సూరి బాలకృష్ణ |
---|
జననం | (1931-08-03)1931 ఆగస్టు 3 గుంటూరు పట్టణం |
---|
మరణం | 1984 సెప్టెంబరు 9(1984-09-09) (వయసు 53)
|
---|
పౌరసత్వం | భారతీయుడు |
---|
జాతీయత | భారతీయుడు |
---|
రంగములు | భూ భౌతిక విజ్ఞాన శాస్త్రము |
---|
చదువుకున్న సంస్థలు | ఉస్మానియా విశ్వవిద్యాలయం |
---|
సూరి బాలకృష్ణ భూబౌతిక విజ్ఞాన శాస్త్రవేత్త. ఈయన ప్రఖ్యాత శాస్త్రవేత్త సూరి భగవంతం కుమారుడు.
బాల్యం
ఈయన గుంటూరు జిల్లా, గుంటూరు పట్టణంలో 1931, ఆగష్టు 3 న జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఎస్.సి (1953) లో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పి.హె.డి పట్టాను (1955) లో పొందారు.
ఉద్యోగాలు
1952 నుంచి భూ విజ్ఞాన, భూ భౌతిక శాస్త్రాలలో విశేష పరిశోధనలు జరిపారు. శిలల భౌతిక ధర్మాలు, వాటి భూ విజ్ఞాన లక్షణాలు, భూ జలాన్వేషణ మొదలైన అంశాల మీద పలు పరిశోధనలు నిర్వహించారు. ఉద్యోగ రంగంలో తొలుత ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చి స్కాలర్ గా (1953-54) ఉంటూ, జియాలజీ విభాగానికి అధిపతిగా (1961-64) రాణించారు. మధ్య కాలంలో ఇదే విభాగానికి రీడర్ గా (1957-61), శాఖాధిపతిగా (1962) గౌరవ ప్రొఫెసర్ గా (1964), అసిస్టెంట్ డైరక్టర్ గా (1965) వివిధ పదవులను సమర్థవంతంగా నిర్వహించారు.
గౌరవ పదవులు
ఆయన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (హైదరాబాద్) కు అసిస్టెంట్ డైరక్టర్ గా, యాక్టింగ్ డైరక్టరుగా (1979-1981) కూడా నిర్వహించారు. ఇండియన్ జియోఫిజికల్ యూనియన్ కు కార్యదర్శిగా ఉంటూనే ఫెలోషిప్ ను అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారి ఫెలోషిప్ ను సైతం అందుకున్నాడు. జియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థకు పౌండర్ ఫెలోగా, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సంస్థకు అధ్యక్షుడిగా (1960) కూడా గౌరవ పదవులు నిర్వహించారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (న్యూఢిల్లీ) లో రీసెర్చ్‌ఫెలోగా (1954), హార్వర్డ్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టొరల్ రీసెర్చ్‌ఫెలోగా (1956-57) రాణించారు. జపాన్ జియోలాజికల్ సౌసైటీ వారి ఫెలోషిప్ ను అందుకోవటమే కాక జపాన్ ప్రభుత్వం వారి గౌరవ పురస్కార గ్రహీతగా ప్రఖ్యాతులయ్యారు.[1]
పరిశోధన పత్రాలు
శిలలు లేదా పర్వతాలు స్థితిస్థాపకత్వం మీద కొన్ని భూసంబంధ లక్షణాలకు గల వాటి అనుబంధాల మీద అనేక పరిశోధనా పత్రాలను వెలువరించారు. పలు విదేశాలలో పర్యటించి, అనేక అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని దాదాపు 125 ప్రామాణిక పరిశోధనా పత్రాలను సమర్పించారు.
మన దేశంలో సంబంధించి భూమి ఆటుపోటులు (ప్రకంపనలు/భూకంపాలు) మీద, భూమి యొక్క అయస్కాంత క్షేత్రాలు, గురుత్వాకర్షణ క్షేత్రాల పనితీరుల మీద సునిశిత పరిశోధనలు జరిపారు. భూ విజ్ఞానాన్ని అందించే ప్రయోగాలు, అధ్యయనాల గురించి అనేక వివరాలు అందించారు. హైదరబాద్, ఉప్పల్ రోడ్ లోని ఎన్.జి.ఆర్.ఐ సంస్థ లోనే స్థిరపడ్డారు.
అవార్డులు
పరిపాలనా దక్షత, కార్యకలాపాల సమన్వయ నైపుణ్యం, నాయకత్వ పటిమలతో భూవిజ్ఞాన శాస్త్ర రంగాలలో సాటిలేని మేటి శాస్త్రవేత్తగా రాణించారు. 1967 లో కృష్ణన్ గోల్డ్ మెడల్, 1979 లో ఆంధ్ర ప్రదేశ్ అకాడామీ ఆఫ్ సైన్సెస్ వారి అవార్డుల గ్రహీత.
మరణం
సూరి బాలకృష్ణ 1984 సెప్టెంబరు 9 న హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు. [2]
మూలాలు
- ↑ బ్రిటానికా ఎన్‌సైక్లోపీడియాలో
- ↑ "ఆబిచ్యురీ". జియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా. Archived from the original on 2021-06-21. Retrieved 2021-06-21.