చిత్రం భళారే విచిత్రం 1992 లో విడుదల అయిన హాస్య చిత్రం. ఒక నగరంలో ఉపాధి కోసం వచ్చిన నలుగురు మిత్రుల కథ ఇది. ఈ చిత్రం మంచి హాస్య సన్నివేశాలతో నిండి, ఆద్యంతం నవ్వులు పండిస్తుంది.
చిత్ర కథ
సుధాకర్, బ్రహ్మానందం ఒక విశ్రాంత పోలీసు కానిస్టేబులు అయిన గోరోజనాల గరుడాచలం (కోట శ్రీనివాస రావు) ఇంట్లో అద్దెకు ఉంటుంటారు. సుధాకర్ ఒక ముద్రణాలయం(ప్రింటింగ్ ప్రెస్)లో కంపోసర్‌గా పనిచేస్తూ ఉంటాడు. ఉద్యోగం లేని బ్రహ్మానందం ఇంటి పనులు చూస్తూంటాడు. మనుషులు అంటే సదభిప్రాయం లేని గరుడాచలం ఇంటి అద్దె కోసం వీరిని ప్రశ్నించినప్పుడల్లా నేర్పుగా తప్పించుకుంటుంటారు. కొన్నాళ్ళకి ఉద్యోగాల వేటలో వీరి మిత్రులు రాజా (నరేష్), రాఘవ కూడా వీరి దగ్గరకి వస్తారు.
గరుడాచలానికి తెలియకుండా నలుగురూ అదే ఇంట్లో ఉంటూ ఉద్యోగాలు వెతుక్కుంటూ ఉంటారు. రాజాకి ఒక సూపర్ మార్కెట్లో ఉద్యోగం దొరుకుతుంది. రాఘవ ఒక హోటల్లో సూపర్ వైజర్ పనిలో చేరతాడు.
ఉద్యోగాలు దొరికిన ఆనందంలో నలుగురూ బారులో మందు త్రాగి ఇంటికి వచ్చి ఇదేంటని ప్రశ్నించిన గరుడాచలాన్ని కొట్టడంతో, అతను వాళ్ళని ఇంట్లోచి తరిమేస్తాడు. పట్నంలో ఎక్కడా బ్రహ్మచారులకి ఇళ్ళు దొరక్కపోవడంతో సుధాకర్ భార్యగా ఆడవేషం వేసుకున్న రాజా, తండ్రిగా బ్రహ్మానందం, తమ్ముడిగా రాఘవ నటిస్తూ ఒక ఇంట్లో అద్దెకు చేరతారు. ఆ ఇంటి యజమాని కూతురిని రాజా ప్రేమిస్తాడు.