చమోలి గోపేశ్వర్,ఉత్తరాఖండ్, గఢ్వాల్ హిల్స్‌లో చమోలి జిల్లా లోని పట్తణం. చమోలి జిల్లా ముఖ్యపట్టణం. సముద్ర మట్టం నుండి 1,550 మీ. ఎత్తున ఉంది. ఇది ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. డిసెంబరు, జనవరిల్లో మాత్రం చాలా చల్లగా ఉంటుంది. ఈ పట్తణం "గోపీనాథ్" దేవాలయానికి ప్రసిద్ధి చెందింది. చమోలీ గోపేశ్వర్‌లో వైతరణి అనే చాలా అందమైన సరస్సు ఉంది.
చమోలి గోపేశ్వర్‌లోని ప్రసిద్ధ ప్రదేశాలు పండిత దీనదయాళ్ పార్కు, అనేక చెరువులు, గోపీనాథాలయం, టెలిఫోన్ టవర్ హౌస్. జిల్లా లోని ఏకైక టిబి హాస్పిటల్ గోపేశ్వర్‌లో ఉంది. పోలీస్ గ్రౌండ్ లోని కొంత భాగంలో క్రీడల స్టేడియం ఉంది. పట్టణం లోని ప్రధాన కాలనీలు పిడబ్యు కాలనీ, జల్ నిగమ్, వైర్‌లెస్ కాలనీ, పోలీస్ కాలనీ, కుండ్ కాలనీ, పోస్ట్ ఆఫీస్, బసంత్ బీహార్, సరస్వతి బీహార్, సుభాష్ నగర్, హల్దపాని, నెగ్వార్, మందిర్ కాలనీ, టీచర్ కాలనీ, హాస్పిటల్ కాలనీ, పాలిటెక్నిక్ కాలనీ.
భౌగోళిక శాస్త్రం
గోపేశ్వర్ 30°25′N79°20′E / 30.42°N 79.33°E / 30.42; 79.33 వద్ద సముద్రమట్టం నుండి సగటున 1550 మీ. ఎత్తున ఉంది. [1] గోపేశ్వర్, చమోలి నుండి 8.4 కి.మీ. దూరాన అలకనంద నది ఒడ్డున, NH 58 వెంబడి ఉంది. గోపేశ్వర్ తన ఆధ్యాత్మిక ఆకర్షణ, సహజమైన అందంతో సందర్శకులను ఆకర్షిస్తుంది. గోపేశ్వర్ నుండి మంచుతో కప్పబడిన కొండలు, శిఖరాలూ కనిపిస్తాయి.
వాతావరణం
కొప్పెన్-గీగర్ వ్యవస్థ ప్రకారం గోపేశ్వర్, తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణానికి (Cwa) చెందుతుంది.
జనాభా వివరాలు
2011 జనగణన ప్రకారం [2] చమోలి గోపేశ్వర్ జనాభా 21,447. మొత్తం గృహాల సంఖ్య 5513.[3] జనాభాలో పురుషులు 56%, స్త్రీలు 44%. పట్టణ సగటు అక్షరాస్యత 81%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ; పురుషుల అక్షరాస్యత 85%, స్త్రీల అక్షరాస్యత 75%. జనాభాలో 10% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు.
రవాణా
వివిధ ప్రదేశాల నుండి గోపేశ్వర్‌కు అని కాలాల్లోనూ అందుబాటులో ఉండే రోడ్లు ఉన్నాయి. సమీప విమానాశ్రయం డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ గోపేశ్వర్ నుండి 227 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప రైల్వే స్టేషన్ రిషికేశ్. ఇది 210 కిలోమీటర్ల దూరంలో ఉంది.[4]
ఆసక్తికరమైన ప్రదేశాలు
గోపేశ్వర్ చుట్టూ నాలుగు ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి: తుంగనాథ్, అనుసూయా దేవి ఆలయం, రుద్రనాథ్, బద్రీనాథ్. కేదార్‌నాథ్ కూడా సమీపంలోనే ఉంది. గోపీనాథ్ మందిర్ అనే ప్రసిద్ధ శివాలయం అక్కడ ఉంది. వైతరణి అనే ఒక చెరువు కూడా ఇక్కడ ఉంది. ఎకో పార్క్, దీన్ దయాళ్ పార్క్, శ్రీ చక్రధర్ తివారీ పార్క్ వంటి అనేక పార్కులు ఉన్నాయి.