హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాలోని, హయత్‌నగర్ మండల కేంద్రంలో ఉన్న డిగ్రీ కళాశాల. హైదరాబాదు నగరానికి సమీపంలో ఉండటంతో హయత్‌నగర్ పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన విద్యార్థులు వచ్చి ఈ కళాశాలలో చదువుకుంటున్నారు.[1]
ప్రారంభం
2008లో హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభించబడింది. ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయంకు అనుబంధంగా ఉన్న ఈ కళాశాలకు న్యూఢిల్లీలోని యుజిసీ ద్వారా 2ఎఫ్ హోదా కల్పించబడింది.[2]
విద్యార్థులు
2021-22 విద్యా సంవత్సరంనాటికి ఈ కళాశాలలో 1505 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ఇందులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా దూర విద్యను అందిస్తున్నారు. అధ్యాపకులు, విద్యార్థుల మధ్య ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ కోసం ఫోరమ్‌లు, సెమినార్లు నిర్వహిస్తున్నారు.
ప్రాంగణం
తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో 1.5 ఎకరాల్లో 2.25 కోట్ల రూపాయలతో నూతన భవన నిర్మించారు. మిగిలిన 3.5 ఎకరాల స్థలంలో ట్రాక్‌లు, క్రీడా మైదానం, ఇతర అవసరాలకు ఉపయోగించారు.
సదుపాయాలు
- డిజిటల్ క్లాస్ రూమ్‌లు, ప్రొజెక్టర్లు, వర్చువల్ క్లాస్ రూమ్‌లు, గ్రీన్ బోర్డులు, కంప్యూటర్ సిస్టమ్స్ టీచింగ్ లెర్నింగ్ ఎయిడ్‌లు, రెండు ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు, ఎన్‌సీసీ, అధునాతన కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, ప్రయోగశాలలు ఉన్నాయి.
- ప్రతి సంవత్సరం హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సాహిత్య సంచిక (వేకువ)ను ప్రచురిస్తున్నారు. విద్యార్థులు రాసిన కవితలు, వ్యాసాలు, కథలు మొదలైనవి ఆ పుస్తకంలో ప్రచురిస్తారు.
- 2010 నవంబరు 26 నుండి గ్రంథాలయం కోసం పుస్తకాలను కొనుగోలును ప్రారంభించారు. కొత్త భవనంలో 2019 ఆగస్టు 1న గ్రంథాలయానికి ప్రత్యేక గది కేటాయించబడింది. 2020 మార్చి 31 నాటికి గ్రంథాలయంలో 4,826 పుస్తకాలు ఉన్నాయి. 2020-21 సంవత్సరాల్లో వచ్చిన 561 పుస్తకాలతో కలిపి 5,387కి పెరిగింది.[3]
న్యాక్ గుర్తింపు
న్యాక్ గ్రేడ్ లో భాగంగా 2022 జూన్ 8, 9 తేదీల్లో జైపూర్ నేషనల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ అంజనా శర్మ, మిజోరం యూనివర్సిటీ ప్రభుత్వ పాలనా శాస్త్ర విభాగ ప్రొఫెసర్ శ్రీనివాస్ పతి, హుబ్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ప్రిన్సిపాల్ డాక్టర్ చెన్నబసవ గౌడ యత్నల్లితో కూడిన న్యాక్ ప్రతినిధుల బృందం కళాశాలను సందర్శించింది.
మూలాలు
బయటి లింకులు