రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు. ఎక్కువగా హాస్య చిత్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన సినిమాలలో అహ నా పెళ్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు మంచిపేరు తెచ్చిపెట్టాయి.
బాల్యం, విద్యాభ్యాసం
రాజేంద్రప్రసాద్ క్రిష్ణా జిల్లాకు చెందిన గుడివాడకు దగ్గర్లోని దొండపాడు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు గద్దె వెంకట నారాయణ, మాణిక్యాంబ.[3] అతను బాల్యం, యవ్వనంలో అప్పుడప్పుడూ ఎన్. టి. ఆర్ స్వస్థలమైన నిమ్మకూరులోని ఇంటికి తరచుగా వెళ్ళి వస్తుండేవాడు. అలా చిన్నప్పటి నుంచే అతనికి ఎన్. టి. ఆర్ ప్రభావం పడింది. సినీ పరిశ్రమలో ప్రవేశించక మునుపు సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లోమా పూర్తి చేశాడు.
నటన
ఎన్టీఆర్ తో చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్రప్రసాద్ ఆసక్తిని గమనించి ఆయనే చెన్నైలోని ఓ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేర్పించాడు.[4] ఎన్టీయార్ సలహాతోనే 1977లో సినిమాల్లో ప్రవేశించాడు. నటుడిగా రాజేంద్రప్రసాద్ తొలిచిత్రం బాపు దర్శకత్వంలో స్నేహం అనే సినిమా 1977 సెప్టెంబరు 5 న విడుదలైంది. ఆ తర్వాత మంచుపల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు.
రాజేంద్రప్రసాద్ హాస్యాన్నే ప్రధానంశంగా తీసుకుని సినిమాలు చేసి, విజయం సాధించి, కథానాయకుడిగా ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. నటుడిగా వివిధ భాషలలో రెండు వందల పైచిలుకు చిత్రాల్లో నటించాడు. నందమూరి తారకరామారావు స్ఫూర్తితో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన రాజేంద్రప్రసాద్ ప్రేమించు పెళ్లాడు సినిమాతో హీరోగా మారాడు. కారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న రోజుల్లో హీరో కూడా నవ్వుల్ని వండివార్చగలడు అని నిరూపించాడు రాజేంద్రప్రసాద్. జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, బాపు లాంటి వారి దర్శకత్వంలో నటించిన ఘనత రాజేంద్రప్రసాదుది.
తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా క్విక్ గన్ మురుగన్ అనే సినిమాతో హాలీవుడ్లో కూడా నటించాడు. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సత్తా చాటాడు. మేడమ్ సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళ పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
మా అధ్యక్షుడు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కు 2015 ఏప్రిల్ లో జరిగిన ఎన్నికలలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికలలో రాజేంద్రప్రసాద్ ఘనవిజయం సాధించాడు. ఎంతో హోరా హోరీగా సాగిన ఈ ఎన్నికలలో రాజేంద్రప్రసాద్, జయసుధలు అధ్యక్ష పదవికి పోటీపడగా తీవ్ర ఉత్కంఠ మధ్య వెలువడిన ఫలితాలు జయసుధ, మురళీమోహన్ లకు షాక్ నిచ్చాయి. జయసుధ గెలుపు ఖాయమని అందరూ భావించినప్పటికీ రాజేంద్రప్రసాద్ గెలుపు అనూహ్యంగా తోచింది. రాజేంద్రప్రసాద్ 83ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. రాజేంద్రుడి ప్యానల్ లోని శివాజీ రాజా, కాదంబరి కిరణ్ కూడా గెలుపొందారు.
పురస్కారాలు
ఎర్రమందారం సినిమాలో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం - 1991
మేడమ్ సినిమాలో నటనకు గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు - 1994
ఆ నలుగురు సినిమాకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు - 2004
రాజేంద్ర ప్రసాద్ బాపు దర్శకత్వం వహించిన స్నేహం (1977) సినిమా ద్వారా వెండితెరపై నటుడిగా అరంగేట్రం చేశారు. ప్రారంభంలో, రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేశాడు . రాజేంద్రప్రసాద్ కృష్ణ నటించిన రామరాజ్యంలో భీమరాజు చిత్రంలో సహాయక పాత్ర పోషించాడు. ఈ సినిమా తర్వాత రాజేంద్రప్రసాద్ కు 14 సినిమాలలో అవకాశాలు వచ్చాయి.
(1985 - 2004)
దర్శకుడు వంశీ తన చిత్రం ప్రేమించు పెళ్లాడులో ఒక ప్రధాన పాత్రను పోషించడానికి రాజేంద్ర ప్రసాద్ ను ఎంపిక చేసుకున్నాడు. రాజేంద్రప్రసాద్ వంశీ దర్శకత్వం వహించిన లేడీస్ టైలర్ సినిమాతో పేరుపొందాడు. రాజేంద్రప్రసాద్ సినిమాలలో ప్రధాన పాత్రలు పోషిస్తూనే సహాయ పాత్రలలో నటించడం కొనసాగించాడు. 45 సంవత్సరాలకు పైగా నట జీవితంలో, రాజేంద్రప్రసాద్ 200 కంటే ఎక్కువ సినిమాలలో నటించాడు. రాజేంద్రప్రసాద్ కొన్ని తమిళ చిత్రాలలో నటించాడు. రాజేంద్ర ప్రసాద్ ను హాస్య నటుడుగా పేరు పొందాడు.[9]ఆంధ్ర ప్రదేశ్‌లో రాజేంద్ర ప్రసాద్ ను హాస్యనటకిరీటి పిలుచుకుంటారు.[10]
↑123తెలుగు, రివ్యూ (30 January 2015). "Top Rankers Review and Rating". www.123telugu.com. Archived from the original on 26 December 2019. Retrieved 24 February 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)