మైసూరు (కన్నడ: ಮೈಸೂರು) కర్ణాటక రాష్ట్రంలో మూడవ అతిపెద్ద నగరం. మైసూరు జిల్లా ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. మైసూరు డివిజన్ కర్ణాటక రాజధానియైన బెంగళూరుకునైరుతి దిశగా 146 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.[1] మైసూరు అనే పదం మహిషూరు అనే పదం నుంచి ఉద్భవించింది. మహిషుడు అంటే హిందూ పురాణాల్లో పేర్కొన్న ఒక రాక్షసుడు. దీని వైశాల్యం సుమారు 42 చ.కి.మీ. ఉంటుంది. చాముండి హిల్స్ పర్వత పాదాలను ఆనుకుని ఉంది. మైసూరు దసరా ఉత్సవాలకు పేరుగాంచింది. ఈ ఉత్సవాలకు యాత్రికులు విశేష సంఖ్యలో హాజరవుతారు. ఈ పేరు నుంచే మైసూరు పెయింటింగ్, మైసూర్ పాక్ అనే మిఠాయి, మైసూరు పట్టు అనే వస్త్రాలు ప్రాచుర్యం పొందాయి.
చరిత్ర
1947 వరకూ ఈ నగరం ఒడయార్లు పరిపాలిస్తున్న మైసూరు రాజ్యానికి రాజధానిగా ఉండేది. 18 శతాబ్దంలో కొద్దికాలం మాత్రం హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లు పరిపాలించారు. ఒడయార్లు సంస్కృతి కళలంటే ప్రాణమిచ్చే వారు. ఈ విధంగా నగరాన్ని సంస్కృతికి నిలువుటద్దంగా తయారు చేశారు. హిందూ పురాణాల ప్రకారం ఒకానొకప్పుడు మహిషూరు అని పిలువబడే ఈ ప్రాంతం మహిషాసురుడు అనే రాక్షసుని పరిపాలనలో ఉండేది.[4] ఈ రాక్షసుణ్ణి దగ్గరే ఉన్న కొండపై కొలువున్న చాముండీ దేవి సంహరించిందని ప్రతీతి. తర్వాత కాలక్రమంలో మహిషూరు, మహిసూరుగా మారి చివరకు మైసూరు అనే స్థిరపడింది.[5]
ప్రస్తుతం మైసూరు నగరం ఉన్న ప్రాంతాన్ని 15వ శతాబ్దం వరకు "పురగేరె" అనేవారు.[6] 1524లో "మహిషూరు"కోటను 3వ చామరాజ వొడయార్ (1513–1553) నిర్మించాడు. తరువాత ఇక్కడి పాలన అతని కొడుకు 4వ చామరాజ వొడయార్ (1572–1576) క్రిందికి వచ్చింది. 16వ శతాబ్దంనుండి నగరాన్ని "మహిషూరు" అనసాగారు. తరువాత ఇది మైసూరుగా పరిణమించింది.[6]. విజయనగర సామ్రాజ్యం కాలంలో వొడయార్‌ల మైసూరు రాజ్యం వారికి సామంతరాజ్యంగా ఉండేది. అప్పటిలో మహిషూరు వొడయార్ల రాజధాని. దగ్గరలోని శ్రీరంగపట్నం విజయనగర సామ్రాజ్య ప్రతినిధి కార్యాలయకేంద్రంగా ఉండేది. 1565లో విజయనగర సామ్రాజ్యం పతనమయ్యింది. 1610లో రాజా వొడయార్ శ్రీరంగపట్నంలోని సామ్రాజ్య ప్రతినిధిని ఓడించి తన రాజధానిని శ్రీరంగపట్నానికి మార్చాడు. క్రమంగా మైసూర్ వొడయార్లు స్వతంత్ర పాలకులయ్యారు. 1637లో నరసింహరాజ వొడయార్ పాలనాకాలంలో మైసూర్ పూర్తి స్వతంత్ర రాజ్యమయ్యింది.[7]
శ్రీరంగపట్నంలో టిప్పు సుల్తాన్ అధికారంలో ఉన్నపుడు మైసూర్ నగరం చాలావరకు నాశనం చేయబడింది. వొడయార్‌ల పాలనను అంతం చేయడమే అతని ఉద్దేశం.[8] 1799లో 4వ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించాడు. అనంతరం రాజధాని మళ్ళీ మైసూరుకు మార్చబడింది.[9][10] అప్పటి రాజు ముమ్మడి కృష్ణరాజ వొడయార్ ఇంకా బాలుడు అవడంవలన పాలనా వ్యవహారాలు అధికంగా పూర్ణయ్య అనే దివాన్ నిర్వహించేవాడు. మైసూర్ నగరం అభివృద్ధికి, ముఖ్యంగా పౌర సదుపాయాల విషయంలో, పూర్ణయ్య చేసిన కృషి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి దోహదపడింది.[9] 1831లో బ్రిటిష్ కమిషనర్ మార్క్ కబ్బన్ రాజధానిని బెంగళూరు నగరానికి మార్చాడు. దానితో మైసూరు నగరం రాజధాని హోదా కోల్పోయింది[11]. మళ్ళీ 1881లో బ్రిటిష్ పాలకులు మైసూరు రాజ్యాన్ని వొడయార్ పాలకులకు అప్పగించారు.[12] అప్పటినుండి 1947వరకు మళ్ళీ మైసూరు నగరం రాజధానిగాను, మైసూరు కోట పాలనాకేంద్రంగాను వర్ధిల్లాయి.
మైసూర్ పురపాలక సంస్థ (మునిసిపాలిటీ) 1888లో ప్రాంభించబడింది. పట్టణాన్ని 8 వార్డులుగా విభజించారు.[13] 1897లో ప్రబలిన ప్లేగు వ్యాధి (bubonic plague) వలన పట్టణం జనాభాలో సుమారు సగం మంది మరణించారు.[14] 1903లో నగరం అభివృద్ధి ట్రస్ట్ బోర్డు (City Improvement Trust Board - CITB) ఏర్పాటయ్యింది. ఇలా ఆసియాలో ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి కార్యక్రామలు చేపట్టిన తొలి నగరాలలో ఒకటిగా మైసూరును పేర్కొనవచ్చును.[15] స్వాతంత్ర్యం తరువాత మైసూర్ రాజసంస్థానం భారతదేశంలో విలీనం అయ్యింది. మైసూర్ రాజు జయచామరేంద్ర వొడయార్ "రాజప్రముఖ్" అయ్యాడు. అతను 1974లో మరణించాడు.[16]
మైసూరులో పెక్కు సరస్సులున్నాయి. వాటిలో "కుక్కరహళ్ళి సరస్సు", "కరాంజి సరస్సు", "లింగాంబుధి సరస్సు" ముఖ్యమైనవి. 2001 గణాంకాల ప్రకారం వివిధ వినియోగాలకు వాడబడే నగర భూభాగం శాతాలు ఇలా ఉన్నాయి—నివాసాలు 39.9%, రోడ్లు 16.1%, పార్కులు, ఖాళీ స్థలాలు 13.74%, పరిశ్రమలు 13.48%, పబ్లిక్ ప్రాపర్టీలు 8.96%, వాణిజ్య సంస్థలు 3.02%, వ్యవసాయం 2.27% జలాశయాలు 2.02% .[22]
మైసూర్ నగరం కావేరి, కాబిని నదుల మధ్య ఉంది. నగరం త్రాగునీటి అవసరాలకు నీరు అధికంగా ఈ నదులనుండే లభిస్తుంది.[22]: p.53 1896లో బెళగొళ ప్రాజెక్టు ద్వారా మొట్టమొదటి పైపు నీరు సదుపాయం లభించింది.[23] ప్రస్తుతం మైసూరు నగరానికి రోజువారీ 42.5 మిలియన్ గాలన్లు నీరు హొంగళ్ళి, బెళగొళ, మేలపూర్ అనే మూడు ప్రాజెక్టులనుండి సరఫరా అవుతుంది. ఇది దాదాపు 85% గృహాలకు చేరుతుంది. వేసవిలో నీటి ఎద్దడి రావడం కద్దు.[24] 1904 నుండి నగరంలో భూగర్భ డ్రైనేజి సదుపాయం మొదలయ్యింది.[22]: p.56
పరిపాలన
మైసూరు మునిసిపాలిటీ 1888లో స్థాపించబడింది. 1977లో కార్పొరేషన్‌గా మార్చబడింది. నగరంలో 65 వార్డులు ఉన్నాయి. ప్రతి ఐదేళ్ళకు కౌన్సిల్ సభ్యులు (కార్పొరేటర్లు) ఎన్నికవుతారు.[25] వారు మేయర్‌ను ఎన్నుకొంటారు. కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ 2007–2008 సంవత్సరానికి గాను 11,443.89 లక్షల రూపాయలు.[26]
నగరం అభివృద్ధి కార్యక్రమాలు "మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ" (MUDA) అధ్వర్యంలో నడుస్తాయి. నగర విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలు ఈ సంస్థ నిర్వహిస్తుంది[27] వీరు చేపట్టిన మైసూర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు నగరంలో ట్రాఫిక్ సమస్యను అదుపు చేయగలదని ఆశిస్తున్నారు.[28] నగరం విద్యుత్ సరఫరా పనులను "చాముండేశ్వరి ఎలక్ట్రిక్ సప్లై కార్పొరేషన్" నిర్వహిస్తుంది.[29]
మైసూర్ నగరం నుండి కర్ణాటక అసెంబ్లీకి నలుగురు ప్రతినిధులు ఎన్నుకోబడుతారు - చామరాజ, కృష్ణరాజ, నరసింహరాజ, చాముండేశ్వరి అనేవి ఆ నాలుగు నియోజక వర్గాల పేర్లు.[30] మైసూర్ నగరం నుండి లోక్‌సభకు ఒక పార్లమెంటు సభ్యుడు ఎన్నుకోబడుతాడు. నగరంలో ప్రధాన రాజకీయ పార్టీలు : భారత జాతీయ కాంగ్రెస్ (INC); భారతీయ జనతా పార్టీ (BJP);, జనతా దళ్ (సెక్యులర్) (JDS).[30]
గణాంకాలు
2001 జనాభా గణన ప్రకారం మైసూర్ నగరం జనాభా799,228. ఇందులో మగవారు 406,363, ఆడువారు 392,865. కర్ణాటకలో ఇది రెండవ పెద్ద నగరం.[31][32] నగరంలో స్త్రీ పురుషుల నిష్పత్తి - ప్రతి 1000 మంది పురుషులకు 967 మంది స్త్రీలున్నారు. జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 6223.55 మంది. జనాభాలో 76.76% హిందువులు, 19% ముస్లిములు, 2.84% క్రైస్తవులు, మిగిలినవార అన్య మతస్తులు.[33] 1931 జనాభా లెక్కలలో ఈ నగరం జనాభా 100,000 పరిమితి దాటింది. తరువాత 1991–2001 దశాబ్దంలో 20.5% జనాభా వృద్ధి నమోదయ్యింది. నగరంలో సగటు అక్షరాస్యత 82.8%. కర్ణాటక రాష్ట్రం సగటు అక్షరాస్యత 67% మాత్రమే.[22]: p.32 ఎక్కువ మంది కన్నడ భాష మాట్లాడుతారు. నగరంలో 19% ప్రజలు దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారు. 8.95% జనాభా మురికి వాడలలో నివసిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో నగరాలలో 35.7% కార్మికులుండగా మైసూరులో మాత్రం 33.3% మాత్రమే కార్మికులు.[32] జనాభాలో 15.1% మంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు.[32] 2005లో మైసూర్ నగరంలో 805 నేరాలు నమోదయ్యాయి. 2003లో నమోదైన 510 నేరాలకంటే ఇది బాగా ఎక్కువ.[34]
వ్యాపార వాణిజ్యాలు
పర్యాటక రంగం ఇక్కడ ప్రధానమైన ఆదాయ వనరుగా చెప్పవచ్చు. 21వ శతాబ్దం మొదటి భాగంలో సమాచార సాంకేతిక రంగంలో వచ్చిన విశేష ప్రగతితో, ఈ పట్టణం ఇపుడు కర్ణాటక రాష్ట్రంలో సాఫ్టువేరుకు రెండవ అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది. మొదటి స్థానం బెంగళూరుదే. ఇక్కడ విమానాశ్రయ సౌకర్యం లేకపోయినా, దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో రైలు, రోడ్డు రవాణా సౌకర్యాలను కలిగిఉంది. మైసూర్ విశ్వవిద్యాలయం నుండి అనేక ప్రముఖులు విద్యావంతులయ్యారు.
సాంప్రదాయికంగా పట్టు వస్త్రాల నేత, గంధపు చెక్కల శిల్పాలు, ఇత్తడి సామానులు వంటి హస్తకళలకు,, నిమ్మ,ఉప్పు ఉత్పత్తికి కేంద్రంగా ఉండేది.[35] 1911లో జరిగిన "మైసూర్ ఆర్ధిక సమావేశం" కారణంగా ప్రణాళికా బద్ధమైన పారిశ్రామికీకరణకు నాంది జరిగింది.[35][36] తత్ఫలితంగా 1917లో "మైసూర్ గంధపునూనె ఫ్యాక్టరీ", 1920లో "కృష్ణరాజేంద్ర మిల్స్" నెలకొల్పారు.[37][38]. 2001లో జరిపిన "బిజినెస్ టుడే" సర్వే ప్రకారం భారత దేశంలో వాణిజ్యానికి అనువైన నగరాలలో మైసూరు 5వ స్థానంలో ఉంది.[39] కర్ణాటక రాష్ట్రం పర్యాటక రంగానికి మైసూరు కీలకమైన స్థానం వహిస్తున్నది. 2006లో 25 లక్షల మంది పర్యాటకులు ఈ నగరాన్ని దర్శించారు.[40]
పారిశ్రామిక అభివృద్ధి కోసం "కర్ణాటక పారిశ్రామిక వాడల అభివృద్ధి బోర్డు" (KIADB) నగర పరిసరాలలో నాలుగు పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసింది. అవి బెళగొళ, బెలవాడి, హెబ్బల్ (ఎలక్ట్రానిక్ సిటీ), హూటగళ్ళి అనే స్థలాలలో ఉన్నాయి.[41] బి.ఇ.ఎమ్.ఎల్., జె.కె.టైర్స్, విప్రో, ఎస్.పి.ఐ.softvision, ఎల్&టి, ఇన్ఫోసిస్ ఇక్కడ ఉన్న ముఖ్య పరిశ్రమలలో కొన్ని. 2003 తరువాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన పరిశ్రమలు మైసూరులో బాగా అభివృద్ధి చెందాయి.
విద్య
ఆధునిక విద్యా విధానం ప్రవేశింపక మునుపు అగ్రహారాలు, మదరసాలు విద్యా కేంద్రాలుగా ఉండేవి.[42] 1833లో ఒక "ఫ్రీ ఇంగ్లీష్ స్కూలు" ప్రారంభమైంది.[43] 1854లో ఈస్టిండియా కంపెనీ వారు హాలిఫాక్స్ డిస్పాచ్ అనే పత్రం ద్వారా మైసూరు రాజ్యంలో పాశ్చాత్య విద్యా విధానం అమలు చేయడం గురించి చర్చించారు.[44] 1864లో మహారాజా కళాశాల ఉన్నత విద్యను అందించడం మొదలుపెట్టింది.[43]: p.50 1868లో హొబ్లీ పాఠశాలల ద్వారా సామాన్య ప్రజలందరికీ విద్యను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నించారు.[45] ఈ విధానంలో ఒక్కొక్క హొబ్లి (నగరంలో ఒక పేట లాంటిది)లో ఒక్కొక్క పాఠశాల ప్రారంభించారు. 1881లో బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభమైంది. ఇది తరువాత "మహారాణి మహిళా కళాశాల"గా మారింది.[46] 1892లో పారిశ్రామిక పాఠశాల, 1913లో చామరాజేంద్ర సాంకేతిక విద్యాసంస్థ ప్రారంభమయ్యాయి.[47] 1916లో మైసూర్ విశ్వవిద్యాలయం ప్రారంభమయింది.[48] తరువాత అనేక విద్యా సంస్థలు వెలశాయి. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం పరిధిలో 127 కాలేజీలు, 53,000 మంది విద్యార్థులు ఉన్నారు.
1946లో ఒక ఇంజినీరింగ్ కాలేజి మొదలయ్యింది.[49] ప్రస్తుతం నగరంలో ఏడు ఇంజినీరింగ్ కళాశాలలు, రెండు సాయంకాలపు ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి.[50] 1930లో మైసూర్ మెడికల్ కాలేజి మొదలయ్యింది. ప్రస్తుతం రెండు మెడికల్ కాలేజిలు ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో ఇంకా 40 పైగా కళాశాలలు ఉన్నాయి.
ఇంకా నగరంలో సెంట్రల్ ఫుడ్ అండ్ టెక్నాలజీ రీసర్స్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్, డిఫెన్స్ ఫుడ్ రీసర్చ్ లాబొరేటరీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వంటి అనేక ప్రత్యేక విద్యా, పరిశోధనా సంస్థలు ఉన్నాయి.
సంస్కృతి, కళలు
మైసూరును కర్ణాటక రాష్ట్రానికి సాంస్కృతిక రాజధానిగా చెప్పుకోవచ్చు.,[51] దసరా ఉత్సవాలకు మైసూరు చాలా ప్రసిద్ధి గాంచింది. ఇది ఆ రాష్ట్రం యొక్క అధికారిక ఉత్సవం. ఇవి పది రోజులపాటు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. వీటిని మొట్టమొదటగా ఓడయార్ రాజా-1 1610 సంవత్సరంలో ప్రారంచభించడం జరిగింది.[52] ఈ ఉత్సవాల్లో తొమ్మిదవ రోజును మహార్నవమి అని అంటారు. ఈ రోజున ఖడ్గాన్ని పూజించడమే కాకుండా అలంకరించిన ఏనుగులు, గుర్రాలు, ఒంటెల మీద ఊరేగిస్తారు.[52] పదవ రోజు విజయదశమి. మైసూరు పురవీధుల్లో ఊరేగింపు (దీనిని జంబూసవారీ అంటారు) ఉంటుంది. చాముండేశ్వరీ దేవిని ఏనుగుపై ఉంచిన బంగారు అంబారీలో ఉంచి ఊరేగిస్తారు. ఈ ఉరేగింపు ముందు నృత్య బృందాలు, సంగీత కళాకారుల సమూహాలు, అలంకరించిన ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు మొదలైనవి సందడి చేస్తూ వెళుతుంటాయి.[52] ఇది మైసూరు ప్యాలెస్ నుంచి ప్రారంభమై బన్నిమంటపం అనే ప్రదేశంలో ముగుస్తుంది..[52] దసరా ఉత్సవాలు విజయదశమి రోజు రాత్రి పంజీన కవయట్టు అనే దివిటీల ప్రదర్శనతో ముగిసిపోతాయి.[52]
మైసూరులో అనేక మైసూరు ప్యాలెస్ లాంటి అనేక ప్యాలెస్ లు కొలువుతీరి ఉండడం వలన మహాసౌధాల నగరంగా తరచు వ్యవహరించడం జరుగుతుంది. జగన్మోహన ప్యాలెస్ ను ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీగా మార్చారు. రాజేంద్ర విలాస్ చాముండి హిల్స్ మీద ఉంటుంది. లలితా మహల్ ను ఇప్పుడు హోటల్‌గా మార్చారు. జయలక్ష్మి విలాస్ మైసూరు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కానవస్తుంది..[53] మైసూరు ప్యాలెస్ లోని ప్రధాన భాగం 1897 లోకాలిపోయింది. ఇప్పుడున్న భవనాలు అదే స్థలంలో నిర్మించారు. దీని వెలుపలి భాగం ఇండో-సరాసెనిక్ పద్ధతిలోనూ, లోపలి భాగం హోయసాల పద్ధతిలో నిర్మించబడి ఉంటుంది.[54] ప్రస్తుతం ఈ భవనాన్ని కర్ణాటక ప్రభుత్వమే నిర్వహిస్తున్నప్పటికీ, రాజకుటుంబీకుల కోసం ప్యాలెస్ లో కొంత భాగం కేటాయించారు. జయలక్ష్మి విలాస్ అనే భవనాన్ని చామరాజ్ ఒడయార్ తన కూతురైన జయలక్ష్మి అమ్మణ్ణి కోసం కట్టించింది. దాన్ని ఇప్పుడు జానపద కళారూపాలను ప్రదర్శించే మ్యూజియంగా మార్చారు. ఒడయార్ల కళాఖండాలను భద్రపరచడం కోసం ఒక ప్రత్యేకమైన మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.[55]
మైసూరు చిత్రలేఖనము విజయనగర చిత్రలేఖనమూలాలనుంచి అభివృధి చెందినది.ఓడయార్ రాజును (1578–1617 CE)ఈ చిత్రలేఖన పోషకునిగా కీర్తిస్తారు.[56]బంగారు రేకులను తగిన విదముగా చిత్రాలయందు తాపడము చేయుట ఈ కళారీతి (విధాన, స్కూల్ ఆఫ్ ధాట్) విశిష్టత.[56]: p.03
మైసూరులో అంతర్జాతీయ గన్జీఫా పరిశోధనా సంస్థ ఉన్నది, ఈ సంస్థ ప్రాచీన గన్జీఫా అట్టముక్కల ఆట గురించి, అందలి కళల గురించి పరిశోధిస్తుంది.[57] మైసూరు నల్ల చెక్క (రోజ్ వుడ్) పొదిగిన కళాఖండములకు ప్రసిద్ధి. 4000 మంది కళాకారులు ఈ కళలో నిమగ్నమయ్యారని ఒక అంచనా.[58]
స్వచ్ఛమైన పట్టు, బంగారు జరీతో నేసే చీరలు మైసూరు పట్టుచీరలుగా ప్రసిద్ధికెక్కాయి.[59] మైసూరు కళాసంస్థలకు ఆటపట్టు. దృశ్యకళలైన చిత్రలేఖనము, ధృశ్యచిత్రము (గ్రాఫిక్స్), శిల్పకళ, కళాత్మ ఉపకరణాల తయారీ, ఛాయాగ్రహణము (ఫోటోగ్రఫీ), ఛాయాగ్రహసహిత వార్తా సేకరణ మరియూ కళల చరిత్రలో శిక్షణ ఇచ్చు చామరాజేంద్ర అకాడమీ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ (సిఏవిఏ) అందలి మచ్చుతునక. రంగయాన (రంగశాల) రంగస్థల కళా క్షేత్రము నాటక ప్రదర్శనములనిస్తూ, రంగస్థల సంభందమైన కళలలో శిక్షణ మరియూ ధ్రువపత్రములను జారీచేస్తుంది. ఎన్నదగిన కన్నడ సాహితీవేత్తయిన కువెంపు, గోపాలకృష్ణ ఆడిగ, యు.ఆర్.అనంతమూర్తి మైసూరులో విద్యనభ్యసించి మైసూరు విశ్వవిధ్యాలములో ఆచార్యులుగా పనిచేయుట వలన వారికి మైసూరుకు ఉన్న అనుభందం దీర్ఘమైనది.[60] ప్రఖ్యాత నవలా రచయిత, మాల్గుడి గ్రంథకర్త ఆర్.కే. నారాయణ్ అతని తమ్ముడు ఆర్.కె.లక్ష్మణ్ జీవితకాలంలో చాలా భాగం మైసూరులోనే గడిచింది.[60]
సా.శ..1761-82 మధ్య మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన హైదర్ అలీ మైసూరులోని నంజనగూడులో నంజుండేశ్వరాలయం అనే గొప్ప దేవాలయంలో తన పేరుతో ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలని కోరి హైదరు లింగం అనే లింగం ప్రతిష్ఠించారు. ఆ లింగానికి ధూపదీపనైవేద్యాలు జరిపించేందుకు హైదరాలీ చాలా సొమ్మునిచ్చి దేవాదాయాన్ని ఏర్పాటుచేశారు. హైదరాలీకి ఒక ప్రియమైన ఏనుగుకు కంటిజబ్బు చేసి ఎంతకీ తగ్గకపోవడంతో ఆస్థానికుల సూచనతో నంజుండేశ్వరస్వామికి మొక్కుకున్నారు. కొద్దిరోజుల్లోనే ఆ ఏనుగుగున్నకు జబ్బునయం కాగా సంతోషంతో నవరత్నాలు పొదిగిన బంగారు హారాన్ని సమర్పించుకున్నారు.[61]
రవాణా
మైసూరు నగరానికి ప్రత్యేక విమానాశ్రయం లేదు. బెంగళూరు నగరంలోనిదే సమీప విమానాశ్రయం. "మండకల్లి" విమానాశ్రయాన్ని అభివృద్ధి పరచే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇది 2009లో విమానాల రాకపోకలు సిద్ధం కావచ్చును.[62] నగరంలో విమానాశ్రయం లేకపోవడం మైసూరు ఆర్థిక ప్రగతికి ఒక ప్రతిబంధకంగా భావింపబడుతున్నది.[63]
మైసూరు నగరంలో ఒక రైల్వే స్టేషను ఉంది. నగరానికి మూడు రైల్వే లైనులు ఉన్నాయి. అవి బెంగళూరు, హసన్, చామరాజ నగర్ మార్గాలు. వీటిలో బెంగళూరు-మైసూరు మీటర్ గేజ్ లైను 1882లో నిర్మింపబడింది.[64] కాని ఈ మూడు లైనులూ సింగిల్ లైనులు కావడం వలన రైల్వే సదుపాయం పరిమితంగా ఉంది. బెంగళూరు మార్గాన్ని డబుల్ లైను చేసే ప్రతిపాదనలున్నాయి.[65] మైసూరు-చెన్నై శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఇక్కడికి వచ్చే రైళ్ళలో అత్యంత వేగవంతమైనది.మైసూరు నుంచి అన్ని నగరాలకు సరాసరి ట్రైన్స్ పరిమితంగా కలవు .అందువలన బెంగుళూరు వచ్చి అక్కడ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు వెళ్ళాళి.
జాతీయ రహదారిNH-212 మైసూరు నగరం గుండా వెళుతుంది. ఇది రాష్ట్రం సరిహద్దు పట్టణం గుండ్లుపేట వద్ద రెండుగా చీలి కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వెళుతుంది.[66] రాష్ట్రం రహదారి నెం.17 (State Highway 17) మైసూరు - బెంగళూరు నగరాలను కలుపుతుంది. ఈ రోడ్డుపై ట్రాఫిక్ చాలా ఎక్కువ. 2006లో దీనిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించారు. తద్వారా బెంగళూరు - మైసూరు నగరాల మధ్య ప్రయాణకాలం తగ్గింది.[67] 1994లో ఈ రెండు నగరాల మధ్య క్రొత్త ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించే ప్రఅజెక్టు మొదలయ్యింది కాని అనేక సమస్యల వలన ఆ పని పురోగతి సాధించలేదు.[68] ఇంకా రాష్ట్ర రహదారి నెం. 33 మైసూరునుండి హెచ్.డి.కోటకు, రహదారి నెం.88 మైసూరు నుండి మడికేరికి ఉన్నాయి.[69]
మైసూరు నుండి ఇతర ప్రాంతాలకు బస్సు సర్వీసులు కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్టు సంస్థ, ఇతర ప్రైవేటు సంస్థలు నడుపుతున్నాయి. నగరంలోపల సిటీబస్సులు, ఆటోలు సాధారణంగా వాడే రవాణా సదుపాయాలు. ఇదివరకు టోంగాలు కూడా ఉండేవి కాని ప్రస్తుతం అవి కనుమరుగవుతున్నాయి.[70]
పర్యాటకం
కర్ణాటకలో మైసూరు ప్రధాన పర్యాటక కేంద్రం. దీని చుట్టుపక్కల ప్రదేశాలను చూడటానికి వచ్చే సందర్శకులకు కూడా ఇది ఆతిథ్యం ఇస్తుంది.[71] పది రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాల సమయంలోనే ఇక్కడికి అత్యధిక సంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తారు.[72] భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడే స్మారక ప్రదేశాలలో ఒకటైన మైసూరు ప్యాలెస్ ఈ ఉత్సవాలకు ప్రధాన కేంద్రం.[73]జగన్మోహన్ ప్యాలెస్, జయలక్ష్మి ప్యాలెస్, లలితా మహల్ మొదలైనవి ఇతర ముఖ్యమైన భవనాలు.[74]చాముండి పర్వతాలపై గల చాముండేశ్వరి దేవి ఆలయం, సెయింట్ ఫిలోమెనా చర్చి ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలు.[71]
1892 లో నెలకొల్పబడ్డ మైసూరు జూ, కారంజి సరస్సు, కుక్కరహళ్ళి సరస్సు, కూడా పర్యాటకులను ఆకర్షించేవే.[71][75] వస్తు ప్రదర్శనశాలల్లో (మ్యూజియం) ప్రాంతీయ మ్యూజియం, ఫోక్‌లోర్ మ్యూజియం, రైల్వే మ్యూజియం,శాండ్ మ్యూజియం, ఓరియంటల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ మొదలైనవి ప్రధానమైనవి. యోగాకు సంబంధించిన ఆరోగ్య పర్యాటక రంగంలో కూడా మైసూరు చెప్పుకోదగ్గ సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది.[76]
మైసూరుకు సమీపంలో బృందావన్ గార్డెన్స్ ను ఆనుకుని కృష్ణరాజసాగర డ్యామ్ ఉంది. ఈ బృందావన్ గార్డెన్స్ లో సంగీతానికి తగ్గట్లుగా ఆడే ఒక మ్యూజికల్ ఫౌంటెయిన్ ఉంటుంది. ఈ ప్రదర్శన ప్రతి రోజూ సాయంత్రం జరుగుతుంది. ఇంకా శ్రీరంగపట్నం, సోమనాథపురం, తలకాడు మొదలైనవి దర్శనీయ స్థలాలు.[71] బి.ఆర్.హిల్స్, హిమవద్గోపాల స్వామి బెట్ట, ఊటీ కొండలు, మడికేరి మైసూరు సమీపంలోని కొండలు. బండిపూర్ నేషనల్ పార్కు, నాగరహొలె నేషనల్ పార్కు, మెల్కోటె వన్యప్రాణి సంరక్షణ కేంద్రము, రంగనతిట్టు పక్షిసంరక్షణ కేంద్రము, గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలోని శుకవనం, కొక్రెబెల్లూరు పక్షి సంరక్షణ కేంద్రము కూడా ప్రకృతి ప్రేమికులకు ప్రియమైన పర్యాటక కేంద్రాలు.[77]నంజనగూడు, బైలకుప్పె, శివసముద్రం జలపాతం మైసూరుకు సమీపంలో ఉన్న మరికొన్ని పర్యాటక కేంద్రాలు.
ప్రముఖులు
మైసూరు పట్టణంలో జన్మించిన కొందరు ప్రముఖులు:
హెచ్.వి.నంజుండయ్య - మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త
↑ 56.056.1: p.01 "Mysore Painting"(PDF). Indianfolklore.org. National Folklore Support Centre. Archived from the original(PDF) on 2003-10-30. Retrieved 2009-02-19.
↑"Roads in Karnataka". Karnataka Public Works, Ports and Inland Water Transport Department. Archived from the original on 2008-05-18. Retrieved 2008-04-09.