తెలుగు సాహిత్యాన్ని అధ్యయనా సౌలభ్యం కోసం కొన్ని యుగాలుగా విభజిస్తారు. ఈ విభజన వివిధ పరిశోధకులు వివిధ ప్రమాణాలతో చేశారు. ఆయా కాలాలలో ఉన్న కవుల పేర్ల మీద గాని, లేదా పాలనాధికారుల పేర్లమీద గాని, లేదా కాలానుగుణంగా గాని ఈ యుగాలకు పేర్లు పెట్టారు.
యుగ విభజన సౌలభ్యం
యుగ విభజన అనేది అధ్యయనంలో ఒక కొండగుర్తుగా ఉపయోగపడుతుంది. కొన్ని విశిష్టమైన, సమానమైన ధర్మాలు గల కాలాన్ని ఒక "యుగం" అని వ్యవహరిస్తారు.[1] అంటే ఒక కాలంలోని సాహిత్యంలో సమానమైన, లేదా విలక్షణమైన అంశాలను ఆ యుగం పేరుతో గుర్తిస్తారు. యుగ విభజన ఎలా చేసినా గాని అది సమగ్రం, నిర్దుష్టం అని చెప్పలేము. అందేదో ఒక విధముగా అతి వ్యాప్తి, అవ్యాప్తి దోషములు కనిపిస్తూనే ఉంటాయి. ఒకే విధమైన కావ్యములు వివిధ కాలాలలో వెలువడవచ్చును. ఒకే కాలంలో బహువిధాలైన రచనలు కూడా రావచ్చును. ఒక కాలంలో పెక్కురు ఉద్ధండులైన పండితులుండవచ్చును. వాఙ్మయకారులు తమ అభిరుచిని బట్టి సౌకర్యం కోసం ఎలాగైనా యుగ విభజన చేయవచ్చును.[2]
వాఙ్మయంలో అంతర ప్రవృత్తి, బాహ్య ప్రవృత్తి అనే రెండు అంశాలున్నాయి. ఇవి కాలాన్నిబట్టి మారడం మనం గ్రహించవచ్చును. అందుకు బయటి భాషా, జాతుల సంపర్కం ఒక కారణం. సమాజాంతర్గతమైన మార్పులు మరొక కారణం. సాహితీ ప్రక్రియలలో అంతకు ముందు కాలంనుండి ఒక ముఖ్యమైన మార్పు సంభవించిన "హద్దు"ను యుగం మారందని చెప్పే సమయంగా భావించవచ్చును. సాహిత్య చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు సాహితీమూర్తులనే యుగకర్తలుగా గుర్తించడం భావ్యం అని పింగళి లక్ష్మీకాంతం అభిప్రాయం.Gudipati Suresh
యుగ విభజన విధానాలు
రచనా సౌలభ్యం కోసం సాహితీ చరిత్రాధ్యయనకారులు వాఙ్మయ చరిత్రను కొన్ని యుగములుగా విభజిస్తారు.
- కందుకూరి వీరేశలింగం - తమ "ఆంధ్ర కవుల చరిత్ర"లో "ప్రాచీన కవులు", "మధ్యయుగ కవులు", "ఆధునిక కవులు" అని విభజించాడు. అతడు వ్రాసినది కవుల చరిత్ర గనుక ఇది సమంజసము.
- కాళ్ళకూరు నారాయణరావు - అజ్ఞాత యుగం, ప్రాచీన యుగం, మధ్యయుగం .. ఇలా విభజించాడు.
- కొందరు రాజ వంశములను బట్టి విభజించారు - చాళుక్య యుగము, రెడ్డి రాజ యుగము, విజయనగర యుగము ఇలా.. ఆరుద్ర తన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో ఈ విధానం అవలంబించాడు.
- ఆయా కాలాలలో వెలువడిన సాహిత్య ప్రక్రియలను బట్టి - పురాణ యుగము, కావ్య యుగము, ప్రబంధ యుగము, గద్య గేయ యక్షగాన యుగము, ఖండకావ్య (భావ కవితా) యుగము ఇలా..
- ఆయా కాలాలలో ప్రసిద్ధులైన, ఇతరులకు మార్గ దర్శకులైన కవులను బట్టి - నన్నయ యుగము, తిక్కన యుగము, శ్రీనాథ యుగము ఇలా..
- దివాకర్ల వేంకటావధాని - తన "ఆంధ్ర వాఙ్మయ చరిత్రము"లో - కావ్య ప్రక్రియలను బట్టి - ప్రాఙ్నన్నయ యుగము, భాషాంతరీకరణ యుగము, కావ్య యుగము, ప్రబంధ యుగము, దక్షిణాంధ్ర యుగము, ఆధునిక యుగము
- పింగళి లక్ష్మీకాంతం - "ఆంధ్ర సాహిత్య చరిత్ర"లో - మిశ్రమమైన విధానాన్ని అవలంబించాడు. - ప్రాఙ్నన్నయ యుగము, నన్నయ యుగము, తిక్కన యుగము, శ్రీనాథ యుగము, రాయల యుగము ఇలా..
- ఆయాకాలాలలో సాహితీ విషయాలకు అనుగుణంగా - భారత కవులు, శివకవులు, రామాయణ కవులు, శతక కవులు, ప్రబంధ కవులు, వాగ్గేయకారులు .. ఇలా..
కవుల ననుసరించి
పింగళి లక్ష్మీకాంతం తన "ఆంధ్ర సాహిత్య చరిత్ర"లో "యుగకర్త"లైన మహాకవులను ఆయా యుగాలను గుర్తించే దీపస్తంభాలుగా పరిగణించాడు. ఈ విధానాన్ని చాలామంది అంగీకరించారు.[1]
తెలుగు వికీపీడియాలో వ్యాసాల విభజన, వర్గీకరణ, మూసలకు ఈ విభజననే పాటించడం జరుగుతున్నది.
తన విభజన విధానాన్ని వివరిస్తూ పింగళి లక్ష్మీకాంతం ఇలా చెప్పాడు - "యుగ విభాగము సహేతుకముగా (రేషనల్ గా) ఉండవలెను. కాని నిర్హేతుకముగా వుండ చనదు. ఎవరి చిత్తము వచ్చినట్లు వారు (యథేచ్ఛగా) చేయరాదు . ఆయుగకర్తల పేరు మీదుగా వాఙ్మయ చరిత్రను విభాగము చేయుట సమంజసమైన పద్ధతి. .. సాహిత్య చక్రవర్తులగు కవి సార్వభౌములకు మారుగా వారికాశ్రయమునిచ్చిన ధారుణీశ్వరులను సారస్వత సింహపీఠిక నుంచుట అన్యాయము. ఏ యగమునందైనను ఒక రాజు ప్రశస్తమైన కవి కూడనైనచో ఆ యుగమతని పేరుమీద నుంచదగును. అదియు నాతని కవిగా నెంచియే.. .. ఆ రాజులు పోయిరి. ఆ వంశములును ఏనాడో అస్తమించిపోయినవి. ఇక కవిరాజులు వారి గ్రంథ రూపములలో సజీవులైయున్నారు. వీరిని త్రోసిపుచ్చి గతించినవారికై అన్వేషణ జరుపుట భావ్యము కాదు. వారి రాజ్యముల కంటెను వీరి (సాహితీ) రాజ్యములు స్థిరములు, అజరామరములు. .. ఆంధ్ర కావ్య పథమును తీర్చి దిద్దిన మహాకవి నన్నయ పేరుమీద ఈ యుగ విభజన ఆరంభమగుచున్నది" [3]
- ప్రాఙ్నన్నయ యుగము : సా.శ. 1000 వరకు
- నన్నయ యుగము : 1000 - 1100
- శివకవి యుగము : 1100 - 1225
- తిక్కన యుగము : 1225 - 1320
- ఎఱ్ఱాప్రగడ యుగము : 1320 - 1400
- శ్రీనాధుని యుగము : 1400 - 1500
- రాయల యుగము : 1500 - 1600
- దక్షిణాంధ్ర యుగము లేదా నాయకరాజుల యుగము : 1600 - 1775
- క్షీణ యుగము : 1775 - 1875
- ఆధునిక యుగము : 1875 నుండి
పాలకుల, పోషకుల ననుసరించి
సాహిత్యాభివృద్ధికి పోషకులు కూడా ముఖ్య కారణం గనుక ఈ విభజన చేయబడింది. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో ఈ పద్ధతి వాడాడు.
- చాళుక్య యుగము
- కాకతీయ యుగము
- పద్మనాయక యుగము
- రెడ్డి రాజుల యుగము
- తొలి రాయల యుగము
- మలి రాయల యుగము
- నవాబుల యుగము
- నాయక రాజుల యుగము
- కడపటి రాజుల యుగము
- కుంఫిణీ యుగము
- జమీందారీ యుగము
- ఆధునిక యుగము
సాహితీ ప్రక్రియలననుసరించి
ఒక్కో యుగంలో వెలువడిన రచనా రీతులను అనుసరించి ఈ విభజన చేయబడింది.
- ప్రాఙ్నన్నయ యుగము (అజ్ఞాత యుగము, శాసన యుగము)
- భాషాంతరీకరణ యుగము (పురాణ కావ్య యుగము)
- కావ్య యుగము
- ప్రబంధ యుగము
- గద్య, గేయ, యక్షగాన యుగము
- దక్షిణాంధ్ర యుగము
- ఆధునిక యుగము - ఖండకావ్య (భావ కవితా) యుగము
ఇవి కూడా చూడండి
వనరులు
- పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
- దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - ప్రచురణ : ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు (1961) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
- ద్వా.నా. శాస్త్రి - తెలుగు సాహిత్య చరిత్ర - ప్రచురణ : ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)
- కాళ్ళకూరు వెంకటనారాయణరావు - ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము (1936) - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
మూలాలు
- ↑ 1.0 1.1 ద్వా.నా. శాస్త్రి - తెలుగు సాహిత్య చరిత్ర
- ↑ దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్రము
- ↑ పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర
బయటి లింకులు