వైకోం నారాయణ జానకి (1923 నవంబరు 30 - 1996 మే 19) (జానకీ రామచంద్రన్ గా సుపరిచితురాలు) తమిళనాడు 4వ ముఖ్యమంత్రి. ఆమె తమిళ సినిమానటి, రాజకీయ నాయకురాలు. ఆమె తమిళనాడు 3వ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎం.జి.రామచంద్రన్ భార్య . భర్త మరణించిన తరువాత ఆమె ముఖ్యమంత్రి పదవిలో 23 రోజులు కొనసాగారు. [3] ఆమె తమిళనాడు రాష్ట్ర మొదటి మహిళా ముఖ్యమంత్రిగా, భారతదేశంలో సినిమా నటి నుండి ముఖ్యమంత్రి పదవిని పొందిన వారిగా గుర్తింపు పొందింది.
తొలినాళ్ళ జీవితం
జానకీ రామచంద్రన్ కేరళ రాష్ట్రం, కొట్టాయంలోని వైకోం పట్టణంలో రాజగోపాల్ అయ్యర్, నారాయణి అమ్మా దంపతులకు జన్మించింది. ఆమె సోదరుడు పి.నారాయణన్ విద్యావేత్త. ఆమె బాబాయి పాపనాశం శివన్ పేరొందిన కర్ణాటక సంగీత విద్వాంసుడు, కన్నడ సినీ రంగంలో సంగీత దర్శకుడు. 1940లలో ఆమె విజయవంతమైన నటిగా కొనసాదింది. దాదాపు 25 సినిమాల్లో నటించింది. రాజా ముక్తి, వెలైకారి, ఆయిరం తలైవంగైయా అబూర్వ చింతామణి, దేవకి, మరుధనట్టు ఇలవరసి వంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. ఎం.జి.రామచంద్రన్ తన ఆత్మకథలో జానకి గురించి రాస్తూ 1940, 50లలో నటునిగా తాను సంపాదించేదానికన్నా, ఆమె ఎక్కువ సంపాదించేవారని ప్రస్తావించారు.
వ్యక్తిగత జీవితం
ఆమె 1939లో తన 16వ ఏట ఆమె వివాహం గణపతి భట్ తో జరిగింది. వీరిద్దరికీ సురేంద్రన్ అని కుమారుడు ఉన్నాడు. ఆ తరువాత 1963లో ఎం.జి.రామచంద్రన్ ను వివాహం చేసుకుంది.
రాజకీయ జీవితం
1987లో ఎం.జి.రామచంద్రన్ మరణించిన తరువాత, జానకి తమిళనాడుకు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టింది. ఎడిఎంకె పార్టీకి నాయకురాలిగా కూడా ఎన్నికైంది. జనవరి 1988లో ఆమె భర్త రామచంద్రన్ చనిపోయాక ఆమె ముఖ్యమంత్రిగా పనిచేసింది. కానీ ఆమె ప్రభుత్వం 23 రోజులు మాత్రమే అధికారంలో ఉంది. తమిళనాడు చరిత్రలో అతితక్కువ రోజులు ఉన్న ప్రభుత్వం ఇదే. అసెంబ్లీలో 1988లో విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఆమె ప్రభుత్వం గెలిచినా, కేంద్రంలో ఉన్న రాజీవ్ గాంధీ ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం జానకి ప్రభుత్వాన్ని రద్దు చేసింది. 1989లో జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ ఓడిపోయింది. అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కళికం రెండు చీలికలుగా విడిపోవడంతో ఆమె రాజకీయల నుంచి బయటకు వచ్చేసింది.[4]
మరణం
1996 మే 19న జానకి గుండె పోటుతో మరణించింది.
దాతృత్వం
1986లో జానకి అవ్వాయ్ షణ్ముగం సలయ్ లోని తన ఆస్తిని భర్త రామచంద్రన్ జ్ఞాపకార్ధం ఎ.ఐ.డి.ఎం.కె పార్టీకి రాసిచ్చేసింది. అదే ఆ పార్టీకి ప్రధాన కార్యాలయంగా ఉంది. టి.నగర్ లోని ఆర్కాట్ వీధిలో ఉన్న తన ఇంటిని 1988లో డాక్టర్.ఎం.జి.ఆర్ మెమోరియల్ హౌస్ గా విల్లు రాసింది.[5] సత్య విద్య, స్వచ్చంద సంస్థను స్థాపించింది. ఈ సంస్థకు ఆమె చైర్మెన్ గా వ్యవహరించింది. ఈ సంస్థ చెన్నైలో ఎన్నో ఉచిత విద్యా సంస్థలను నడుపుతోంది. తమిళనాడులోని ఎన్నో స్వచ్చంద సంస్థల కోసం ఎన్నో మిలియన్ డాలర్లు విలువ చేసే ఆస్తిని రాసింది.[6] జానకి రామచంద్రన్ విద్య, స్వచ్చంద ట్రస్టును స్థాపించింది. ఈ సంస్థ ఉపయోగించుకుంటున్న భూములు ఆమె రాసిచ్చినవే. అవన్నీ ఎన్నో మిలియన్ డాలర్ల విలువైనవి కావడం విశేషం.[7][8]