విదిశ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణం. ఇది రాష్ట్ర రాజధాని భోపాల్కి ఈశాన్యంగా 62.5 కి.మీ. దూరంలో ఉంది "విదిశ" అనే పేరు పురాణాలలో పేర్కొన్న "బైస్" నది నుండి వచ్చింది.[1] ఈ పట్టణాన్ని పూర్వం భెల్సా అని పిలిచేవారు. పురాతన కాలంలో బెస్‌నగర్ అని దీనికి పేరు.
1904 లో విదిశ, బసోడా తహసీళ్ళను కలిపి ఈ జిల్లాను "భిల్సా జిల్లా"గా ఏర్పాటు చేసారు. అంతకుముందు అవి గ్వాలియర్ సంస్థానంలో భాగంగా ఉండేవి. 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, పూర్వపు సంస్థానమైన గ్వాలియర్ 1948 లో ఏర్పడిన మధ్య భారత్ రాష్ట్రంలో భాగమైంది.
మధ్యయుగ కాలంలో విదిశ, భెల్సాకు పాలనా కేంద్రంగా ఉంది. 1956 లో దీని పేరును విదిశ అని మార్చారు.[2]
2011 జనగణన ప్రకారం,[3] విదిశ జనాభా 1,55,959. జనాభాలో పురుషులు 53.21%, స్త్రీలు 46.79%. విదిశ అక్షరాస్యత 86.88% ఇది జాతీయ సగటు 74.04% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 92.29%, స్త్రీ అక్షరాస్యత 80.98%. విదిశ జనాభాలో 15% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.
ఈ పట్టణం బెట్వా నదికి తూర్పున, బెట్వా, బెస్ నదుల సంగమం వద్ద, సాంచి నుండి 9 కి.మీ. దూరంలో ఉంది. బెస్‌నగర్ పట్టణం, నేటి విదిశ ఉన్న స్థానం నుండి 3 కి.మీ. దూరంలో నదికి పడమటి వైపున ఉండేది. సా.పూ. 6 వ, 5 వ శతాబ్దాల్లో, శుంగులు, నాగులు, శాతవాహనులు, గుప్తుల కింద ఇది ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉండేది. పాళీ గ్రంథాల్లో దీని ప్రస్తావన ఉంది. అశోక చక్రవర్తి తన తండ్రి పాలించే కాలంలో విదిశకు రాజప్రతినిధిగా ఉండేవాడు. అతని మొదటి భార్య అయిన బౌద్ధ సామ్రాజ్ఞి విదిశా దేవి, విదిశలోనే పెరిగింది. కాళిదాసుని మేఘదూతంలో పట్టణ ప్రస్తావన ఉంది
బెస్‌నగర్ శిథిలాలను అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్ 1874–1875లో పరిశీలించాడు.[4] నగరం పశ్చిమ భాగంలో పెద్ద రక్షణ గోడ యొక్క అవశేషాలను కనుగొన్నాడు. పురాతన బౌద్ధ రైలింగ్‌లు నగరానికి వెలుపల కనుగొనబడ్డాయి, ఇవి బహుశా స్థూపాన్ని అలంకరించి ఉండవచ్చు. పశ్చిమ సాత్రపులకు చెందిన తొమ్మిది నాణేలతో సహా అనేక నాణేలను ఇక్కడ కనుగిన్నారు.
హీలియోడోరస్ స్థూపం ఒక రాతి స్థూపం. దీనిని క్రీ.పూ 110 లో నిర్మించారు. ఈ రాతి స్థూపాన్ని ఇండో-గ్రీక్ రాజు ఆంటియల్‌సిడాస్ యొక్క గ్రీకు రాయబారి నిర్మించాడు. అతను శుంగ రాజు అయిన భగభద్ర ఆస్థానానికి వచ్చాడు. వాసుదేవుడికి అంకితం చేయబడిన ఈ కాలమ్ వాసుదేవ ఆలయం ముందు నిర్మించబడింది. ఈ స్థూపం విదిశ-గంజ్ బసోడా రాష్ట్ర రహదారి-14 పై విదిశ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. వైస్ నది ఉత్తరపు ఒడ్డున ఉంది. ఇది 20 అడుగుల 7 అంగుళాల పొడవైన రాతి స్థూపం, దీనిని సాధారణంగా ఖమ్ బాబా అని పిలుస్తారు.[4] శాసనంలో ఉపయోగించిన లిపి బ్రాహ్మి, కానీ భాష మాత్రం ప్రాకృతం. హెలియోడోరస్ ఈ స్థూపాన్ని గరుడ స్థూపంగా నిర్మించి వాసుదేవుడికి సమర్పించాడని వివరిస్తుంది. తరువాత ఇదే విష్ణువు అవతారంగా భావించబడింది.
మధ్యయుగ కాలంలో బెస్‌నగర్‌ను భెల్సా అని పిలిచేవారు. ఇది సూర్య దేవుడు భిల్లాస్వానిన్ ఆలయానికి ప్రసిద్ధి చెందింది.[5] దీనిని తరువాత గుప్త రాజు దేవగుప్తుడు, రాష్ట్రకూట రాజు మూడవ కృష్ణుడు పాలించారు. ఈ పేరును సా.శ. 878 లో ఒక శిలాశాసనంలో పరవాడ వర్గానికి చెందిన హతియాకా అనే వ్యాపారి గుర్తించారు.[6] 12 వ శతాబ్దపు త్రిశక్తి-శాలక-పురుష-చరిత్ర విదిశ వద్ద భిల్లస్వామిన్ చిత్రంతో పాటు ఇసుకలో ఖననం చేసిన జీవంత్ స్వామి నకలు గురించి ప్రస్తావించింది.[7] మిన్హాజుద్దీన్ రాసిన తబాకత్-ఇ-నుసిరీలో ఇల్తుత్మిష్ 1233-34 లో ఈ ఆలయాన్ని నాశనం చేసాడని రాసాడు.[8]
1293 లో, సుల్తాన్ జలాలుద్దీన్ జనరల్ గా ఢిల్లీ సుల్తానేట్కు చెందిన అలావుద్దీన్ ఖల్జీ ఈ నగరాన్ని కొల్లగొట్టాడు . మధ్యయుగంలో విదిశకు ప్రాముఖ్యత ఉందని ఇది నిరూపిస్తుంది.[9] 1532 లో భిల్సాను గుజరాత్ సుల్తానేట్ బహదూర్ షా ఆక్రమించాడు. ఇది మాళ్వా సుల్తాన్ల చేతికి, ఆ తరువాత మొఘలులకు, ఆపై సింధియాలకూ చేరింది .
విదిశను జైన తీర్థంగా భావిస్తారు. విదిశ పదవ తీర్థంకరుడైన శీతలనాథుని జన్మస్థలం అని నమ్ముతారు. [12] విదిశలో 14 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి బడా మందిర్, బజ్రమఠ్ జైన్ ఆలయం, మహాదేవి ఆలయం, గదర్మల్ ఆలయం, పటారియా జైన దేవాలయం. ఈ దేవాలయాలు గొప్ప వాస్తుశిల్పంతో కూడ్కున్నవి. [13] [14] [15] [16]
విదిశ రైల్వేస్టేషను, మధ్య రైల్వే యొక్క ఢిల్లీ-చెన్నై, ఢిల్లీ-ముంబై ప్రధాన మార్గంలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుండి 54 కి.మీ. దూరంలో ఉంది.