విజయ నరేష్ లేదా నరేష్ తెలుగు సినీ నటుడు. ఇతను నటి విజయ నిర్మల కుమారుడు. అనేక తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ముఖ్యంగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.[1][2]
నేపథ్యము
బాలనటుడిగా 1972లో పండంటి కాపురం చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. 1982లో ఇతని తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో ప్రేమ సంకెళ్ళు చిత్రంలో కథానాయకుడిగా నటించాడు, కానీ ఆ చిత్రం విజయవంతం కాలేదు. తర్వాతి కాలంలో అనేక హాస్య ప్రధాన చిత్రాలలో నటించి నటుడిగా మంచిపేరు తెచ్చుకున్నాడు. ఇతను కథానాయకిడిగా నటించిన చిత్రం జంబలకిడి పంబ తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన హాస్యచిత్రంగా నిలిచింది. కొద్దికాలంగా సహాయ పాత్రలను పోషిస్తున్నాడు. ప్రతినాయక పాత్రలను కూడా పోషించనున్నట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 2019 మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో అంతకు మునుపు అధ్యక్షుడైన శివాజీ రాజా మీద 69 ఓట్ల ఆధిక్యంతో గెలిచి అధ్యక్షుడయ్యాడు.[3]
వ్యక్తిగత జీవితము
నరేశ్ వివాహము నాలుగుసార్లు జరిగింది. మొదటి సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు నవీన్ జన్మించిన తర్వాత మనస్ఫర్ధల కారణంగా విడిపోయారు. తర్వాత రెండో పెళ్ళి చేసుకున్నాక అది కూడా విడాకులవరకు వచ్చింది. 50 ఏళ్ళ వయస్సులో ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకుడు అయిన రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను 2010 డిసెంబరు 3న హిందూపురంలోవివాహం చేసుకున్నాడు. ముగ్గురు కొడుకులు. 2003 లో నటి పవిత్ర లోకేశ్ ను వివాహమాడారు.
రాజకీయ జీవితము
1990వ దశకంలో రాజకీయ అనిశ్చితి వల్ల వాజ్‌పేయి ప్రభుత్వం కేవలం పదమూడు రోజులో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సమయంలో వాజపేయి ప్రసంగానికి నరేశ్ ఉత్తేజితుడై భారతీయ జనతా పార్టీలో చేరి కొంతకాలం చురుకైన పాత్ర పోషించాడు. రాష్ట్ర జనరల్ సెక్రటరీ స్థాయికి ఎదిగాడు. 2009లో పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తరువాత బిజెపిని వదిలిపెట్టాడు.
ఫిలిప్పీన్స్ రాజధాని మనిలాలో నరేష్ విజయకృష్ణ కి 'సర్' అనే బిరుదు తో పాటు గౌరవ డాక్టరేట్ ని ప్రదానం చేశారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ సంస్థ తో పాటు ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ విభాగాలు కలిసి నిర్వహించిన సమావేశాలలో నరేష్ ను మిలటరీ ఆర్ట్స్ గుడ్ విల్ అంబాసిడర్ గా, లెఫ్టినెంట్ కల్నల్ గా నియమించారు. ఈ విధమైన గౌరవం పొందిన తొలి నటుడు దేశంలో నరేష్.[14]