వెంగలీల్ కృష్ణన్ కృష్ణ మేనన్ (1896 మే 3, – 1974 అక్టోబరు 6) భారత జాతీయవాది, దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు. మొట్టమొదటి ప్రధాని నెహ్రూకు అత్యంత ఆప్తుడుగా పేరు గాంచాడు. కొంతమంది ఒక దశలో ఇతనిని నెహ్రూ తర్వాత అంతటి శక్తివంతుడుగా అభివర్ణించారు. [1][2]
మేనన్ మంచి వక్తగా, తెలివైన వాడుగా, కరుకైన వాడిగా పేరు గాంచాడు. భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశాల్లోనూ అతనిని పొగిడే వాళ్ళూ, విమర్శించే వాళ్ళు సమాన సంఖ్యలో ఉన్నారు. సమర్ధించే వారు అతనిని పాశ్చాత్య దేశాల ఆధిపత్య ధోరణిని వ్యతిరేకించి వారి స్థాయిని వారికి తెలియపరిచిన వాడిగా భావిస్తే,[3] విమర్శించే పాశ్చాత్యులు మాత్రం అతనిని నెహ్రూను నడిపించే క్షుద్ర మేధావి గా అభివర్ణించారు.[4]
యుక్తవయస్సులో ఉండగా మేనన్ పెంగ్విన్ బుక్స్ సంస్థకు సంపాదకుడిగా పని చేశాడు. బయటి దేశాల్లో భారత స్వాతంత్ర్యోద్యమానికి ప్రాచుర్యం కల్పించాడు. లండన్ లో ఇండియా లీగ్ ను స్థాపించడం ద్వారా యూకేలో పలుచోట్ల పర్యటించి భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాల్సిన అవసరం గురించి జనం మద్ధతు కూడగట్టడానికి ప్రయత్నించాడు. సోవియట్ యూనియన్ లాంటి శక్తివంతమైన దేశం నుంచి మద్ధతు రాబట్టగలిగాడు.
బాల్యం, విద్యాభ్యాసం
మేనన్ లో ప్రస్తుతం కేరళలో ఉన్న థలస్సేరి అనే ప్రాంతంలో, ఉన్నత వంశస్థులైన వెంగలీల్ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి కోమత్ కృష్ణ కురుప్, తల్లి కోమత్ శ్రీదేవి కుట్టిలమ్మ ఇద్దరూ న్యాయవాదులే. తండ్రి కడతనాడు రాజు అయిన ఒర్లత్తిరి ఉదయవర్మ కుమారుడు కాగా తల్లి 1815 నుంచి 1817 వరకు ట్రావెన్‌కూర్ సంస్థానంలో దివానుగా పనిచేసిన రామన్ మేనన్ మనవరాలు. మేనన్ కోళికోడ్ లోని జోమారిన్ కళాశాలలో చదువుకున్నాడు. 1918 లో మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశల నుంచి చరిత్ర, ఆర్థికశాస్త్రంలో బి. ఎ పట్టా పుచ్చుకున్నాడు.[5] మద్రాసు లా కళాశాలలో చదువుతుండగానే ఆయనకు దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించిన మేడం బ్లావట్‌స్కీతో కలిసి హోం రూల్ ఉద్యమంలో పనిచేశాడు. బ్రదర్స్ ఆఫ్ సర్వీస్ అనే పేరుతో అనీబిసెంట్ ఏర్పాటు చేసిన బృందంలో ఒకడై 1924 లో ఇంగ్లండుకు ప్రయాణమయ్యాడు.
లండన్ లో
మేనన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి బాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా, లండన్ యూనివర్శిటీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ప్రొఫెసర్ అయిన హెరాల్డ్ లస్కీ ఈయనను ఆయన దగ్గర చదివిన వారిలో అత్యుత్తమ విద్యార్థి అని పేర్కొన్నాడు.[6]
స్మారకం
2006 లో వి. కె. కృష్ణ మేనన్ జీవితం, సాధించిన విజయాలకు గుర్తుగా ఒక సంస్థను ప్రారంభించారు. భారత్, ఇంకా ఇతర ఆసియా దేశాలలో విజ్ఞానశాస్త్రం, సాహిత్యం, ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు, దౌత్య శాస్త్రం, మానవ హక్కులు మొదలైన రంగాలలో కృషి చేసిన వారిని సత్కరించడం దీని ప్రధాన ఆశయం.[7]
2013 లో లండన్ లోని 30 లాంగ్‌డన్ పార్క్ రోడ్ లో ఇంగ్లీష్ హెరిటేజ్ వారు ఈయన పేరు మీదుగా ఒక నీలి ఫలకాన్ని ప్రతిష్టించారు.[8]
1997 లో భారత తపాలా శాఖ ఆయన గౌరవార్థం ఒక తపాలా బిళ్ళ విడుదల చేసింది.