పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధుడు మందుముల నరసింగరావుమార్చి 17, 1896 న ప్రస్తుత రంగారెడ్డి జిల్లాచేవెళ్ళలో జన్మించాడు. తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన నరసింగరావు న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. పర్షియన్ భాషలో కూడా ఇతను గొప్ప పండితుడు, పత్రికా రచయితగా పేరుపొందాడు. 1921లో ఆంధ్రజనసంఘాన్ని స్థాపించిన వారిలో ఒకడు. 1927లో న్యాయవాదవృత్తికి స్వస్తి చెప్పి పత్రికారచన, రాజకియాలుచేపట్టారు. 1927లో రయ్యత్ అనే ఉర్దూ వార్తాపత్రిక స్థాపించి సంపాదక బాధ్యతలు చేపట్టాడు[2]. మందుముల సమరరంగంలో కూడా కీలకపాత్ర వహించి 1937లో ఇందూరు (నిజామాబాదు) లో జరిగిన 6వ ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించాడు.[3] 1938-42 కాలంలో నిజాం లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నాడు. 1947లో జాయిన్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టు అయ్యాడు. ఇవేకాక బాల్యవివాహాల రద్దుకు, వితంతు వివాహాలకు బాగా కృషిచేశాడు. 1952లో కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున హైదరాబాదు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957-62 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేశాడు. నిజాం కాలంలోని దుష్పరిపాలనను వర్ణిస్తూ "50 సంవత్సరాల హైదరాబాదు" గ్రంథాన్ని స్వీయజీవిత చరిత్రగా రచించాడు.