శాంతారాం రాజారాం వణకుద్రే (నవంబరు 18, 1901 - అక్టోబరు 30, 1990) భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత,దర్శకుడు, నటుడు.[2] ఈయన "డా.కోట్నిస్ కీ అమర్ కహానీ" (1946), "అమర్ భూపాలి" (1951), "దో ఆంఖె బారహ్ హాథ్" (1957), "నవరంగ్" (1959), "దునియా నా మానే" (1937), "పింజ్రా" (1972) వంటి చిత్రాలతో అందరికి పరిచితుడు.
జీవిత విశేషాలు
డా వి.శాంతారామ్ మహారాష్ట లోని కొల్హాపూర్ సమీప గ్రామంలో తేదీ-18-11-1901వ సంవత్సరంలో జన్మించాడు. 1921లో నటుడిగా చిత్రరంగప్రవేశం చేసిన ఆయన మూకీ, టాకీలు అన్నీ కలిపి 25 చిత్రాల్లో నటించాడు. సుమారు 90 సినిమాలు నిర్మించాడు. వీటిలో 55 సినిమాలకు స్వయంగా ఆయనే దర్శకత్వం కూడా వహించాడు. కళాత్మక, వ్యాపార దృక్పథాలను మేళవించిన విలక్షణ దర్శకునిగా పేరుగాంచాడు. అమరజ్యోతి, ఆద్మీ, దునియా న మానే, పడోసీ, స్త్రీ, అమర్ భూపాలీ, డా కోట్నిస్‌కీ అమర్ కహానీ మొ. సినిమాలు శాంతారామ్ దర్శకత్వంలో వచ్చిన కొన్ని ఆణిముత్యాలు. నవరంగ్, గీత్ గాయా పత్థరోంనే, ఝనక్ ఝనక్ పాయల్ బాజే మొ. చిత్రాల్లో కళాకారుడి అంతరంగాన్ని, ఆవేదనను ఆవిష్కరించాడు. ‘శాంతారామ’ అనే పేరుతో తన ఆత్మకథను వ్రాసుకున్నాడు. చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ, 1985 లో కేంద్ర ప్రభుత్వం ‘దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంను బహూకరించింది. అంతేకాక నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందిన ఆయన అక్టోబరు 18, 1990 వ సంవత్సరంలో మరణించాడు.