ఘాజీ |
---|
ఘాజీ |
దర్శకత్వం | సంకల్ప్ రెడ్డి |
---|
రచన | సంకల్ప్ రెడ్డి |
---|
నిర్మాత | పెరల్ వి.పొట్లూరి, పరం వి.పొట్లూరి, కవిన్ అన్నె, అన్వేష్ రెడ్డి నిరంజన్ రెడ్డి జగన్‌మోహన్ వంచ, వెంకటరమణారెడ్డి |
---|
తారాగణం | దగ్గుబాటి రానా, తాప్సీ, కె.కె.మీనన్, రాహుల్ సింగ్, ఓంపురి, అతుల్ కులకర్ణి, నాజర్, రాహుల్ సింగ్, సత్యదేవ్, రవివర్మ |
---|
ఛాయాగ్రహణం | ఆర్. మధి |
---|
కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
---|
సంగీతం | కె |
---|
నిర్మాణ సంస్థలు | |
---|
విడుదల తేదీ | 17 ఫిబ్రవరి 2017 (2017-02-17) |
---|
సినిమా నిడివి | 123 నిమిషాలు |
---|
దేశం | భారతదేశం |
---|
భాష | తెలుగు |
---|
బడ్జెట్ | ₹16 crore (US$2.0 million) |
---|
బాక్సాఫీసు | ₹34.5 crore (US$4.3 million) |
---|
ఘాజీ 2017, ఫిబ్రవరి 17న విడుదలైన తెలుగు సినిమా. దీనిని తెలుగుతో బాటు హిందీ, తమిళంలో కూడా విడుదల చేశారు. జలాంతర్గామి నేపథ్యంలో తెరకెక్కిన మొట్టమొదటి భారతీయ చిత్రం ఇది. అలాగే ఇంతవరకూ భూమ్మీద, సముద్రం మీద, గాల్లో జరిగే యుద్ధాలతోనే దేశంలో సినిమాలు వచ్చాయి. సముద్రం లోపల జరిగే పోరాటంతో ఇలా తొలిసారిగా వచ్చిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాకు 65వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమా పురస్కారం లభించింది.[1]
నటీనటులు
సాంకేతికవర్గం
- కథ, దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి
- సంభాషణలు: గుణ్ణం గంగరాజు
- సంగీతం : కె
- కెమెరా : మాధి
- ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
- నిర్మాతలు : పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నె, అన్వేష్ రెడ్డి, జగన్‌మోహన్ వంచ, వెంకటరమణారెడ్డి
కథ
1971లో తూర్పు పాకిస్తాన్ (తర్వాత బంగ్లాదేశ్)లో పశ్చిమ పాకిస్తాన్ సాగిస్తున్న దమనకాండ నేపథ్యంలో భారత నేవీ తన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకని విశాఖపట్నం తూర్పు నావల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్‌కి బదిలీ చేయడం పాకిస్తాన్‌కి ఆందోళన కల్గిస్తుంది. సముద్రతీరంలో తూర్పు పాకిస్తాన్‌కి చేరువలో ఐఎన్ఎస్ విక్రాంత్ వుండడం ప్రమాదమని, దాన్ని నాశనం చేయడానికి తన జలాంతర్గామి (సబ్ మెరైన్) పిఎన్ఎస్ ఘాజీని పంపడానికి పథకం వేస్తుంది. తూర్పు పాకిస్తాన్ లోని చిట్టగాంగ్‌కి పంపిన ఒక రహస్య సందేశాన్ని టాప్ చేయడం ద్వారా ఈ పాక్ పథకం తూర్పు నావల్ కమాండర్- ఇన్- చీఫ్ (ఓంపురి)కి తెలుస్తుంది. ఆయన వెంటనే ఐఎన్ఎస్ రాజ్‌పుత్ జలాంతర్గామిని రంగంలోకి దింపుతాడు. భారత సముద్ర జలాల్లోకి ఘాజీ వస్తోందా లేదా నిఘావేసి తెలియజేయాల్సిందిగా కెప్టెన్ రణ్‌విజయ్ సింగ్ (కెకె మీనన్)ని ఆదేశిస్తాడు. రణ్‌విజయ్ సింగ్‌ది ఉడుకు రక్తం. చూసి తెలియజేయడమెందుకు, చూసి పేల్చేస్తామంటాడు. అది యుద్ధానికి దారి తీస్తుందని, కేవలం చెప్పినట్టు చేయమని హెచ్చరిస్తాడు ఛీప్. రణ్‌విజయ్ సింగ్‌ని కంట్రోలులో వుంచాల్సిందిగా లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మ (రానా దగ్గుబాటి)ని కోరతాడు. వీళ్లిద్దరితో బాటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవరాజ్ (అతుల్ కులకర్ణి) బయల్దేరతాడు.
సముద్ర అంతర్భాగంలో రహస్యప్రయాణం మొదలెడుతుంది రాజ్‌పుత్; అట్నుంచి ఘాజీ సముద్రం లోపల్నుంచి గుట్టుగా వస్తూంటుంది. అప్పుడు ఈ రెండిటి మధ్య యుద్ధం ఎలా జరిగింది?, ఈ యుద్ధంలో బద్ధ వ్యతిరేకులైన కెప్టెన్ రణ్‌విజయ్ సింగ్, లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్‌వర్మల మధ్య ఏం ఘర్షణ జరిగింది?, వీళ్ళిద్దరి మధ్య ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవరాజ్ ఎలా నలిగాడు?, డ్యూటీ విషయంలో అదుపుతప్పే రణ్‌విజయ్ ఆవేశాన్ని అర్జున్ ఎలా కంట్రోలు చేశాడు?, మధ్యలో ఘాజీ ఒక మర్చంట్ నౌకని పేల్చేస్తే అందులోంచి అర్జున్ రక్షించిన ఆ యువతి, బాలిక ఎవరు?; చివరికి ఘాజీ మీద ఇండియన్ బృందం ఎలా విజయం సాధించింది?.. ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడవలసిందే.[2]
నిర్మాణం
అభివృద్ధి
ఈ సినిమాను పి.వి.పి సినిమా నిర్మించింది.[3][4] కరణ్ జోహార్ హిందీ సినిమా వెర్షన్‌ను పంపిణీ చేశాడు.[5] ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు కె. కృష్ణ కుమార్ సంగీతాన్ని అందించాడు. విజ్యువల్ ఎఫెక్ట్స్‌ను ఎవా మోషన్ స్టూడియోస్ చేపట్టింది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక
ఈ సినిమాకు రానా దగ్గుబాటి,[6] తాప్సీ[7][8]లను ప్రధాన పాత్రలకు ఎంపిక చేశారు. వీరితో పాటుగా కె.కె.మీనన్,[9]సత్యదేవ్ కంచరన,[10] అతుల్ కులకర్ణి,రామానుజ్ దుబే, కునాల్ కౌశిక్, ప్రియదర్శి పుల్లికొండ, రాహుల్ సింగ్, అక్షయ్ మిట్టల్, మాల్యబన్ లాహిరి, నరేన్ యాదవ్‌లను నటవర్గంలో ఎంపిక చేసుకున్నారు.[11] మిర్చి, శ్రీమంతుడు సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన ఆర్.మాధిని ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా నియమించారు. సంగీతాన్ని కె, ఎడిటింగ్‌ను శ్రీకర్ ప్రసాద్, విజ్యువల్ ఎఫెక్ట్స్‌ను వాసుదేవ ఆర్.ఏనుగలకు అప్పగించారు.[12]
చిత్రీకరణ
ఈ సినిమా చిత్రీకరణ 2016, జనవరి 3న ప్రారంభమయ్యింది.[13][14]
పురస్కారాలు
65వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమాగా ఈ చిత్రం ఎన్నికైంది.[1] ఈ అవార్డు క్రింద నిర్మాతలకు రజత కమలం, లక్షరూపాయల నగదు బహుమతి, సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ ప్రదానం చేశారు.
మూలాలు
బయటిలింకులు