సాయి కుమార్ తెలుగు సినిమా నటుడు, డబ్బింగ్ కళాకారుడు, భారతీయ జనతా పార్టీ సభ్యుడు. సాయికుమార్ కుటుంబ సభ్యులంతా చిత్రపరిశ్రమతో అనుబంధం ఉన్నారు. తండ్రి పి. జె. శర్మ, ఇద్దరు తమ్ముళ్ళు అయ్యప్ప శర్మ, రవిశంకర్ నటులు, డబ్బింగ్ కళాకారులు. కొడుకు ఆది సినీ నటుడు.
బాల్యం
సాయికుమార్ నటుడు పి.జె.శర్మ కుమారుడు. ఈయన స్వస్థలం పెద్దకళ్ళేపల్లి. తల్లి కృష్ణజ్యోతి. ఈమె స్వస్థలం కర్ణాటకలోని బాగేపల్లి. సాయికుమార్ మద్రాసులో పుట్టి పెరిగాడు.[1] తండ్రి కూడా డబ్బింగ్ కళాకారుడు కావడంతో సాయి కుమార్ బాల్యం నుంచే ఆ వృత్తిలో ప్రవేశించాడు. కథానాయకులు సుమన్, రాజశేఖర్ ల సినిమాలకు మొదట్లో డబ్బింగ్ చెప్పాడు. కంఠస్వరం, తెలుగు ఉచ్ఛారణ బాగుండటంతో ఆయనకు చిత్ర పరిశ్రమలో నటుడిగా కూడా అవకాశాలు లభించాయి. ఆయనకు భార్య సురేఖ, పిల్లలు ఆది , జ్యోతిర్మయి ఉన్నారు. సాయికుమార్ సోదరులు రవిశంకర్ డబ్బింగ్ కళాకారుడు, అయ్యప్ప శర్మ (నటుడు).[2]
సినీరంగం
సాయికుమార్ సినీ ప్రస్థానం డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభమైంది. ఆయన డబ్బింగ్ చెప్పిన తొలిచిత్రం ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన సంసారం అనే సినిమా.
కొన్నాళ్ల తర్వాత బాలనటుడిగా కూడా అవకాశాలు వచ్చాయి. బాలనటుడిగా సాయికుమార్ చేసిన తొలిసినిమా దేవుడు చేసిన పెళ్లి. అందులో ఆయన అంధుడిగా నటించాడు. తర్వాత దర్శకుడు మధుసూదన్‌రావు తెరకెక్కించిన జేబు దొంగ సినిమాలో నటించాడు. ముందుగా కన్నడ చిత్రాలలో కథానాయకుడిగా నటించిన తర్వాతే తెలుగు సినిమాలలో నటించాడు.