ఫైజాబాద్ఉత్తర ప్రదేశ్ లోని ఒక నగరం. అయోధ్యతో కలిపి దీన్ని మునిసిపల్ కార్పొరేషన్ పరిపాలిస్తుంది. ఫైజాబాద్, ఫైజాబాద్ జిల్లాకు, ఫైజాబాద్ డివిజనుకూ ప్రధాన కార్యాలయంగా ఉండేది. 2018 నవంబరు 6 న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా మార్చడానికి, జిల్లా ముఖ్యపట్టణాన్ని అయోధ్య నగరానికి మార్చడానికి ఆమోదం తెలిపింది.[2][3] ఫైజాబాద్ ఘాఘ్రా నది ఒడ్డున ఉంది (స్థానికంగా దీన్ని సరయూ అని పిలుస్తారు). ఇది రాష్ట్ర రాజధాని లక్నోకు తూర్పున సుమారు 130 కి.మీ. దూరంలో ఉంది. ఇది అవధ్ నవాబుల మొదటి రాజధాని. నవాబులు నిర్మించిన.బహూ బేగం సమాధి, గులాబ్ బారి వంటి స్మారక చిహ్నాలు ఇక్కడ ఉన్నాయి.
చరిత్ర
సా.శ. 1722 లో భారతదేశంలో సంస్థానంగా ఉన్న అవధ్‌కు ఫైజాబాద్ రాజధానిగా ఉండేది. సాదత్ అలీ ఖాన్ I దాని మొదటి నవాబు. అతడే అవధ్ నవాబులకు ఆద్యుడు. అతను పురాతన నగరమైన అయోధ్య శివార్లలోని సాకేత్ వద్ద తన సొంత రాజభవనానికి పునాది వేశాడు. ఆ నగరానికి ఫైజాబాద్ అని పేరు పెట్టాడు, ఇది కొత్త ప్రభుత్వానికి రాజధానిగా మారింది. అవధ్ రెండవ నవాబు (1739–54) సఫ్దర్ జాంగ్ పాలనలో ఫైజాబాద్ మరింతగా అభివృద్ధి చెందింది. అతను దీనిని తన సైనిక ప్రధాన కార్యాలయంగా చేసుకున్నాడు. అతని వారసుడు, అవధ్ మూడవ నవాబయిన నవాబ్ షుజా-ఉద్-దౌలా షుజా-ఉద్-దౌలా దీనిని పూర్తి స్థాయి రాజధాని నగరంగా మార్చాడు.
షుజా-ఉద్-దౌలా, ఉద్యానవనాలు, రాజభవనాలు, మార్కెట్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలతో దీనిని పూర్తి స్థాయి రాజధాని నగరంగా అభివృద్ధి చేశాడు. 1764 తరువాత అతను ఫైజాబాద్ వద్ద స్థిరపడ్డాడు. చోటా కలకత్తా అని పిలిచే కోటను అక్కడ నిర్మించాడు. ప్రస్తుతం అది శిథిలావస్థలో ఉంది. 1764 లో బక్సర్ యుద్ధంలో ఓడిపోయిన తరువాత సరయూ నది ఒడ్డున అతడీ కోటను నిర్మించాడు. 1765 లో అతను చౌక్, తిర్పాలియాలను నిర్మించాడు. తరువాత అంగురిబాగ్, మోతీబాగ్, నగరానికి పశ్చిమాన అసఫ్ బాగ్, బులంద్ బాగ్‌లను నిర్మించాడు. షుజా-ఉద్-దౌలా పాలనలో ఫైజాబాద్ ఉత్తర భారతదేశంలో వర్తక వాణిజ్యాలకు ఒక ముఖ్యమైన కేంద్రంగా పరాకాష్ఠకు ఎదిగింది. ఐరోపా ఆసియాల నుండి ప్రయాణికులు, రచయితలు, వ్యాపారులు, కళాకారులు, వేశ్యలను ఈ పట్టణం ఆకర్షించింది.
షుజా-ఉద్-దౌలా పాలనలో సాధించిన ఐశ్వర్యాన్ని, సంపదను ఫైజాబాద్ ఆ తరువాత మళ్ళీ చూడలేదు. నవాబులు ఫైజాబాద్‌ను అనేక ముఖ్యమైన భవనాలతో అలంకరించారు. వాటిలో గులాబ్ బారి, మోతీ మహల్, బహూ బేగం సమాధి ఉన్నాయి. గులాబ్ బారి ఒక తోటలో, చుట్టూ గోడతో ఉంటుంది. రెండు పెద్ద ద్వారాల ద్వారా లోపలికి వెళ్ళవచ్చు. ఈ భవనాలు వాటి నిర్మాణ శైలుల దృష్ట్యా ఆసక్తికరంగా ఉంటాయి. షుజా-ఉద్-దౌలా భార్య పేరు బాహు బేగం. ఆమె 1743 లో నవాబును వివాహం చేసుకుని ఫైజాబాద్‌లో మోతీ-మహల్‌లో నివసించింది. జవహర్‌బాగ్ వద్ద ఆమె మక్బారా ఉంది. 1816 లో మరణించిన తరువాత ఆమెను అక్కడే ఖననం చేసారు. అవధ్‌లోనే అత్యుత్తమమైన భవనాలలో ఇది ఒకటి అని భావిస్తారు. ఆమె ప్రధాన సలహాదారు దరాబ్ అలీ ఖాన్ మూడు లక్షల రూపాయల వ్యయంతో ఆ భవనాన్ని నిర్మించాడు. సమాధి భవనం పైనుండి చక్కటి నగర దృశ్యాన్ని చూడవచ్చు. బహు బేగం హుందాగా ఉండే మహిళ. గొప్ప హోదా, గౌరవాలున్న మహిళ. ఫైజాబాద్ లోని చాలా ముస్లిం భవనాల నిర్మాణానికి ఆమే కారణమని చెప్పవచ్చు. 1815 లో బాహు బేగం మరణించిన తేదీ నుండి అవధ్‌ను స్వాధీనం చేసుకునే వరకు ఫైజాబాద్ నగరం క్రమంగా క్షీణించింది. నవాబ్ అసఫ్-ఉద్-దౌలా రాజధానిని ఫైజాబాద్ నుండి లక్నోకు మార్చడంతో ఫైజాబాద్ వెలుగు తగ్గి, చివరకు మరుగున పడింది.[4]
1857 నాటి సిపాయీల తిరుగుబాటు సమయంలో జరిగిన అనేక యుద్ధాలలో ఫైజాబాద్ కూడా ఒక కేంద్రం. ఫైజాబాద్ వివరణాత్మక చరిత్రను, మున్షి మొహద్ రాసిన 'తరీఖ్-ఎ-ఫరాబక్ష్' లో చదవవచ్చు. ఫైజ్ బక్ష్, (అతని పేరిటే ఫైజాబాద్‌కు ఆ పేరు పెట్టారు) షుజా-ఉద్-దౌలా దర్బారులో ఒక ఉద్యోగి. ఈ పుస్తకాన్ని హమీద్ అఫాక్ ఖురేషి 'మెమోయిర్స్ ఆఫ్ ఫైజాబాద్' గా ఆంగ్లంలోకి అనువదించాడు. మౌల్వి అబ్దుల్ హలీమ్ 'షరార్' రాసిన 'గుజిష్ట లఖ్నౌ'లో ఫైజాబాద్ గురించి ప్రముఖంగా వివరణాత్మకంగా ప్రస్తావవించాడు. అవధ్ నాల్గవ నవాబు, నవాబ్ అసఫ్-ఉద్-దౌలా, 1775 లో తల్లితో అతని సంబంధాలు చెడిపోయినపుడు అవధ్ రాజధానిని లక్నోకు మార్చాడు.[5]
భారత స్వాతంత్ర్య సమరంలో
కాకోరి కుట్ర పర్యవసానంగా అష్ఫకుల్లా ఖాన్‌ను ఫైజాబాద్ జైలులో బంధించారు. అతని సోదరుడు, రియాసత్ ఉల్లా ఖాన్ ఈ కేసును కోర్టులో వాదించడానికి సీనియర్ న్యాయవాది కృపా శంకర్ హజేలాను నియమించాడు. కానీ అది విజయవంతం కాలేదు. నలుగురు ముద్దాయిలకు (పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫకుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, ఠాకూర్ రోషన్ సింగ్ ) మరణశిక్ష విధించారు . మిగతా పదహారు మంది ముద్దాయిలకు నాలుగేళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్షలు విధించారు.
భారత జనగణన ప్రకారం, 2011 లో ఫైజాబాద్ జనాభా 1,67,544; ఇందులో పురుషులు 87,279, స్త్రీలు 80,265. పట్టణంలో లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 920. ఫైజాబాద్‌లో అక్షరాస్యులు 1,30,700 అందులో 70,243 మంది పురుషులు కాగా, 60,457 మంది మహిళలు ఉన్నారు. 2011 లో ఆరేళ్ళ లోపు పిల్లలు 16,479 మంది ఉన్నారు. 8,658 మంది బాలురు ఉండగా, 7,821 మంది బాలికలు ఉన్నారు. బాలికల పిల్లల లింగ నిష్పత్తి 903.
రాజకీయ ప్రముఖులు
ఆచార్య నరేంద్రదేవ్ :ఆచార్య నరేంద్ర దేవ్ (1889 అక్టోబరు 30 -1956 ఫిబ్రవరి19) భారతదేశ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సిద్ధాంతకర్తలలో ఒకడు.అతని ప్రజాస్వామ్య సోషలిజం, హింసాత్మక మార్గాలను సూత్రప్రాయంగా త్యజించి, సత్యాగ్రహాన్ని విప్లవాత్మక వ్యూహంగా స్వీకరించింది.[6] అతని తండ్రి బాబు బలదేవ్ సహాయ్ పజియాబాద్ లో పేరుపొందిన న్యాయవాదిగా పనిచేసాడు.[7]
వాతావరణం
శీతోష్ణస్థితి డేటా - Faizabad (1971–2000, extremes 1959–2003)
ఫైజాబాద్ జాతీయ రహదారి 28 పై ఉంది. నగరం నుండి కాన్పూర్ (213 కి.మీ.), లక్నో (127 కి.మీ.), వారణాసి (202 కి.మీ.), అలహాబాద్ (161 కి.మీ.), గోరఖ్పూర్ (165 కి.మీ.) లకు రోడ్డు సౌకర్యాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ రహదారి రవాణా సంస్థ ఈ నగరాలకు బస్సులను నడుపుతుంది. లక్నో - బరౌని జాతీయ రహదారి 27 ఫైజాబాద్‌ను ఇ నగరాలతో పాటు గోరఖ్‌పూర్‌తో కూడా కలుపుతుంది. జాతీయ రహదారి 330 నగరాన్ని అలహాబాద్, సుల్తాన్పూర్ క్లను కలుపుతుంది.. నవాబ్ యూసఫ్ రోడ్ ఫైజాబాస్‌ను వారణాసి, జౌన్పూర్ లను, జాతీయ రహదారి 330A రాయ్‌బరేలి, కుమార్‌గంజ్, జగదీష్‌పూర్ లను కలుపుతుంది.
రైలు
ఫైజాబాద్ రైల్వే స్టేషను నుండికాన్పూర్ (4 గంటలు) లక్నో (3 గంటలు), వారణాసి (4 గంటలు.), అలహాబాద్ (5 గంటలు) లకు రైలు మార్గం ఉంది.
విమానాలు
లక్నో అంతర్జాతీయ విమానాశ్రయం (128) కి.మీ.), అలహాబాద్ విమానాశ్రయం (144 కి.మీ.), వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం (200 కి.మీ.) ఫైజాబాద్‌కు దగ్గారి లోని విమానాశ్రయాలు