హనుమంతరావుకు 1924లో సరస్వతీ దేవితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు.
ఉద్యమ జీవితం
ఆ తర్వాత బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు తదితర ప్రముఖులతో కలిసి ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నాడు. మహబూబ్ నగర్‌లో జరిగే అన్ని ఉద్యమాలకు ఇతను నాయకత్వం వహించాడు.మహబూబ్ నగర్ జిల్లాలో ఆంధ్రమహాసభను పటిష్ఠం చేయడమే కాకుండా గ్రామగ్రామాన గ్రంథాలయాలు స్థాపించడానికి కృషిచేశాడు. 1947-48లో నిరంకుశ నిజామ్ పాలనకు, దాష్టీక రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి జైలుకు వెళ్ళాడు. హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో కలిసిన పిమ్మట 1948, సెప్టెంబరు 19న ఇతను జైలు నుంచి విడుదలైనాడు.మహబూబ్ నగర్ విద్య సమితిని స్థాపించి విద్యావ్యాప్తికి కృషిచేశారు.1942 లో గాంధీ ప్రారంభించిన వ్యక్తి సత్యాగ్రహాన్ని పాలమూరులో చేపట్టి అరెస్ట్ అయ్యారు.
రాజకీయ నేపథ్యం
1952లో జరిగిన తొలి శాసనసభ ఎన్నికలలో మహబూబ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనాడు. అప్పుడే బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో 1954 ఫిబ్రవరి నుండి 1956 సెప్టెంబరు వరకు డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ రెవెన్యూ మంత్రిగా స్థానం కూడా పొందినాడు. ఇతన్ని మహబూబ్ నగర్ గాంధీ అని పట్టణ ప్రజలు అప్యాయంగా పిలిచేవారు.[3]భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున 1957 నుండి 1967 వరకు రెండుసార్లు మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[4]
గుర్తింపులు
2009 మార్చిలో పల్లెర్ల హనుమంతరావు శతజయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడలిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించబడింది.