చమోలి జిల్లా

Chamoli district
Location in Uttarakhand
Location in Uttarakhand
పటం
Chamoli district
Coordinates: 30°25′N 79°20′E / 30.42°N 79.33°E / 30.42; 79.33
Country India
రాష్ట్రంUttarakhand
DivisionGarhwal
Established24 February 1960
ముఖ్యపట్టణంChamoli Gopeshwar
Tehsils12
Government
 • District collectorHimanshu Khurana IAS[1]
 • Lok Sabha constituencyGarhwal
 • Vidhan Sabha constituenciesBadrinath, Karnaprayag, Tharali(SC)
విస్తీర్ణం
 • Total8,030 కి.మీ2 (3,100 చ. మై)
 • RankI in the state
Highest elevation7,816 మీ (25,643 అ.)
Lowest elevation800 మీ (2,600 అ.)
జనాభా
 • Total3,91,605
 • జనసాంద్రత49/కి.మీ2 (130/చ. మై.)
Language
 • OfficialHindi[2]
 • RegionalGarhwali[3]
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
Vehicle registrationUK 11

చమోలి జిల్లా, భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన జిల్లా.[4] దీనికి ఉత్తరాన టిబెట్ ప్రాంతం, తూర్పున ఉత్తరాఖండ్ జిల్లాలు పిథోరాఘర్, బాగేశ్వర్, దక్షిణాన అల్మోరా, నైరుతిలో పౌరీ గర్వాల్, పశ్చిమాన రుద్రప్రయాగ్, వాయవ్యంలో ఉత్తరకాశీ సరిహద్దులుగా ఉన్నాయి. చమోలి జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం గోపేశ్వర్‌లో ఉంది. పర్యాటకులకు చమోలి బద్రీనాథ్, హేమ్‌కుండ్ సాహిబ్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌తో సహా పర్యాటక ఆసక్తిని కలిగి ఉన్న వివిధ ప్రదేశాలను కలిగి ఉంది. చిప్కో ఉద్యమం మొదట చమోలీలో ప్రారంభమైంది.1960లో చమోలీ జిల్లా పౌరీ ఘర్వాల్ జిల్లా లోని కొంత భూభాగం వేరుచేసి చమోలీ జిల్లాగా రూపొందించబడింది. చమోలీ ఘర్వాల్ జిల్లా ఈశాన్య సరిహద్దులో ఉంది. ఇది హిమాలయాల మద్యభాగంలో ఉంది. పురాణాలలో ఈ ప్రాంతాన్ని బహిర్గిరి అని ప్రస్తావించారు. ఇది హిమాలాయాల మూడు భాగాలలో ఒకటి.

భౌగోళికం

ఘర్వాల్ జిల్లా నుండి కొంత భూభాగం 1960లో వేరుచేసి చమోలీ జిల్లాగా రూపొందించారు. ఈ జిల్లా మద్యహిమాలయాలో ఉంది. అంతేకాక ప్రముఖ హిందూపుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ యాత్రామార్గంలో ఉంది. జిల్లా వాయవ్య సరిహద్దులో ఉత్తరకాశి జిల్లా, నైరుతి సరిహద్దులో పితోరాఘర్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో అల్మోరా, ఈశాన్య సరిహద్దులో రుద్రప్రయాగ, పడమర సరిహద్దులో తెహ్రి ఘర్వాల్ జిల్లాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 7,520 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంది.

భూమి

ప్రపంచభౌగోళిక చరిత్రలో హిమాలయాలు చివరి భౌగోళిక మార్పులలో మొజాయిక్ కాలంలో ఏర్పడ్డాయని భావిస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ లభించే రాళ్ళు కొన్ని పురాతన కాలానికి చెందినవని భావిస్తున్నారు. ఈ జిల్లాలోని భూభాగం నుండి అలకాందా నది ప్రవహిస్తూ ఉంటుంది. జిల్లా భూభాగంలోనే అలకనందా నదిలో దాని ఉపనదులు కొన్ని సంగమిస్తున్నాయి. ఈ జిల్లా పరతశ్రేణులు ఉత్తరం నుండి దక్షిణానికి విస్తరించి ఉన్నాయి. తూర్పు -ఆగ్నేయంగా జోషీమఠ్, లోహర్‌ఖెట్ గ్రామాలు, పక్కన ఉన్న పితోరాఘర్ జీల్లాల నుండి ఊహాత్మక రేఖ ఉంటుంది. ఉత్తరభూభాగంలో ఉన్నతమైన హిమశిఖరాలు విస్తరించి ఉన్నాయి. దక్షిణ భూభాగంలో దిగువశ్రేణి పర్వతాలు ఉన్నాయి.

గణాంకాలు

2022లో చమోలి జిల్లా జనాభా 6,91,605,[5] ఇది మాల్దీవుల దేశానికి దాదాపు సమానం.[6] ఇది భారతదేశంలోని 640 జిల్లాలలో జనాభా పరంగా 559వ ర్యాంక్‌ను ఇస్తుంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో ప్రతి చ.కీ.మీ.కు 49 మందితో జనసాంద్రత ఉంది. 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 5.6% శాతం పెరిగింది. చమోలిలో ప్రతి 1000 మంది పురుషులకు 1021 స్త్రీల లింగ నిష్పత్తి ఉంది. అక్షరాస్యత రేటు 83.48%. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వరుసగా 20.25% శాతం, 3.13% శాతం మంది ఉన్నారు.[5]

2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో ప్రధానమైన మొదటి భాషగా గర్వాలీ.దీనిని మొత్తం జనాభాలో 90% శాతం మంది జనాభా మాట్లాడతారు. హిందీ భాషను 5.1% శాతం మంది వారి మొదటి భాషగా వాడతారు.అయితే చిన్న కమ్యూనిటీలలో భోటియా (1.6%), నేపాలీ (1.4%), కుమావోని (1%), రోంగ్పో [7][8] మాట్లాడేవారు ఉన్నారు.

చారిత్రక నేపథ్యం

కోటల జిల్లా అనబడే ఘర్వాల్ లోని భూభాగంతో చమోలీ రూపొందించబడింది. ప్రస్తుతం ఘర్వాల్‌ను ఒకప్పుడు " కేదార్- ఖండ్ " అని పిలిచేవారు. ఇది ఈశ్వరనివాసంగా భావిస్తారు. రామాయణ, మహాభారతం వంటి పురాణాలలో, వేదాలలో దీనిని " కేదార్ ఖండ్ " అని వర్ణించారు. బద్రీనాథ్‌కు 4 కిలోమీటర్ల దూరంలో " మనా " గ్రామంలో ఉన్న వ్యాసగృహలో విఘ్నేశ్వరుడు వ్యాసుడు చెప్తున్న వేదాలకు లిపిరూపం ఇచ్చాడని విశ్వసిస్తారు.

ఋగ్వేదం అనుసరించి (1017-19) జలప్రళయం తరువాత సప్తఋషులు మనా గ్రామంలో నివసించారని భావిస్తారు. ఘర్వాల్ ప్రాంతంలోనే వేదాలు వ్రాయబడ్డాయని అందువలన ఇప్పటికీ ఘర్వాల్ భాధలలో సంస్కృత పదాలు వాడుకలో ఉన్నాయని భావిస్తారు. ఘర్వాల్ ప్రాంతంలోని వేదకాల ౠషుల నివాసాలు ప్రస్తుతం పవిత్రక్షేత్రాలైయ్యాయి. ప్రత్యేకంగా చమోలీకి 25 కిలోమీటర్ల దూరంలో అత్రి, అనసూయల ఆశ్రమం, బద్రీనాథ్ సమీపంలో ఉన్న గంధమాదన్ పర్వతప్రాంతంలో కశ్యప మహర్షి ఆశ్రమం ఉన్నాయి. ఆదిపురాణం అనుసరించి బద్రీనాథ్ 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యాసగృహలో వ్యాసుడు వల్లిస్తున్న విఘ్నేశ్వరుడు వేదాలకు వ్రాతరూపం ఇచ్చాడని భావిస్తారు. పాండురాజు తపసుచేసిన తపస్థలి ఇక్కడే ఉందని ఇది ఈశ్వరుడు నివసించిన ప్రాంతమని భావిస్తారు.

చరిత్ర

చమోలీ జిల్లాకు చెందిన విశ్వసించతగిన సాక్ష్యాధారాలు సా.శ. 6 శతాబ్దం నుండి లభిస్తునాయి. పాడుకేశ్వర్ లోని లలిత్‌శూర్‌లో గోపేశ్వరాలయంలో ఉన్న అతిపురాతన త్రిశూలం పురాతన ఉదాహరణలలో ఒకటి. సిరోలిలో ఉన్న నర్వమన్ శిలాక్షరాలు, రాజా కనకపాల్ వ్రాయించిన చంద్‌పూర్ గరి శిలాక్షరాలు పురాతన ఆధారాలలో ప్రధానమైనవి. ఈ ఆధారాలు ఘర్వాల్ చారిత్రక, సాంస్కృతిక చరిత్రకు మూలాధారాలు.

కొంతమంది చారిత్రకారులు, పరిశోధకులు ఈ ప్రాంతం ఆర్యుల పూర్వీక ప్రాంతమని (సా.శ.పూ 300 ) భావిస్తున్నారు. కాశ్మీర్, నేపాల్, కుమాన్ మార్గంలో ఘర్వాల్ మీద ఖాసాలు దండెత్తారు. అప్పుడు ఇక్కడి స్థానికులకు, వెలుపలి నుండి వచ్చిన వారికి మద్య తీవ్రమైన ఘర్షణ చెలరేగింది. స్థానికులు వారి రక్షణ కొరకు చిన్న చిన్న గర్హాలు (కోటలు) నిర్మించికున్నారు. ఖాసాలు మొత్తం గర్హాలను ఆక్రమించుకుని స్థానికులను ఓడించారు.

ఖాసాల తరువాత క్షత్రియులు ఈ ప్రాంతం మీద దండెత్తి విజయం సాధించి వందలాది ఘర్హాలను 52 ఘర్హాలుగా మార్చారు. క్షత్రియుల నాయకుడు కంతుర వాసుదేవుడు ఘర్వాల్ ఉత్తరభాగంలో రాజ్యస్థాపన చేసాడు. ఆయన తన రాజ్యానికి జ్యోత్రిమఠాన్ని తరువాత కార్తికేయపురి రాజదానిని చేసాడు. ఘర్వాల్ ప్రాంతంలో రాజ్యస్థాపన చేసిన కత్యూరా రాజ్యస్థాపకుడు వాదుదేవ్ కత్యూరి వారసులు ఈ ప్రాంతాన్ని వందలాది సంవత్సరాలు పాలించారు. ఈ సమయంలో ఆదిశంకరాచార్యుడు ఈ ప్రాంతాన్ని సందర్శించి జ్యోతిమఠాన్ని స్థాపించాడు. శంకరాచార్యుడు స్థాపించిన 4 ముఖ్యమైన మఠాలలో జ్యోత్రిమఠం ఒకటి. మిగిలిన మూడు మఠాలు ద్వారకా, పూరీ, శృంగేరీలలో ఉన్నాయి. ఆదిశంకరాచార్యుడు బౌద్ధుల భయంతో నారదకుండంలో దాచిన బద్రీనాథుని విగ్రహాన్ని బద్రీనాథ్‌‌లో పునఃప్రతిష్ఠ చేసాడు. తరువాత బద్రీనాథ్ యాత్ర ఆరంభం అయింది. పి.టి హరికృష్ణ రాతూరి పరిశోధనలు ఆధారంగా రాజా భానుప్రతాప్ ఘర్వాల్ ప్రాంతంలో స్థాపించిన పంవార్ సామ్రాజ్యానికి మొదటి పాలకుడని తెలుస్తుంది. రాజా భానుప్రతాప్ తనసామ్రాజ్యానికి చంపూర్-గర్హి రాజధానిగా చేసుకున్నాడు. ఘర్వాల్‌లోని 52 ఘర్హాలలో చంపూర్-గర్హి శక్తివంతమైంది.

భూకంపం

1803 సెప్టెంబరున సంభవించిన భయంకరమైన భూకంపం ఘర్వాల్ ఆర్థిక - నిర్వహణా వ్యవస్థలకు తీవ్రమైన అఘాతం కలిగించింది. బాహీనమైన పరిస్థితిని ఆధారంగా చేసుకుని అమరసింగ్ తపా, హాస్టిడల్ చంతురియా నాయకత్వంలో గొర్కాలు ఘర్వాల్ మీద దండెత్తి 1804లో సగం ఘర్వాల్‌ను ఆక్రమించుకుని రాజ్యస్థాపన చేసి 1845 వరకూ పాలన సాగించాడు. ఒకవైపు రాజా సుదర్శన్ షాహ్ ఈస్టిండియా కంపెనీతో సనరదింపులు జరిపాడు. రాజా సుదర్శన్ బ్రిటిష్ వారి సాయంతో గోర్కాలను ఓడించి అలానందా, మందాకినీ తూర్పు ప్రాంతాన్ని తన సామ్రాజ్యంలో విలీనం చేసాడు. అలాగే తన సామ్రాజ్యానికి శ్రీనగరును రాజధానిని చేసాడు. ఆసమయంలో ఈ ప్రాంతం బ్రిటిష్ ఘర్వాల్ అనిపిలువబడింది. తరువాత రాజధానిని శ్రీనగర్ నుండి తెహ్రీ ఘర్వాలుకు మార్చబడింది. ఆరంభంలో ఈ ప్రాంతం మీద డెహ్రాడూన్, సహరన్‌పూర్ బ్రిటిష్ పాలకుల ఆధీనంలో ఉంటూవచ్చింది. తరువాత ఈ ప్రాతంలో బ్రిటిష్ పాలకులు కొత్త జిల్లాగా విభజించి దానికి పౌరీ అని నామకరణం చేసారు. తరువాత తాలూకాగా ఉన్న చమోలీని 1960 ఫిబ్రవరి 24 న చమోలీని జిల్లాగా మార్చారు. 1970 అక్టోబరులో మరో 2 తెహ్సిల్స్, చమోలీ లోని రెండు బ్లాకులు కలిపి రుద్రప్రయాగ జిల్లాగా మార్చబడింది.

ఖనిజాలు

ఈ జిల్లాలో లభ్యమౌతున్న ఖనిజాలు కింద ఉన్నాయి.

  • అస్బెస్టాస్:- అమోసిట్ రకానికి చెందిన ఈ అస్బెస్టాస్ రాళ్ళ నుండి అస్బెస్టాస్, సిమెంట్ ఇటుకలు, లాబరేటరీ అస్బెస్టాస్ షీట్లు, పేపర్ తయారు చెయ్యవచ్చు.
  • మాగ్నస్టిక్: - మద్యరకానికి చెందిన క్రిస్టల్ రాళ్ళతో కూడిన భూభాగంలో క్రిస్టలైన్ డొలోమిటీలు, కూన్ని ప్రదేశాలలో సోప్‌స్టోన్ రాళ్ళతోకూడిన భూభాగం ఉంటుంది. ఈ భూభాగంలో ఉండే మెగ్నీషియం మద్యరకానికి చెందినది.
  • సోప్స్టోన్: - సీస్టైట్:- ఇక్కడ లభించే మాగ్నసైట్ నుండి కాస్మెటిక్ పరిశ్రమలలో సోప్ ఫిల్లర్‌గా ఉపకరిస్తుంది.
  • కాపర్: - ఈ జిల్లాలో విస్తారంగా లభ్యమౌతున్న రాగి హిందూ, గోర్కాల కాలంలో విరివిగా ఉపయోగించబడింది. రాగి గనులన్నీ దాదాపు వాడుకోబడింది. ప్రస్తుతం ఈ గనులు ఉపాధి కల్పించే దశలో లేవు.
  • ఐరన్: - ఇనుము శాతం తక్కువగా ఉన్న రాళ్ళతో కూడిన భూభాగం కనుక ఇది వాణిజ్యపరమైన ఉత్పత్తికి ఉపకరించదు.
  • గ్రాఫిట్: - పట్టిలోభాలో లభ్యమౌతున్న ప్లంబాగో తరహా రాళ్ళను డైగా వాడారు కాని ఈ భూభాగంలో ఇవి స్వల్పంగా మాత్రమే ఉన్నాయి
  • బంగారం: - అలకనందా, పింద్దర్ భూభాగలో అతిస్వల్పమైన బంగారు నిల్వలు ఉన్నాయి.
  • జిప్సం: - నదీతీరాలలో లభ్యమౌతున్న జిప్సం ఒకప్పుడు సాసర్లు, వడ్డించే పాత్రలు తయారీకి ఉపయోగించబడ్డాయి.ఈ రాళ్ళను మెత్తని పొడిగా చేసి ప్లాస్టరాఫ్ పారిస్‌గా వివిధ రకాలుగా వాడుతుంటారు.
  • సీసం: - ఒకప్పుడు విరివిగా లభ్యమైన సీసం ప్రస్తుతం అరుదైపోయింది.
  • బలపం రాయి: - మెత్తని బంకమట్టితో తయారైన ఈ బలపం రాళ్ళు సన్నని మెత్తని ఫలకాలుగా విడివడి ఉంటాయి. ఇవి జిల్లా అంతా విస్తరించి ఉన్నాయి. ఇవి గృహాలు పైకప్పుగానూ ఒక్కోసారి

గృహాంతర్గత అలకరణకు ఉపకరిస్తాయి.

  • సున్నపురాళ్ళు: - ఈ రాళ్ళను కాల్చి సున్నం, ఫిరంగి మందు తయారు చెయ్యవచ్చు. జిల్లాలో సున్నపురాళ్ళతో కూడిన రెండు పర్వతశ్రేణులు ఉన్నాయి. నాగ్‌పూర్ సమీపంలో అలకనందానదికి ఉత్తరంగా ఒకటి ఉండగా రెండవది పింద్దర్ లోని లోభా పట్టి నుండి ఘర్వాల్ జిల్లాలో ఉన్న పట్టి బచ్చంస్యూన్ వరకూ వ్యాపించి ఉన్నాయి.
  • బిల్డింగ్ స్టోన్ - భవన నిర్మాణానికి ఉపకరించే ఇసుకరాళ్ళు దిగువ పర్వటశ్రేణి పర్వతాలలో జిల్లా అంతటా లభిస్తున్నాయి. జిల్లా అంతటా లభించే క్లోరైట్, సాధారణ శిలలు గృహనిర్మాణానికి ఉపకరిస్తున్నాయి.
  • సల్ఫర్: - జిల్లాలో బ్రింస్టోన్ అనబడే పసుపుపచ్చని ఈ ఖనిజం " గ్రీన్ సల్ఫేట్ ఆఫ్ ఇరన్ "గా లభిస్తుంది. ఇది ఇనుము, రాగి గనుల వద్ద లభిస్తుంది. జిల్లాలో పలు ప్రదేశాలలో

జిల్లాలో అక్కడక్కడా సల్ఫర్ సెలయేళ్ళు ప్రవహిస్తున్నాయి.

  • బిటుమెన్: - షిలాజిత్ అనబడే బిటుమన్ లేత గోధుమ రంగులో లభిస్తుంది. ఎత్తైన ప్రదేశాలలో శిలారూపలో లభిస్తున్న ఈ ఖనిజాన్ని ఆయిర్వేద వైద్యంలో ఉపయోగించబడుతుంది. భక్తులు విరివిగా వచ్చే సమయంలో వీట విక్రయాలు అధికం ఔతాయి కనుక ప్రజలకు వీటి నుండి కొంత ఆదాయం లభిస్తుంది.
  • ఇతరాలు:- ఆంటిమొని, ఆర్సెనిక్, లిగ్నైట్, బ్రున్ మార్బుల్, మైకా, వెండి లభిస్తాయి.
  • సాధారణంగా జిల్లా ప్రాంతంలో భౌగోళిక పరిస్థితి కారణంగా భూకంపాల ప్రమాదాలకు ఆస్కారం అధికంగా ఉంది. జిల్లాలోని భౌగోళిక పరిస్థితులు అస్థిరంగా ఉంటుందు. జిల్లాలో అగ్నిపర్వాలు లేవు. అయినప్పటికీ చౌకాంబా శిఖరం పురాతన అగ్నిపర్వతంగా భావిస్తున్నారు.

వాతావరణం

సముద్రమట్టానికి 800-8,000 మీ ఎత్తు జిల్లా వాతావరణం మీద అత్యధిక ప్రభావం చూపుతుంది. నవంబరు మద్య నుండి మార్చి మాసం వరకు శీతాకాలం కొనసాగుతుంది. జిల్లాలోని అత్యధిక ప్రాంతం హిమాలయాల దక్షిణ భూభాగంలో ఉపస్థితమై ఉంది. ౠతుపవన వాయువులు హిమాలయ లోయల మీదుగా ప్రయాణిస్తూ జిల్లాభూభాగంలో ప్రవేశించింది. జూన్, సెప్టెమర్ మాసాలలో జిల్లాలో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది.

  • వర్షపాతం - జిల్లా దక్షిణ భూభాగంలో జూన్ - సెప్టెంబరు మాసాలలో 70-80 శాతం వర్షపాతం ఉంటుంది. ఉత్తర భూభాగంలో 55-60 శాతం వర్షపాతం ఉంటుంది. వర్షపాతం కారణంగా తక్కువ ఉష్ణోగ్రత, పర్వతసానువులలో అడవి, పచ్చని చెట్లు అధికం కావడానికి కారణం ఔతుంది. అయినప్పటికీ ప్రభావం మాత్రం భూభాగం అంతటా సమానంగా ఉండదు. ఎత్తైన భూభాగంలో పచ్చదనం తక్కువగానే ఉంటుంది. అవపాతం తక్కువగా ఉన్నందువలన ఈ భూభాగంలో తడికూడా తక్కువగా ఉంటుంది. జిల్లాలోని 7 ప్రజా నివాసిత ప్రాంతాలలో వర్షపాతం కొలిచే కేంద్రాలు ఏర్పాటు చెయ్యబడ్డాయి.
  • ఉష్ణోగ్రత - జిల్లాభూభాగంలో ఉష్ణోగ్రతలు 0-35 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. జనవరి మాసంలో అత్యంత చలిగా ఉంటుంది. జూన్-జూలై మాసాలలో ఉష్ణోగ్రత అత్యధికంగా ఉంటుంది. ఎత్తైన భూభాగంలో ఉష్ణోగ్రతలో మార్పులు ఉంటాయి. లోయలలో అప్పుడప్పుడూ హిమపాతం సంభవిస్తుంది. పడమటి గాలుకు ఉష్ణోగ్రత పతనం కావడానికి కారణం ఔతూ ఉంటుంది.
  • హ్యూమిడిటీ - వర్షాకాలంలో గాలిలో తేమ 79% అధికమౌతుంది. వర్షపాతానికి ముందు ఎడారి ప్రాంతంలో గాలిలో తేమ 35% వరకూ పతనం ఔతుంది.
  • ఎత్తైన పర్వతశిఖరాలలో శీతాకాలంలో గాలిలో తేమ అధికం ఔతుంది.
  • మబ్బులు - వర్షాకాలంలో ఆకాశంలో అత్యధికంగా మబ్బులు కమ్ముకుంటాయి. పడమటి గాలులు వీస్తున్న సమయంలో మబ్బులు మరింత దట్టంగా కమ్ముకుంటాయి.
  • గాలులు - భూభాగంలో వ్యత్యాసం కారణంగా వాయువేగం అధికంగా ఉండదు. రాత్రి, పగటి వేళలలో వాయువేగంలో మార్పులు ఉంటాయి.

నదులు

చమోలీ జిల్లాగుండా పలు నదులు వాటి ఉపనదులు ప్రవహిస్తూ ఉంటాయి. దేవప్రయాగ వద్ద భాగీరది నదిలో సంగమిస్తున్న అలకనందా నది పొడవు 220 కిలోమీటర్లు ఉంటుంది. అలకనందా నది సముద్రమట్టానికి సుమారు 3,641 కి.మీ ఎత్తులో బలాకున్ శిఖరాలలో జనించి ప్రవహిస్తూ ఉంటుంది.ఎగువన ఉన్న రెండు గ్లాసియర్ల నుండి ప్రవహిస్తున్న అలకనందా నది బద్రీనాథ్ మార్గం గుండా ప్రాహిస్తుంది. ఈ రెండు గ్లాసియర్లు చౌకుంబా పర్వతశిఖరాల తూర్పు భూభాగంలో బద్రీనాథ్, దాని శాటిలైట్ శిఖరాలు (7,140 మీ) ఎత్తున ఉంటాయి. పడమర భాగంలో ఉన్న గంగోత్రి శిఖరాల నుండి ఇవి వేరుపడి ఉంటాయి. అలకనందా నదీ మైదానంలోని అత్యధిక భాగం చమోలీ జిల్లాలో ఉంటుంది. 58 చదరపు కి.మీలు విస్తరించి ఉన్న ఈ మైదానాన్ని ఎగువ అలకనందా మైదానం అని అంటారు. మిగిలిన మైదానాన్ని దిగువ అలకనందా మైదానం అంటారు. అలకనద గ్లాసియర్ల నుండి కదిలి అలకాపురి లోయల గుండా ప్రవహిస్తుంది కనుక ఈ నదికి ఈ పేరు వచ్చింది. అలకనందా నది జలాలను సుసంపన్నం చేస్తున్న ఉపనదులు.

  • సరస్వతి మనా గ్రామానికి 9 కి.మీ దూరంలో దిగువభూభాగంలో అలకనందా నదితో సరస్వతి నది సంగమిస్తుంది.
  • ఖిల్‌రావణ్ గంగా నది బద్రీనాథ్ ఆలయానికి దిగువన అలకనందా నదితో సంగమిస్తుంది. అలాగే భుయందర్ గంగానది హనుమాన్ చట్టికి దిగువన అలకనందా నదితో సంగమిస్తుంది.
  • డౌలి గంగా నది జోషిమఠ్ ఎగువన విష్ణుప్రయాగ వద్ద అలకనందా నదితో సంగమిస్తుంది. సముద్రమట్టానికి 5,070 మీ ఎత్తున ఉన్న నితి పాస్ నుండి డౌలి గంగానది ప్రవహిస్తూ ఉంది. ఈ నదీ లోయలు పడమరన కామెట్ గ్రూప్ శిఖరాల మద్య, తూర్పున నందాదేవి గ్రూపు శిఖరాల మద్య విస్తరించి ఉంది. డైలీనది మలరీ వద్ద ఇరుకైన మలరీ, తపోవన లోయల నుండి ఉత్తరదిశగా ప్రవహిస్తుంది. ఈ నదికి ఒకవైపు పర్పెక్యులర్ శిలలు మరొకవైపు ఎత్తైన 1,000 మీ ఎత్తైన శిఖరాలు ఉన్నాయి. డైలి గంగా నదీ మార్గంలో రేణికి 500 మీటర్ల దిగువగా దానికి ఉపనదులైన గిర్హిగంగా, ౠషిగంగా జలాలు సంగమిస్తున్నాయి.
  • జోషిమఠ్, చమోలీల మద్య హెలాంగ్, గౌర్ద్, పాటల్, బిరహిగంగా నదులు అలకనందా నదితో సంగమిస్తున్నాయి.
  • సముద్రా గ్లాసియర్ల నుండి ప్రవహిస్తున్న మందాకిని నది త్రిశూల్ పర్వతాల నుండి ప్రవహిస్తూ నందప్రయాగ వద్ద అలకనందా నదితో సంగమిస్తుంది.
  • జిల్లా ఆగ్నేయదిశలో పంద్దార్ నది కర్ణప్రయాగ వద్ద అలకనందా నదితో సంగమిస్తుంది. నందాదేవి గ్రూపు గ్లాసియర్లలోని మిలాం, పింద్దర్ గ్లాసియర్ల నుండి పింద్దర్ నది ప్రవహిస్తుంది. పింద్దర్ అలకనందా నదితో సంగమించే ముందుగా దానితో కాళిగంగా, భేరిగంగా నదులు పింద్దర్ నదితో సంగమిస్తున్నాయి.
  • చమోలీ జిల్లాలో ఇరుకైన నిటారుగా ఉండే మార్గాల మద్య ప్రవహించే నదులు అతి వేగంగా ప్రవహిస్తుంటాయి. ఈ ప్రవాహాలు ఒక్కోమారు తీరాలను ఖండిస్తూ ప్రవహిస్తూ ఉంటాయి కనుక తరచుగా కొండచరియలు విరిగిపడుతూ ఉంటాయి.

సంస్కృతి, ఉత్సవాలు, పండుగలు

గృహవసతులు

జిల్లాలోని గృహాలు ఎటువంటి నగరనిర్మాణ ప్రణాళికలో నిర్మించబడలేదు. అయినప్పటికీ తగినంత చదునైన ప్రదేశం, కనీస అవసారాలు తీరడానికి అనువైన ప్రదేశంలో తగినంత నీరు లభించే నదీ తీరాలు, లోయలలో గృహసముదాయాలు నిర్మించబడ్డాయి. రాళ్ళతో నిర్మించబడిన ఈ గృహాలలో సాధారణంగా రెండు అంతస్తులు ఉంటాయి కొన్ని మూడు, నాలుగు, ఐదు అంతస్తులు కూడా ఉంటాయి. కొన్ని గృహాలలో గ్రౌండు ఫ్లోరులో 1.8 మీటర్ల ఎత్తైన గదులు ఉంటాయి. వీటిలో సాధారణంగా పెంపుడు జంతువులను కట్టివేస్తారు. ప్రతి ఇంటి ముందు ఖాళీ ప్రదేశం (చౌక్) ఉంటుంది. పై అంతస్తులు ఎక్కడానికి మట్టి, రాయి లేక చెక్క మెట్లు ఉంటాయి. పైకప్పు కూడా చెక్కతో నిర్మితమై ఉంటుంది. పై అంతస్తు సాధారణంగా 2.1 మీటర్ల ఎత్తున ఉంటుంది. పైకప్పు వాలుగా దంతెలతో నిర్మించబడి ఉంటుంది. సాధారణంగా పై అంతస్తులో గదుల నుడి వెలుపలికి వరండాలు ఉంటాయి. ఎత్తైన ప్రదేశాలలో నిర్మించబడిన గృహాలు 2-3 అంతస్తులు, వరండాలు కలిగి ఉంటాయి. అంతేకాక పెరడు కూడా ఉంటుంది. అక్కడ ప్రజలు అల్లిక, నూర్పిడి, నేత, ఇతర పనులను చేస్తుంటారు. 5-6 అంతస్తులు కలిగిన కొన్ని గృహాలలో మాత్రం ప్రజలు పై అంతస్తులో వంటగదిని ఏర్పాటు చేస్తారు. కొన్ని గ్రామాలలో ఊరికి దూరంగా పశువులకొష్టాలు ఉంటాయి. సుమారు ఐదారు గృహాలు వరుసగా నిర్మించబడి ఉండడం వలన ఇళ్ళు కోటలలా అందగా ఉంటాయి.

ఆహారం

ప్రజలు ఆహారానికి గోధుమలు, బియ్యం, మొక్కజొన్నలు, మందుయా, ఝంజోరాలను ఉపయోగిస్తారు. చివరి మూడు ధాన్యాలు కొంచం కథినంగా ఉంటాయి కనుక వీటిని అధికంగా పేదవారు ఉపయోగిస్తుంటారు. మినపప్పు, గహత్, గహత్, సూంత, తర్, లోపియా, మాసర్ వంటి పప్పుధాన్యాలను ఉపయోగిస్తుంటారు. హిందువులు సాధారణంగా శాకాహారులై ఉన్నారు. క్రిస్తవులు, ముస్లిములు, సిక్కులు మాంసాహారులై ఉంటారు. వారు కూడా ప్రతి దినం మాంసం లభించని కారణంగా ఎక్కువ భాగం శాకాహారభోజనమే చేస్తుంటారు.

ఆభరణాలు

వివాహిత స్త్రీలు భర్త జీవించి ఉండాడానికి గుర్తుగా బిచువాలు (వెండి మెట్టెలు) ధరిస్తుంటారు. కీల్ (చిన్న ముక్కు ముక్కెర) ఎడమ ముక్కుకు ధరిస్తుంటారు. బంగారంతో చేసిన నాథ్ (ముక్కు పుడక), చెవి కమ్మలు ధరిస్తారు. అంతేకాక హాంసులిస్, చందనహార్ (చంద్రహారం), కాసులమాల, పులిగోరు ఆభరణాలు స్త్రీలు, ఆదపిల్లలు సాధారణంగా మెడలో ధరిస్తారు. అలాగే మెడకు భుజాలకు వెండి కడియాలు ధరిస్తారు. వివాహిత అయిన స్త్రీలు వెండి, రాగితో చేసిన కాళ్ళ కడియాలు ధరిస్తారు. బంగారు, వెండి లేక గ్లాసు చురీలు (గాజులు) కూడా ధరిస్తారు. అలాగే దంతంతో చేసిన బొటియాలను స్త్రీలు, ఆడపిల్లలు ధరిస్తారు. పురుషులు సాధారణంగా చేతి వేళ్ళకు ఉంగరాలు, మెడకు గొలుసులు ధరిస్తారు.

దుస్తులు

నిరాడంబరమైన, చౌకైన, పర్వతవాతావరణానికి అనువైన ఫుస్తులను ధరిస్తుంటారు. పురుషులు కుర్తా, ఫైజమా ధరిస్తుంటారు. అలాగే శీతాకాలంలో సద్రి (జాకెట్), టోపీ, మోకాలు పొడవున కోటు కూడా ధరిస్తుంటారు. ఫైజమా, బొత్తాములు కలిగిన కోటు ధరిస్తారు. స్త్రీలు సాధారణంగా చీరె, పూర్తి చేతుల రవికె లేక ఆంగ్రా ధరిస్తుంటారు. అలాగే శీతాకాలంలో స్వెట్టర్లు ధరిస్తుంటారు. గ్రామాలలో ఇప్పటికీ స్త్రీలు బిగుతుగా కుట్టబడిన పొడవు చేతుల జాకెట్, తల, భుజాలు కప్పుతూ ఆర్ని (మఫ్లర్) ధరిస్తుంటారు. చదువుకుంటున్న ఆడపిల్లలు సల్వార్ కమీజు, దుపట్టా ధరిస్తుంటారు. ఎత్తైన ప్రదేశాలలో నివసించే చారు సాధారణంగా ఉలెన్ దుస్తులు ధరిస్తుంటారు. సాధారణంగా పురుషులు ఫైజమా, షర్ట్, కోటు, టోపీ ధరిస్తుంటారు. స్త్రీలు బూడిదరంగు అంగ్రా, గాగ్రా, ఫంతు, ఉలెన్ షాల్ ధరిస్తారు. స్త్రీపురుషులు కూడా నడుం చుట్టూ కమర్‌బాండ్ అనే బెల్టును ధరిస్తారు.

వినోదం

పర్వతప్రాంతాలలో నివసిస్తున్న కారణంగా జిల్లావాసులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పోవడం శ్రమతోకూడుకున్నది. అయినప్పటికీ సంసృతి, జానపద సాహిత్యం, జానపద గీతాలు, జానపదనృత్యాలు జిల్లా గుర్తింపు చిహ్నాలుగా ఉన్నాయి. జిల్లాలో సీజనల్, సంప్రదాయం, మతసంబంధిత కార్యక్రమాలో తాండియా నృత్యం ప్రధానమైనది. బసంతపంచమి (వసంతపంచమి) రోజున తాండియా జానపద గీతాలతో సాగే తాండియా నృత్యంలో ప్రజలు అందరూ పాల్గొంటారు. వసంతకాలం వచ్చిందనడానికి గుర్తుగా ఈ మేళా నిర్వహిస్తారు. అలాగే మరొక ఉత్సవం దీపావళి, పంటకోతల తరువాత నిర్వహిస్తారు. ఉత్సవాలలో మహాభారతంలోని కొన్న సంఘటనలను కూడా ప్రదర్శిస్తారు. జీతు బగ్దవాల్, జగర్ లేక ఘరియాల్ వంటి జానపద నృత్యాలు కూడా ప్రదర్శిస్తారు. ఈ నృత్యాలు మతసంబంధిత కథలతో ముడిపడి ఉంటాయి. ఇందులో పాల్గొనే స్త్రీపురుషులు వర్ణరంజితమైనవి, సంప్రదాయకమైనవి అయిన వస్త్రాలను ధరిస్తారు. నృత్యకారులు రసింగాలు, డ్రంస్ శబ్ధానికి అనుగూంగా నర్తిస్తుంటారు. మరొక తరహా నృత్యంలో చంచారి గితాలకు అనుగుణంగా స్త్రీపురుషులు నృత్యం చేస్తారు.

జానపద గీతాలు ప్రత్యేకంగా సంప్రదాయబద్ఫ్హంగా ఉంటాయి. వీటిని సాధారణంగా స్త్రీలు మాత్రమే పాడుతుంటారు. అన్ని విధాలైన వాతావరణలో పొలాలలో రాత్రి వరకు పనిచేసే స్త్రీలు జానపద గితాలు పాడుతూ పనిపాటలు చేస్తుంటారు. చైత్రమాసంలో స్త్రీలంతా ఊరి మద్యలో చేరి పాడేపాటలలో వీర్యం, ప్రేమ, పర్వతప్రాంతాలలో వారు సాగిస్తున్న కష్టతరమైన జీవితాన్ని ప్రతిబింబించే గీతాలను ఆలపిస్తారు. జిల్లా సంతలు ఉత్సవాలు, సాంఘిక సమావేశాలు అందించే వినోదం అరియు ఉత్సాహం ప్రజలకు దైనందిక జీవితం నుండి వెసులుబాటు లభించడానికి అవకాశం లభిస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రజలు బహిరంగ ప్రదేశాలలో శివపురాణ సంబంధిత దృశ్యాలను ప్రదర్శిస్తుంటారు.

ఉత్సవాలు, పండుగలు

జిల్లాలోని ప్రజల జీవితాలలో మిగిలిన ప్రదేశాలకంటే పండుగలు ప్రధానపాత్ర వహిస్తాయి. సంవత్సరమంతా ఉత్సవాలు వేడుకలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో చాలా ప్రాముఖ్యత కలిగిన ఉత్సవాల సంగ్రహణ వివరణ కింద ఇవ్వబడుంది.

  • రామనవమి చైత్రమాసం 9 వరోజున చైత్రశుద్ధ నవమి తిథిలో శ్రీరాముని పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. రామభక్తులు ఆరోజంతా ఉపవాసవ్రతం ఆచరిస్తారు. నగరమంతా రామాయణ ప్రవచనం జరుగుతూ ఉంటుంది.
  • నాగపంచమి శ్రావణ శుద్ధ పంచమి నాడు నాగపంచమి రోజున నాగదేవత ఆరాధన ఘనంగా నిర్వహిస్తారు. ఫలకం మీద నాగుపాము బొమ్మను చిత్రించి పాలు, బియ్యం, పూలు సమర్పించి కుటుంబం అంతా ఆరాధిస్తారు.
  • రక్షా-బంధన్ : - శ్రావణమాసం చివరి రోజున రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ఆరోజు ఆడపిల్లలు తమ అన్నదమ్ముల క్షేమం కోరుతూ చేతికి రక్షగా రక్షాబంధన్ కడతారు. దీనిని సాధారణంగా రాఖీ అంటారు. అన్నదమ్ములు రక్షాబంధన్ కట్టిన సహోదరికి తమకు వీలైనంత కానుకలను ఇస్తుంటారు. నాగపంచమి సందర్భంలో నందప్రయాగ, కేదార్నాథ్‌లో ఉత్సవాలు జరుగుతుంటాయి.
  • జన్మాష్టమి - శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలో లాగా జిల్లాలో కూడా ప్రజలు రోజంతా ఉపవసిస్తారు. శ్రికృష్ణుని పుట్టినరోజును గుర్తుచేసుకుంటూ ప్రజలు తమ గృహాలలో, ఇతర ప్రదేశాలలో శ్రీకృష్ణుని కొరకు ఉయ్యాలలు కట్టి వాటిని విద్యుద్దీపాలతో అలకరించి అందులో కృష్ణుడిని ఉంచి ఆనందిస్తారు. ప్రజలు గుడికి వెళ్ళి భగవంతుడిని దర్శించిన తరువాత అర్ధరాత్రి తరువాత తమ ఉపవాస దీక్షని విరమిస్తారు. భక్తులు గృహాలు, ఆలయాలలో శ్రీకృష్ణుని కీర్తిస్తూ గితాలాపన చేయడం ప్రత్యేకత. పుట్టినరోజు తతువాత ఆరవరోజున భక్తులు మరొక ఉత్సవం జరుపుకుంటారు. ఈ పండుగను కేదార్నాథ్, నాగనాథ్, బద్రీనాథ్ లలో కోలాహలంగా జరుపుకుంటారు.
  • దశరా - ఆశ్వీజమాసం శుద్ధ దశమినాడు రాముడు రావణుని జయించిన రోజును స్మరించుకుంటూ ఈ పండుగ జరుపుకుంటారు. అమావాస్య తరువాత తొమ్మిది రోజులను నవరాత్రి అన్న పేరుతో దేవి ఉపాసన చేస్తారు. రామలీలా ఉత్సవాలు జిల్లాలోని పలు ప్రదేశాలలో జరుపుకుంటారు. ప్రత్యేకంగా కాళీమఠ్‌లో ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు.
  • దీపావళి - ఆశ్వీజ బహుళ చతుర్ధశి నాడు నరకచతుర్ధశి ఆచరించి మరునాడు కార్తీక అమావాస్య నాడు దానవుడైన నరకుని వధను కొనియాడుతూ దిపావళి పండుగను నిర్వహిస్తారు. ఈ పండుగ నాడు గృహాలను దీపాల వరుసలతో అలంకరించి ప్రత్యేకంగా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఈ పండుగకు రెండు రోజుల నుండి ఆరంభం ఔతుంది. వ్యాపారులకు దీపావళితో సంవత్సరం పూర్తి ఔతుంది కనుక తరువాతి సంవత్సర సమృద్ధి కొరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. దీపావళినాడు జిల్లాకే ప్రత్యేకమైన మేళానృత్యం అనే జనపదనృత్యం ప్రదర్శిస్తుంటారు.
  • మకర సంక్రాంతి - ఇది నదీ స్నానాలకు ప్రతీతి. సూర్యసంక్రమణ రోజున నదీ స్నానం ఆచరంచడం ప్రత్యేకత కనుక జనవరి 13-14న భక్తులు అలకనందా నదిలో విశేషంగా స్నానం ఆచరిస్తారు.

కర్ణప్రయాగ, నందప్రయాగ వద్ద విశేషంగా ఉత్సవసంబరాలు నిర్వహించబడుతుంటాయి.

  • శివరాత్రి - మాగమాసం చివరి రోజున త్రయోదశి అర్ధరాత్రి సమయంలో ఈ పండుగను మహాశివుడు జ్యోతిరూపంలో ఆవిర్భవించిన పుణ్య కాలాన్ని శివరాత్రిగా జరుపుకుంటారు. ప్రజలు శివరాత్రి రోజాంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం ఉండి శివుని ఆరాధిస్తారు. శివుని ఆలయాలు ప్రత్యేకంగా అలంకరించి విద్యుద్దీప తోరణాలతో అలంకరిస్తారు. భక్తులు పెద్దసంఖ్యలో శివుని దర్శించి పాలు, మారేడుపత్రి, పూలు సమర్పిస్తారు. తరువాత భక్తితో శివుని కీర్తిస్తూ గీతాలాపన చేస్తుంటారు. ఈ సందర్భంగా దేవల్, బైరకుండ్, గోపేశ్వర్, నాగనాథ్ వంటి శివాలయాలలో గొప్పగా ఉత్సవాలు నిర్వహిస్తారు.
  • హోళి - ఇది వసంతోత్సవంగా జరుపుకుంటారు. దీనిని ఫాల్గుణ పౌర్ణమి నాడు ఆచరిస్తారు. ప్రజలు ఫాల్గుణ మాస గితాలు రాత్రివేళ ఆలపిస్తారు. జాల్గుణ ఏకాదశి రోజున ఊరి మద్యలో ఒక జండాను పాతి పౌర్ణమినాడు వాటిని భస్మం చేసి ఆభస్మాన్ని బంధు మిత్రులతో నుదుట ధరిస్తారు. మరుసటి రోజున సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలలో ప్రజలు మద్యాహ్నవేళ ఒకరిమీద ఒకరు రంగులు రంగు నీళ్ళు జరుపుకుంటారు. తరువాత సాయంకాలాలలో బంధుమిత్రులను కలుసుకుంటుంటారు.
  • ఉత్సవాలు : ప్రతి సంవత్సరం ఏప్రిల్ 13న బిష్వత్ సంక్రాంతి ఉత్సవం నిర్వహించబడుతూ ఉంది. ఏప్రిల్ 14న మింగ్ ప్రాంతంలో, అసర్ ప్రాంతంలో ఏప్రిల్ 15న, హంస్ కోటిలో ఏప్రిల్ 16న, కుల్సారి, అబ్దారిలో ఏప్రిల్ 17న ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది. జిల్లాలో నిర్వహించబడే ఇతర ఉత్సవాలలో గౌచర్‌లో (కర్నప్రయాగ) నిర్వహించబడుతున్న గౌచర్ మేళా ఒకటి. ప్రతి సంవత్సరం నవంబరు మాసంలో నిర్వహించబడే ఈ ఉత్సవానికి అనేకమంది భక్తులు వస్తుంటారు. ఇతర ఉత్సవాలలో నౌతా (అబ్దారి), నౌమీన్ (హరియాలి), నందాదేవి (బెధీ), దత్తాత్రేయ పూరన్మసీ (అంసుయా ఆలయం), నాగ్నాథ్ (దేవర్ వల్లా) ప్రధానమైనవి.

నందాదేవి రాజ్ జత్

బృహత్తరమైన నందాదేవి రాజ్ జత్ చమోలీకి ప్రత్యేకతను సంతరించి పెడుతుంది. 9 వశతాబ్దం షాలీపాల్ కాలంలో ఆరంభమైన పురాతనౌత్సవాలలో ఇది ఒకటి. విశ్వసనీయమైన చారిత్రక ఆధారాలు లేకున్నా ప్రజలలో ప్రచారంలో ఉన్న కథనాలు, జానపద గేయాలు (జగోరీ) ఆధారంగా చాంద్‌పుర్ గర్హి రాజధానిగా చేసుకున్న షాహిపాల్ నౌటీ సమీపంలో నందా దేవి (రాజరాజేశ్వరి) యంత్రాన్ని భూమిలో స్థాపించాడు. నౌటీలో నివసిస్తున్న రాజపురోహితుడు దేవి ఆరాధనా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

రాజా షాహీపాల్ 12 సంవత్సరాలకు ఒకసారి నందాదేవిని నందాగంగ్తి శిఖరంలో ఉన్న అత్తవారింటికి తీసుకు పోవడం అనే ఉత్సవం నిర్వహించడం అనే సంప్రదాయాన్ని ఆరంభించాడు. రాజ్ జాత్ నిర్వహణాధికారాన్ని పొందిన రాజా చిన్న తమ్ముడైన అజయపాల్ కుంవర్‌ రాజధానిని రాజధానిని తరలించి కంసువా వద్ద స్థిరపడ్డాడు. కుంవర్ దేవీ ఆశీర్వాదాలు పొందడానికి వచ్చి జాతరను విర్వహిస్తాడు. హోమం నిర్వహించడానికి ఆగస్టు/సెప్టెంబరుమాసాలలో నందాసతమి దినాన్ని నిర్ణయిస్తారు. ప్రత్యేక ఆరాధనకు కుల్సరి కొరకు పౌర్ణమి రోజును నిర్ణయిస్తారు. కుంవర్ 4 కొమ్ముల గొర్రెతో రింగల్-చత్రంతో వచ్చి చేరుకోగానే రాజ్ జాత్ మొదలౌతుంది. రాజ్ జాత్ 19 రోజులపాటు 19 మజిలీలు చేస్తూ 280 చదరపు కి.మీ ప్రదేశానికి చేరుకుంటుంది. బయలుదేరే ముందుగా భూమియల్, ఉఫ్రాని, అర్చనా దేవీలను పూజిస్తారు. బంగారంతో చేయబడిన నందాదేవిని వెండి పల్లకీలో తీసుకురాబడుతుంది. ఈ ఉత్సవాలలో వేలాది భక్తులు పాల్గొంటారు. ఈ గొప్ప ఉత్సవం సాగిపోతున్న సమయంలో అనేకమంది భక్తులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలలో పాల్గొని తమ భక్తిని తెలియజేస్తారు. ఊరేగింపు ముందుకు సాగుతూ ఉంటే అనేక మంది సమీపం నుండి దూరప్రాంతాల నుండి తమతమ స్వంత పల్లకీలలో అమ్మవారి విగ్రహాలను ఉంచి చత్రాలను చేరబట్టి ఊరేగింపులో కలుకోవడంతో ఊరేగింపు అంతకంతకు పెద్దదౌతూ ఉంటుంది. అల్మోరా, కుమోన్ వద్ద కురద్ నుండి ఘాట్ వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబడతాయి. దాదాపు ఊరేగింపు హోమకుండ్ చేరే సాయానికి 300 నందాదేవి విగ్రహాలు, అలంకృత చత్రాలు చేరుకుంటాయి. ఈ ఉత్సవాలలో పామరభక్తుల భాగస్వామ్యం, వారు కనబరిచే భక్తి ఎనలేనివని చెప్పచ్చు. కఠినమైన మార్గంలో అలసటకలిగించే ఈ ఉత్సవ ప్రయాణం సముద్రమట్టానికి నౌటీ సమీపంలోని జురియా గలి వద్ద 900 మీటర్లతో మొదలై 5335 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. మంచు, పర్వత శిలలు నిండిన దట్టమైన అడవుల మద్య ఈ యాత్ర సాగుతుంది. షలి సముద్రా వద్ద తెల్లవారు ఝామున మూడు కాంతి కిరణాలు, కొంత పొగ చూడంతో ఈ యాత్రముగింపుకు వస్తుంది. ఆశ్చర్యకరంగా 4కొమ్ముల గొర్రె నౌటీ వద్ద దేవికి భక్తులు అందించిన కానుకలతో నందా గంగ్తి వద్ద ఉన్న హోమకుండ్ చేరుకుంటుంది. రాత్రంతా నౌటీ చత్రం సమీపంలో దేవి పక్కన ఉండే గొర్రె మానవులలా ఉద్రేకపూరుతంగా కంటినిండా నీరునింపుకుని దేవికి భక్తులు సమర్పించిన కానుకలతో మెల్లిగా కొండ ఎక్కి ముందుకు సాగుతుంది. వ్యాన్ గ్రామంలో ప్రతి ఇల్లూ జాత్ రోజు భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా తెరచి ఉంచబడి ఉంటుంది. గ్రామవాసులు అది నందాదేవి ఆదేశమని భక్తిపూర్వకంగా భావిస్తారు. 2000 సంవత్సరంలో చివరిసారిగా నందాదేవి రాజ్ జాత్ నిర్వహించబడింది. ప్రతిసంవత్సరం ఆగస్టు/సెప్టెంబరు మసంలో కురుద్ నుండి ఘాట్ వరకూ చిన్నతరహా జాతర జరుగుతూ ఉంటుంది.

పర్యాటకం

చమోలీ కొండప్రాంతాలకు, ప్రకృతి సౌందర్యానికి, మతపరమైన కేంద్రాలకు అంతర్జాతీయ ఖ్యాతిగాంచింది.ఈ జిల్లాలో పవిత్ర యాత్రలకు, పర్వతారోహణ వంటి సాహస యాత్రలకు చాలా అవకాశాలు ఉన్నాయి. చమోలీలోబద్రీనాథ్, కేదార్నాథ్, జోషీమఠ్ వంటి ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ప్రజలు ఇక్కడకు అత్యధికంగా మతవిశ్వాసంతో వస్తుంటారు. అంతేకాక దేవరియా తాల్, వేదిని బగ్యాల్, ఔలి బగ్యాల్, గుర్సన్ బగ్యాల్, రూప్‌కుండ్ ప్రాంతాలకు సాహసయాత్రీకులు పర్వతారోహణ కొరకు వస్తుంటారు. చోప్టా, చమీలీ, గ్వాడం మొదలైనవి ప్రకృతి ఆరాధకుల గమ్యస్థానంగా ఉంది.

ఇక్కడ సమీప ప్రదేశాల వివరాలు ఉన్నాయి.

ప్రదేశం పేరు సముద్రమట్టానికి ఎత్తు మీటర్లలో సమీప పట్టణం పర్వతారోహణ మార్గం వర్గం
బధ్రీనాథ్ 3100 బద్రీనాథ్ రహదారితో అనుసంధానం యాత్రాస్థలం
కేదార్నాథ్ 3528 గౌరీకుండ్ 14 కి.మీ యాత్రాస్థలం
తుంగనాథ్ 3650 ఉఖిమత్ 22 కి.మీ యాత్రాస్థలం
హేమకుంట్ సాహెబ్ 4329 గోవింద్ ఘాట్ 21 కి.మీ యాత్రాస్థలం
వేదినీ బుగ్యాల్ 4200 బాన్ (గ్రామం) 15 కి.మీ సాహసయాత్ర, యాత్రాస్థలం
రూప్‌కుండ్ 5020 కర్ణప్రయాగ 61 చ.కి.మీ సాహసయాత్ర
పుష్పాల లోయ 3000 మీ నుండి 4500 మీ గోవింద్ ఘాట్ 19 కి.మీ సుందరమైన పర్వతారోహణా ప్రదేశం
ఔలీ బుగ్యాల్ 3300 మీ నుండి 4500 మీ జోషి మఠ్ 5 కి.మీ పర్వతారోహణ, శీతాకాల దృశ్యాలు
గ్వాల్డం 1829 గ్వాల్డం రహదారితో అనుసంధానం కొండ ప్రాంతం

ఇవి కూడ చూడండి

మూలాలు

  1. "Collectorate | Chamoli District Website | India". Retrieved 29 July 2022.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 9 October 2019.
  3. "Garhwali". Ethnologue. Retrieved 24 February 2021.
  4. "Chamoli district at a glance" (PDF).
  5. 5.0 5.1 "District Census Handbook: Chamoli" (PDF). censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 13 June 2007. Retrieved 1 October 2011. Maldives 394,999 July 2011 est.
  7. "Table C-16 Population by Mother Tongue: Uttarakhand". www.censusindia.gov.in. Registrar General and Census Commissioner of India.
  8. "India – Languages". Ethnologue (22nd ed.). SIL International. 2019.

వెలుపలి లింకులు

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!