మహబూబ్ నగర్ జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజన ఫలితంగా జడ్చర్ల నియోజకవర్గంలోని తిమ్మాజీపేట మండలం ఈ నియోజకవర్గంలో భాగం కాగా, ఇది వరకు ఉన్న గోపాలపేట మండలం వనపర్తి నియోజకవర్గానికి తరలించబడింది.[1][2]
1999 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాగం జనార్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన ఇండిపెండెంట్ అభ్యర్థి దామోదర్ రెడ్డిపై 31466 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. నాగం జనార్థన్ రెడ్డికి 61964 ఓట్లు రాగా, దామోదర్ రెడ్డి 30498 ఓట్లు పొందినాడు. రంగంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి వి.మోహన్ గౌడ్‌కు మూడవ స్థానం లభించింది. మొత్తం 8 అభ్యర్థులు పోటీ చేయగా ప్రధాన పోటీ ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్యనే కొనసాగింది. మిగితా 5గురు అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు.
2004 ఎన్నికలు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో నాగర్‌కర్నూల్ శాసనసభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాగం జనార్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అయిన కూచకుళ్ళ దామోదర్ రెడ్డిపై 1449 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. నాగం జనార్థన్ రెడ్డి 57350 ఓట్లు సాధించగా, దామోదర్ రెడ్డి 55901 ఓట్లు పొందినాడు.
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి[6], భారతీయ జనతా పార్టీ తరఫున జె.రఘునందన్ రెడ్డి [7], కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా పరిషత్తు చైర్మెన్ కె.దామోదరరెడ్డి[8], ప్రజారాజ్యం పార్టీ నుండి నూర్జహాన్[9], లోక్‌సత్తా నుండి కె.రామకృష్ణ [10] పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాగం జనార్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కూచుకుళ్ల దామోదర్ రెడ్డిపై విజయం సాధించి ఐదవసారి శాసనసభలో ప్రవేశించాడు.
మహబూబ్ నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలలో ముఖుడైన నాగం జనార్థన్‌రెడ్డి గతంలో ఆరోగ్య, సంక్షేమశాఖామంత్రిగానూ, పంచాయతీరాజ్ శాఖామంత్రిగాను పనిచేశాడు. ఎం.బి.బి.ఎస్. చదివిన నాగం జనార్థన్‌రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ఐదవసారి విజయం సాధించాడు.
కూచుకుళ్ళ దామోదరరెడ్డి
1981లో తూడుకుర్తి గ్రామ పంచాయతి సర్పంచిగా ఎన్నికై రాజకీయ జీవితం ప్రారంభించిన దామోదరరెడ్డి 1989లో మండల ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. 194-99 కాలంలో తెలుగుదేశం పార్టీలో ఉంటూ నాగర్ కర్నూల్ మండలాధ్యక్షుడిగా వ్యవహరించాడు. 1999లో కాంగ్రెస్ పార్టీలో చేరి, పార్టీ టికెట్టు రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ ఓడిపోయాడు. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పోటీచేసి నాగం జనార్థన్ రెడ్డి చేతిలో పరాజయం పొందినాడు. 2006 జడ్పీటీసి ఎన్నికలలో తాడూరు మండలం నుండి గెలుపొంది మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్తు చైర్మెన్ పదవిని పొందినాడు. 2009 ఎన్నికలలో నాగర్ కర్నూల్ స్థానం నుండి పోటీచేయడానికి కాంగ్రెస్ పార్టీ టికెట్టు లభించింది.[11]