భీముడు వాయుదేవుని అంశమున జన్మించిన కారణంగా పుట్టుకతోనే అమితబలశాలి. పుట్టిన పదవ రోజున భీముడు తల్లి చంక నుంచి జారి ఒక రాతి మీద పడినాడు. భీముని తాకిడికి ఆ రాయి చూర్ణం అయినది. దుర్యోధనుడు నీటిలో పడవేసి చంపడానికి ప్రయత్నిస్తే నాగలోకానికి చేరి వెయ్యి ఏనుగుల బలం వచ్చే ఆశీర్వాదంతో బయటకు వచ్చాడు.
భుజ బలంలోనూ, గదా యుధ్ధంలోనూ కౌరవ పాండవులలో సాటిలేని వీరునిగా పేరొందిన వీరుడు. మగధరాజైన జరాసంధుని మల్ల యుద్ధంలో నిర్జించిన జట్టి. ఏకచక్రపురాన్ని పట్టి పీడిస్తున్న బకాసురున్నీ, అతని సోదరుడు కిమ్మీరున్నీ వధించిన మేటి. హిడింబాసురుణ్ణి వధించి, తనని వరించిన ఆతని సోదరి హిడింబి అను రాక్షస వనితను కుంతీ ధర్మరాజాదుల అనుమతితో వివాహమాడినాడు. వారిరువురికీ కలిగిన సంతానమే మహాభారత యుద్దమందు తన మాయాజాలముతో వీరంగము చేసి ప్రసిద్దుడైన ఘటోత్కచుడు.