జ్యోతిష శాస్త్రంలో రాశులు పన్నెండు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో తొమ్మిది (9) నక్షత్రపాదాలు ఉంటాయి. ఇలా పన్నెండు (12) రాశులలో కలిసి నూట ఎనిమిది (108) నక్షత్ర పాదాలు ఉంటాయి. రాశి నక్షత్ర సమూహాలను ఉహా రేఖతో కలిపి ఆ ఆకారం పోలికను అనుసరించి ఋషుల చేత నిర్ణయించబడినవే మేషము, మీనం మొదలగు రాశులు.
సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక మాస కాలం ఉంటాడు. ఆతరువాత రాశి మారుతూ ఉంటాడు. దానిని మాస సంక్రాంతి అంటారు. అలాగే ఒక రోజుకు ఒక లగ్నానికి రెండు గంటలు చొప్పున ఇరవైనాలుగు గంటల కాలాన్ని పన్నెండు లగ్నాలుగా విభజిస్తారు.
ఒక రోజులో పన్నెండు లగ్నాలు ఉంటాయి. ప్రతి రెండు గంటల సమయానికి లగ్నం మారుతూ ఉంటుంది. పుట్టిన సమయాన్ని అనుసరించి లగ్న నిర్ణయం జరుగుతుంది. జాతకుడు పుట్టిన లగ్నం అతడికి మొదటి రాశి లేక స్థానం లేక లగ్నం ఔతుంది. మేషమునకు అధిపతి కుజుడు, వృషభముకు అధిపతి శుక్రుడు. మిధునముకు అధిపతి బుధుడు. కటకముకు అధిపతి చంద్రుడు. సింహముకు అధిపతి సూర్యుడు. కన్యకు అధిపతి బుధుడు. తులకు అధిపతి శుక్రుడు. వృశ్చికముకు అధిపతి కుజుడు. ధనస్సుకు అధిపతి గురువు. మర, కుంభములకు వరుసగా శని అధిపతి. చివరి రాశి అయిన మీనముకు అధిపతి గురువు.
నవాంశచక్రము జాతక నిర్ణయంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఉత్తరభారతదేశంలో నవాంశను ఆధారంగా చేసుకుని జాతక నిర్ణయం చేస్తారు. ఫలితాలు తుల్యంగా ఉంటాయని పండితుల అభిప్రాయం. రాశిలోని తొమ్మిది నక్షత్ర పాదాలను తొమ్మిది భాగాలుగా విభజిస్తారు. ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క రాశి ఆధిపత్యం వహిస్తుంది. మేషం, కటకం, తుల, మకరం వరుసగా నవాంశ ఆరంభ రాశులు. నవాంశను గ్రహం ఉపస్థిత రాశిని దానికి ఒక్కొక్క పాదంలో స్థానంలో ఉన్న రాశిని అనుసరించి నిర్ణయిస్తారు.