20వశతాబ్దం 1901 జనవరి 1 న (MCMI) ప్రారంభమై, 2000 డిసెంబరు 31 న (MM) న ముగిసింది. [1] ఆధునిక యుగాన్ని నిర్వచించిన ముఖ్యమైన సంఘటనలు 20వ శతాబ్దంలో జరిగాయి. వాటిలో కొన్ని: స్పానిష్ ఫ్లూ మహమ్మారి, మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, అణ్వాయుధాలు, అణుశక్తి, అంతరిక్ష పరిశోధనలు, జాతీయవాదం, డీకోలనైజేషన్, సాంకేతిక పురోగతి, ప్రచ్ఛన్న యుద్ధం, ప్రచ్ఛన్నయుద్ధానంతర సంఘర్షణలు. ఇవి భూగోళపు రాజకీయ, సామాజిక నిర్మాణాన్ని పునర్నిర్మించాయి.
20వ శతాబ్దంలో ప్రకృతితో మానవుడి సంబంధంలో భారీ మార్పు వచ్చింది. ప్రపంచ జనాభా, సముద్ర మట్టం పెరుగుదల, పర్యావరణ పతనాలు పెరిగాయి. అయితే భూమి కోసం, క్షీణిస్తున్న వనరుల కోసం పోటీ, అటవీ నిర్మూలన, నీటి క్షీణత, ప్రపంచంలోని అనేక జాతుల సామూహిక వినాశనం, ఇతర జీవుల జనాభాలో క్షీణతను వేగవంతం చేసింది. గ్లోబల్ హీటింగ్ తీవ్రమైన వాతావరణ పరిస్థితుల ప్రమాదాన్ని పెంచింది.
అవలోకనం
కాలక్రమ చరిత్ర
20వ (ఇరవయ్యవ) శతాబ్దం 1901 జనవరి 1 న ప్రారంభమై, 2000 డిసెంబరు 31 న ముగిసింది. [2][3] ఇది 2వ సహస్రాబ్దిలో పదవ, చివరి శతాబ్దం. చాలా శతాబ్దాల సంవత్సరాల మాదిరిగా కాకుండా, 2000సంవత్సరం లీపు సంవత్సరం, 1600 తర్వాత గ్రెగోరియన్ క్యాలెండర్‌లో వచ్చిన శతాబ్దపు లీపు సంవత్సరాల్లో మొదటిది.
మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధాల్లో ఖండాలు, మహాసముద్రాల అంతటా ప్రపంచ శక్తుల మధ్య ప్రపంచ స్థాయి యుద్ధాలు ఈ శతాబ్దంలో జరిగాయి. జాతీయవాదం 20వ శతాబ్దంలో ప్రపంచంలో ఒక ప్రధాన రాజకీయ సమస్యగా మారింది. దీన్ని అంతర్జాతీయ చట్టంలో స్వయం నిర్ణయాధికారం, శతాబ్దపు మధ్యకాలంలో అధికారిక డీకోలనైజేషన్, సంబంధిత ప్రాంతీయ సంఘర్షణలతో పాటుగా గుర్తించారు.
రాజకీయాలు, భావజాలం, ఆర్థిక శాస్త్రం, సమాజం, సంస్కృతి, సైన్స్, టెక్నాలజీ, వైద్యంలో మార్పులతో ప్రజల జీవన విధానంలో ఈ శతాబ్దం పెద్ద మార్పును తెచ్చింది. నాగరికత ఆవిర్భవించినప్పటి నుండి గడచిన శతాబ్దాలన్నిటి కంటే 20వ శతాబ్దం ఎక్కువ సాంకేతిక, శాస్త్రీయ పురోగతిని చూసింది. జాతీయవాదం, ప్రపంచవాదం, పర్యావరణవాదం, భావజాలం, ప్రపంచ యుద్ధం, మారణహోమం,అణు యుద్ధం వంటి పదాలు సాధారణ వాడుకలోకి వచ్చాయి. సాపేక్షత సిద్ధాంతం, క్వాంటం ఫిజిక్స్ వంటి శాస్త్రీయ ఆవిష్కరణలు భౌతిక శాస్త్ర పునాదులను మార్చాయి. విశ్వం గతంలో విశ్వసించిన దానికంటే చాలా క్లిష్టంగా ఉందని శాస్త్రవేత్తలకు తెలిసింది. శాస్త్రీయ జ్ఞానానికి సంబంధించిన కొన్ని చివరి వివరాలు పూరించబోతున్నాం అనే 19 వ శతాబ్దపు ఆశలను ఛేదించిన శతాబ్దం ఇది. ఈ శతాబ్దం గుర్రాలు, సాధారణ ఆటోమొబైల్స్, ఫ్రైటర్లతో ప్రారంభమై, హై-స్పీడ్ రైలు, క్రూయిజ్ షిప్‌లు, గ్లోబల్ కమర్షియల్ ఎయిర్ ట్రావెల్, స్పేస్ షటిల్‌తో ముగిసింది. వేలాది సంవత్సరాలుగా ప్రాథమిక వ్యక్తిగత రవాణాగా ఉన్న గుర్రాలు, ఇతర మోసే జంతువుల స్థానంలో, కేవలం కొన్ని దశాబ్దాలలో యంత్ర వాహనాలు వచ్చి చేరాయి. ఈ పరిణామాలు శిలాజ ఇంధన వనరుల వలన సాధ్యమైంది. ఇవి శక్తిని సులభంగా, మోసుకెళ్ళగలిగేలా అందించాయి. కానీ కాలుష్యం, పర్యావరణంపై దీర్ఘకాలిక ప్రభావం చూపి, ఆందోళన కలిగించింది. మానవులు మొదటిసారిగా అంతరిక్షాన్ని అన్వేషించారు, చంద్రునిపై మొదటి అడుగు వేసారు.
మాస్ మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ముఖ్యంగా కంప్యూటర్లు, పేపర్‌బ్యాక్ పుస్తకాలు, పబ్లిక్ ఎడ్యుకేషన్, ఇంటర్నెట్) ప్రపంచ పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా అందుబాటులోకి తెచ్చాయి. ప్రజారోగ్యం మెరుగవడంతో ప్రపంచ మానవుల సగటు ఆయుర్దాయం 35 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు పెరిగింది. అయితే వేగవంతమైన సాంకేతిక పురోగతుల కారణంగా, యుద్ధం అపూర్వమైన విధ్వంస స్థాయికి చేరుకుంది. ఒక్క రెండవ ప్రపంచ యుద్ధం లోనే 6 కోట్ల మంది మరణించారు. అణ్వాయుధాలు మానవాళికి తక్కువ సమయంలో తనను తాను నాశనం చేసుకునే మార్గాలను అందించాయి. అయితే, ఇదే యుద్ధాలు సామ్రాజ్య వ్యవస్థను నాశనం చేశాయి. మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా, సామ్రాజ్యాలు, వాటి విస్తరణ, వలసరాజ్యాల యుద్ధాలు అంతర్జాతీయ వ్యవహారాలలో ఒక అంశంగా నిలిచిపోయాయి, ఫలితంగా మరింత ప్రపంచీకరణ జరిగి, సహకార ప్రపంచం ఏర్పడింది. 1945లో చివరిసారిగా ప్రధాన శక్తులు బహిరంగంగా ఘర్షణ పడ్డాయి. అప్పటి నుండి హింస బాగా క్షీణించింది. [4]
రవాణా, సమాచార సాంకేతికత, ప్రజాదరణ పొందిన సంగీతం, పాశ్చాత్య సంస్కృతి, అంతర్జాతీయ సంస్థల ప్రభావాలు మొదలైన వాటి కారణంగా 20వ శతాబ్దం చివరినాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన అభివృద్ధితో ప్రపంచం గతంలో కంటే సాంస్కృతికంగా సజాతీయంగా మారింది.
యుద్ధాలు, రాజకీయాలు
ప్రభుత్వ చర్యల వల్ల ఈ శతాబ్ద కాలంలో మరణించిన వారి సంఖ్య వందల మిలియన్లలో ఉంది. ఇందులో యుద్ధాలు, మారణహోమం, రాజకీయ హత్యలు, సామూహిక హత్యల వల్ల సంభవించే మరణాలు ఉన్నాయి. ఒక్క రెండు ప్రపంచ యుద్ధాల లోనే యుద్ధ చర్యల వల్ల మరణించిన వారి సంఖ్య 5, 8 కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేయబడింది. రాజకీయ శాస్త్రవేత్త రుడాల్ఫ్ రమ్మెల్, యుద్ధాలలో మరణించిన వారిని, యుద్ధంలో అనుకోకుండా చంపబడిన పౌరులను, అల్లర్లకు పాల్పడే గుంపుల హత్యలను మినహాయించి ఇతర మరణాల సంఖ్య 26.2 కోట్లు ఉంటుందని అంచనా వేశాడు. [5] చార్లెస్ టిల్లీ ప్రకారం, "మొత్తం, శతాబ్ద కాలంలో ప్రభుత్వం లేదా మరొక ప్రభుత్వ మద్దతుతో వ్యవస్థీకృత సైనిక విభాగాలు చేసిన చర్య ఫలితంగా దాదాపు 10 కోట్ల మంది మరణించారు. యుద్ధం-వలన చెలరేగిన వ్యాధి, ఇతర పరోక్ష ప్రభావాల వలన ఇంతే సంఖ్యలో పౌరులు మరణించే అవకాశం ఉంది." [6] 1914 - 1945 మధ్య కాలంలో [7] 7 కోట్ల మంది యూరోపియన్లు యుద్ధం, హింస, కరువు కారణంగా మరణించారని అంచనా.
ఆర్మేనియన్, సిరియాక్, గ్రీక్ మారణహోమాలు మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యంలో అర్మేనియన్లు, అస్సిరియన్లు, గ్రీకులను పాలక కమిటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ (CUP) నేతృత్వంలో క్రమబద్ధంగా జరిగిన విధ్వంసం, సామూహిక హత్య, బహిష్కరణ. [8][9]
మొదటి ప్రపంచ యుద్ధం (1914-1918) యొక్క అనేక కారణాలలో జాతీయవాదం పెరగడం, జాతీయ అవగాహన పెరగడం కూడా ఒకటి. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, రష్యా/ USSR, బ్రిటీష్ సామ్రాజ్యం అమెరికా సంయుక్త రాష్ట్రాలుతో సహా అనేక ప్రధాన ప్రపంచ శక్తులు పాల్గొన్న రెండు యుద్ధాలలో ఇది మొదటిది. మొదటి ప్రపంచ యుద్ధం అనేక కొత్త దేశాల సృష్టికి దారితీసింది, ముఖ్యంగా తూర్పు ఐరోపాలో. ఆ సమయంలో దాన్ని " అన్ని యుద్ధాలను అంతం చేసే యుద్ధం " అని చాలా మంది అన్నారు.
శతాబ్దపు మొదటి భాగంలో యునైటెడ్ స్టేట్స్‌లో, ఐరోపాలో చాలా వరకు రాజకీయ హక్కులను పొందిన తరువాత, కొత్త జనన నియంత్రణ పద్ధతుల ఆగమనంతో, మహిళలు ఈ శతాబ్దంలో మరింత స్వతంత్రంగా మారారు .
20వ శతాబ్దం మొదటి అర్ధభాగంలో పారిశ్రామిక యుద్ధం దాని స్థాయిలో, సంక్లిష్టతలో బాగా పెరిగింది. రసాయన యుద్ధం, సైనిక విమానయానం జలాంతర్గాములను విస్తృతంగా ఉపయోగించడం వంటి ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. 20వ శతాబ్దం మధ్యలో వచ్చిన అణుయుద్ధంతో ఆధునిక యుద్ధం ఒక కచ్చితమైన పరివర్తనకు లోనైంది.
అనేక దేశాలలో అంతర్యుద్ధాలు జరిగాయి. 1936లో జనరల్ ఫ్రాన్సిస్కో ఫ్రాంకో రెండవ స్పానిష్ రిపబ్లిక్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు స్పెయిన్‌లో హింసాత్మక అంతర్యుద్ధం జరిగింది. చాలా మంది ఈ యుద్ధాన్ని రెండవ ప్రపంచ యుద్ధానికి పరీక్షా యుద్దభూమిగా పరిగణిస్తారు, ఎందుకంటే ఫాసిస్ట్ సైన్యాలు కొన్ని స్పానిష్ భూభాగాలపై బాంబు దాడి చేశాయి. [10]
1930లలో ఏర్పడిన మహా మాంద్యం ఐరోపాలో ఫాసిజం, నాజీయిజంల పెరుగుదలకు దారితీసింది.
రెండవ ప్రపంచ యుద్ధం (1939-1945) లో తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతాలు చైనా, యునైటెడ్ స్టేట్స్‌పై జపాన్ దురాక్రమణ రూపంలో పాల్గొన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో, రెండు వైపులా ఉన్న నగరాలపై వైమానిక బాంబు దాడి, యూదులు, ఇతరులపై జర్మన్ మారణహోమం (హోలోకాస్ట్) కారణంగా పౌరులు కూడా చాలా బాధలు పడ్డారు.
1917 రష్యన్ విప్లవంలో, 300 సంవత్సరాల రోమనోవ్ పాలన ముగిసింది. వ్లాదిమిర్ లెనిన్ నాయకత్వంలో బోల్షెవిక్‌లు ప్రపంచంలోని మొదటి కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ ప్రమేయం తర్వాత, ప్రపంచ రాజకీయాల్లో కమ్యూనిజం ప్రధాన శక్తిగా మారింది. ముఖ్యంగా తూర్పు ఐరోపా, చైనా, ఇండోచైనా, క్యూబాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు దాదాపు సంపూర్ణ అధికారాన్ని పొందాయి.
ప్రచ్ఛన్న యుద్ధం (1947–1989) లో ఆయుధాల పోటీ, ప్రపంచంలోని రెండు ప్రధాన దేశాలైన సోవియట్ యూనియన్ యునైటెడ్ స్టేట్స్ ల మధ్య పోటీ పెరిగింది. ఈ పోటీలో అణ్వాయుధాల అభివృద్ధి, మెరుగుదల, అంతరిక్ష పోటీ ఉన్నాయి. ఈ పోటీ, కొరియా (1950-1953), వియత్నాం (1957-1975) లో యుద్ధాలతో సహా పాశ్చాత్య కూటమితో ప్రాక్సీ యుద్ధాలకు దారితీసింది.
దేశీయ వ్యతిరేకతను తొలగించడానికి సోవియట్ అధికారులు లక్షలాది మంది సొంత పౌరుల మరణాలకు కారణమయ్యారు. [11] 1.8 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలను గులాగ్ ల లోకి పంపారు. మరో 60 లక్షల మందిని సోవియట్ యూనియన్ యొక్క మారుమూల ప్రాంతాలకు బహిష్కరించారు . [12]
యునైటెడ్ స్టేట్స్‌లో పౌర హక్కుల ఉద్యమం, దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఆ దేశాలలో జాతి విభజనను సవాలు చేశాయి.
రెండు ప్రపంచ యుద్ధాలు అంతర్జాతీయ సహకారాన్ని పెంచుకునే ప్రయత్నాలకు దారితీశాయి. ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దాని వారస సంస్థ ఐక్యరాజ్యసమితిని స్థాపించారు.
1948లో మధ్య ప్రాచ్యంలో యూదు రాజ్యమైన ఇజ్రాయెల్ ఏర్పడటం అనేక ప్రాంతీయ వివాదాలకు ఆజ్యం పోసింది. ప్రధానంగా అరబ్ ప్రాంతంలోని అనేక ఇతర దేశాలలో ఉన్న విస్తారమైన చమురు క్షేత్రాల ద్వారా కూడా ఇవి ప్రభావితమయ్యాయి.
వలసవాదం ముగింపు అనేక ఆఫ్రికన్, ఆసియా దేశాల స్వాతంత్ర్యానికి దారితీసింది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో, వీటిలో చాలా వరకు రక్షణ కోసం యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్, చైనాలతో జతకట్టాయి.
సుదీర్ఘ కాలం పాటు సాగిన అంతర్యుద్ధాలు, పాశ్చాత్య శక్తులతో విభేదాల తరువాత, చైనా చివరి రాజవంశం 1912లో ముగిసింది. ఫలితంగా ఏర్పడిన రిపబ్లిక్, మరొక అంతర్యుద్ధం తర్వాత, 1949లో కమ్యూనిస్ట్ పీపుల్స్ రిపబ్లిక్ అధికారానికి వచ్చింది. 20వ శతాబ్దం చివర నాటికి, కమ్యూనిస్ట్ పార్టీయే పాలిస్తున్నప్పటికీ, చైనా ఆర్థిక వ్యవస్థ చాలా వరకు పెట్టుబడిదారీ విధానంగా రూపాంతరం చెందింది.
1959 - 1962 మధ్యకాలంలో పది లక్షల మంది చైనా రైతుల మరణానికి గ్రేట్ చైనీస్ కరువు ప్రత్యక్ష కారణం. ఇది మానవ చరిత్రలో అతిపెద్ద కరువుగా భావిస్తున్నారు. [13]
వియత్నాం యుద్ధం 20 లక్షల మరణాలకు కారణమైంది. తూర్పు, పశ్చిమ బ్లాక్‌ల మధ్య గతిశీలతను మార్చింది. ప్రపంచ ఉత్తర-దక్షిణ సంబంధాలను మార్చింది. [14]
ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్ యుద్ధం పది లక్షల మరణాలకు కారణమైంది. సోవియట్ యూనియన్ పతనానికి దోహదపడింది. [13]
1989 విప్లవాలతో సోవియట్ ఆధిపత్యం నుండి తూర్పు, మధ్య ఐరోపాలు విడుదల అయ్యాయి. ఆ తర్వాత వెంటనే, సోవియట్ యూనియన్, చెకోస్లోవేకియా, యుగోస్లేవియాలు రద్దు అయ్యాయి. తరువాతి అనేక సంవత్సరాలలో హింసాత్మకంగా, వారసత్వ దేశాలుగా, అనేక జాతి జాతీయవాదంతో నిండిపోయాయి. ఇంతలో, 1990లో తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీల పునరేకీకరణ జరిగింది.
1989 లో బీజింగ్‌లోని తియానన్‌మెన్ స్క్వేర్‌లో జరిగిన నిరసనలు, వందలాది మంది పౌర నిరసనకారుల మరణాలకు దారితీశాయి. ప్రధానంగా విద్యార్థులు, మేధావుల నేతృత్వంలో, ప్రపంచవ్యాప్తంగా అనేక కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు కూలిపోయిన ఒక సంవత్సరంలో ఈ నిరసనలు జరిగాయి.
యూరోపియన్ ఏకీకరణ 1950లలో ప్రారంభమై, చివరికి యూరోపియన్ యూనియన్‌కు దారితీసింది. ఇది 20వ శతాబ్దం చివరిలో, 15 దేశాలతో ఏర్పడిన రాజకీయ ఆర్థిక యూనియన్.
సైన్స్
గణితం
20వ శతాబ్దంలో గణితంలో అనేక కొత్త రంగాలు అభివృద్ధి చేయబడ్డాయి. 20వ శతాబ్దపు మొదటి భాగంలో, కొలత సిద్ధాంతం, క్రియాత్మక విశ్లేషణ, టోపోలాజీ స్థాపించబడ్డాయి. నైరూప్య బీజగణితం, సంభావ్యత వంటి రంగాలలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. సెట్ థియరీ, ఫార్మల్ లాజిక్ అభివృద్ధి గోడెల్ యొక్క అసంపూర్ణత సిద్ధాంతాలకు దారితీసింది.
20వ శతాబ్దపు మలి భాగంలో, కంప్యూటర్ల అభివృద్ధి గణన సిద్ధాంతాన్ని స్థాపించడానికి దారితీసింది. [15]
భౌతిక శాస్త్రం
స్పెషల్ సాపేక్షతా సిద్ధాంతం, సాధారణ సాపేక్షత సిద్ధాంతం, క్వాంటం మెకానిక్స్ వంటి భౌతిక శాస్త్రంలోని కొత్త రంగాలు శతాబ్దం మొదటి అర్ధభాగంలో అభివృద్ధి చేయబడ్డాయి. ఈ ప్రక్రియలో, పరమాణువుల అంతర్గత నిర్మాణం స్పష్టంగా అర్థమైంది, ఆ తర్వాత ప్రాథమిక కణాల ఆవిష్కరణ జరిగింది.
మానవాళికి తెలిసిన శక్తులు కేవలం నాలుగు ప్రాథమిక పరస్పర చర్యలకు మాత్రమే గుర్తించబడతాయని కనుగొనబడింది. విద్యుదయస్కాంతత్వం, బలహీనమైన పరస్పర చర్య అనే రెండు శక్తులను ఎలక్ట్రోవీక్ ఇంటరాక్షన్‌లో విలీనం చేయవచ్చునని, మూడు వేర్వేరు ప్రాథమిక పరస్పర చర్యలను మాత్రమే భావించవచ్చనీ మరింతగా కనుగొనబడింది.
రేడియోకార్బన్ డేటింగ్ కనుగొనబడింది. చరిత్రపూర్వ జంతువులు, మొక్కలు అలాగే చారిత్రక వస్తువుల వయస్సును నిర్ణయించడానికి ఇది శక్తివంతమైన సాంకేతికతగా మారింది.
ఖగోళ శాస్త్రం
విశ్వం పరిణామం గురించి మరింత మెరుగైన అవగాహన చేకూరింది. దాని వయస్సు (సుమారు 13.8 బిలియన్ సంవత్సరాలు) నిర్ణయించబడింది. విశ్వానికి మూలంగా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇది సాధారణ ఆమోదం పొందింది.
భూమితో సహా సౌర వ్యవస్థ యొక్క వయస్సు నిర్ణయించబడింది. ఇది ముందుగా అనుకున్న దాని కంటే చాలా పాతది అని తేలింది.1862లో లార్డ్ కెల్విన్ సూచించిన 2 కోట్ల సంవత్సరాలు కాక, ఇది 400 కోట్ల సంవత్సరాల కంటే ఎక్కువని తేలింది. [16]
సౌర వ్యవస్థలోని గ్రహాలు, వాటి చంద్రులను అనేక అంతరిక్ష పరిశోధనల ద్వారా నిశితంగా పరిశీలించారు. ప్లూటో సౌర వ్యవస్థ అంచున 1930లో కనుగొనబడింది, అయితే 21వ శతాబ్దం ప్రారంభంలో, ఇది గ్రహం కాదని, మరగుజ్జు గ్రహమనీ మళ్లీ వర్గీకరించబడింది.
సూర్యుని చుట్టూ తిరుగుతున్న ఇతర గ్రహాలలో గానీ, విశ్వంలో మరెక్కడా గానీ జీవం జాడ కనుగొనబడలేదు. సౌర వ్యవస్థలో కొన్ని రకాల ఆదిమ జీవులు ఎక్కడైనా ఉన్నాయా లేదా ఉనికిలో ఉండేవా అనేది తేలలేదు. సోలార్ గ్రహాలను తొలిసారిగా పరిశీలించారు.
ఇంజనీరింగ్ సాంకేతికత
20వ శతాబ్దపు ప్రముఖ లక్షణాలలో ఒకటి సాంకేతిక పరిజ్ఞానం నాటకీయ పెరుగుదల. పరిశోధన, సైన్స్ అభ్యాసం లలో జరిగిన వ్యవస్థీకృత అభ్గివృద్ధి కారణంగా కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, ట్రావెల్, మెడిసిన్, యుద్ధం వంటి రంగాలలో పురోగతికి దారితీసింది.
వాషింగ్ మెషీన్లు, బట్టలు ఆరబెట్టే యంత్రాలు, ఫర్నేసులు, వ్యాయామ యంత్రాలు, డిష్‌వాషర్లు, రిఫ్రిజిరేటర్‌లు, ఫ్రీజర్‌లు, ఎలక్ట్రిక్ స్టవ్‌లు, వాక్యూమ్ క్లీనర్‌లతో సహా ప్రాథమిక గృహోపకరణాలు 1920ల నుండి 1950ల వరకు ప్రాచుర్యం పొందాయి. 1920లలో రేడియోలు ఒక వినోద రూపంగా ప్రాచుర్యం పొందాయి, ఆ తర్వాత 1950లలో టెలివిజన్ కూడా ప్రాచుర్యం పొందింది.
మొదటి విమానం, రైట్ ఫ్లైయర్, 1903లో ఎగిరింది. 1940లలో వేగవంతమైన జెట్ ఇంజిన్ యొక్క ఇంజనీరింగ్‌తో, సామూహిక విమాన ప్రయాణం వాణిజ్యపరంగా లాభదాయకంగా మారింది.
అసెంబ్లీ లైన్ ఆటోమొబైల్ యొక్క భారీ ఉత్పత్తిని ఆచరణీయంగా చేసింది. 20వ శతాబ్దం చివరి నాటికి, కోట్ల మంది ప్రజలు వ్యక్తిగత రవాణా కోసం ఆటోమొబైల్‌లను వాడుతున్నారు. ఆటోమొబైల్, మోటారు పడవలు, విమాన ప్రయాణాలు అన్నీ కలిసి అపూర్వమైన వ్యక్తిగత ప్రయాణాలకు వీలు కలిగించాయి. పాశ్చాత్య దేశాలలో, యువకుల మరణానికి మోటారు వాహన ప్రమాదాలు ప్రధాన కారణం. అయితే, విభజించబడిన రహదారుల విస్తరణ మరణాల రేటును తగ్గించింది.
ట్రయోడ్ ట్యూబ్ను కనుగొన్నారు.
భవనాలను ఎయిర్ కండిషనింగ్ చెయ్యడం మామూలైపోయింది.
కొత్త మెటీరియల్స్, ముఖ్యంగా స్టెయిన్‌లెస్ స్టీల్, వెల్క్రో, సిలికాన్, టెఫ్లాన్, పాలీస్టైరిన్, PVC, పాలిథిలిన్, నైలాన్ వంటి ప్లాస్టిక్‌లు అనేక రకాల అప్లికేషన్‌ల కోసం విస్తృత వినియోగంలోకి వచ్చాయి. ఈ పదార్థాలు సాధారణంగా 20వ శతాబ్దానికి ముందు తెలిసిన వాటి కంటే బలం, ఉష్ణోగ్రత, రసాయన నిరోధకత లేదా యాంత్రిక లక్షణాలలో అద్భుతమైన పనితీరును కలిగి ఉంటాయి.
అల్యూమినియం చవకైన లోహంగా మారింది. ఉపయోగంలో ఇనుము తర్వాత ఇది రెండవది.
పారిశ్రామిక ప్రాసెసింగ్, గృహ వినియోగం కోసం వేలాది రసాయనాలు అభివృద్ధి చేయబడ్డాయి.
డిజిటల్ కంప్యూటర్లు వాడుకలోకి వచ్చాయి
అంతరిక్ష పరిశోధనము
యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్ ల మధ్య అంతరిక్ష పోటీ ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో రాజకీయ, సైనిక ఉద్రిక్తతలకు శాంతియుత ప్రత్యామ్నాయాన్ని అందించింది. ఇది 1961లో సోవియట్ యూనియన్ యొక్క వోస్టాక్ 1 మిషన్‌తో మొదటి మానవ అంతరిక్షయానానికి దారితీసింది. మనిషి మరొక ప్రపంచంలోకి మొదటిసారి దిగింది 1969లో అమెరికా అపోలో 11 మిషన్‌తో చంద్రునిపై కాలూనినపుడు. తరువాత, సోవియట్ అంతరిక్ష కార్యక్రమం ద్వారా మొదటి అంతరిక్ష కేంద్రం మొదలైంది. యునైటెడ్ స్టేట్స్ మొదటిసారిగా 1981లో ప్రారంభించిన స్పేస్ షటిల్ ప్రోగ్రామ్‌తో పునర్వినియోగపరచదగిన అంతరిక్ష నౌక వ్యవస్థను అభివృద్ధి చేసింది. శతాబ్దం ముగిసే సమయానికి నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అంతరిక్షంలో శాశ్వత మానవ ఉనికిని స్థాపించారు.
మానవ అంతరిక్షయానంతో పాటు, మానవరహిత అంతరిక్ష పరిశోధనలు ఒక ఆచరణాత్మకమైన, సాపేక్షంగా చవకైన అన్వేషణ రూపంగా మారాయి. మొదటి కక్ష్యలో ఉన్న అంతరిక్ష పరిశోధన, స్పుత్నిక్ 1, సోవియట్ యూనియన్ 1957లో ప్రయోగించబడింది. కాలక్రమేణా, కృత్రిమ ఉపగ్రహాల యొక్క భారీ వ్యవస్థ భూమి చుట్టూ కక్ష్యలో ఏర్పడింది. ఈ ఉపగ్రహాలు నావిగేషన్, కమ్యూనికేషన్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్, జియాలజీ, శీతోష్ణస్థితి వంటి అనేక రంగాలను బాగా అభివృద్ధి చేశాయి. అలాగే, 20వ శతాబ్దం చివరి నాటికి, మానవరహిత ప్రోబ్‌లు చంద్రుడు, బుధుడు, శుక్రుడు, అంగారక గ్రహం, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, వివిధ గ్రహశకలాలు, తోకచుక్కలను సందర్శించాయి లేదా వాటి గుండా ప్రయాణించాయి. వాయేజర్ 1 మానవుడు తయారు చేసిన వస్తువుల్లో భూమికి అత్యంత దూరంలో ఉన్న వస్తువు. 2022 సెప్టెంబరు 6 నాటికి భూమి నుండి 23.5 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. వాయేజర్ 2తో కలిసి ఈ రెండు నౌకల్లో 55 భాషలలో శబ్దాలు, సంగీతం, శుభాకాంక్షలతో పాటు ప్రకృతి, మానవ పురోగమనం, అంతరిక్షం, సమాజానికి సంబంధించిన 116 చిత్రాలను కలిగి ఉన్న ది వాయేజర్ గోల్డెన్ రికార్డ్ ఉంది.
1990లో ప్రారంభించబడిన హబుల్ స్పేస్ టెలిస్కోప్, విశ్వంపై మన అవగాహనను బాగా విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా టీవీ, కంప్యూటర్ స్క్రీన్‌లకు అద్భుతమైన చిత్రాలను అందించింది.
భూ-ఆధారిత రిసీవర్‌లు తమ కచ్చితమైన స్థానాన్ని గుర్తించడానికి వీలు కలిగించే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉపగ్రహాల శ్రేణిని అభివృద్ధి చేసి, వినియోగం లోకి తెచ్చారు. [17]