ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల అనేది తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల.[1] గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఔత్సాహిక వైద్య విద్యార్థులకు వైద్య పరిజ్ఞానాన్ని అందించేందుకు తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం 2023లో ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించింది. ఇది కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది. 2023 ఏప్రిల్ 10న నేషనల్ మెడికల్ కమిషన్ నుండి 2023-24 విద్యా సంవత్సరానికి 100 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లేఖను అందుకుంది.[2]
ఏర్పాటు
ఖమ్మం జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేయనున్నట్టు 2022 మార్చి7న అసెంబ్లీలో ప్రకటించబడింది. వైద్య కళాశాల ఏర్పాటుకు 2022 ఆగస్టు 6న ఉత్తర్వులు విడుదల చేసింది. వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం తొలివిడతగా 166 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. కళాశాల ఏర్పాటుకు 30ఎకరాల స్థలం అవసరం ఉండడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా ఉన్న కలెక్టరేట్ భవనం, ఆర్‌అండ్‌బీ కార్యాలయం స్థలాన్ని అధికారులు సర్వే చేశారు.[3]
నిర్మాణం, ప్రారంభం
8.5 కోట్ల రూపాయలతో పట్టణంలోని పాత కలెక్టరేట్ భవనాన్ని ఆధునీకరించి ప్రభుత్వ వైద్య కళాశాలగా మార్చబడింది. ఇందులో పరిపాలన విభాగం, లైబ్రరీ, పరీక్షా కేంద్రాలు, టీచింగ్ హాల్స్, మ్యూజియం, బయో కెమిస్ట్రీ, క్లినికల్ ఫిజియాలజీ, హెమటాలజీ, అంఫిబియా ల్యాబ్స్, డిసిక్షన్, లెక్చరర్ హాల్స్, బయోకెమిస్ట్రీ, అనాటమీశాఖలు, విద్యార్థినీ విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్స్ నిర్మించబడ్డాయి.[4]
విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఆరుగురు ప్రొఫెసర్లు, ఐదుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 27 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లతోపాటు ఇతర సిబ్బంది నియమితులయ్యారు.
2023 సెస్టెంబరు 15 నుండి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 9 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించాడు.[6][7] ఈ కార్యక్రమంలో కళాశాల నుండి రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.