రన్ రేట్

క్రికెట్‌లో, రన్ రేట్ (RR), లేదా ఓవర్‌కు పరుగులు (RPO) అంటే బ్యాటింగ్ జట్టు ఒక ఓవర్‌కు చేసిన సగటు పరుగుల సంఖ్య. [1] ఆటలో ఆ సమయానికి ఆ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ జట్టు చేసిన పరుగులు, బ్యాట్స్‌మెన్ చేసిన పరుగులు, బౌలింగ్ జట్టు ఇచ్చిన ఎక్స్‌ట్రాలు కలిసి ఉంటాయి.

విలువలు

మంచి రన్ రేట్ అనేది పిచ్ స్వభావం, మ్యాచ్ రకం, ఆట స్థాయిని బట్టి ఉంటుంది. ఐదు రోజుల పాటు జరిగే టెస్ట్ మ్యాచ్‌లో సాధారణంగా పరిమిత ఓవర్ల ఆట కంటే తక్కువ రన్ రేట్‌ ఉంటుంది, ఎందుకంటే బ్యాట్స్‌మెన్ మరింత జాగ్రత్తతో కూడిన విధానాన్ని అవలంబిస్తారు. ఇటీవలి సంవత్సరాలలో, సగటు టెస్ట్ రన్ రేట్ ఓవర్‌కు 3 - 3.5 పరుగుల మధ్య ఉంటోంది. కొన్నిసార్లు ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు.[2] అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ గెలవడానికి అవసరమైన స్కోరును సాధించడానికి మరింత దూకుడు విధానాన్ని అవలంబించాలి. వన్డే ఇంటర్నేషనల్ (50 ఓవర్లు) క్రికెట్‌లో, 1970లలో మొదటిసారిగా ఆడినప్పుడు సగటు రన్ రేట్ దాదాపు 4 ఉండేది. అది ఇటీవలి సంవత్సరాలలో 5కి పైగా పెరిగింది. కేవలం ఇంగ్లండ్ మాత్రమే ఓవర్‌కు 9 పరుగుల కంటే ఎక్కువ పరుగులు చేసింది.[3] 8 లేదా 7 రేట్‌తో పరుగులు చేయడం మంచి రన్ రేట్. ఎందుకంటే ఉన్నది 50 ఓవర్లే. వికెట్లు కోల్పోవడం ఎల్లప్పుడూ ఆందోళన కలిగిస్తుంది.[4] 20 ఓవర్ల ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సగటు రన్ రేట్ ఓవర్‌కు 8 - 9 పరుగుల మధ్య ఉంటుంది. ఇది చిన్న ఫార్మాట్, దీనిలో ఎక్కువ పరుగులు చేయడం అవసరం. అత్యధిక రన్-రేట్ 13-14 వద్ద ఉంది.[5]

ఎక్స్‌ట్రాలు, ఓవర్‌త్రోలు లేకుండా, సాధ్యమయ్యే గరిష్ట రన్ రేట్ 36 – ప్రతి బంతిని సిక్స్ కొట్టడం అన్నమాట. ఇప్పటి దాకా పూర్తయిన మ్యాచ్‌లో ఇది ఎప్పుడూ జరగలేదు. ఒకే ఓవర్‌లో కూడా చాలా చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది.

ఉపయోగాలు

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రన్ రేట్ ప్రధాన ఉపయోగం బ్యాటింగ్ జట్టు సాధించిన రన్ రేట్‌ను (పూర్తి ఓవర్‌కు స్కోర్ చేసిన పరుగులు) గేమ్ గెలవడానికి అవసరమైన రన్ రేట్‌తో (ఇంకా మిగిలి ఉన్న ఓవర్లలో ఒక్కో ఓవరుకూ చెయ్యాల్సిన పరుగులు) పోల్చడం. సాధారణంగా ఆఖరి ఓవర్లలో జట్లు తమ రన్ రేట్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఫీల్డింగ్ పరిమితి నియమాలును (ఇప్పుడు పవర్‌ప్లేస్‌ అంటున్నారు), ఇన్నింగ్స్‌లో తొలి భాగంలో వేగంగా స్కోర్ చేయడాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగిస్తారు.

ఆట ముగిసే సమయానికి దగ్గరగా ఉన్నపుడు, అవసరమైన రన్ రేట్‌ను ఉపయోగించకుండా మిగిలిన బంతులు, అవసరమైన పరుగులు గమనిస్తూ ఉండడం సర్వసాధారణం (అనగా, మిగిలిన 3 ఓవర్లలో 6 అవసరమైన రన్ రేట్ చెప్పడానికి బదులుగా, మిగిలిన 18 బంతుల్లో 18 పరుగులు అవసరమని చెప్పడం).

డక్‌వర్త్ లూయిస్ పద్ధతి రాకముందు, వర్షం వలన గానీ, వెలుతురు తగ్గిన కారణంగా గానీ (సగటు రన్ రేట్ పద్ధతిలో) తగ్గించబడిన గేమ్‌లో విజేతను నిర్ణయించడానికి ఉపయోగించే అనేక పద్ధతులలో రన్ రేట్ ఒకటి. ఇది సాధారణంగా నెట్ రన్ రేట్ పద్ధతిలోనే జరిగినప్పటికీ, అదే గెలుపు-ఓటముల రికార్డుతో లీగ్ పట్టికలో జట్లను వేరు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Macintosh, Iain (2012). Everything You Ever Wanted to Know About Cricket But Were Too Afraid to Ask. London: A & C Black. p. 120. ISBN 9781408174340. Retrieved 11 November 2014.
  2. "Aggregate/overall records | Test matches | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2019-08-05.
  3. "RECORDS / ONE-DAY INTERNATIONALS / TEAM RECORDS / HIGHEST INNINGS TOTALS". ESPN CricInfo.
  4. "Aggregate/overall records | One-Day Internationals | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2019-08-05.
  5. "Aggregate/overall records | Twenty20 Internationals | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2019-08-05.

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!