సూరి భగవంతం |
---|
|
జననం | అక్టోబరు 14, 1909 అగిరిపల్లి, కృష్ణా జిల్లా |
---|
మరణం | 1989 ఫిబ్రవరి 6(1989-02-06) (వయసు 79)
|
---|
పౌరసత్వం | భారతీయుడు |
---|
జాతీయత | Indian |
---|
రంగములు | భౌతిక శాస్త్రము |
---|
చదువుకున్న సంస్థలు | మద్రాసు విశ్వవిద్యాలయం |
---|
ప్రసిద్ధి | దేశ రక్షణ పరిశోధనలు |
---|
ప్రభావితం చేసినవారు | సి.వి.రామన్[1] |
---|
సూరి భగవంతం (అక్టోబరు 14, 1909 - ఫిబ్రవరి 6, 1989) (వయసు 79) ప్రముఖ శాస్త్రవేత్త. దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనల్లో ఆద్యుడు.
బాల్యం-విద్యాభ్యాసం
ఈయన కృష్ణా జిల్లా ఆగిరిపల్లి గ్రామంలో అక్టోబరు 14, 1909 న జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం హైదరాబాదు నిజాం కళాశాలలో డిగ్రీ (బి.ఎస్సీ) చదువు పూర్తిచేసి, మద్రాసు యూనివర్సిటీ నుండి బి.ఎస్.సి (భౌతిక శాస్త్రము) డిగ్రీని ప్రథమ శ్రేణిలో ప్రథముడుగా అందుకున్నాడు. ఈ సందర్భంగా అనేక పతకాలను అందుకున్న విద్యార్థిగా కలకత్తాలో సర్ సి.వి.రామన్ దగ్గర రీసెర్చ్ స్కాలర్ గా చేరాడు. ఈయన తన మేథో సంపత్తితో, శాస్త్రీయ దృక్పథంతో, ఆలోచనా సరళితో, ప్రయోగ శీలతతో సి.వి.రామన్ అభిమానాన్ని చూరగొని ప్రియ శిష్యుడయ్యాడు. అక్కడే మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్సీ. పట్టాను సంపాదించాడు.
ఉద్యోగం
ఈయన 1932లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర విభాగంలో అధ్యాపకుడుగా చేరాడు. 1938లో ప్రొఫెసర్ గా పదోన్నతి పొందాడు. బోధనా విధానంలో వీరిది చాలా సులభశైలి. స్పష్టమైన వ్యక్తీకరణ, విశేషమైన ఆలోచన, కచ్చితమైన అనువర్తన, సమగ్రమైన దృష్టి, అద్భుతమైన ప్రతిభ లన్నీ కలగలిపి వీరి బోధనా విధానాన్ని ఇతర శాఖల అధ్యాపకులు కూడా నేర్చుకునేవారని చెబుతారు. తన 28 వ యేటనే యింతటి ఉన్నత పదవిని అదిష్టించటం విశేషం. దీనికి కొద్ది కాలం ముందే యూనివర్సిటీ ఈయనకు డి.ఎన్‌సి (Honoris Causa) డిగ్రీ ప్రదానం చేసింది. ఈయన 1948 వరకు ఈ పదవిలోనే ఉన్నారు.
వీరు 1941లో కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో తన పరిపాలనా కౌశలం చూపి కళాశాలను విజయవంతంగా నడిపారు. 1948-49 మధ్య లండన్ లోని భారత రాయబారి వి.కె. కృష్ణ మీనన్ కార్యాలయంలో వైజ్ఞానిక సలహాదారుగా పనిచేశారు. వీరు చాలా ఐరోపా దేశాల్లో పర్యటించి వివిధ విజ్ఞాన విషయాల మీద ప్రసంగాలు చేశారు.
1949లో స్వదేశం తిరిగివచ్చి హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భౌతిక శాఖాధిపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. వీరి కాలంలో పరిశోధన వైపు దృష్టి కేంద్రికరించి 12 మంది డాక్టరేట్ లను తయారుచేశారు. తరువాత 1952లో విశ్వవిద్యాలయ ఉప కులపతిగా పదవిని చేపట్టారు.
వీరు 1957లో బెంగళూరు లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు.[2] ఇక్కడ పనిచేస్తుండగా కృష్ణ మీనన్ వత్తిడి మీద 1961లో రక్షణ శాఖ పరిశోధనా సంస్థకు అధిపతిగాను, తనకు వైజ్ఞానిక సలహాదారుగా చేరారు.
1962 చైనా-భారత్ యుద్ధం తర్వాత వై. బి. చవాన్ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ఇతడు డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డి.ఆర్.డి.ఒ.) అధిపతిగా చేరి ఎంతో ప్రగతి సాధించారు. భారతదేశమంతా ఇరవైకి పైగా ప్రయోగశాలలను ప్రారంభించి యుద్ధ రంగానికి అవసరమైన క్షిపణులు, విమానాలు, ట్యాంకులు, రాడార్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైన అనేక విషయాలలో విజయం సాధించారు. 1969లో పదవీ విరమణ చేశారు.
వీరు 300 పైగా పరిశోధన వ్యాసాలు ప్రచురించారు. ఇవి కాక గ్రూపు థియరీ, రామన్ ఎఫెక్ట్, క్రిస్టల్ సిమెట్రీ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనే మూడు గ్రంథాలు రచించారు.
దేశ రక్షణ శాఖలో అద్వితీయ సేవలు
1961 జూలైలో కేంద్ర ప్రభుత్వ సర్వీస్ లో ప్రవేశించిన ప్రొఫెసర్ భగవంతం రక్షణ మంత్రికి సైంటిఫిక్ అడ్వయిజర్ గా నియమితులైనప్పటికీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డి.ఆర్.డి.ఓ) కు డైరక్టర్ జనరల్ గా కూడా వ్యవహరించారు. భూతలం మీద, సముద్ర జలాలమీద, గాలిలో దేశ పోరాట శక్తులను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బలోపేతం చేయటానికి డి.ఆర్.డి.ఓని ఒక సమర్థవంతమైన పనిముట్టుగా రూపొందించారు. శక్తివంతమైన అయుధంగా మలిచారు.
డి.ఆర్.డి.ఓకు నేతృత్వం వహించిన 9 సంవత్సరాల వ్యవధిలో మిస్సైల్స్, ఎయిర్ క్రాప్ట్స్, ఏరో ఇంజన్స్, కొంబాట్ వెహికల్స్ (ట్యాంకులు మొదలైనవి) ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్స్, హై ఎక్స్‌ప్లోజివ్స్, అండర్ వాటర్ వెపన్స్ మొదలగు వాటిని అభివృద్ధి చేయటానికి ల్యాబరేటరీలను స్థాపించారు. ఆధునిక యుద్ధ తంత్ర సాంకేతిక నైపుణ్య రంగంలో ఉన్న ఉద్యోగులకు శిక్షణ ఇప్పించారు. వారికి అవసరమైన సౌకర్యాలను కల్పించారు.
విశాఖ పట్టణం నుంచి లేహ్, తేజ్‌పూర్ ల వరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ల్యాబరేటరీల శ్రేణిని నెలకొల్పారు. డి.ఆర్.డి.ఓను పటిష్ఠ పరచడంలో ఈయన చేసిన కృషికి తార్కాణంగా తమవంటి సమర్థులను రూపొందించడమే. ఈయన స్థానంలో డాక్టర్ వి.ఎస్.అరుణాచలం ప్రవేశించిన తర్వాత ఆయన పదవీకాలం లోనే ఆర్గనైజేషన్ బ్రహ్మాండమైన ఎదుగుదలను సాధించింది. అనేకానేక ల్యాబరేటరిలను, సుశిక్షితులను రూపొందించారు. రక్షణ శాఖ పరిశోధనలలో అనేక మంది శాస్త్రవేత్తలకు ప్రవేశం కల్పించి, వారి మేధస్సుకు పదును పెట్టారు.
రక్షణ శాఖ శాస్త్ర సలహాదారుగా
దేశ రక్షణ శాఖకు అద్వితీయమైన సేవలు అందిస్తూనే మరోపక్క అవాంఛనీయ పోకడలను గమనిస్తూనే ఉన్నారు. ఒకసారి నోబెల్ బహుమతి గ్రహీత, భారత మిత్రుడు ప్రొఫెసర్ పి.ఎం.ఎస్.బ్లాకెట్ ప్రధాని నెహ్రూకు ఒక సలహా యిచ్చారు. దేశ రక్షణ శాఖ అభివృద్ధి చెందడానికి దేశీయ ఉత్పత్తుల రూపకల్పనను మినహాయించి ప్రత్యామ్నాయంగా దిగుమతులు చేసుకోవలసినదిగానూ, రాడార్స్, మిస్సైల్స్, యుద్ధ ట్యాంకుల కోసం దిగుమతుల మీద ఆధారపడటం ఉత్తమమని సలహా యిచ్చారు. ఈ సలహాను పూర్తిగా నిర్లక్ష్య పరిచేలా చేసిన ప్రొఫెసర్ భగవంతం మన దేశం సర్వదా కృతజ్ఞతగా ఉండాలి. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు శాస్త్ర సలహాదారునిగా విశేష కృషి చేసి, జాతీయ భావాలకు పరిపుష్టి కల్పించి అఖండ పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
రామన్ ఫలితం పై అధ్యయనం
భౌతిక శాస్త్ర రంగంలో మూడు ప్రామాణిక గ్రంథాలను, అనేక పరిశోధనా పత్రాలను వెలువరించారు. రామన్ ఎఫెక్ట్ అంశం మీద వివిధ కోణాలలో అధ్యయనం చేశారు. పునః పరిశోధనలు జరిపారు. "మాలిక్యులర్ లాటిస్ వైబ్రేషన్" అంశం మీద గ్రూప్ థియరిటికల్ అప్లికేషన్స్, వాయువుల గూర్చి రామన్ ఎఫెక్ట్ కు సంబంధించిన పరిశోధనలు మీద సునిశిత కృషి జరిపారు. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లలో ఫెలోషిప్ మీద పరిశోధనలు నిర్వహించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోషియేషన్ వారి భౌతిక శాస్త్ర విభాగానికి అధ్యక్షులుగా (1946) వ్యవహరించారు.
శాస్త్ర రచనలు
1961 లో క్రిస్టల్ సిమెట్రీ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనే బృహత్తర గ్రంథ రచన చేసి అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. కమిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద డెవలపింగ్ కంట్రీస్ అధ్యక్షులుగా సి.వి.రామన్ పరిశోధించిన రామన్ ఎఫెక్టు అంశం మీద ప్రామాణిక పరిశోధనలు చేసిన అద్వితీయ శాస్త్రవేత్తగా కీర్తి గడించారు. రామన్ ఎఫెక్ట్, క్రిష్టల్ స్ట్రక్చర్ మొదలగు అంశాల మీద అవిశ్రాంత పరిశోధనలు జరిపి గ్రంథరచనలు చేశారు.
ఈయన 300 పైగా పరిశోధనా పత్రాలను వెలువరించారు. పైన తెలిపిన గ్రంథమే కాక గ్రూప్ థీరీ, రామన్ ఎఫెక్టు అనే రెండు ఉత్తమ గ్రంథాలను కూడా చేశారు. ఈ మూడు గ్రంథములు ప్రామాణిక గ్రంథాలుగా అంతర్జాతీయ ఖ్యాతిని పొంది, అనేక భాషలలోకి అనువదించటం జరిగింది. జాతీయ అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక సైంటిఫిక్, ప్రొఫెషనల్ సంస్థలు అనేకంలో ఈయన అలెక్టెడ్ ఫెలోగా ఉన్నారు. పలు యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి.
చివరి రోజులు
సి.వి.రామన్ అనుంగు శిష్యునిగా, దేశ రక్షణ శాఖను బలోపేతం చేసిన దేశభక్తునిగా పేరొందిన ప్రొఫెసర్ భగవంతం తన 80 వ యేట 1989, ఫిబ్రవరి 6 వ తేదీన మరణించారు. ఆయన శత జన్మదిన వేడుకలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2009 లో జరిగాయి.[3]
ఈయన కుమారుడు సూరి బాలకృష్ణ కూడా ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త.
మూలాలు
యితర లింకులు
- సైన్స్ పరిశోధన నుంచి సత్యశోధన దాకా... డాక్టర్ సూరి భగవంతం : ఎందరో సైన్స్ మహానుభావులు, నాగసూరి వేణుగోపాల్, ఆంధ్ర ప్రదేశ్ డిసెంబరు 2009 ప్రచురించిన వ్యాసం పేజీలు 43-4.
- హిందూ లో వ్యాసం[permanent dead link]