సామల సదాశివ (మే 11, 1928 - ఆగష్టు 7, 2012) కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. తెలంగాణకు చెందిన తెలుగు, ఉర్దూ రచయిత, హిందుస్తానీ సంగీత పండితుడు.[1] హిందుస్తానీ సంగీతాన్ని తొలిసారిగా తెలుగు పాఠక లోకానికి పరిచయం చేసిన తొలి తెలుగు రచయిత.
సామల సదాశివ పేరు వినగానే మనకు మలయమారుతాలు, సంగీత శిఖరాలు, యాది వంటి వ్యాస సంకలనాలు గుర్తుకొస్తాయి. ఇంక అంజద్ రుబాయీలు, ఉర్దూ సాహిత్య చరిత్ర, మౌలానా రూమీ మస్నవీ, ఉర్దూ కవుల కవితా సామగ్రి, మిర్జా గాలిబ్ పుస్తకాలు కూడా గుర్తుకొస్తాయి. మిర్జా గాలిబ్ (జీవితము, రచనలు), ఉర్దూ సాహిత్య చరిత్ర (అనువాదము) వంటి రచనలలో మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు గోచరిస్తాయి. ఆమూలాగ్రం చదివిస్తాయి.
మలయ మారుతాల్లో అతడు మనకు హిందుస్తానీ సంగీత ప్రపంచాన్ని, అందులోని మేటి కళాకారుల్నీ, వారి గొప్పదనాన్ని ఆత్మాభిమానాన్ని కళ్ళకు కట్టినట్టు వివరిస్తాడు. ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకు పోయేట్టు చెప్పెడం అతనికున్న ప్రత్యేకత. అతని భాషా, శైలీ చాలా సహజ సుందరంగా ఉంటాయి. ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్, హీరాబాయి బరోడేకర్, బడే గులాం అలీఖాన్, అల్లాదియా ఖాన్, బేగం అఖ్తర్, గంగూబాయి హంగల్, కేసర్ బాయి కేర్కర్, ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్, ఇలా ఎందరో సంగీత విద్వాంసులను, వారు ఆలపించే విధానాలను సదాశివ మనకు వివరిస్తాడు. తరువాత ఇక మనము హిందుస్తానీ రాగాల్ని రేడియో లోనో, క్యాసెట్ల రూపంలోనో, ఇంటర్నెట్లోనో వినకుండా ఉండలేనంతగా మనలో హిందుస్తానీ సంగీతం పట్ల అభిరుచిని కలిగిస్తాడు.