మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా లోని శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 4 మండలాలు ఉన్నాయి. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గం 1957లో ఇతర నియోజకవర్గంలో కలవగా మళ్ళీ 1962లో ప్రత్యేకంగా ఏర్పడింది. 1978లోమర్రి చెన్నారెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థిని గెలిపించిన ప్రత్యేకతను ఈ నియోజకవర్గం దక్కించుకుంది. ఇటీవలి వరకు తెలుగుదేశం పార్టీలో స్థానం పొంది అనేక పదవులు నిర్వహించి, నవతెలంగాణ పార్టీ స్థాపించిన టి.దేవేందర్ గౌడ్ వరుసగా 3 సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు. ఇప్పటి వరకు జరిగిన 11 ఎన్నికలలో కంగ్రెస్ పార్టీ 6 సార్లు, తెలుగుదేశం పార్టీ 4 సార్లు విజయం సాధించగా, 1962లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన వందేమాతరం రామచంద్రారావు కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.వి. రంగారెడ్డిపై గెలుపొందినాడు.[1]
2004 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి టి.దేవేందర్ గౌడ్ వరుసగా మూడవ పర్యాయం పోటీచేయగా మొత్తం 172904 ఓట్లు సాధించి సమీప తెలంగాణా రాష్ట్ర సమితి అభ్యర్థి అయిన కె.ఆర్.సురేందర్ రెడ్డిపై 25704 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. సురేందర్ రెడ్డికి 147200 ఓట్లు లభించాయి.
రంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్మెన్‌గాను, 3 సార్లు మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడుగాను, రంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్మెన్‌గానూ, రాష్ట్రమంత్రివర్గంలో అనేక మంత్రిపదవులను చేపట్టిన నేత టి.దేవేందర్ గౌడ్ మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలో 1953, మార్చి 18న జన్మించాడు. కళాశాల దశలోనే విద్యార్థి నాయకుడిగా పనిచేసిన అనుభవంతో తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి ఎన్.టి.రామారావు నేతృత్వంలో పార్టీలో చేరి అంచెలంచెలుగా పార్టీలో ముఖ్య వ్యక్తిగా ఎదిగాడు. తన తెలంగాణ వాదానికి పార్టీలో తగిన ప్రతిస్పందన లభించకపోవడంతో 2008, జూన్ 23న తెలుగుదేశం పార్టీకి రాజానామా చేసి నవతెలంగాణా ప్రజాపార్టీ పేరుతో కొత్త పార్టీ స్థాపించాడు. ఫిబ్రవరి 2009లో నవతెలంగాణా పార్టీని ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశాడు.