బలం అనే తెలుగు మాటని ఫోర్స్ అనే ఇంగ్లీషు మాటకి సమానార్ధకంగా వాడుతున్నాము.
ఒక వస్తువులో త్వరణమును కలిగించే ప్రభావమును బలము అంటారు. ఈ వస్తువు యోక్క వాస్తవ త్వరణమును దానిపై పని చేసే బల సదిశ ల మొత్తానికి సమానముగా పేర్కొంటారు. బలమును న్యూటన్ లలో కొలుస్తారు. బలము వస్తు స్వరూపములో మార్పునకు కారణమవుతుంది. ఈ బలము బ్రమణబ్రామకము (టార్క్), వత్తిడి రూపములలో కూడా ఉంటుంది.
బలాలు - రెండు రకాలు
1. స్పర్శాబలాలు(Contact forces): రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా పనిచేసే బలాలను స్పర్శా బలాలు అంటారు.
2. క్షేత్ర బలాలు( Field forces): రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం లేకుండా బలం పనిచేస్తే అటువంటి బలాన్ని క్షేత్ర బలం అని అంటారు
స్పర్శ బలాలు 4 రకాలు:
1. కండరబలం (Muscular force)
2. ఘర్షణ బలం (Force of friction)
3. అభిలంబ బలం (Normal force)
4. తన్యత (Tension)
1. కండర బలం: కండరాలను ఉపయోగించి చేసే బలాన్ని కండర బలం అంటారు. ఉదాహరణకు ప్రతిరోజు పళ్ళు తోమటం, స్నానం చేయడం, తినడం, నడవడం, రాయడం, వాహనాలు నడపడం వంటి పనులు కండల బలాన్ని ఉపయోగించి చేస్తాను.
2. ఘర్షణ బలం: ఒక వస్తు దాని స్పర్శలో ఉన్న వేరొక వస్తువు విపరీతలంపై కదులుతున్నప్పుడు దాని చలనాన్ని నిరోధించేది ఘర్షణ.
3. అభిలంబ బలం: ఏదైనా ఒక వస్తువు యొక్క తలం వేరొక వస్తువు మీద లంబ దిశలో (అభిలంబంగా) కలగజేసే బలాన్ని అభిలంబ బలం అంటారు.
4. తన్యత: తాడు లాగడానికి ప్రయత్నించినప్పుడు తాడు లేదా దారంలో గల బిగుసుదానాన్ని తన్యతా బలం అంటారు. ఇది ఒక స్పర్శాబలం.
క్షేత్ర బలాలు 3 రకాలు:
1. అయస్కాంత బలం (Magnetic force)
2. స్థావర విద్యుత్ బలం (Electrostatic forces)
3. గురుత్వాకర్షణ బలం (Gravitational force)
1. అయస్కాంత బలం : అయస్కాంత సజాతీయ ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతీయ ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. సజాతి ధ్రువాలు ఒకదానికొకటి వికర్షించుకోవడం లేదా దూరంగా నెట్టి వేయడం మరియు విజాతి ధ్రువాలు ఆకర్షించుకోవడం లేదా దగ్గరగా లాగవడం గమనించవచ్చు ఈ విధమైన బలాలను అయస్కాంత బలాలని అంటారు.
2. స్థావర విద్యుత్ బలాలు: బెలూన్ కాగితంతో రుద్దినప్పుడు దాని ఉపరితలం విద్యుదావేశం పొందుతుంది ఆ బెలూన్ విద్యుత్ ఆవేశపూరిత బెలూన్ అంటాం. ఒక ఆవేశ వస్తువు వేరొక ఆవేశ పూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసే బలాన్ని స్థావరం విద్యుత్ బలం అంటారు.
3. గురుత్వాకర్షణ బలం: ఏ వస్తువును పైకి విసిరిన దానిపై పనిచేసే ఒక బలం వల్ల ఆ వస్తువు తిరిగి భూమి పైనే పడుతుంది. ఆ బలాన్నే గురుత్వాకర్షణ బలం అంటారు.
వస్తువుల చలన తత్వాలు అర్థం చేసుకోవాలనే తపన 16 వ శతాబ్దంలో గెలీలియో గెలీలితో మొదలయిందనవచ్చు. ఈ విచారణలు 17 వ శతాబ్దంలో నూటన్ అసమాన ప్రతిభ వల్ల సఫలం అయినాయి. నాటి నుండి నేటి వరకూ వస్తువుల గమనానికి సంబంధించిన విషయాలన్నిటిలోనూ నూటన్ వక్కాణించినది వేదవాక్కులా నిలచిపోయింది. గెలిలియో, కెప్లర్ మొదలైన వారి అనుభవాన్నంతా కాసి, వడబోసి తన గణిత మేధా శక్తితో రంగరించి వస్తువులు మూడు సూత్రాలని అనుసరిస్తూ చలిస్తాయని నూటన్ ఉటంకించేడు. నాటి నుండి నేటి వరకూ ఈ మూడు సూత్రాలనీ అధిగమించి చలించిన వస్తువేదీ కనపడ లేదు. అందుకనే వీటిని నూటన్ చలన విధాన సూత్రములు (Newton's Laws of Motion) అని అంటారు.
ఆశ్చర్యం ఏమిటంటే ఈ మూడు సూత్రాలనీ ఆధారంగా తీసుకుని సనాతన భౌతిక శాస్త్రం (classical physics) అనే ఉన్నతమయిన మేడని కట్టవచ్చు. బంతులు, బళ్ళు, రైళ్ళు, రాకెట్లు...ఇవన్నీ నూటన్ చలన సూత్రాలకి దాసోహం అంటూ ప్రవర్తిస్తాయి. అతి చిన్న పరిమాణం గల అణుగర్భం లోనూ, అత్యంత (అంటే కాంతి వేగంతో సమతుల్యమయిన) వేగాలు ఉన్నప్పుడు మాత్రం నూటన్ సూత్రాలని సవరించాలి.
నూటన్ సూత్రాలలో 'బలం' అన్న భావానికే అగ్ర తాంబూలం. శక్తి ది ద్వితీయ స్థానమే. దీనికి కారణం నూటన్ కాలంలో శక్తి గురించి పరిపూర్ణమైన అవగాహన లేదు. నూటన్ తరువాత లగ్రాంజ్ (Lagrange), హేమిల్టన్ (Hamilton) అనే శాస్త్రజ్ఞులు 'శక్తి' కి పెద్ద పీట వేసి చలన శాస్త్రాన్ని మరొక దృక్పధంలో అధ్యయనం చేసేరు. ఏ కోణంలో పఠించినా గమ్యం ఒకటే. నూటనిక (Newtonian) పద్ధతులు సులభమయిన భౌతిక వ్యవస్థలను అధ్యయనం చెయ్యటానికి అనుకూలంగా ఉంటుంది. అటువంటి సందర్భాలలో శక్తి ప్రాధాన్యతతో కూడిన లగ్రాంజ్-హేమిల్టన్ (Lagrangian and Hamiltonian) పద్ధతులు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటివి.
బాగా ముగ్గిన పండు చెట్టుని వదలి భూమి మీదకి పడుతోందంటే ఆ పండుని ఏదో అదృశ్యమయిన బలం కిందికి లాగుతున్నాదనే భావన కలగక మానదు. పైనుండి కిందకి పడే వాటన్నిటికి ఉమ్మడిగా కిందను ఉన్నది భూమే కనుక భూమి ఆ వసువుని ఆకర్షింఛటం వల్ల ఆ వస్తువు కిందకి పడుతున్నాదని సిద్ధాంతీకరించవచ్చు. పరిశీలనా దక్షుడయిన నూటన్ ఏమన్నాడంటే "చెట్టునున్న పండునే కాదు, ఆకాశంలో ఉన్న చంద్రుడిని కూడ భూమి ఆకర్షిస్తున్నాది" అన్నాడు. అంతే కాదు "విశ్వంలో ఉన్న ప్రతి వస్తువూ ప్రతి ఇతర వస్తువునీ ఆకర్షిస్తున్నాది" అన్నాడు. "ఈ ఆకర్షణ ప్రభావం వల్లనే గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి" అని కూడా అన్నాడు. ఇదే నూటన్ ప్రవచించిన గురుత్వాకర్షణ సిద్ధాంతం.
గురుత్వాకర్షణలో ఒక భాగమే భూమ్యాకర్షణ. భూమ్యాకర్షణ లక్షణం ఏమిటంటే తన చేరువలో 'పై నుండి కిందకి' పడే ప్రతి వస్తువులోనూ ఒకే 'సమ త్వరణం' (uniform acceleration) కలిగించటం. దీనిని g అనే ఇంగ్లీషు అక్షరంతో సూచించం సంప్రదాయం. దీని విలువ సుమారుగా 980 సెంటీమీటర్లు/సెకండు2. ఈ సమ త్వరణం సదిశ రాశి (vector). దీని దిశ ఎల్లప్పుడూ భూమి కేంద్రం వైపే చూపుతూ ఉంటుంది.
సమవృత్తాకార చలనంలో ఉన్న ఒక వస్తువుపై కేంద్రానికి బయటివైపు పనిచేస్తూ భ్రమణ చట్రంలో మాత్రమే గమనించటానికి వేలైన బలాన్ని అపకేంద్ర బలం అంటారు.
రేఖీయ మార్గంలో చలించే కణాన్ని వృత్తాకార మార్గంలో చలించేందురు అవిచ్ఛిన్నంగా పనిచేసే బలాన్ని అభికేంద్ర బలం అంటారు.