అతిథి 2007లో విడుదలైన ఒక తెలుగు సినిమా. మహేష్ బాబు హీరోగా నటించాడు. ఈ సినిమాకు ముందు విడుదలైన మహేష్ బాబు సినిమా పోకిరి తెలుగు చలన చిత్ర రంగంలో సంచలనాత్మక విజయం సాధించగా, వెంటనే వచ్చిన సైనికుడు చిత్రం భాక్సాఫీస్ దగ్గర విఫలమైన నేపథ్యంలో ఈ సినిమా విడుదలయ్యింది. "థమ్సప్" శీతల పానీయాల ప్రకటనలకు ఈ సినిమాలోని హీరో పాత్రను వాడారు.
ఢిల్లీలో ఒక కుర్రవాడు బెలూన్లు అమ్ముకుంటుంటాడు. అతడు ఒక పాపకు బెలూన్ ఇచ్చిన తరువాత జరిగే ఘటనలవల్ల ఆ పాప కుటుంబం ఆ కుర్రవాడిని తమ ఇంటికి "అతిథి"గా ఆహ్వానిస్తారు. ఒకమారు కొందరు దుండగులు ఆ పాప తల్లిదండ్రులను చంపగా ఆ నేరం అతిథిపై పడుతుంది. అతను అరెస్టవుతాడు. ఆ పాప కూడా అతనిని అసహ్యించుకుంటుంది.
14 సంవత్సరాల తరువాత అతిథి (ఇప్పుడు మహేష్ బాబు) జైలునుండి విడుదలయ్యాక అమృత (అమృతారావు) అనే యువతికి పరిచయమౌతాడు. వారి మధ్య ప్రేమ పెరిగింది. అయితే ఆమె తల్లిదండ్రులే ఇంతకు ముందుకు హత్య చేయబడ్డారని, అందువల్ల ఆ యువతి ఇప్పటికీ "అతిథి"ని ద్వేషిస్తున్నదనీ అతనికి తెలుస్తుంది. హైదరాబాదు చేరిన అమృతను చంపాలని ఆ పాత రౌడీ విలన్ కైజర్ ప్రయత్నిస్తున్నాడని హీరో తెలుసుకుంటాడు. అంతే కాకుండా నిజాయితీ పరునిగా పేరుపడ్డ ఒక పోలీసు ఆఫీసర్, గూండా లీడర్ కైజర్ ఒకరేనని కూడా హీరో తెలుసుకుంటాడు.
ఆ విలన్ హీరోయిన్‌ను ఎత్తుకుపోతాడు. అతనినుండి హీరోయన్‌ను రక్షించుకోవడం పతాక సన్నివేశం.
మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో 6 పాటలున్నాయి. ఆడియో విడుదల సెప్టెంబరు 27, 2007న జరిగింది.