రన్ రాజా రన్ 2014 లో సుజీత్ దర్శకత్వంలో విడుదలైన ఓ తెలుగు సినిమా.[2] శర్వానంద్, సీరత్ కపూర్, అడివి శేష్, కోట శ్రీనివాసరావు, సంపత్ రాజ్ ఇందులో ప్రధాన పాత్రధారులు. ఆగస్టు 1, 2014 న విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి మంచి సమీక్షలనందుకుంది.[3][4]
ఉత్తమ హాస్య నటి , విద్యుల్లేఖ రామన్ , నంది పురస్కారం
కథ
రాజా (శర్వానంద్) ఒక సాధారణ కూరగాయల వ్యాపారి కొడుకు. తన నిజాయితీ ప్రవర్తనతో విసిగి అతన్ని ప్రేమించిన అమ్మాయిలంతా విడిపోతూ ఉంటారు. ఒకసారి అతను ప్రియ (సీరత్) తో పరిచయమై అది ప్రేమగా మారుతుంది. అదలా ఉండగా అచ్చం కొన్ని సంవత్సరాల క్రితం నగరంలో జరిగిన విధంగా మంత్రులు అపహరణకు గురవుతూ ఉంటారు. అప్పుడు ఆ మిస్టరీని ఛేదించిన పోలీసు కమీషనర్ దిలీప్ (సంపత్ రాజ్) కింద నయీం బాషా (అడివి శేష్) అనే చలాకీ ఆఫీసరు పని చేస్తూ ఉంటాడు. కొద్ది రోజుల్లోనే రాజాకి ప్రియ కమీషనర్ కూతురనీ, మంత్రి కొడుకుతో వివాహం జరగబోతుందని దిలీప్ ద్వారా తెలుసుకుంటాడు. దిలీప్ రాజా తన కూతుర్ని ప్రేమించడం ఇష్టం లేక అతన్ని వదిలించుకోవడానికి అతన్ని కేసులో ఇరికించడానికి నగరంలో ఓ ప్రముఖుణ్ణి కిడ్నాప్ చేయమని ఒప్పిస్తాడు. కానీ రాజా ప్రియను అపహరిస్తాడు. ప్రియ మాత్రం తాను రాజాను ప్రేమించలేదనీ పెళ్ళి తప్పించుకుని పై చదువుల కోసం విదేశాలను వెళ్ళడానికే అలా నటించానని చెబుతుంది.
రాజా దీంతో కలత చెందినా ఆమెను తన స్నేహితురాలి ఇంటికి చేరుస్తాడు. దిలీప్ ఆ మంత్రికి తెలియకుండా కూతురు జాడ కనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు కానీ కుదరదు. ఓ సారి దిలీప్ మంత్రితో ఉండగా రాజా ఫోన్ చేసి మూడు కోట్లు ధనం అడుగుతాడు. అప్పుడు నయీం రాజానే దొంగ అనీ దిలీప్ అతన్ని మోసం చేయబోయి తానే మోసపోయాడని తెలియజేస్తాడు. ప్రియకి రాజా తనను విడుదల చేయడానికి డబ్బు అడిగాడని తెలుస్తుంది. ఆమె అదే విషయం రాజాను ప్రశ్నిస్తుండగానే ఆమె తండ్రి వచ్చి రాజాను అరెస్టు చేస్తాడు. దొంగ దొరికినందుకు దిలీప్ సంతోషిస్తుంటాడు. అంతలోనే మంత్రి కొడుకు ఎవరో అపహరించి 15 కోట్లు అడుగుతారు. దిలీప్ పోలీసు స్టేషన్ కు వెళ్ళి చూస్తే అక్కడ రాజా కనిపించడు. ఈ లోపు ప్రియ తల్లి ద్వారా రాజా తండ్రి, దిలీప్ గతస్నేహం గురించి తెలుసుకుంటుంది. రాజా తండ్రి కరీమ్ బాషా అనే సిన్సియర్ పోలీసును తన స్వంత కుటుంబంలో వాడిగా చూస్తుంటాడు. రాజా తండ్రి నగరంలో జరుగుతున్న కిడ్నాపులను మంత్రే పథకం ప్రకారం చేస్తున్నాడని కనుక్కుంటాడు. దాంతో ఆయన మంత్రిని అరెస్టు చేయడానికి వెళితే అక్కడ దిలీప్ అదంతా తన ప్రణాళిక అని చెబుతాడు. అక్కడ జరిగిన పెనుగులాటలో మంత్రి కరీంను చంపేస్తాడు. దాంతో ఆగ్రహం వచ్చిన రాజా తండ్రి మంత్రి గొంతులో కాలుస్తాడు. అతని మీద అన్యాయంగా కిడ్నాప్ కేసు మోపుతారు. అతను జైలు పాలవుతాడు.
ఇంతలో దిలీప్ నయీమ్, రాజా తోడుదొంగలని తెలుసుకుంటాడు. నయీం మంత్రి దగ్గర 15 కోట్లు తీసుకుంటాడు. అంతలో రాజా తండ్రి నయీం చనిపోయిన కరీం కొడుకని తెలియజేస్తాడు. తరువాత రాజా దిలీప్ ఈ అపహరణకు పాత్రధారి అని ఒప్పుకున్నట్లు వీడియోతీసి మీడియా వాళ్ళకి పంపిస్తాడు. నయీం మంత్రి దగ్గర నుంచి 500 కోట్లు అపహరించి అనాథ శరణాలయానికి దానం చేస్తాడు. దిలీప్ అరెస్టవుతాడు. మంత్రి అవమానంతో తనను కాల్చుకుని చనిపోతాడు. చివరగా రాజా, ప్రియ ఒకటవడంతో కథ ముగుస్తుంది.
తారాగణం
పాటలు
ఈ సినిమాకు గిభ్రాన్ సంగీత దర్శకత్వం వహించాడు.
బుజ్జి అమ్మ బుజ్జీ అమ్మ , రచన: శ్రీమణి, గానం.బెన్నీదయాళ్ , గోల్డ్ దేవరాజు
కామ కామ కోమ , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.కునాల్ గంజ్వాల, యాజీన్ నజీర్, సునీత సారథి
రాజాధి రాజనప్ప, రచన: శ్రీమణి, గానం.తోమస్ అండ్రీస్
శాంతి ఓం శాంతి, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.క్లింటన్ సెరేజో , మాయ అయ్యర్
వద్దంటూనే నేను వద్దంటూనే , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.చిన్మయి
మూలాలు