పూరిఒడిషా రాష్ట్రం లోని తీరప్రాంత పట్టణం. ఇది పూరి జిల్లాకు కేంద్రం. ఇది రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు దక్షిణంగా 60 కి.మీ. దూరంలో ఉంది. పట్టణంలో ఉన్న 12వ శతాబ్ద కాలం నాటి జగన్నాథ దేవాలయం పేరిట దీనిని శ్రీ జగన్నాథ ధామం అని కూడా పిలుస్తారు. హిందువుల ఒరిజినల్ చార్ ధామ్ తీర్థయాత్రా స్థలాలలో ఇది ఒకటి.
పురాతన కాలం నుండి పూరీని అనేక పేర్లతో పిలుస్తూ ఉన్నారు. స్థానికంగా "శ్రీ క్షేత్రం" అని, జగన్నాథ దేవాలయాన్ని "బడదేవలా" అనీ పిలుస్తారు. క్రీ.శ. 7వ శతాబ్దం నుండి 19వ శతాబ్దపు ఆరంభం వరకు ఆలయ సంపదను దోచుకోవాలనే లక్ష్యంతో పూరీని, జగన్నాథ దేవాలయాన్నీ ముస్లిం పాలకులు 18 సార్లు ఆక్రమించారు. 1803 నుండి ఆగస్టు 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందే వరకు పూరీ, బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేది. సంస్థానాలు ఇప్పుడు లేనప్పటికీ, గజపతి వంశీకులే ఇప్పటికీ ఆలయ విధులను నిర్వహిస్తున్నారు. పట్టణంలో అనేక హిందూ మఠాలు ఉన్నాయి.
భారత ప్రభుత్వం, హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన పథకం కింద పూరీని వారసత్వ నగరాల్లో ఒకటిగా ఎంపిక చేసింది. 2017 మార్చి చివరి నాటికి 27 నెలలలోపు అమలు చేయడానికి "సంపూర్ణ అభివృద్ధిపై దృష్టి" పెట్టిన 12 వారసత్వ నగరాల్లో ఒకటిగా దీన్ని ఎంపిక చేసారు.[2]
చరిత్ర
చరిత్రలో పేర్లు
శ్రీక్షేత్రం అని కూడా ప్రసిద్ధి చెందిన జగన్నాథుని పవిత్ర క్షేత్రం ఇది. ఋగ్వేదం, మత్స్య పురాణం, బ్రహ్మ పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, స్కంద పురాణం, కపిల పురాణం, నీలాద్రిమహోదయ వంటి పురాణాల్లో దీనికి అనేక పురాతన పేర్లున్నాయి. ఋగ్వేదంలో, ఇది పురుషమందామ-గ్రామ అని పిలువబడే ప్రదేశంగా పేర్కొనబడింది, కాలక్రమేణా ఆ పేరు పురుషోత్తమ పురిగా మారి, మరింతగా కుదించుకుపోయి, పూరీ అయింది. పురుషుడే జగన్నాథుడయ్యాడు. భృగువు, అత్రి, మార్కండేయుడు వంటి మహర్షుల ఆశ్రమాలు ఈ ప్రదేశానికి సమీపంలోనే ఉండేవి. [3] జగన్నాథుడి పేరు మీదుగా ఈ పయ్ట్టణానికి శ్రీక్షేత్రం, పురుషోత్తమ ధామము, పురుషోత్తమ క్షేత్రం, పురుషోత్తమ పురి, జగన్నాథ పురి అని పేర్లు వచ్చాయి. ప్రస్తుతం పూరి అనే పేరు ప్రముఖంగా వాడుకలో ఉంది. శంఖక్షేత్ర (పట్టణం శంఖాకారంలో ఉంది) అని, [4] నీలాచల ("నీలి పర్వతం") అనీ, నీలాచక్షేత్రం, నీలాద్రి అనీ కూడా దీనికి పేర్లున్నాయి. [5]సంస్కృతంలో, "పురి" అనే పదానికి పట్టణం లేదా నగరం అని అర్థం,[6] ఈ పేరు గ్రీకు భాషలోపోలిస్ అనే పేరుకు సంబంధం ఉంటుంది. [7]
భారత పురావస్తు శాఖకు చెందిన జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్ గుర్తించిన మరొక పురాతన పేరు, చరిత. దీనిని చైనీస్ యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్ చే-లి-టా-లో అని ఉచ్చరించాడు. క్రీ.శ. 11, 12 శతాబ్దాలలో తూర్పు గంగ రాజు అనంతవర్మ చోడగంగ ప్రస్తుత ఆలయాన్ని నిర్మించినప్పుడు, దీనిని పురుషోత్తమక్షేత్రంగా పిలిచేవారు. అయితే, మొఘలులు, మరాఠాలు, ప్రారంభ బ్రిటిష్ పాలకులు దీనిని పురుషోత్తమ-ఛతర్ లేదా కేవలం ఛతర్ అని పిలిచారు. ఐన్-ఇ-అక్బరీ లోను, తదుపరి ముస్లిం చారిత్రక రికార్డులలోనూ దీనిని పురుషోత్తమ అని అన్నారు. సా.శ. 8వ శతాబ్దంలో మురారి మిశ్ర అనే నాటక రచయిత రచించిన సంస్కృత నాటకం అనర్ఘ రాఘవ నాటకంలో కూడా దీనిని పురుషోత్తమ అని పేర్కొన్నాడు. [4] క్రీ.శ. 12వ శతాబ్దం తర్వాత మాత్రమే ఈ నగరాన్ని జగన్నాథ పురికి సంక్షిప్త రూపమైన పూరితో పిలవడం మొదలైంది. [5] భారతదేశంలో కృష్ణునితో పాటు రాధ, లక్ష్మి, సరస్వతి, దుర్గ, భూదేవి, సతీ, పార్వతి, శక్తి లు నెలకొన్న ఏకైక పుణ్యక్షేత్రం ఇది.[8]
ప్రాచీన కాలం
మదాల పంజీ చరిత్ర ప్రకారం, క్రీ.శ. 318లో, రాష్ట్రకూట రాజు రాకటావహు కోపం నుండి తప్పించుకోవడానికి ఆలయ పూజారులు, సేవకులు విగ్రహాలను దూరంగా ఉంచారు. [9] బ్రహ్మ పురాణం, స్కంద పురాణాలలో ఈ ఆలయాన్ని ఇంద్రద్యుమ్నుడు, ఉజ్జయని అనే రాజు నిర్మించాడని పేర్కొన్నట్లుగా ఆలయ చారిత్రక రికార్డులలో ఉంది. [10]
SN సదాశివన్ అనే చరిత్రకారుడు తన పుస్తకం ఎ సోషల్ హిస్టరీ ఆఫ్ ఇండియాలోహిందూ మైథాలజీ, వేద అండ్ పురానిక్ పుస్తక రచయిత విలియం జోసెఫ్ విల్కిన్స్‌ను ఉటంకిస్తూ పూరీలో బౌద్ధమతం ఒకప్పుడు బాగా వ్యాప్రిలో ఉండేదని పేర్కొన్నాడు. అయితే తరువాత బౌద్ధం స్థానంలో బ్రాహ్మణ మతం వచ్చింది. బుద్ధ దేవతనే ఇప్పుడు హిందువులు జగన్నాథగా పూజిస్తారు. జగన్నాథ విగ్రహం లోపల బుద్ధుని యొక్క కొన్ని అవశేషాలు ఉన్నాయని విల్కిన్సన్ చెబుతాడు. బ్రాహ్మణులు వీటిని కృష్ణుడి ఎముకలని చెబుతారు. క్రీస్తుపూర్వం 240లో మౌర్య రాజు అశోకుడి పాలనలో కూడా కళింగ, బౌద్ధ కేంద్రంగా ఉండేది. లోహబాహు అనే తెగ వారు (ఒడిశా వెలుపలి అనాగరికులు) బౌద్ధమతంలోకి మారారు. ఇప్పుడు జగన్నాథగా పూజించబడుతున్న బుద్ధుని విగ్రహంతో ఆలయాన్ని నిర్మించారు. లోహబాహులు కొన్ని బుద్ధ అవశేషాలను ఆలయ ప్రాంగణంలో నిక్షిప్తం చేశారని విల్కిన్సన్ చెప్పాడు. [11]
ప్రస్తుత జగన్నాథ ఆలయ నిర్మాణం 1136 లో ప్రారంభమై, 12వ శతాబ్దం చివరి భాగంలో పూర్తయింది. తూర్పు గంగా రాజు అనంగభీమ III తన రాజ్యాన్ని అప్పుడు పురుషోత్తమ-జగన్నాథ అనే జగన్నాథ భగవానుడికి అంకితం చేసాడు. అప్పటి నుండి అతను, అతని వారసులూ "జగన్నాథ కుమారులు, వారసులుగా" పరిపాలించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం భారతదేశంలో సంస్థానాలు లేనప్పటికీ, నేటికీ పూరీ ఎస్టేట్ వారసులే ఇప్పటికీ ఆలయ ఆచార విధులను నిర్వహిస్తారు; రథయాత్ర ప్రారంభానికి ముందు రాజు అధికారికంగా రథాల ముందు రహదారిని ఊడుస్తాడు. ఈ ఆచారాన్ని చెర్రా పహన్రా అంటారు. [12]
మధ్యయుగ, తొలి ఆధునిక కాలాలు
ఆలయ సంపదను దోచుకోవడానికి చరిత్రలో 18 సార్లు ఆక్రమణకు గురైన పూరీ జగన్నాథ దేవాలయ చరిత్రకే పట్టణ చరిత్ర కూడా ముడిపడి ఉంది. మొదటి దండయాత్ర 8వ శతాబ్దం ADలో రాష్ట్రకూట రాజు గోవింద III (క్రీ.శ. 798-814) చేసాడు. చివరిది 1881 లో జగన్నాథ ఆరాధనను గుర్తించని అలెఖ్ ( మహిమ ధర్మ ) కు చెందిన ఏకేశ్వరవాద అనుచరులు చేసారు. [13] 1205 నుండి [12]యవనులు లేదా విదేశీయులుగా పిలువబడే ఆఫ్ఘన్, మొఘల్ సంతతికి చెందిన ముస్లింలు నగరం పైన, ఆలయంపైనా అనేక దండయాత్రలు చేశారు. ఈ దండయాత్రల సమయాల్లో విగ్రహాలను ఆలయ పూజారులు, సేవకులు సురక్షిత ప్రదేశాలకు తరలించేవారు. ఈ ప్రాంత రాజులు సకాలంలో ప్రతిఘటించడం వలన గానీ, లొంగిపోవడం వల్ల గానీ ఆలయ విధ్వంసం జరక్కుండా ఆగింది. అయితే ఆలయ సంపదను మాత్రం పదే పదే దోచుకెళ్లారు. [14] మొత్తం 18 దండయాత్రల్లో, ప్రతి దండయాత్ర తరువాత జగన్నాథ, బలభద్ర, సుభద్ర ల విగ్రహాల స్థితిని కింది పట్టికలో చూడవచ్చు. [13]
బంగాళాఖాతంలో విసిరినట్లు పుకార్లు ఉన్నప్పటికీ, విగ్రహాలు కనబడలేదు. [16]
4
బెంగాల్ అల్లావుద్దీన్ హుస్సేన్ షా యొక్క ఇస్మాయిల్ ఘాజీ కమాండర్, 1509
ప్రతాపరుద్రదేవ రాజు
విగ్రహాలను చిలికా సరస్సు సమీపంలోని ఛంధేయ్ గుహా పహాడాకు మార్చారు. [16]
5
కాలాపహార, ఆఫ్ఘన్ సుల్తాన్ ఆఫ్ బెంగాల్ యొక్క సులైమాన్ కర్రానీ యొక్క ఆర్మీ అసిస్టెంట్ జనరల్, 1568
ముకుందదేవ హరిచందన్
విగ్రహాలు మొదట్లో చిలికా సరస్సులోని ఒక ద్వీపంలో దాచబడ్డాయి. అయితే, ఆక్రమణదారుడు విగ్రహాలను ఇక్కడి నుంచి గంగా నది ఒడ్డుకు తీసుకెళ్లి దహనం చేశాడు. దండయాత్ర చేసిన సైన్యాన్ని అనుసరించిన వైష్ణవ సన్యాసి బిషర్ మొహంతి, బ్రహ్మలను వెలికితీసి 1575 లో ఖుర్దాగడ వద్ద దాచాడు. దేవతలను తిరిగి పూరీకి తీసుకువచ్చి జగన్నాథ ఆలయంలో ప్రతిష్ఠించారు. [17]
6
కుతు ఖాన్ కుమారుడైన సులేమాన్, ఇషా కుమారుడైన ఉస్మాన్, 1592
రామచంద్రదేవ, ఖుర్దా భోయ్ వంశ పాలకుడు
విగ్రహాలను అపవిత్రం చేసిన స్థానిక ముస్లిం పాలకుల తిరుగుబాటు. [18]
7
మీర్జా ఖురుమ్, బెంగాల్ నవాబైనఇస్లాం ఖాన్ I వద్ద సేనాని, 1601
భోయి వంశానికి చెందిన పురుషోత్తమదేవుడు
విగ్రహాలను భార్గవి నది గుండా పడవలో కపిలేశ్వర్‌పూర్ గ్రామానికి తరలించి, పంచముఖి గోసాని ఆలయంలో ఉంచారు. ఆ తరువాత, దోబంధ-పెంతాలో ఉంచారు. [18]
8
హసీం ఖాన్, ఒరిస్సా సుబేదార్, 1608
ఖుర్దా రాజు పురుషోత్తం దేవ
విగ్రహాలను ఖుర్దాలోని గోపాల్ ఆలయానికి మార్చారు. 1608 లో తిరిగి తెచ్చారు. [18]
9
కేశోదస్మరు, 1610
ఖుర్దా రాజు పురుషోత్తమదేవ
విగ్రహాలు గుండిచా ఆలయంలో ఉంచారు. ఎనిమిది నెలల తర్వాత తిరిగి పూరీకి తెచ్చారు. [18]
10
కళ్యాణ్ మల్లా, 1611
పురుషోత్తమదేవ, ఖుర్దా రాజు
విగ్రహాలను చిలికా సరస్సులోని 'బ్రహ్మపుర' లేదా 'చకనాసి' అని కూడా పిలువబడే 'మహిసనాసి'కి తరలించారు. అక్కడ ఒక సంవత్సరం పాటు ఉన్నాయి. [19]
11
కళ్యాణ్ మల్లా, 1612
ఖుర్దా రాజు పురుషోత్తమదేవుని పైక్స్
గురుబాయి గడ వద్ద పడవలపై ఉంచిన విగ్రహాలు 'లోటాని బరాగచ్చ' లేదా మర్రి చెట్టు కింద ఉంచారు. [20]
12
ముకర్రం ఖాన్, 1617
ఖుర్దా రాజు పురుషోత్తమ దేవ
విగ్రహాలను బంకినిధి దేవాలయం, గోబాపదర్‌కు తరలించారు. 1620లో తిరిగి పూరీకి తెచ్చారు. [20]
13
మీర్జా అహ్మద్ బేగ్, 1621
నరసింగ దేవా
చిలికా సరస్సు మీదుగా షాలియా నది ముఖద్వారంలోని 'అంధరిగడ'కు విగ్రహాలను తరలించారు. 1624లో తిరిగి పూరీకి తెచ్చారు [21]
విగ్రహాలను 'మా భగబతి ఆలయానికి' తరలించారు. చిలికా సరస్సు మీదుగా బాన్‌పూర్‌లోని బడా హంతువాడాకు తరలించారు. చివరకు 1699లో తిరిగి పూరీకి తెచ్చారు. [22]
17
ముహమ్మద్ తాకీ ఖాన్, 1731, 1733
అతగడకు చెందిన బీరాకిషోర్ దేవా, బీరాకిశోర్ దేవా
బాన్‌పూర్‌లోని హరీశ్వర్, ఖలీకోట్‌లోని చికిలి, కోడెలలోని రుమాగఢ్, గంజాంలోని అతగడ, చివరగా కోడెలలోని మార్దాకు విగ్రహాలను తరలించారు. 2.5 ఏళ్ల తర్వాత మళ్లీ పూరీకి తెచ్చారు. [22]
సా.శ. 810 లో పూరీ సందర్శనలో ఆదిశంకరాచార్య పూరీలో గోవర్ధన మఠాన్ని స్థాపించాడు. అప్పటి నుండి ఇది హిందువులకు ముఖ్యమైన ధామ్ (దైవ కేంద్రం)గా మారింది; మిగిలినవి శృంగేరి, ద్వారక, జ్యోతిర్మఠం. మఠం జగద్గురు శంకరాచార్య నేతృత్వంలో ఉంది. మహావిష్ణువు పూరీలో విందు చేసి, రామేశ్వరంలో స్నానమాచరించి, ద్వారకలో రాత్రి గడిపి, బద్రీనాథ్‌లో తపస్సు చేస్తాడని స్థానికుల నమ్మకం. [10][24]
16వ శతాబ్దంలో, బెంగాల్‌కు చెందిన చైతన్య మహాప్రభు భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని స్థాపించాడు. దీనినే ఇప్పుడు హరే కృష్ణ ఉద్యమం అని పిలుస్తారు. అతను పూరీలో జగన్నాథ భక్తుడిగా చాలా సంవత్సరాలు గడిపాడు. అతను దేవతలో ఐక్యమైపోయాడని విశ్వసిస్తారు. [25] ఇక్కడ రాధాకాంత మఠం అనే పేరున్న చైతన్య మహాప్రభు మఠం కూడా ఉంది. [10]
17వ శతాబ్దంలో, భారతదేశంలోని తూర్పు తీరంలో ప్రయాణించే నావికులకు, ఈ ఆలయం ఒక మైలురాయిగా పనిచేసేది. దీనిని వారు "తెల్ల పగోడా" అని పిలిచేవారు, పూరికి తూర్పున 60 కి.మీ. దూరాన ఉన్న కోణార్క సూర్య దేవాలయాన్ని, "నల్ల పగోడా" అనేవారు. [25]
జగన్నాథ దేవాలయంలోని విగ్రహాలను ఉత్తర ఒడిషాకు చెందిన సబరల (గిరిజన సమూహాలు) చేసిన పూజల నుండి తీసుకున్న రూపాలు అని విశ్వసిస్తారు. కలప కాలక్రమేణా క్షీణిస్తుంది కాబట్టి, ఈ విగ్రహాలను ఎప్పటి కప్పుడూ మారుస్తూ ఉంటారు. ఈ పునఃస్థాపన అనేది వడ్రంగుల ప్రత్యేక బృందం ఆచారబద్ధంగా నిర్వహించే ఒక ప్రత్యేక కార్యక్రమం. [25]
నగరంలో అనేక ఇతర మఠాలు కూడా ఉన్నాయి. 12వ శతాబ్దంలో తమిళవైష్ణవ సన్యాసి రామానుజాచార్యులు ఎమ్మార్ మఠాన్ని స్థాపించారు. ప్రస్తుతం జగన్నాథ ఆలయానికి తూర్పు మూలలో సింహద్వారానికి ఎదురుగా ఉన్న ఈ మఠం 16వ శతాబ్దంలో సూర్యవంశీ గజపతి రాజుల కాలంలో నిర్మించబడింది. 2011 ఫిబ్రవరి 25 న మఠంలో ఒక మూసివున్న గది నుండి 522 వెండి పలకలు బయట పడినపుడు ఈ మఠం వార్తలకెక్కింది.[26][27]
బ్రిటిషు వారు 1803లో ఒరిస్సాను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రజల జీవితంలో జగన్నాథ దేవాలయానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి, వారు మొదట ఆలయ వ్యవహారాలను చూసేందుకు ఒక అధికారిని నియమించారు. తరువాత ఆలయాన్ని జిల్లాలో భాగంగా ప్రకటించారు. [12]
1906లో క్రియా యోగ విద్వాంసుడు, పూరీ నివాసి అయిన శ్రీ యుక్తేశ్వర్, పూరీలో " కరారాశ్రమం " అనే పేరుతో ఒక ఆధ్యాత్మిక శిక్షణా కేంద్రాన్ని స్థాపించాడు. అతను 1936 మార్చి 9 న మరణించాడు. అతని మృతదేహాన్ని ఆశ్రమంలోని తోటలో ఖననం చేశారు. [28][29]
ఈ నగరం 1913-14లో గవర్నర్ల కాలంలో నిర్మించబడిన బ్రిటిష్ రాజ్ యొక్క పూర్వ వేసవి నివాసం, రాజ్ భవన్ యొక్క ప్రదేశం.[30]
1990 జూన్ 14న జగన్నాథ దేవాలయం లోని అమలక భాగంలో పాక్షికంగా కూలిపోయింది. ప్రజలు దీన్ని ఒడిశాకు చెడ్డ శకునంగా భావించారు. 1991 ఫిబ్రవరి 28 న పడిపోయిన రాయి స్థానంలో అదే పరిమాణం, బరువు (7.7 టన్నులు) ఉన్న రాతితో తిరిగి నిర్మించారు. [25]
పుణ్యక్షేత్రాలలోకి ప్రవేశించడానికి హిందూయేతరులకు అనుమతి లేదు. కానీ ఆలయాన్ని, ఆలయ ప్రాంగణంలో ఉన్న రఘునందన్ లైబ్రరీ పైకప్పు నుండి చిన్న ఆలయ కార్యకలాపాలను వీక్షించడానికి వీరిని అనుమతిస్తారు. [31]
శీతోష్ణస్థితి
కొప్పెన్-గీగర్ శీతోష్ణస్థితి వర్గీకరణ వ్యవస్థ ప్రకారం పూరీ శీతోష్ణస్థితిని Aw (ఉష్ణమండల సవన్నా వాతావరణం)గా వర్గీకరించారు. నగరంల్ఫో మధ్యస్థ ఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. ఏడాది పొడవునా తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రత గరిష్టంగా 36 °C (97 °F) కి చేరుకుంటుంది. శీతాకాలంలో ఇది 17 °C (63 °F). సగటు వార్షిక వర్షపాతం 1,337 మిల్లీమీటర్లు (52.6 అం.), సగటు వార్షిక ఉష్ణోగ్రత 26.9 °C (80.4 °F). క్రింది పట్టికలో శీతోష్ణస్థితి డేటా చూడవచ్చు. [32][33][34]
శీతోష్ణస్థితి డేటా - Puri (1981–2010, extremes 1901–2012)
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పూరి పట్టణ సముదాయం జనాభా 2,00,564.[35] ఇందులో 1,04,086 మంది పురుషులు, 96,478 మంది స్త్రీలు ఉన్నారు. 18,471 మంది పిల్లలు (ఆరు సంవత్సరాలలోపు) ఉన్నారు. లింగ నిష్పత్తి 927. నగరంలో సగటు అక్షరాస్యత 88.03 శాతం (పురుషులలో 91.38 శాతం, స్త్రీలలో 84.43 శాతం).
పరిపాలన
పూరి మునిసిపాలిటీ, పూరీ కోణార్క్ డెవలప్‌మెంట్ అథారిటీ, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ ఆర్గనైజేషన్, ఒరిస్సా వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ వంటి కొన్ని ప్రధాన సంస్థలు నీటి సరఫరా, మురుగునీటి పారుదల, వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, రోడ్లు వంటి పౌర సౌకర్యాలను అందిస్తున్నాయి. ఈ సంస్థలపై గరిష్ట ఒత్తిడిని కలిగించే ప్రధాన కార్యకలాపం జూన్-జూలైలో జరిగే రథయాత్ర. పూరీ మున్సిపాలిటీ ప్రకారం, ఈ కార్యక్రమానికి పది లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు హాజరవుతారు. అందువల్ల, భద్రతతో పాటు, యాత్రికులకు మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు వంటి అభివృద్ధి కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తారు. [36]
పరిపాలన పూరీ పురపాలక సంఘం బాధ్యత. 1881లో పూరీ, మునిసిపాలిటీ అయ్యాక పూరీ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్ పేరుతో 1864లో మునిసిపాలిటీ ఉనికిలోకి వచ్చింది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఒరిస్సా మునిసిపల్ చట్టం (1950) నగర పరిపాలనను పూరీ మునిసిపాలిటీకి అప్పగిస్తూ ప్రకటించింది. మునిసిపల్ పరిధిలోని 30 వార్డులకు ప్రాతినిధ్యం వహించే చైర్‌పర్సన్, కౌన్సిలర్‌లతో ఎన్నికైన ప్రతినిధులు ఈ సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తారు. [37]
టాటా పవర్ సెంట్రల్ ఒడిషా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ నగరంతో పాటు, మొత్తం జిల్లాలో విద్యుత్తును అందిస్తోంది.[38]
ఆర్థిక వ్యవస్థ
పూరీ ఆర్థిక వ్యవస్థ దాదాపు 80 శాతం వరకు పర్యాటకంపై ఆధారపడి ఉంది. ఈ దేవాలయం నగరానికి కేంద్ర బిందువుగా ఉండి పట్టణ ప్రజలకు ఉపాధిని కల్పిస్తోంది. ఈ ప్రాంతంలోని బియ్యం, నెయ్యి, కూరగాయలు మొదలైన వ్యవసాయ ఉత్పత్తులు ఆలయ అవసరాలను తీరుస్తుంది. పట్టణం చుట్టూ ఉన్న అనేక స్థావరాలు ప్రత్యేకంగా ఆలయ అవసరాలను తీరుస్తాయి. [39] ఆచారాలను నిర్వహించడానికి ఆలయ పరిపాలనా యంత్రాంగం 6,000 మందిని నియమించింది. ఈ దేవాలయం 20,000 మందికి ఉపాధి కలిగిస్తోంది. [31] ఆహారం, ప్రయాణంపై రచయిత్రి కొలీన్ టేలర్ సేన్ భారతదేశ ఆహార సంస్కృతిపై వ్రాసిన ప్రకారం, ఆలయ వంటగదిలో 400 మంది వంటవారు 1,00,000 మందికి ఆహారం అందిస్తారు. [40] ఇండ్ బరత్ పవర్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ (IBPIL) డైరెక్టర్ J మోహపాత్ర ప్రకారం, ఇక్కడీ వంటగది "ప్రపంచంలోని అతి పెద్ద వంటగది". [41]
పూరిలో రథయాత్ర
జగన్నాథ ఆలయ త్రయాన్ని సాధారణంగా పూరీలోని ఆలయ గర్భగుడిలో పూజిస్తారు, అయితే ఆషాఢ మాసంలో (ఒరిస్సా వర్షాకాలం, సాధారణంగా జూన్ లేదా జూలైలో) వాటిని బడా దండ (పూరీ ప్రధాన వీధి)లో బయటకు తీసుకువస్తారు. గుండిచా ఆలయానికి[42] భారీ రథాలలో ( రథ ), ప్రజలు దర్శనం చేసుకుంటారు. ఈ పండుగను రథ యాత్ర అని పిలుస్తారు. [43] యాత్ర ప్రతి సంవత్సరం హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ శుక్ల ద్వితీయ రోజున ప్రారంభమవుతుంది.[44]
చారిత్రికంగా, పాలక గంగా రాజవంశం దాదాపు 1150 లో జగన్నాథ దేవాలయం పూర్తయిన తర్వాత రథయాత్రను ప్రారంభించింది. పాశ్చాత్య ప్రపంచానికి చాలా ముందుగానే తెలిసిన హిందూ పండుగలలో ఇది ఒకటి. [45] ఫ్రియర్ ఒడోరిక్, 1321లో రాసిన గ్రంథంలో, ప్రజలు రథాలపై "విగ్రహాలను" ఎలా ఉంచారో రాసాడు. రాజు, రాణి, ప్రజలందరూ వాటిని పాటలతో సంగీతంతో "చర్చి" నుండి ఎలా తీసారో రాసాడు. [46][47]
రథాలు పెద్ద చక్రాలతో అందించబడిన భారీ చెక్క నిర్మాణాలు, వీటిని ప్రతి సంవత్సరం కొత్తగా నిర్మిస్తారు. దీన్ని భక్తులే లాగుతారు. జగన్నాథుని రథం దాదాపు 45 అడుగులు (14 మీ.) ఎత్తు ఉంటుంది. దాని నిర్మాణానికి సుమారు 2 నెలలు పడుతుంది. [48] రథం 16 చక్రాలతో, ఒక్కొక్కటి 7 అడుగులు (2.1 మీ.) వ్యాసంతో ఉంటాయి. రథం ముందు భాగంలో మారుతి లాగే నాలుగు చెక్క గుర్రాలు ఉన్నాయి. దాని ఇతర మూడు ముఖాలపై, రాముడు, సూర్యుడు, విష్ణువు చెక్కతో ఉంటాయి. ఈ రథాన్ని నంది ఘోష అంటారు. రథం పైకప్పును పసుపు, ఎరుపు రంగుల వస్త్రంతో కప్పుతారు. బలభద్రుని రథం 44 అడుగులు (13 మీ.) ఎత్తులో 14 చక్రాలు అమర్చబడి ఉంటాయి. సాత్యకి రథసారధిగా చెక్కబడిన రథం, పైకప్పు ఎరుపు, ఆకుపచ్చ రంగుల వస్త్రంతో కప్పబడి ఉంటుంది. ఈ రథాన్ని తాళధ్వజ అని పిలుస్తారు. ఈ రథంపై చెక్కిన శిల్పాలలో జగన్నాథుని సహచరులుగా నరసింహ, రుద్ర విగ్రహాలు ఉంటాయి. తదుపరి రథం సుభద్రది. ఇది 43 అడుగులు (13 మీ.) ఎత్తున, 12 చక్రాలు, నలుపు ఎరుపు రంగు వస్త్రంతో కప్పబడిన పైకప్పుతో ఉంటుంది. ఈ రథాన్ని దర్ప దలాన్ అని పిలుస్తారు. దీని రథసారథి అర్జునుడు. రథంపై చెక్కబడిన ఇతర విగ్రహాలు వన దుర్గ, తారా దేవి, చండీ దేవి .[44] పూరీలోని కళాకారులు. చిత్రకారులు రథాలను అలంకరిస్తారు. చక్రాలపై పూల రేకులు, ఇతర డిజైన్‌లు, చెక్కలో చెక్కబడిన రథసారథి, గుర్రాలు, సింహాసనం వెనుక గోడపై తిరగబడిన తామర ఆకారాలను చిత్రించారు. [43] ఈ జగన్నాథుని రథాలే ఇంగ్లీషు పదం జగ్గర్నాట్ కు శబ్దవ్యుత్పత్తి మూలం.[49] రథ యాత్రను శ్రీ గుండిచా యాత్ర అని, ఘోషయాత్ర అని కూడా పిలుస్తారు [44]
రవాణా
ఆధునిక రహదార్లు లేనప్పుడు, ప్రజలు పూరీకి చేరుకోవడానికి బళ్ళ బాటల వెంట ఎడ్ల బళ్ళపై లేదా కాలినడకన లేదా ప్రయాణించేవారు. కలకత్తా నుండి గంగానదిపై పడవ ప్రయాణం, ఆపై కాలినడకన లేదా క్యారేజీల ద్వారా ప్రయాణం చేసేవారు. 1790లో మరాఠా పాలనలో ఉండగా జగన్నాథ్ సడక్ (రోడ్డు) నిర్మించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తా నుండి పూరీ వరకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని 1898లో ప్రారంభించారు. [50] ప్రస్తుతం పూరీకి రైలు, రోడ్డు, విమాన సౌకర్యాలు ఉన్నాయి. సౌత్ ఈస్టర్న్ రైల్వే యొక్క బ్రాడ్ గేజ్ రైలు మార్గం పూరీని కలకత్తాతో కలుపుతుంది. ఖుర్దా ఈ మార్గంలో ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్. కలకత్తా నుండి రైలు మార్గం దూరం దాదాపు 499 కిలోమీటర్లు (310 మై.),[51]విశాఖపట్నం నుండి 468 కిలోమీటర్లు (291 మై.). జాతీయ రహదారి NH 203 పట్టణాన్ని రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌తో కలుపుతుంది. NH 203 B బ్రహ్మగిరి మీదుగా నగరాన్ని శతపదతో కలుపుతుంది. NH 203 Aలో భాగమైన మెరైన్ డ్రైవ్, పూరీని కోణార్కతో కలుపుతుంది. సమీప విమానాశ్రయం భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం. [52] పూరీ రైల్వే స్టేషన్ భారతీయ రైల్వేలలో అత్యధికంగా టిక్కెట్లు అమ్ముడయ్యే మొదటి వంద స్టేషన్లలో ఒకటి.[53]