లేహ్, భారతదేశం లోని లడఖ్కేంద్రపాలిత ప్రాంతపురాజధాని. ఈ ప్రాంతపు అతిపెద్ద పట్టణం కూడా. లేహ్ జిల్లాలో ఉన్న లేహ్, హిమాలయ రాజ్యమైన లడఖ్‌కు చారిత్రకంగా రాజధాని. ఈ సామ్రాజ్య పీఠం, లడఖ్ రాజకుటుంబపు పూర్వ నివాసమైన లేహ్ ప్యాలెస్‌లో ఉంది. టిబెట్‌లోని పొటాలా ప్యాలెస్ శైలి లోనే దాన్ని నిర్మించిన సమయంలోనే దీన్ని కూడా నిర్మించారు. లేహ్, సముద్రమట్టం నుండి 3,524 మీటర్ల (11,562 అడుగులు) ఎత్తున ఉంది. జాతీయ రహదారి 1, నైరుతిలో ఉన్న శ్రీనగర్‌తో కలుపుతుంది. లే-మనాలి హైవే ద్వారా దక్షిణాన ఉన్న మనాలి చేరుకోవచ్చు.
చరిత్ర
సింధు లోయ వెంట, తూర్పున్ ఉన్న టిబెట్కు, పశ్చిమాన ఉన్న కాశ్మీరుకూ, భారత చైనాల మధ్యనూ ఉన్న వాణిజ్య మార్గాల్లో లేహ్ ఒక ముఖ్యమైన మార్గమధ్య స్థలం. ఇండిగో, సిల్క్ నూలు, బనారస్ బ్రోకేడ్‌లు, తారిమ్ బేసిన్ నుండి ఉప్పు, ధాన్యం, పాష్మ్ లేదా కాశ్మీరీ ఉన్ని, చరస్ లేదా గంజాయి రెసిన్ మొదలైనవి ఈ మార్గంలో వెళ్ళే సరుకులు.
కుషాణుల కాలం నాటికే (సా.శ. 1 - 3 వ శతాబ్దాలు), [2] లడఖ్ గుండా భారతదేశానికి వెళ్ళే వాణిజ్య మార్గం గురించి చైనీయులకు తెలుసు అనేందుకు ఆధారాలు ఉన్నప్పటికీ (టంగ్ రాజవంశం కాలానికైతే కచ్చితంగా తెలుసు), [3] ఆ కాలంనాటి ఈ ప్రాంత చరిత్ర గురించి తెలిసినది చాలా తక్కువ. 10 వ శతాబ్దం చివరలో టిబెట్ యువరాజు, స్కైయిడ్ ఎల్డినైమా గోన్ (లేదా నైమా గోన్ ), బౌద్ధ వ్యతిరేక టిబెటన్ రాజు లాంగ్దర్మా (r.c 838 నుండి 841) మనవడు, రాజ్యాన్ని స్థాపించడానికి ముందు ఈ ప్రాంత చరిత్ర గురించి తెలియదు. 300 మంది మాత్రమే కలిగిన సైన్యంతో అతను, పశ్చిమ టిబెట్‌ను జయించాడు. నైమా గోన్ అనేక పట్టణాలు, కోటలను స్థాపించినట్లు ప్రతీతి. షే వద్ద ప్రధాన శిల్పాలను నిర్మింపజేసాడు. "ఒక శాసనంలో, త్సాన్పో (తన వంశపు పేరు) మత ప్రయోజనం కోసం, న్గారిస్ (వెస్ట్రన్ టిబెట్) ప్రజలందరి మత ప్రయోజనాల కోసమూ వాటిని తయారు చేయించానని చెప్పాడు. ఈ తరంలో బౌద్ధమతంపై లాంగ్దర్మా వ్యతిరేకత అప్పటికే అంతరించిందని ఇది చూపిస్తుంది." [4] ఆధునిక లేహ్ నుండి తూర్పున 15 కిలోమీటర్ల దూరం లోనే ఉన్న షే, లడఖి రాజుల ప్రాచీన కాలపు అధికారం పీఠం.
డెలిగ్స్ నాంగ్యాల్ (1660-1685) పాలనలో, [5] అప్పటి మొఘల్ సామ్రాజ్యంలో ఒక ప్రావిన్స్‌గా ఉన్న కాశ్మీరుకు చెందిన నవాబు, మంగోల్ సైన్యం తాత్కాలికంగా లడఖ్‌ను విడిచిపెట్టడానికి ఏర్పాట్లు చేసాడు. అయితే ఆ సైన్యం తరువాత మళ్ళీ వచ్చింది. 1679-1684 నాటి టిబెట్-లడఖ్-మొఘల్ యుద్ధంలో డెలిగ్స్ నాంగ్యాల్‌కు సహాయం చేసినందుకు గాను నవాబు, భారీగా డిమాండ్లు చేశాడు. లేహ్‌లో, లేహ్ ప్యాలెస్‌కు దిగువన, లేహ్‌లోని బజారుకు ఎగువ చివరలో పెద్ద సున్నీ ముస్లిం మసీదును నిర్మించడమనేది అతడి చిన్న కోరికల్లో ఒకటి. ఈ మసీదు ఇస్లామిక్, టిబెటన్ నిర్మాణ శైలుల సమ్మేళనం. అందులో 500 మందికి పైగా ప్రార్థన చెయ్యగలరు. ఇది లేహ్ లోని మొదటి మసీదు కాదు; దీని కంటే పాతవని చెప్పే రెండు చిన్న మసీదులు ఉన్నాయి.[6]
సాంప్రదాయకంగా లేహ్‌లో నలుదిశల నుండి అనేక వాణిజ్య మార్గాలు వచ్చి కలుస్తాయి. పంజాబ్ నుండి మండి, కులు లోయ, రోహ్తాంగ్ పాస్, లాహౌల్ ద్వారా సింధు లోయ వరకు, ఆపై లేహ్ వరకూ వెళ్లే ఆధునిక రహదారి సూటి మార్గం. శ్రీనగర్ నుండి లేహ్ వెళ్ళే మార్గం, జోజి లా గుండా కార్గిల్ దాటి, ఆపై సింధు లోయ గుండా లే వరకు వెళ్లే ఆధునిక కాలపు రహదారికి సమానంగా ఉంది. బాల్టిస్తాన్ నుండి రెండు మార్గాలున్నాయి: ఒక మార్గం ఇండస్ నుండి ఒక కనుమ గుండా ష్యోక్ లోయ గుండా ఆపై హాను నదిని దాటి మళ్ళీ సైంధు లోయ లోకి వచ్చి ఖల్సీకి దిగువగా లేహ్ వెళ్తుంది. రెండవది స్కర్దూ నుండి నేరుగా కార్గిల్, అక్కడి నుండి లేహ్ వెళ్తుంది. ఇక, లేహ్ యార్కండ్ ల మధ్య కారకోరం కనుమ, జైదుల్లాల గుండా వెళ్ళే వేసవికాల, శీతాకాల మార్గాలు రెండు ఉన్నాయి. చివరగా, లేహ్ నుండి లాసా వరకు ఓ రెండు మార్గాలు ఉన్నాయి.[7]
ప్రస్తుత ప్యాలెస్‌కు పట్టణానికీ ఎదురుగా ఉన్న ఎత్తైన నామ్‌గ్యాల్ ('విక్టరీ') శిఖరం పైన లడఖ్‌లోని మొట్టమొదటి రాజనివాసాన్ని నిర్మించారు. ప్రస్తుతం శిథిలమై పోయిన ఈ కోటను, గోన్-ఖాంగ్ (రక్షకులైన దేవతల ఆలయం) నూ రాజు తాషి నంగ్యాల్ నిర్మించాడు.తాషి నంగ్యాల్ 16 వ శతాబ్దం చివరి పావు కాలంలో పాలించినట్లు తెలుస్తోంది.[8] నాంగ్యాల్ (దీనిని "త్సేమో గోంపా" = 'ఎరుపు గోంపా' అనీ డ్గోన్-పా-సో-మా = 'న్యూ మొనాస్టరీ' అనీ కూడా అంటారు), [9] అనేది ఒక ఆలయం, లేహ్ లోని ప్రధాన బౌద్ధ కేంద్రం.[10] దీని వెనుక కొన్ని పాత గోడలు ఉన్నాయి, వీటిని "డార్డ్ కాజిల్" అనేవారని ఫ్రాంక్ చెప్పాడు. నిజంగా దీన్ని డార్డులు నిర్మించి ఉంటే, ఇది వెయ్యి సంవత్సరాల క్రితం లడఖ్‌లో టిబెటన్ పాలకుల కంటే ముందే అయి ఉండాలి.[11]
దీని క్రింద చంబా (బయామ్స్-పా, అంటే మైత్రేయ), చెన్రేసి (స్ప్యాన్-రస్-గ్జిగ్స్, అంటే అవలోకితేశ్వర) విహారాలున్నాయి. వీటి నిర్మాణం ఎప్పుడు జరిగిందనేది అనిశ్చితంగా ఉంది.[9]
రాజభవనాన్ని లేహ్ ప్యాలెస్ అని పిలుస్తారు. దీనిని రాజు సెంగ్ నాంగ్యాల్ (1612-1642) నిర్మించాడు. 1631 లో లేను సందర్శించిన పోర్చుగీసు జెసూట్ పూజారి ఫ్రాన్సిస్కో డి అజీవెడో, దీని గురించి ప్రస్తావించలేదు. బహుశా అప్పటికీ సెంగ్గే నాంగ్యాల్ మరణించిన 1642 కూ మధ్య కాలంలో దీన్ని నిర్మించి ఉండవచ్చు [12]
లే ప్యాలెస్ తొమ్మిది అంతస్తుల భవనం. పై అంతస్తుల్లో రాజ కుటుంబపు నివాసముండేది. దిగువ అంతస్తుల్లో గుర్రపుశాల, స్టోర్ రూములు ఉండేవి. 19 వ శతాబ్దం మధ్యలో కాశ్మీరీ దళాలు దీనిని ముట్టడించినప్పుడు ఈ ప్యాలెస్‌ను ఖాళీ చేసారు. రాజ కుటుంబం తమ ప్రాంగణాన్ని సింధు నది దక్షిణ ఒడ్డున ఉన్న ప్రస్తుత నివాసం స్టోక్ ప్యాలెస్‌కు తరలించింది.
"ఇప్పటికే చెప్పినట్లుగా, ఈ పట్టణం అసలు పేరు, ఇప్పుడు పిలుస్తున్నట్లు స్లేల్ (sLel) కాదు. దీని అసలు పేరు స్లెస్ (sLes). ఇది సంచార జాతుల శిబిరాన్ని సూచిస్తుంది. డార్డ్ వలసవాదులు నివాసముండడం ప్రారంభించిన సమయంలో, ఈ [టిబెటన్] సంచార జాతుల వారికి లేహ్ లోయను సందర్శించడం అలవాటుగా ఉండి ఉండవచ్చు. అందువల్లనే, లే వద్ద ఉన్న ర్నామ్-ర్గ్యాల్-ర్ట్సే-మో కొండ పైభాగంలో ఉన్న శిధిలాల లోని అత్యంత పురాతన భాగాన్ని 'అబ్రోగ్-పాల్-మఖర్ (డార్డ్ కోట) అంటారు. . . . " [13]
2010 లో వచ్చిన ఆకస్మిక వరదలతో లేహ్ భారీగా దెబ్బతింది.
పరిపాలన
భారతదేశంలోని ఇతర జిల్లాల మాదిరిగా కాకుండా, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్‌హెచ్‌డిసి) లేలో పాలనా బాధ్యతలు నిర్వహిస్తుంది. ఇందులో 30 మంది కౌన్సిలర్లు ఉంటారు. అందులో 4 గురు నామినేటెడ్ కాగా, 26 మంది ఎన్నికైన ప్రతినిధులు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ ఈ మండలికి అధిపతి. వారే మండలికి అధ్యక్షత వహిస్తారు. డిప్యూటీ కమిషనర్, LAHDC కి ముఖ్య కార్యనిర్వహణాధికారి బాధ్యత నిర్వహిస్తారు.
లేహ్ పాత పట్టణం
శీతోష్ణస్థితి మార్పు వలన పెరిగిన వర్షపాతం, తదితర కారణాల వల్ల పాత పట్టణం లెహ్‌ను ప్రపంచ స్మారక నిధి తమ 100 అత్యంత ప్రమాదంలో ఉన్న ప్రదేశాల జాబితాలో చేర్చింది.[14] నిర్లక్ష్యం వలన, మారుతున్న జనావాసాల నమూనాల వలనా, ఈ ప్రత్యేక స్థలపు దీర్ఘకాలిక సంరక్షణకు ముప్పు వచ్చింది.[15]
పట్టణీకరణలో వేగవంతమైన పెరుగుదల, పేలవమైన ప్రణాళికల వలన కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా వచ్చే వరద ముప్పు పెరిగింది. క్లైమేట్ అండ్ డెవలప్‌మెంట్ నాలెడ్జ్ నెట్‌వర్క్ పరిశోధనల ప్రకారం, పట్టణం లోని ఇతర ప్రాంతాల్లో ముప్పు ఈ స్థాయిలో లేదు. అవి క్రమేణా పెరుగుతూ ఉండే 'అదృశ్య విపత్తుల' ప్రభావాలతో బాధపడుతున్నాయి. వీటి గురించి పెద్దగా వెలుగు లోకి రాదు.[16]
భౌగోళికం
లేహ్, లడఖ్ పర్వత శ్రేణి పాదాల వద్ద ఉంది. 3,500 మీటర్ల ఎత్తులో ఉన్నందున లేహ్ చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాల్లో పర్వతాలే ప్రధానంగా ఉంటాయి. లేహ్ కు వచ్చే ముఖ్యమైన రోడ్లు - 434 కిలోమీటర్ల శ్రీనగర్ -లేహ్ హైవే, 473 కిలోమీటర్ల లేహ్- మనాలి రహదారు. ఈ రెండు రహదారులూ అనువుగా ఉన్న కాలంలోనే ప్రయాణానుకూలమైనవి.[17] ఈ రోడ్లు శీతాకాలంలో మంచుతో మూసుకుపోతున్నప్పటికీ, సింధు లోయలోని స్థానిక రోడ్లు మాత్రం తక్కువ అవపాతం, హిమపాతం కారణంగా తెరిచే ఉంటాయి.
వాతావరణం
లేహ్ లో శీతల ఎడారి వాతావరణం (కొప్పెన్ క్లైమేట్ వర్గీకరణ BWk) ఉటుంది. శీతాకాలం నవంబరు చివరి నుండి మార్చి ఆరంభం వరకు సుదీర్ఘంగా ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు చాలా వరకు గడ్డకట్టే కన్నా తక్కువ ఉంటాయి. శీతాకాలంలో అప్పుడప్పుడు మంచు కురుస్తుంది. మిగిలిన నెలల్లో వాతావరణం సాధారణంగా పగటిపూట చక్కగా, వెచ్చగా ఉంటుంది. సగటు వార్షిక వర్షపాతం 102 మి.మీ. మాత్రమే. 2010 లో నగరంలో మెరుపు వరదలు వచ్చినపుడు, 100 మందికి పైగా మరణించారు.[18]
వ్యవసాయం
లేహ్ సముద్రమట్టం నుండి సగటున 3,500 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే సంవత్సరానికి ఒక పంట మాత్రమే అక్కడ పండించవచ్చు. ఖలాట్సే వద్ద రెండు పంటలు పండుతాయి. మే చివరలో లేహ్ వద్ద విత్తే సమయానికి, ఖలాట్సే పంట సగం పెరిగి ఉంటుంది. ప్రధాన పంట గ్రిమ్ (సులభంగా పొట్టు తొలగించే వీలున్న బార్లీ రకం). దీని నుండి లడఖ్ ప్రజల ప్రధానాహారమైన, త్సాంపా తయారౌతుంది.[19] లడఖ్‌లో సాగునీరు సింధు నది నుండి వస్తుంది. బార్లీ-పొలాలకు నీరు బాగా అవసరమయ్యే మార్చి, ఏప్రిల్ నెలల్లో సింధు నది ప్రవాహం పల్చగా ఉంటుంది.[20]
జనాభా వివరాలు
2001 భారత జనాభా లెక్కల ప్రకారం, [21] లే పట్టణ జనాభా 27,513. జనాభాలో 61% పురుషులు, 39% స్త్రీలు. స్థానికేతర కార్మికులు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులూ ఎక్కువగా ఉన్నారు. లేహ్ సగటు అక్షరాస్యత రేటు 75%. ఇది జాతీయ సగటు 74.04%కి దగ్గరగా ఉంది: పురుషుల అక్షరాస్యత 82.14%, స్త్రీల అక్షరాస్యత 65.46%. లేహ్ జనాభాలో ఆరేళ్ళ లోపు వయస్సు కలిగినవారు 9%. లేహ్ ప్రజలు, టిబెటన్ జాతికి చెందినవారు. వీరు లడాఖీ భాష మాట్లాడుతారు
ఐదవ దలైలామా టిబెట్ నుండి లడఖ్‌పై దాడి చేయడానికి ప్రయత్నించినపుడు, కాశ్మీరు రాజ్యం లడఖ్‌ను స్వాధీనం చేసుకుంది. అప్పుడు ఇక్కడ ముస్లిముల ఉనికి మొదలైంది. అప్పటి నుండి, మొదట వాణిజ్యం కోసమూ, ఆ తరువాత కాశ్మీర్ లోయ నుండి లడఖ్ కు పర్యాటకం తరలడంతోనూ మరిన్ని వలసలు జరిగాయి.
లడఖ్ పరిమాణాన్ని బట్టి చూస్తే, చాలా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. 2010 లో 77,800 మంది పర్యాటకులు లేహ్ కు వచ్చారు. అంతకు ముందు ఐదేళ్ళ నాటి సంఖ్యతో పోలిస్తే ఇది 77% అధికం. సందర్శకుల సంఖ్య ఇటీవలి సంవత్సరాలలో వేగంగా పెరిగింది. ఈ పెరుగుదలకు ప్రధానమైన కారణం దేశీయ పర్యాటకులే [22]
బౌద్ధేతర మతాలతో సహజీవనం
హిందూ మతం లోయలోని అత్యంత పురాతన మతం. బౌద్ధమతం రెండవ స్థానంలో ఉంది. 8 వ శతాబ్దం నుండి వివిధ మతాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా బౌద్ధులు, ముస్లిములు లేహ్‌లో నివసిస్తున్నారు. నామ్గ్యాల్ రాజవంశపు ప్రారంభ కాలం నుండి వారు ఈ ప్రాంతంలో కలిసి నివసించారు. వారి మధ్య ఎటువంటి వివాదాలున్నట్లు రికార్డులు లేవు.
"ఈ మసీదును ఇబ్రహీం ఖాన్ (17 వ శతాబ్దం మధ్యలో) నిర్మించాడు,[23] తైమూర్ వారసులను సేవించిన కుటుంబానికి చెందిన వ్యక్తి. అతని కాలంలో, కాలిమాక్‌లు (కాల్‌మక్ తార్తారులు), టిబెట్ [లడఖ్] లో చాలా భాగాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత, ఆ దేశానికి చెందిన రాజా తాను హిందూస్తాన్ చక్రవర్తి అండ కోరాడు. తదనుగుణంగా చక్రవర్తి, అతని సహాయానికై ఇబ్రహీం ఖాన్‌ను నియమించాడు. అతడు కొద్ది కాలంలోనే ఆక్రమణదారులను పారదోలి, రాజాను మరోసారి తన సింహాసనంపై స్థాపించాడు. రాజా మహమ్మదీయ మతాన్ని స్వీకరించి, తనను తాను చక్రవర్తికి సామంతుడిగా ప్రకటించుకున్నాడు. చక్రవర్తి అతన్ని రాజా అకిబుట్ ముహమూద్ ఖాన్ అనే బిరుదుతో సత్కరించాడు, ఈ బిరుదును నేటి వరకూ కాశ్మీరీ పాలకులు ధరిస్తున్నారు. " [24]
ఇటీవలి కాలంలో, రాజకీయ ఘర్షణల కారణంగా బౌద్ధ, ముస్లిం వర్గాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఈ రెండు వర్గాలతో పాటు, క్రైస్తవ మతం, హిందూ మతం, సిక్కు మతం వంటి ఇతర మతాలకు చెందిన ప్రజలు కూడా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. 1860 లలో లాహౌల్‌లోని కీలాంగ్ వద్ద చర్చిని స్థాపించిన జర్మన్ మొరావియన్ మిషనరీలు టిబెటన్ బౌద్ధమతం నుండి మతం మార్చిన వారి వారసులే లేహ్‌లో ప్రస్తుతమున్న చిన్న క్రైస్తవ సమాజం. 1885 లో లేలో మరొక మిషన్‌ను తెరవడానికి వారిని అనుమతించారు. ఖలాట్సేలో దానికి ఒక ఉప శాఖను కూడా తెరిచారు. 1947 లో భారత స్వాతంత్ర్యం వచ్చేవరకూ అవి తెరిచే ఉన్నాయి. వైద్య, విద్యా కార్యకలాపాలు చేసినప్పటికీ వారు, కొద్దిమందిని మాత్రమే మతమార్పిడి చెయ్యగలిగారు.[25]
నగరానికి 15 కి., మీ. దూరంలో ఉన్న షే వద్ద ప్రతి సంవత్సరం సింధు దర్శన ఉత్సవం జరుగుతుంది. సింధునదీ తీరంలో విలసిల్లిన మత సామరస్యాన్ని, కీర్తినీ ప్రోత్సహించడానికి ఈ ఉత్సవం జరుపుకుంటారు. ఈ సమయంలో, చాలా మంది పర్యాటకులు లేహ్ ను సందర్శిస్తారు.[26]
పర్యాటక ఆకర్షణలు
లేహ్ లో
లే ప్యాలెస్
నాంగ్యాల్ త్సేమో గొంపా
శాంతి స్థూపం
చో ఖాంగ్ గొంప
చంబా ఆలయం
జామా మసీదు
గురుద్వారా పథార్ సాహిబ్
శంకర్ గొంపా
యుద్ధ మ్యూజియం
విక్టరీ టవర్
జోరావర్ కోట
లడఖ్ మారథాన్
దాతున్ సాహిబ్
రవాణా
లేహ్ మిగతా భారతదేశానికి రెండు ఎత్తైన రహదారుల ద్వారా అనుసంధానించబడి ఉంది. ఈ రెంటి లోనీ కొండచరియలు విరిగి పడుతూంటాయి. శీతాకాలంలో మంచుతో కప్పబడి, ప్రయాణాలకు అనుకూలించవు. శ్రీనగర్ నుండి కార్గిల్ మీదుగా జాతీయ రహదారి 1 డి సాధారణంగా సమవత్సరంలో ఎక్కువకాలం పాటు తెరిచి ఉంటుంది. చాలా ఎక్కువ కనుమలు, పీఠభూములు, మనాలికి సమీపంలో, కొండచరియలు విరిగిపడే రోహ్‌తాంగ్ కనుమ మొదలైనవాటి కారణంగా లే-మనాలి హైవే ఇబ్బందికరంగా ఉంటుంది. మూడవ రహదారి - నిమ్ము-పదం-ధర్చా రోడ్డు - నిర్మాణంలో ఉంది.
విమాన మార్గం
లేహ్ లోని లేహ్ కుషోక్ బకులా రింపోచీ విమానాశ్రయం నుండి ఢిల్లీకి ప్రతిరోజూ ఎయిర్ ఇండియా విమానాలు ఉన్నాయి. జమ్మూకు వారానికి రెండుసార్లు, శ్రీనగర్కు వారానికి ఒకటి విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇతర గమ్యస్థానాలకు ప్రయాణికులు ఢిల్లీలో కనెక్ట్ అవుతారు. పీక్ సీజనులో గో ఎయిర్ ఢిల్లీ నుండి రోజువారీ విమానాలను నడుపుతుంది.
రైలుమార్గం
ప్రస్తుతం లడఖ్‌కు రైల్వే సేవ లేదు. అయితే 2 రైల్వే మార్గాలు ప్రతిపాదనలో ఉన్నాయి.[27]
గ్యాలరీ
లే నగర దృశ్యం
ఖార్డంగ్ లా రోడ్ నుండి లే నగర దృశ్యం
లేహ్, లడఖ్ రాజధాని ca. 1857
1909 లో సిటీ-స్క్వేర్
శాంతి స్థూపం, 1983 లో జపనీయులు నిర్మించారు
లేహ్‌లోని నామ్గ్యాల్ త్సేమో గొంప
లేహ్ మసీదు
శీతాకాలంలో లే
శాంతి స్థూపం నుండి చూసినట్లు లే యొక్క పూర్తి దృశ్యం
↑A History of Ladakh. A. H. Francke with critical introduction and annotations by S. S. Gergan & F. M. Hassnain. Sterling Publishers, New Delhi. 1977, pp. 52, 123
↑Travels in Central Asia by Meer Izzut-oollah in the Years 1812-13. Translated by Captain Henderson. Calcutta, 1872, p. 12.