నీమచ్ [1] మధ్యప్రదేశ్ మాళ్వా ప్రాంతంలోని పట్టణం. ఇది నీమచ్ జిల్లా ముఖ్యపట్టణం. మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దు పట్టణం పక్కగా పోతుంది. పట్టణంలో గ్వాలియర్ సంస్థానం లోని పెద్ద బ్రిటిష్ కంటోన్మెంటు ఉండేది. 1822 లో ఈ పట్టణం సంయుక్త రాజ్‌పుతానా - మాల్వా రాజకీయ ఏజన్సీకి రాజధానిగా ఉండేది. 1895 లో మాళ్వా ఏజెన్సీకి రాజధానిగా మారింది. బ్రిటిష్ కంటోన్మెంటును 1932 లో రద్దు చేసారు. తరువాత దీనిని బ్రిటిష్ మునిసిపల్ బోర్డు నిర్వహించింది. నీమచ్ దాదాపు 1: 1 లింగనిష్పత్తి కలిగిన గ్రామం.
నీమచ్ జిల్లా ఉజ్జయిని విభాగంలో భాగం. ఇది పశ్చిమ, ఉత్తరాల్లో రాజస్థాన్, తూర్పు, దక్షిణాల్లో మంద్‌సౌర్ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. 1998 జూన్ 30 న మాండ్‌సౌర్ జిల్లా నుండి విభజించి ఈ జిల్లాను ఏర్పరచారు.
ఈ నగరం మూడు ప్రధాన భాగాలుగా ఉంది: నీమచ్ పట్టణం, ఛావనీ, బఘానా.
2011 జనగణన ప్రకారం నీమచ్ జనాభా 1,27,000. ఇందులో పురుషులు 53%, స్త్రీలు 47%. నీమచ్ అక్షరాస్యత 85%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 77%, స్త్రీల అక్షరాస్యత 62%. నీమచ్ జనాభాలో 14% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
2011 జనాభా లెక్కల ప్రకారం నీమచ్ జిల్లా జనాభాలో 70.31% మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా, 29.69% మంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. [2]
నీమచ్ మాల్వా ప్రాంతంలో ఉన్న కారణంగా, ఇక్కడి శీతోష్ణస్థితి ఆహ్లాదకరంగా ఉంటుంది. మే జూన్లలో గరిష్ట ఉష్ణోగ్రత 46°C కి చేరుకుంటుంది. శీతాకాలంలో, కనిష్ట ఉష్ణోగ్రత 2°C కి చేరుకుంటుంది. నీమచ్‌లో వార్షిక సగటు వర్షపాతం 812 మి.మీ. గరిష్ట వర్షపాతం జూలై, ఆగస్టు నెలలలో సంభవిస్తుంది. అత్యల్ప వర్షపాతం 501.6 మి.మీ. 2007 లో నమోదైంది. గరిష్ట వర్షపాతం 1352 మి.మీ. 2006 లో సంభవించింది. గాలి దిశ ఏప్రిల్ నుండి సెప్టెంబర్ నెలలలో నైఋతి నుండి ఉత్తరం వైపుగా ఉంటుంది. మిగిలిన నెలల్లో ఇది ఈశాన్యం నుండి నైరుతి దిశలో ఉంటుంది. [6] [7]
నీమచ్ అజ్మీర్ - రత్లాం బ్రాడ్ గేజ్ రైలు మార్గంలో ఒక ముఖ్యమైన రైల్వే స్టేషన్ . నీమచ్ రైల్వే స్టేషన్‌ను బ్రిటిష్ వారు 1880 లో నిర్మించారు. దీనికి రత్లాం, నాజ్డా ద్వారా ఉజ్జయినికి, రాజస్థాన్‌లోని కోట, బుంది, చిత్తోర్‌గఢ్ కు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ఇది రత్లం నుండి సుమారు 140 కి.మీ., చిత్తోర్‌గఢ్ నుండి 60 కి.మీ. దూరంలో ఉంది. నీమచ్ నుండి జావాద్, సింగోలి, కోట వరకు ప్రత్యేక రైలు మార్గం కోసం ఒక సర్వేను 2014 లో తాత్కాలిక రైలు బడ్జెట్‌లో ఆమోదించారు. [10]
జిల్లా లోని ప్రదేశాల తోను, మధ్యప్రదేశ్ రాష్ట్రం, పొరుగున ఉన్న రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్న ప్రదేశాల తోనూ పట్టణాన్ని కలిపే రోడ్లతో పాటు, జాతీయ రహదారి 79 కూడా నీమచ్ గుండా పోతుంది. జాతీయ రహదారి 79 అజ్మీర్, చిత్తోర్, రత్లామ్‌లతో కలుపుతుంది. రాష్ట్ర రహదారి, పట్టణాన్ని రాజస్థాన్ లోని ఉదయపూర్ తో కలుపుతుంది. జాతీయ రహదారి మినహా, సింగోలి, మానసా వెళ్లే జిల్లా రహదారులను రాష్ట్ర పిడబ్ల్యుడి చూసుకుంటుంది. నగర రహదారులను మునిసిపల్ కౌన్సిల్ నిర్వహిస్తుంది.