శోభన్ (1968-2008) ఒక తెలుగు సినిమా దర్శకుడు. వర్షం సినిమా దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు. మహేష్ బాబు హీరోగా బాబీ అనే సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు.[2]
ఇతని సోదరుడు లక్ష్మీపతి సినీ నటుడు. ఇద్దరు అన్నదమ్ములూ ఒక వారం తేడాతో మరణించారు.
కెరీర్
1989లో సినీ పరిశ్రమలో ప్రవేశించడానికి చెన్నై వెళ్ళాడు. రౌడీయిజం అనే సినిమాకు కొద్ది రోజుల పాటు పనిచేసాడు. కానీ కొన్ని కారణాల వలన 10 రోజులకు ఆ సినిమా ఆగిపోయింది. తరువాత రాంగోపాల్ వర్మ దగ్గర అనగనగా ఒక రోజు అనే సినిమాకు సహాయ దర్శకుడిగా చేరాడు. ఆయనతోనే ప్రేమకథ, దావూద్ అనే సినిమాలకు పనిచేశాడు.[1] కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సింధూరం సినిమాకు రచయితగా పనిచేశాడు. క్షణ క్షణం, ఒక రాజు ఒక రాణి అనే సినిమాల్లో కూడా నటించాడు. మురారి సినిమాకు కూడా కృష్ణవంశీతో కలిసి పనిచేశాడు. ఆ సమయంలో మహేష్ బాబు తో కలిగిన పరిచయంతో బాబీ సినిమాతో దర్శకుడిగా అవకాశం వచ్చింది.[2] ఎం. ఎస్. రాజు నిర్మించగా ప్రభాస్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన వర్షం సినిమా అతనికి దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. రవితేజ, ఛార్మి, అంజలి నటించిన చంటి సినిమా అతని ఆఖరి సినిమా. ఇది బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేదు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు కి కూడా సన్నిహితుడుగా ఉండేవాడు.[1]
మరణం
శోభన్ కథానాయిక భూమిక ఇంట్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చి కూలబడిపోయాడు. భూమిక, ఆమె భర్త అతన్ని హైదరాబాదు మాదాపూరులోని ఇమేజ్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు తెలియజేశారు.[3] అప్పటికి అతని వయస్సు 40 సంవత్సరాలు. భార్య సౌజన్య, ఇద్దరు కుమారులతో కలిసి నివసించేవాడు.
మూలాలు