మధ్యమహేశ్వర్ (మద్మహేశ్వర్) అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్వాల్ హిమాలయాలలోని గౌండర్ గ్రామంలో శివుడికి అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం.[1] ఇది 3,497 మీ. (11,473.1 అ.) ఎత్తులో ఉంది. గర్వాల్ ప్రాంతంలోని ఐదు శివాలయాలను కలిగి ఉన్న పంచ కేదార్ తీర్థయాత్ర (కేదార్‌నాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్, కల్పేశ్వర్) లలో ఇదీ ఒకటి. శివుని మధ్య లేదా బొడ్డుభాగం లేదా నాభి ఇక్కడ పూజించబడుతుంది. ఈ దేవాలయాన్ని పాండవులు నిర్మించారని నమ్ముతారు.[2]
చరిత్ర
గర్వాల్ ప్రాంతం శివుడు, పంచ కేదార్ దేవాలయాల సృష్టి గురించి అనేక జానపద ఇతిహాసాలు ప్రాచూర్యంలో ఉన్నాయి.
కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు తమ దాయాదులను - కౌరవులను ఓడించి చంపిన తరువాత సోదరహత్య, బ్రాహ్మణహత్య చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడంకోసం వారు తమ రాజ్యాధికారాన్ని తమ బంధువులకు అప్పగించి, శివుడిని ఆశీర్వాదం కోసం బయలుదేరారు. మొదట వారణాసి (కాశీ)కి వెళ్ళి కాశీ విశ్వనాథునిని వేడుకున్నారు. కానీ కురుక్షేత్ర యుద్ధంలో నిజాయితీ లేని కారణంగా శివుడు, పాండవుల ప్రార్థనలను పట్టించుకోలేదు. శివుడు నంది రూపాన్ని ధరించి, గర్వాల్ ప్రాంతంలో దాక్కున్నాడు.
వారణాసిలో శివుడు కనిపించకపోవడంతో పాండవులు గర్వాల్ హిమాలయాలకు వెళ్ళారు. అక్కడ భీముడు రెండు పర్వతాల వద్ద నిలబడి శివుని కోసం వెతకగా, గుప్తకాశి సమీపంలో ఒక ఎద్దు మేస్తున్నట్లు కనిపించింది. భీముడు వెంటనే గుర్తించి, ఎద్దును దాని తోక, వెనుక కాళ్ళను పట్టుకున్నాడు. కానీ ఎద్దురూపంలో ఉన్న శివుడు భూమిలోకి అదృశ్యమయ్యాడు. కేదార్‌నాథ్‌లో మూపురం పెరగడం, తుంగనాథ్‌లో చేతులు కనిపించడం, రుద్రనాథ్‌లో ముఖం, నాభి, మధ్యమహేశ్వర్‌లో పొత్తికడుపు, కల్పేశ్వర్ లో వెంట్రుకలు కనిపిస్తాయి. ఐదు వేర్వేరు రూపాల్లో తిరిగి కనిపించడంతో పాండవులు సంతోషించారు. శివుడిని పూజించడం కోసం ఐదు ప్రదేశాలలో దేవాలయాలను నిర్మించారు. ఆ విధంగా పాండవులు తమ పాపాల నుండి విముక్తులయ్యారు.[3]
ఎద్దు ఐదు భాగాలుగా విడిపోయి హిమాలయాలలోని గర్వాల్ ప్రాంతంలోని కేదార్ ఖండ్‌లోని ఐదు ప్రదేశాలలో కనిపించింది.[4] పంచ కేదార్ దేవాలయాలను నిర్మించిన తరువాత, పాండవులు మోక్షం కోసం కేదార్‌నాథ్‌లో ధ్యానంచేసి, యజ్ఞంచేసి, ఆపై మహాపంత్ (స్వర్గరోహిణి) అనే స్వర్గ మార్గం ద్వారా స్వర్గం లేదా మోక్షాన్ని పొందారు. పంచ కేదార్ దేవాలయాలు ఉత్తర-భారత హిమాలయ దేవాలయ నిర్మాణంలో కేదార్‌నాథ్, తుంగనాథ్, మధ్యమహేశ్వర్ దేవాలయాలు ఒకే విధంగా కనిపిస్తాయి.
పంచ కేదార్ దేవాలయాల వద్ద శివ దర్శన తీర్థయాత్రను పూర్తిచేసిన తర్వాత, బద్రీనాథ్ దేవాలయంలోవిష్ణువును సందర్శించడం ఒక అలిఖిత మతపరమైన ఆచారం.[5]
దేవాలయం
ఉత్తర-భారత హిమాలయ నిర్మాణ శైలిలో ఉన్న ఈ దేవాలయం ఎత్తైన శిఖరం క్రింద, పచ్చిక మైదానంలో ఉంది. పురాతనమైన, 'వృద్ధ్-మద్మహేశ్వర్' అని పిలవబడే ఈ దేవాలయం, చౌఖంబ పర్వత శిఖరాల వద్ద నేరుగా కనిపించే శిఖరంపై ఉన్న ఒక చిన్న నల్లటి మందిరం. నల్లరాతితో చేసిన నాభి ఆకారంలో ఉన్న శివలింగం గర్భగుడిలో ప్రతిష్టించబడింది.[2]పార్వతికి, అర్ధనారీశ్వరుడికి చేరో గుడులు ఉన్నాయి. రెండవ పాండవ సోదరుడైన భీముడు ఈ దేవాలయాన్ని నిర్మించి ఇక్కడ శివుడిని పూజించాడని చెబుతారు. ప్రధాన దేవాలయానికి కుడివైపున ఒక చిన్న గుడి ఉంది, ఆ గర్భగుడిలో పాలరాతితో తయారు చేయబడిన సరస్వతి, హిందూ విద్యా దేవత ప్రతిష్ట ఉంది.[6]
పూజ
దేవాలయ ప్రాంగణం నుండి వచ్చే నీరు చాలా పవిత్రమైనదిగా చెప్పబడుతోంది. పూజలు శీతాకాలం తర్వాత వేసవి నెలల ప్రారంభం నుండి నిర్దిష్ట కాల వ్యవధితో ప్రారంభమవుతాయి. శీతాకాలం ప్రారంభం నుండి అక్టోబరు/నవంబరు వరకు మంచు పరిస్థితుల కారణంగా దేవాలయ ప్రాంగణాన్ని చేరుకోలేము. శీతాకాలంలో, దేవుని ప్రతీకాత్మకమైన విగ్రహం నిరంతర ఆరాధన కోసం ఉఖిమత్‌కు మతపరమైన లాంఛనాలతో మార్చబడుతుంది. ఈ దేవాలయంలో పూజారులు, రాష్ట్రంలోని అనేక ఇతర దేవాలయాలలో వలె, దక్షిణ భారతదేశానికి చెందినవారు. ఈ ప్రత్యేక దేవాలయంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌కు చెందిన లింగాయత్ కులానికి చెందిన జంగమా అని పిలుస్తారు. 2 కి.మీ. దూరంలో బురా మధ్యమహేశ్వర్ అనే చిన్న దేవాలయం ఉంది. పెద్ద మూర్‌లు, లోయల గుండా 2 కిలోమీటర్లు నిటారుగా ట్రెక్కింగ్ చేసి, ఆపై ఒక చిన్న సరస్సుకి చేరుకోవాలి, అక్కడ శిఖరాలు, చౌఖంబ, కేదార్‌నాథ్, నీలకంఠ్, త్రిశూల్, కామెట్, పంచుల్లి మొదలైన హిమాలయాల పూర్తి విశాల శ్రేణి ఉంటుంది.[7]
భౌగోళికం
ఎత్తైన హిమాలయ పర్వత శ్రేణులలో చౌఖంబ (నాలుగు స్తంభాలు లేదా శిఖరాలు), నీలకంఠ, కేదార్‌నాథ్ మంచు శిఖరాలతో చుట్టుముట్టబడిన ఆకుపచ్చ లోయలో ఈ దేవాలయం ఉంది.[8] కేదార్ మాసిఫ్ అని పిలువబడే కేదార్ కొండలు, మందాకిని నది మూలాన్ని కలిగి ఉన్న అనేక హిమానీనదాలతో కూడిన పర్వత నిర్మాణ దృశ్యం ఉంటుంది. ఈ ప్రాంతంలో గొప్ప వృక్షజాలం, జంతుజాలం ఉన్నాయి. ముఖ్యంగా కేదార్‌నాథ్ వన్యప్రాణుల అభయారణ్యంలో అంతరించిపోతున్న హిమాలయన్ మోనల్ ఫెసెంట్, హిమాలయన్ కస్తూరి జింకలు (కస్తూరి జింక)లు ఉన్నాయి.
సందర్శన
ఏప్రిల్ నుండి సెప్టెంబరు వరకు దేవాలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం. అక్టోబరు నెల తరువాత కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. పంచ కేదార్‌లోని ఐదు దేవాలయాలను చూడడానికి మొత్తం ట్రెక్ పొడవు సుమారు 170 కి.మీ. (105.6 మై.) (గౌరీకుండ్ వరకు రహదారి ప్రయాణంతో సహా), 16 రోజుల ప్రయాణం ఉంటుంది. గౌరీ కుండ్ నుండి ట్రెక్ ప్రారంభమవుతుంది, దీని నుండి హిమాలయ కొండల శ్రేణి, ఆల్ప్స్‌తో పోల్చదగిన విశాలమైన గర్వాల్ ప్రాంతం దృశ్యాలు ఉంటాయి.
ట్రెక్కింగ్ రెండు సీజన్లలో జరుగుతుంది; వేసవిలో మూడు నెలలు, వర్షాకాలం తర్వాత రెండు నెలలు, రుద్రనాథ్ మినహా మిగిలిన నాలుగు పంచ కేదార్ దేవాలయాలు మంచు కవచం కారణంగా ప్రవేశించడం వీలుకాదు.