయ్యింది.[25] కొన్నాళ్ళ తర్వాత వానలో జరిగే పోరాట సన్నివేశాలు అక్కడ చిత్రీకరించారు. ఈ సన్నివేశంలో చరణ్ తో పాటు కోట శ్రీనివాస్ రావు సాయి కుమార్ తదితరులు పాల్గున్నారు.[26] ఏప్రిల్ 2013 నెలమధ్యలో రామోజీ ఫిల్మ్ సిటీలో పీటర్ హెయిన్స్ నేతృత్వంలో చరణ్, మరికొందరిపై భారీ పోరాట సన్నివేశాలు తెరకెక్కించారు.[27] అదే సమయంలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ లపై ముఖ్యసన్నివేశాలు హైదరాబాదులో తెరకెక్కించారు.[28] జూన్ 2013 నెలమొదట్లో బ్యాంకాక్ ప్రాంతంలో జరిగిన చిత్రీకరణలో చరణ్, శ్రుతి హాసన్, అమీ జాక్సన్ పాల్గున్నారు.[29] జూన్ 2013 నెలచివర్లో చరణ్ - శ్రుతి హాసన్ జంటపై జురిచ్, స్విట్జర్ల్యాండ్ ప్రాంతాల్లో ఒక పాటని చిత్రీకరించారు.[30] జూలై 2013 మొదట్లో మరో పాట చిత్రీకరించారు. శ్రుతి హాసన్ పై కొన్ని ప్యాచ్ వర్క్ సన్నివేశాల చిత్రీకరణతో షూటింగ్ మొత్తం జూలై 22, 2013న పూర్తయ్యింది.[31]
సంగీతం
దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించగా సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, కృష్ణ చైతన్య, శ్రీ మణి సాహిత్యాన్ని అందించారు. రాంచరణ్ తేజ మరియూ పైడిపల్లి వంశీలతో దేవి శ్రీ ప్రసాద్ కలిసి పనిచేసిన తొలి చిత్రమిది. జూలై 1, 2013న హైదరాబాఉలోని శిల్పకళా వేదికలో ఈ సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలయ్యాయి. మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయగా రాంచరణ్ తేజ, అల్లు అర్జున్, శృతి హాసన్, వంశీ పైడిపల్లి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, బ్రహ్మానందం, దిల్ రాజు, అల్లు అరవింద్, సాయి కుమార్, దేవి శ్రీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.[32]
ఎవడు సినిమా పాటలకు మంచి స్పందన లభించింది. 123తెలుగు.కామ్ వారు తమ సమీక్షలో "దేవీ శ్రీ ప్రసాద్ చాలా సేఫ్ సైడ్ గా డీసెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ ఆల్బంలోని పాటలు అందరినీ షాక్ కి గురిచేసేలా ఉండవు అలాగని నిరుత్సాహపరిచేలా కూడా ఉండవు. ఎవడు సాంగ్స్ ఫ్యాన్స్ కి నచ్చుతాయి, రామ్ చరణ్ లోని డాన్సింగ్ స్కిల్స్ ని మరో చూపించడానికి చక్కని అవకాశం ఉంది" అని వ్యాఖ్యానించారు.[33] ఏపీహెరాల్డ్.కామ్ వారు తమ సమీక్షలో "ఎవడు సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ని ఊపేయడం ఖాయం. దేవిశ్రీ మరోసారి మ్యాజిక్ చేశాడు" అని వ్యాఖ్యానించారు.[34]
సినిమా ప్రారంభించినప్పుడు ఆంగ్ల అక్షరాలతో ఉన్న ఎవడు టైటిల్ని, ఆ టైటిల్ కలిగిన పోస్టర్లని విడుదల చేసారు. వాటిలో చరణ్ లుక్స్ కి మంచి స్పందన లభించింది.[35] మార్చి నెలచివర్లో చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని మార్చి 24, 2013న తెలుగు లోగోతో పాటు ఆ లోగో కలిగిన రెండు పోస్టర్లు, ఆంగ్ల లోగోతో ఒక పోస్టరు విడుదల చేసారు.[36] మార్చి 27, 2013న చరణ్ పుట్టినరోజుతోపాటు హోలీ పండుగ సందర్భంగా ఎవడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నామని, ఆడియో విడుదలలో మెయిన్ లుక్ విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు మీడియాకి ఒక రోజు ముందు స్పష్టం చేసారు.[37] మార్చి 27, 2013న విడుదలైన టీజరుకి మంచి స్పందన లభించింది.[38] జూన్ 2013 నెలచివర్లో సినిమాకి సంబంధించిన కొన్ని పోస్టర్లు విడుదలయ్యాయి. ఇందులో చరణ్ లుక్ తో పాటు, హీరోయిన్లతో చేస్తున్న రొమాంటిక్ స్టిల్స్ మంచి స్పందనను రాబట్టాయి. అదే విధంగా చెర్రీకి తగిన జోడీగా శృతి హాసన్, అమీ జాక్సన్ ఆకట్టుకున్నారు.[39][40] జూలై 2, 2013న సినిమా యొక్క మొదటి థియేట్రికల్ ట్రైలర్ విడుదలయ్యింది. ఆ ట్రైలరుకి భారీ సానుకూల స్పందన లభించింది.[41] జనవరి 3, 2014న ఈ సినిమా రెండో థియేట్రికల్ ట్రైలర్ చరణ్ చేతులమీదుగా సంధ్య 70 ఎం.ఎం. ధియేటరులో సాయంత్రం 6 గంటలకు విడుదలయ్యింది.[42] ఆ ట్రైలరుకి కూడా భారీ సానుకూల స్పందన లభించింది.[43] పైగా సినిమా విడుదలకు ముందు ఒక అగ్రకథానాయకుడు అభిమానులను థియేటరులో కలవడం ఇదే మొదటిసారి.[44] రామోజీ ఫిల్మ్ సిటీలో రేసుగుర్రం చిత్రీకరణ పూర్తిచేసుకుని రాత్రి 8 గంటలకు జనవరి 5, 2014న ఎవడు మొబైల్ అప్లికేషనును శ్రుతి హాసన్ చేతులమీదుగా విడుదల చేసారు. కానీ లాంచ్ అనంతరం శ్రుతీ హాసన్ తీవ్రమైన కడుపునొప్పితో అపోలో ఆసుపత్రిలో చేరింది.[45][46]
వివాదాలు
జనవరి 15, 2014న ఈ సినిమాపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ అమీ జాక్సన్ పోస్టర్లు అశ్లీలంగా ఉన్నాయని మాజీ కౌన్సిలర్ కె నాగేంద్ర ప్రసాద్ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఐపీసీ 292 సెక్షన్ కింద హీరో హీరోయిన్లతో పాటు దిల్ రాజు, వంశీ పైడిపల్లి తదితరులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.[47][48] ఏప్రిల్ 2014లో ఈ సినిమాలోని పింపుల్ డింపుల్ పాటలో శృతి హాసన్ ఎక్స్పోజింగ్ శ్తిల్స్ బయటికి వచ్చాయి. విడుదలైన 11 ఫొటోల్లో కొన్ని అసభ్యకరమైన కోణాల్లో శ్రుతి ఛాతి, నడుము కనపడేలా ఉన్నాయి. సోషల్ మీడియాలో విడుదలైన కొన్ని గంటలకే భారీగా ఈ ఫొటోలు దర్శనమిచ్చాయి. ఎంతో మంది శ్రుతి హాసన్ పై కమెంట్ చేసారు. శ్రుతి బరితెగించిందని వార్తలు కథనాలు జోరుగా సాగిన నేపథ్యంలో బాధపడిన శ్రుతి హాసన్ విలేఖరులతో మాట్లాడింది. తన అనుమతి లేకుండా తమ ఫోటోలను ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసిన వారిపై కేసులు పెడతానని, డాన్స్ చేస్తున్నప్పుడు టాప్ యాంగిల్ లో తీసిన కొన్ని ఫోటోలు అసభ్యంగా ఉన్నాయని, అలాంటివాటిని డిలేట్ చేసేస్తూంటారని, అయినా బయిటకు ఎలా వచ్చాయో అర్దం కావటం లేదని ఆమె చెప్పింది. శ్రుతి మాట్లాడుతూ "నన్ను చాలా మంది అడుగుతున్నారు అలాంటి అసభ్యకరమైన ఫోజ్ ఎందుకు ఇచ్చావంటూ. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్దం కావటంలేదు. నిజం ఏమిటంటే ఇలాంటి చీప్ పబ్లిసిటీని నేను ఎప్పుడూ నమ్మను. ఇలాంటివి జరుగుతాయని నేను ఊహించలేదు. అలాగే నేను హైదరాబాద్ లో ఈ విషయమై ఎఫ్ ఐ ఆర్ నమోదు చెయ్యబోతున్నాను" అని తేల్చి చెప్పింది. అలాగే తాను ఈ ఇష్యూలో ఎంతదాకా అయినా వెళ్తానని, ఎలాగయినా ఈ ఫొటోలు అప్ లోడ్ చేసిందెవరో తెలుసుకుంటానని చెప్పింది. ఇది నమ్మకానికి సంబంధించిన సమస్య అంది.[49]
ఈ ఫోటోలు లీక్ అవ్వడం వెనక చిత్ర నిర్మాత దిల్ రాజు హస్తం ఉందనే వార్తలొచ్చాయి. ఇలాంటి ఫోటోలు నిర్మాత ఆధీనంలోనే ఉంటాయని, ఆయనే వాటిని వెబ్ సైట్లకు విడుదల చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.[50] దిల్ రాజు సైతం తనకేం తెలియదని, ఆ ఫొటోలు ఎలా బయట్కి వచ్చాయో తనకి అర్థం కావడంలేదన్నారు. సహజంగా అలాంటి ఫొటోలను డిలీట్ చేస్తారని, దీని వెనుక అపరిచితుల హస్తం ఉందని వ్యాఖ్యానించారు. మే నెలలో శ్రుతి హాసన్ హైదరాబాదులోని సీఐడీ పోలీసుల న్యాయవిభాగాన్ని కలిసి గుర్తుతెలియని వ్యక్తులు తన అసభ్యకరమైన ఫొటోలను లీక్ చేసారని కేసు నమోదు చేసింది. సైబర్ విభాగం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది. సీఐడీ అధికారులు 10 ఛాయాగ్రహకులను పిలిపించి విచారించారు. ఈ విషయంలో పోలీసులు ఎవడు సినిమా పబ్లిసిటీ డిజైనర్, ఫోటో గ్రాఫర్, ప్రొడక్షన్ మేనేజర్, పీఆర్వోలను విచారించారు. సాంకేతిక ఆధారాలను సేకరించేందుకు ఫొటోలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించారు. న్యాయ విభాగం సూచనలు, ఫోరెన్సిక్ ప్రయోగశాల ఫలితాలొచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐడీ వర్గాలు తెలిపాయి. ఆ వ్యక్తులు దొరికి కేసు నిరూపితమైతే జైలు శిక్ష పడే అవకాశముంది అని మీడియాకి తెలిపారు.[51][52]
విమర్శకుల స్పందన
ఎవడు సినిమా విమర్శకుల నుంచి సానుకూల స్పందనను రాబట్టగలిగింది. 123తెలుగు.కామ్ వారు తమ సమీక్షలో "ఎవడు సినిమా అందరూ అనుకున్నట్టుగానే మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే మాస్ ఎంటర్టైనర్. రామ్ చరణ్ పవర్ ప్యాక్ పెర్ఫార్మన్స్, అల్లు అర్జున్ ఎపిసోడ్, హీరోయిన్స్ గ్లామర్, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి ప్రధాన హైలైట్ అయితే రొటీన్ గా అనిపించే సెకండాఫ్, ఫస్ట్ హాఫ్ లోని కొన్ని బోరింగ్ సీన్స్, ఎంటర్టైన్మెంట్ లేకపోవడం సినిమాకి మైనస్. రెగ్యులర్ ప్రేక్షకులు ఒకసారి చూడదగిన సినిమా అయితే రామ్ చరణ్ అభిమానులకు మాత్రం పండగ చేసుకునే సినిమా అవుతుంది. సంక్రాంతి సీజన్ కావడం వల్ల ఎ సెంటర్స్ లో అటు ఇటుగా ఉన్నా బి,సి సెంటర్స్ లో మాత్రం కలెక్షన్స్ కొల్లగొడుతుంది" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇచ్చారు.[53] వన్ ఇండియా వారు తమ సమీక్షలో "హాలీవుడ్ చిత్రం ఫేస్ ఆఫ్ లోని నావల్టీ పాయింట్ ని తీసుకుని రెగ్యులర్ తెలుగు కథ,కథనంతో మసాలా దట్టించి చేసిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులుకు బాగానే పట్టే అవకాశం ఉంది. అయితే చిత్రానువాదం విషయం లో మరింత జాగ్రత్తపడి అల్లు అర్జున్ ,రామ్ చరణ్ కథలుగా విడి విడిగా చెప్పకుండా రెండింటిని కలిపి చెప్తే మరింత నిండుతనంగా ఉండి ఉండేది. ఇక ఇది పూర్తిగా డైరక్టర్ ఓరియెంటెడ్ సినిమా...అయినా రామ్ చరణ్ ...తనే పూర్తిగా మోసాడనే చెప్పాలి" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇచ్చారు.[54]
తెలుగుమిర్చి.కామ్ వారు తమ సమీక్షలో "ఇది మామూలు పగ – ప్రతీకారాల ఫార్ములానే. కాకపోతే ఒక పగ కాదు. రెండు పగలు. అదే కాస్త కొత్తగా ఉంది. పైగా ఒకరి స్థానంలో మరొకరు వచ్చి పగ తీర్చుకోవడం అన్న కాన్సెప్ట్ తెలుగు సినిమా వరకూ కొత్తదే. అసలు కథ మొదలైనట్టు. ప్లాస్టిక్ సర్జరీతో వచ్చిన ఓ రూపానికి మరో ఫ్లాష్ బ్యాక్ జోడించి సెకండాఫ్‌కి అదిరిపోయే లీడ్ ఇచ్చాడు. ఇప్పుడు సెకండాఫ్‌లో మరో కథ మొదలవుతుంది. ప్రేక్షకులకు ఒక్క టికెట్ పై రెండు సినిమాలు చూసిన ఫీలింగ్ ఉన్నా – సెకండాఫ్‌లో దర్శకుడు పండించిన ఎమోషనల్ డ్రామా, సాయికుమార్ పాత్ర ఇవన్నీ పండడంతో సగటు సినిమా అభిమాని సంతృప్తిగా థియేటర్‌ని వదిలి బయటకు వస్తాడు. ఈ సినిమా క్లాసిక్కో, మైండ్ బ్లోయింగో, మరోటో మరోటో కాదు. జస్ట్ పక్కా కమర్షియల్ సినిమా. అందరికీ కావల్సిన అన్ని అంశాలూ ఉన్నాయ్. హాయిగా చూసేయండి. సంక్రాంతి పండగ చేసుకోండి" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3.5/5 రేటింగ్ ఇచ్చారు.[55] ఏపీహెరాల్డ్.కామ్ వారు తమ సమీక్షలో "మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం లో ఒక అభిమానికి, ఒక ప్రేక్షకుడికి ఏదైతే కావాలో అదే ఇచ్చాడు. కాని సమస్యల్ల వచ్చింది కథనం దగ్గరే చెప్పేదే రొటీన్ కథ అందులోనూ ప్రేరణ పొందిన సన్నివేశాలు, చరణ్ బ్లాంక్ ఎక్స్ప్రెషన్ సెకండ్ హాఫ్ లో దానికి జత అయిన శృతి బ్లాంక్ ఎక్స్ప్రెషన్ ఇవి ఈ చిత్రాలలో మైనస్ లు ప్లస్ ల గురించి మాట్లాడితే అల్లు అర్జున్ నటన దేవిశ్రీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, హీరో ఎలివేషన్ ఇవన్ని ప్లస్ , మొత్తంగా చెప్పాలంటే ఈ చిత్రం ఈ సంక్రాంతి విజేత, ఈ సంక్రాంతికి ఏదయినా చిత్రం చూడాలి అనుకుంటే రెండవ ఆలోచన లేకుండా "ఎవడు" చిత్రానికి వెళ్ళిపొండి" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇచ్చారు.[56] హలోఆంధ్రా.కామ్ వారు తమ సమీక్షలో "పైసా వసూల్ సినిమా... అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఈ సినిమా. పక్కా కమర్షియల్ హంగులతో తీర్చిదిద్దారు. తుఫాన్ తాకిడికి గిలగిలలాడిన రామ్‌చరణ్‌కు నిజంగానే ఈ సినిమా ఓ ఓదార్పు! వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ సినిమా పండుగకి రిలీజ్ అయ్యి హీరో, నిర్మాతలకు రిలీఫ్ ని ఇచ్చింది. అందరు చూడదగ్గ సినిమా 'ఎవడు'. డోంట్ మిస్ ఇట్" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3.25/5 రేటింగ్ ఇచ్చారు.[57]
↑"కేరళలో చరణ్ హవా." ఇండియాగ్లిట్స్. February 17, 2014. Retrieved June 12, 2014.
↑మన తెలంగాణ, సినిమా (హరివిల్లు) (12 September 2018). "సినిమాలే నా జీవితం..!". manatelangana.news (in ఇంగ్లీష్). వి. భూమేశ్వర్. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020.