శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
పై ఎడమ నుండి సవ్యదిశలో: శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం, బారా షహీద్ దర్గా, పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం, పల్లిపాడు (ఇందుకూరుపేట), మైపాడు సముద్రతీరం, ఉదయగిరి కోట
Nickname: 
విక్రమ సింహపురి
Coordinates: 14°26′06″N 79°58′08″E / 14.435°N 79.969°E / 14.435; 79.969
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లా కేంద్రంనెల్లూరు
Government
 • Bodyజిల్లా కలెక్టరు కార్యాలయం
 • కలెక్టర్హరి నారాయణ్ IAS
విస్తీర్ణం
 • Total10,441 కి.మీ2 (4,031 చ. మై)
జనాభా
 (2011)[1]
 • Total24,69,700
 • జనసాంద్రత237/కి.మీ2 (610/చ. మై.)
జనగణన గణాంకాలు
Time zoneUTC+5:30 (IST)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 0( )

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (నెల్లూరు జిల్లా, ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా), భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణతీరప్రాంతపు జిల్లా. ఈ జిల్లా కేంద్రం నెల్లూరు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా 2022లో ఈ జిల్లాలోని కొంత భూభాగం తిరుపతి జిల్లాలో చేరగా, గతంలో ప్రకాశం జిల్లాలో చేరిన భాగాలను తిరిగి ఈ జిల్లాలో కలిపారు. ఈ జిల్లా వరి సాగుకు, ఆక్వా కల్చర్‌కు ప్రసిద్ధి. Map[2]

పేరు వ్యుత్పత్తి

మనుమసిద్ధి కాలంలో ఈ ప్రాంతం సస్యశ్యామలమై అత్యధిక వరి ధాన్యపు ఉత్పత్తితో విలసిల్లేది. అందుకే ఈ ప్రాంతానికి నెల్లి ( తమిళ భాషలో వరి అని అర్ధం) పేరుమీదుగా నెల్లివూరు అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశ స్థలపురాణం, చరిత్రల ప్రకారం కాలక్రమంలో నెల్లివూరు నెల్లూరుగా రూపాంతరం చెందింది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో నెల్లూరు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.

నెల్లూరు సింహపురమని, విక్రమసింహపురమని కూడా వ్యవహరింపమడేది. ఈ పట్టణ సమీపంలోని అడవులలో సింహలు పరిమితంగా ఉన్నందువలననే యీ పేరు వచ్చిందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. విక్రమసింహుడనే వాని ఆధీనంలో యీ ప్రాంతం వున్నదని, అందువలననే అతని పేరు తోనే ఈ ప్రాంతం అలా పిలువబడివుండవచ్చునని యింకొందరు భావిస్తున్నారు.

పూర్వం త్రినేత్రుడు లేక ముక్కంటిరెడ్డి అనే వ్యక్తికి నెల్లిచెట్టు అనగా ఉసిరిచెట్టు క్రింద వున్న శివలింగం వున్నచోట దేవాలయాన్ని నిర్మించమని కలలో వాణి తెలియచేసిందని, ఆ మేరకు ఆలయాన్ని ఆయన నిర్మించాడని చెబుతారు. కాల క్రమేణా నెల్లి నామం నెల్లూరుగా రూపాంతరం చెందిందంటారు.

"నెల్లూరు జిల్లా"ను ఆంధ్రరాష్ట్రం కోసం అసువలుబాసిన పొట్టి శ్రీరాములు గౌరవార్ధం "శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా"గా 2008 జూన్ 1 న మార్చారు.[3]

ఉమ్మడి జిల్లా చరిత్ర

మౌర్యులు, చోళులు, పల్లవులు

క్రీ.పూ 3వ శతాబ్దం నుండి అశోకసామ్రాజ్యంలో ఒక భాగంగా ఉండేది. నెల్లూరు ప్రాంతంలో ఉన్న గుహలలో చెక్కబడిన శిలాక్షరాలు అశోకచక్రవర్తి సమంలో ఉపయోగించిన బ్రాహ్మీ లిపిలో ఉండడం ఇందుకు ఆధారము. మౌర్యసామ్రాజ్యం అవతరించిన పిమ్మట ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాల మాదిరి నెల్లూరు కూడా మౌర్యుల ఆధీనంలోకి వచ్చింది.

భారతదేశ దక్షిణ ద్వీపకల్పంలో చోళుల సామ్రాజ్యం అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. చోళులు ప్రారంభదశ సా.శ. 1వ శతాబ్దం నుండి 4వ శతాబ్దం వరకు సాగింది. చోళులు ప్రారంభ శిలాశాసనాలు సా.శ. 1096 నుండి కనిపెట్టబడ్డాయి. జమ్మలూరులో లభించిన శిలాశాసనాలు ఇందుకు నిదర్శనం. మొదటి చక్రవర్తి అలాగే చాలా ప్రఖ్యాతి కలిగిన కరికాలచోళుని సామ్రాజ్యంలో ఈ జిల్లాను ఒక భాగంగా ఉండేది. కరికాలచోళుడు కావేరీనది మీద అద్భుతమైన కల్లణై ఆనకట్టను నిర్మించి తన నిర్మాణ కౌశలాన్ని చాటుకున్నాడు.

పల్లవ, చేర, పాండ్య రాజ్యాల నుండి 9వ శతాబ్దం వరకు సాగించిన నిరంతర దాడుల వలన చోళ సామ్రాజ్య పతన దశ ఆరంభం అయింది. సింహవిష్ణు పల్లవ రాజు చోళులను బయటకు తరిమి సా.శ. 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు నెల్లూరు మీద తన ఆధిపత్యం ప్రతిష్ఠించాడు. పల్లవుల రాజకీయ అధికార కేంద్రం ఉత్తర భూభాగంలో క్షీణించి అక్కడి నుండి దక్షిణ భూభాగం వైపు కొనసాగింది. ఉదయగిరిలో పలు పాలవ, చోళ ఆలయాలు నిర్మించబడ్డాయి. గుంటూరు, నెల్లూరు జిల్లాలలో పల్లవ, చోళుల పాలనగురించిన అనేక శిలాశాసనాలు లభించాయి. వీటిలో ఉండవల్లి గుహలలో ఉన్న నాలుగంతస్థుల గుహలు ఉన్నాయి. ప్రకాశం జిల్లా భైరవకోనలో ఉన్న పల్లవ శిల్పకళా శైలిని ప్రతిబింబిస్తున్న 8 గుహాలయాలు మహేంద్రవర్మ పాలనా కాలంలో నిర్మించబడ్డాయి.

నెల్లూరు చోళరాజులు

తెలుగు చోళులలో ఒక శాఖ, కల్యాణీకి చెందిన చాళుక్యులు కలిసి ఐక్యంగా వీరిని చోళ, చాళుక్య యుద్ధాలలో సహాయం చేసే నిమిత్తం ఇక్కడ పాకనాడు పాలకులుగా నియమించారు. వారు నెల్లూరు (విక్రమసింహపురిని)ను రాజధానిగా చేసుకుని నెల్లూరు, కడప, చిత్తూరు, చెంగల్పట్టు ప్రాంతాలను పాలించారు.

తిక్కా (1223-1248) హొయశిల, పాండ్యులను ఓడించి తొండైమండలాన్ని స్వాధీనపరచుకుని చోళస్థాపనాచార్యా బిరుదును పొందాడు. రెండవ మనుమసిద్ధి తరువాత వచ్చిన రాజ్యపాలకుడు తిక్కా కుమారుని పరిపాలనా కాలంలో (1223-1248) నెల్లూరు ఇతర చోళ, చాళుక్యుల దాడులను అనేకమార్లు ఎదుర్కొంది. తిక్క కాకతీయ రాజైన గణపతిదేవుడిని కలుసుకుని రాజుకు సైన్యసహకారం సంపాదించాడు. 1260లో మనుమసిద్ధికి కనిగిరికి చెందిన ఎర్రగడ్డపాడు రాజప్రతినిధి కాటమరాజుకు మధ్య వంశకలహాలు చెలరేగాయి. ఇద్దరి రాజకుమారుల మధ్య పచ్చిక భూములలో పశువులను మేపడానికి హక్కుల కొరకు వివాదాలు చెలరేగాయి. ఈ కలహాలు చివరకు పెన్ననది తీరంలో ముత్తుకూరు సమీపంలో ఉన్న పంచలింగాల వద్ద జరిగిన ఘోరయుద్ధానికి దారితీసింది. మనుమసిద్ధి సైన్యాలు ఖడ్గతిక్కన సైన్యాధ్యక్షతలో సాగాయి. కవి తిక్కన మేనల్లుడైన ఖడ్గతిక్కన యుద్ధంలో విజయం సాధించాడు కాని నాయకుడు పరమపదించాడు. ఈ వంశకలహాలు యుద్ధఫలితాలు కాటమరాజు కథ అనే యక్షగానరూపంలో ప్రజలమధ్య ప్రచారం అయింది. ఈ యుద్ధానికి అనంతరం కొద్ది కాలానికే మనుమసిద్ధి మరణంతో నెల్లూరు తన ప్రత్యేక గుర్తింపును కోల్పోయింది.

కాకతీయులు, పాండ్యులు, విజయనగరవాసులు

ఉదయగిరి కోట

కాకతీయులు, పడమటి కల్యాణీ చాళుక్యుల పాలెగాళ్ళు బలంపుంజుకుని స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. కాకతీయసామ్రాజ్యానికి చెందిన గణపతిదేవా అత్యధికమైన తెలుగు ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకువచ్చాడు. 13వ శతాబ్దంలో నెల్లూరు కాకతీయసామ్రాజ్యంలో ఒక భాగం అయింది. రెండవ ప్రతాపరుద్రుడు పాండ్యుల చేత ఓడించబడే వరకు నెల్లూరు ఆధిపత్యం కాకతీయులు, పాండ్యుల మధ్య మారుతూ వచ్చింది. కాకతీయసామ్రాజ్యపతనం తరువాత నెల్లూరు భూభాగం మీద తుగ్లక్ ఆధిపత్యంలోకి వచ్చింది. తరువాత నెల్లూరు కొండవీటి రెడ్ల ఆధిపత్యంలోకి మారింది.

14వ శతాబ్ధానికి నెల్లూరు జిల్లాలోని అధికప్రాంతం విజయనగర సామ్రాజ్యపు సంగమరాజ్యంలో చేరింది. సా.శ. 1512లో మిగిలి ఉన్న ఉదయగిరిని విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు జయించి స్వాధీనపరచుకున్నాడు. విజయనగర రాజుల చేత నిర్మింపబడిన శిథిలమైన కోటభాగాలు ఇంకా ఉన్నాయి.

నెల్లూరు మండలమును నాగజాతికి చెందిన దర్శి వంశపు రాజులు పాలించారు. పదిహేనవ శతాబ్ద ప్రారంభమున దర్శి పట్టణపు రాజగు ఆసనదేవమహారాజు తన తల్లి ఆర్యమదేవి పేరిట నొక చెఱువు త్రవ్వించి శాలివాహన శకము 1357వ సంవత్సరముననగా క్రీస్తు శకము 1435-36వ సంవత్సరమున నొక శాసనము వ్రాయించెను.[4]

నవాబులు, బ్రిటిష్ కాలం

విజయనగరసామ్రాజ్య పతనం తరువాత ఈ ప్రాంతం నవాబుల ఆధీనంలోకి చేరింది. 1753లో నెల్లూరు అర్కాటు నవాబు తమ్ముడైన నజీబుల్లాహ్ పాలనలోకి మారింది. మచిలీపట్నం నుండి ఫ్రెంచి వారు మద్రాసు నుండి బ్రిటిష్ వారు నజీబుల్లాహ్, ఆర్కాటునవాబులకు సహకరించగా నెల్లూరు ప్రాంతం అనేక యుద్ధాలకు సాక్ష్యంగా నిలబడింది. 1762లో బ్రిటీష్ సైన్యాలు నెల్లూరును స్వాధీనపరచుకొనడంతో ఆర్కాటునవాబు హస్తగతం అయింది. 1781 నాటికి అదాయ పంపిణీ వ్యవహారంలో భాగంగా నవాబు అజమ్ ఉద్ దౌలా మిగిలిన నెల్లూరు భాగాన్ని ఈస్టిండియా కంపెనీకి తిరిగి ఇచ్చాడు. నెల్లూరు జిల్లాను స్వాధీనపరచుకున్న ఈస్టిండియా కంపెనీ డైటన్‌ను మొదటి కలెక్టర్‌గా నియమించింది. నెల్లూరు జిల్లా ఆదాయకేంద్రంగా ప్రకటించబడింది. 1838లో కర్నూలు నవాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉదయగిరి జాగీరు విషయంలో పన్నిన కుట్ర మినహా నెల్లూరు జనజీవితంప్రంశాంతగా సాగింది.[5] బ్రిటిష్ ప్రభుత్వాధీనంలోకి వచ్చిన తరువాత నెల్లూరు జిల్లా పరిధిలో అంతగా మార్పులు జరుగ లేదు. 1904లో ప్రత్యేక గుంటూరు జిల్లా ఏర్పడిన తరుణంలో ఒంగోలు ప్రాంతం గుంటూరులో చేర్చబడింది.

స్వాతంత్ర్యం తరువాత

నెల్లూరు జిల్లా, 1953 అక్టోబరు 1 న ఆంధ్రరాష్ట్రం ఏర్పడే వరకు సంయుక్త మద్రాసు రాష్ట్రం లో భాగంగా ఉంది. 1956 నవంబరు 1వ తారీఖున భాషాప్రయుక్త రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భాగం అయింది. అప్పటి నెల్లూరు జిల్లాలో జన్మించి ఆంధ్రరాష్ట్రం కొరకు అసువులు బాసిన పొట్టి శ్రీరాములు గౌరవార్ధం "శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా"గా 2008 జూన్ 1 న మార్చారు.[3]

బెజవాడ గోపాలరెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డి నెల్లూరు జిల్లా నుండి ఎన్నికై ముఖ్యమంత్రి పదవి నిర్వహించారు. ప్రముఖ కమ్యూనిష్ఠు అయిన పుచ్చపల్లి సుందరయ్య తన ఆస్తులను నెల్లూరు జిల్లాలో ఆర్థికంగా అంతగా బలంగా లేని కమ్యూనిష్ఠు పార్టీకి అంకితం చేసాడు.

2022 ఏప్రిల్ 4 న ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. పూర్వపు ప్రకాశం జిల్లాలో గల కందుకూరు శాసనసభ నియోజకవర్గం మండలాలు మరల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపబడ్డాయి. జిల్లాలోగల సూళ్ళూరుపేట శాసనసభ నియోజకవర్గం పరిధిలో మండలాలను జిల్లా కేంద్రానికి దగ్గరలో వుంచే సౌకర్యం కొరకు, తిరుపతి జిల్లాలో కలిపారు.[1][6]

భౌగోళిక స్వరూపం

జిల్లా తూర్పున బంగాళాఖాతము, దక్షిణాన తిరుపతి జిల్లా, పశ్చిమాన అన్నమయ్య జిల్లా, వైఎస్ఆర్ జిల్లా, ఉత్తరాన ప్రకాశం జిల్లా ఉన్నాయి. జిల్లా మొత్తం వైశాల్యం 10,441 చ.కి.మీ.[6] జిల్లా పెన్నానది వలన రెండుగా చీల్చబడి ఉంది. నెల్లూరు జిల్లా సముద్రమట్టానికి 19 మీటర్ల (62 అడుగుల)ఎత్తులో ఉంది.[7]

జిల్లాలోని సగభాగం మాగాణి పంటలకు అనువైనది. మిగిలిన సగభాగం రాళ్ళతో కూడిన భూమి. నెల్లూరు సముద్రతీర ప్రాంతం ఇసుక భూములతో అడవులతో నిండి ఉంటుంది. పెన్నానది ఉపనది అయిన కండలేరు, బొగ్గేరు మిగిలిన ప్రాంతాన్ని సారవంతం చేస్తున్నాయి. జిల్లా ప్రాచీనమానవుడు ఆయుధాలకు, అగ్నిని రగల్చడానికి ఉపయోగించే చెకుముకి రాళ్ళ ఖనిజాలకు ప్రసిద్ధి.

నదులు

నదులు, వాగులు: పిల్లివాగు, పైడేరు, పెన్న,ఉప్పుటేరు,స్వర్ణముఖి,కాళంగి,కఁడలేరు,బొగ్గేరు

ఖనిజాలు

అభ్రకం ఉత్పత్తిలో అగ్రగామి. పింగాణి,ముడి ఇనుము,జిప్సం,సున్నాపురాయి నిల్వలున్నాయి.

పశుపక్ష్యాదులు

ఉమ్మడి నెల్లూరు జిల్లా వృక్షజాలతో, జంతుజాలంతో సమృద్ధి కలిగి ఉంది. తూర్పు కనుమల భాగం మరియి సముద్రతీరం, తడి లేని అడవులు, పొదలు కలిగి ఉండడం ఇందుకు కారణం. ఇక్కడ ఉన్న జంతుజాలం అద్భుతం. నెల్లూరుకు 70-80 కిలోమీటర్ల దూరంలో సూళ్ళూరు పేట వద్ద ఉన్న పులికాట్ సరస్సు ఒక విధమైన జలసంబంధిత వలస పక్షులకు ఆశ్రయం ఇస్తుంది. ఫ్లెమింగోలు, పెయింటెడ్ స్ట్రోక్స్, గ్రే పెలికాన్స్, సీగల్స్ ఇవి కాక అనేక పక్షులకు ఇది ఆలవాలం. పులుకాట్ సరస్సు తీరంలో నేలపట్టు పక్షి సంరక్షణకేంద్రము 486 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంది. సైబేరియన్ కొంగల జాతులు 160 ఇక్కడ ఉన్నట్లు ఇది గర్వంగా చెప్పుకుంటున్నది. నేలపట్టు ప్రతి సంవత్సరం ఫ్లెమింగో ఉత్సవం జరుపుకుంటుంది.

జనాభా లెక్కలు

2011 జనగణన ప్రకారం, 2022 లో సవరించిన జిల్లా పరిధిలో జనాభా 24,69,700 లతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది, జనసాంద్రత:237/చ.కి.మీ.[1] జిల్లాలో అత్యధిక ప్రజలు తెలుగు మాతృభాషా, వ్యవహార భాషగా మాట్లాడుతుంటారు. అదేవిధంగా దక్షిణ ప్రాంతాలు, దక్షిణ తీరప్రాంతాల ప్రజలు తమిళం మాట్లాడుతుంటారు.

రవాణా వ్వవస్థ

జాతీయ రహదారులు
రైలు మార్గం
  • గూడూరు-విజయవాడ రైలు మార్గం

విద్య

2974 ప్రాథమిక పాఠశాలలో చాలావరకు మండలపరిషతులు నిర్వహిస్తున్నాయి. 646 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. 749 ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు అనుబంధంగా 7 ఉన్నత పాఠశాలలు, 208 జూనియర్ కళాశాలలున్నాయి. అక్షరాస్యత 69%గా ఉంది. ఇది రాష్ట్ర అక్షరాస్యత 67.41% కంటే కొద్దిగా ఎక్కువ.

సాధారణ డిగ్రీ కళాశాలలు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం నకు అనుసంధానించబడి ఉన్నాయి. మెడికల్, డేంటల్, నర్సింగ్ కళాశాలలు విజయవాడ లోని డాక్ఠరు వైఎస్ఆర్ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయముతో అనుసంధానించబడ్డాయి.

నారాయణా ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రధాన కార్యాలయం నెల్లూరు లోనే ఉంది. నారాయణా మెడికల్ కాలేజ్ యు జి, పీ జి ఉన్నత విద్యను అందిస్తున్నాయి. నారాయణా డెంటల్ కాలేజ్ తొమ్మిది వైవిధ్యమున్న విభాగాలలో డెంటల్ యు జి, పీ జి విద్యలను అందిస్తుంది.

రెవెన్యూ డివిజన్లు, మండలాలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మండలాల పటం (Overpass-turbo)


జిల్లాను నెల్లూరు, కావలి,కందుకూరు, ఆత్మకూరు అనే నాలుగు రెవెన్యూ డివిజన్లుతో, 38 మండలాలులుగా విభజించారు.[1]

నగరాలు, పట్టణాలు

నగరం
నెల్లూరు
పట్టణాలు(3)
కావలి, ఆత్మకూరు, కందుకూరు

రాజకీయ విభాగాలు

లోక్ సభ నియోజకవర్గాలు
శాసనసభ నియోజక వర్గాలు
  1. ఆత్మకూరు
  2. ఉదయగిరి
  3. కావలి
  4. కోవూరు
  5. కందుకూరు
  6. నెల్లూరు గ్రామీణ
  7. నెల్లూరు పట్టణ
  8. వెంకటగిరి (పాక్షికం)
  9. సర్వేపల్లి

ఆర్ధిక స్థితి గతులు

జిల్లా ప్రధానంగా పెన్ననదీ పరీవాహక ప్రాంతం కనుక ఇక్కడ వ్యవసాయం ప్రధాన అదాయ వనరుగా ఉంది.

వ్యవసాయం, ఆక్వా కల్చర్, నీటి వనరులు

దామరమడుగు వద్ద పంటపొలాలు

ప్రధాన పంటలు వరి, చెరకు. నెల్లూరు జిల్లా ప్రత్యేకంగా మొలగొలుకులు అనే నాణ్యమైన బియ్యం ఉత్పత్తికి పేరు పొందింది. ఇతర పంటలలో పత్తి, నిమ్మకాయలు, నూనె గింజలు, తోటసంస్కృతి గింజల ఉత్పత్తి ప్రధానమైనవి.

బంగాళా ఖాతపు తీరం వెంట చేపల, రొయ్యల పెంపకానికి (ఆక్వా కల్చర్‌) నెల్లూరు చాలా ప్రసిద్ధి. నెల్లూరు జిల్లా అత్యధికంగా రొయ్యల పెంపకం చెయ్యడ కారణంగా భారతదేశ రొయ్యల కేంద్రంగా ప్రసిద్ధి పొందింది.

నీటి వనరులు

వెలికొండలు (తూర్పు కనుమలు) వద్ద పెన్నా నది మీద నిర్మించబడిన సోమశిల ఆనకట్ట, నెల్లూరు వద్ద ఆనకట్ట, సంగం వద్ద ఆనకట్ట, పెన్నా నది ఉపనది అయిన పెన్నేరు మీద గండిపాలెం వద్ద నిర్మించబడిన ఆనకట్టలు జిల్లాలోని అనేక గ్రామాలలోని వ్యవసాయానికి చక్కగా ఉపయోగపడుతున్నాయి.

పరిశ్రమలు

వ్యవసాయం తరువాత అధికమైన ప్రజలు చేనేత పని మీద అధారపడి జీవిస్తున్నారు. పాటూరు స్వచ్ఛమైన జరీతో నేయబడిన చేనేతవస్త్రాల ఉత్పత్తికి ప్రధాన కేంద్రం.

ప్రధాన పరిశ్రమలు:-

  • నెల్లూరు నిప్పో బ్యాటరీస్ ఫ్యాక్టరీ.
  • బాలాజీ స్టీల్, నెల్లూరు.
  • సైదాపురం మైకా గనులు.

సంస్కృతి

నెల్లూరు రుచికరమైన ఆహారాలకు కళాత్మ వసతులు కలిగి పెద్ద నగరాలకు సమానమైన సినిమా ధియేటర్లకు పేరుపొందినది. నెల్లూరు స్వర్ణమసూరి, నెల్లూరు చేపల పులుసు అంతర్జాతీయ నాణ్యత కలిగిన ఆహారంగా గుర్తింపు పొందింది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా నెల్లూరు మెస్ పేరుతో భోజనశాలలు ఉన్నాయి. భారతదేశం లోని ఇతర రాష్ట్రాలలో కూడా వీటిని చూడవచ్చు. నెల్లూరు హోటల్స్ (భోజన శాలలు) నాణ్యత కలిగిన ఆహారాన్ని అందచేయడంలో ప్రసిద్ధి చెందాయి.

పురాణప్రశస్థి

తమిళపురాణాలను అనుసరించి ఈ నగర చరిత్ర గురించి వివిధ విశ్వాసాలు వాడుకలో ఉన్నాయి. శివుడు ఒక ఉసిరిక చెట్టు (దీనిని తమిళ భాషలో నెల్లిమరమ్ అంటారు) లింగరూపంలో దర్శనం ఇచ్చాడని విశ్వసిస్తున్నారు. పురాణ కథనం అనుసరించి ముక్కంటి రెడ్డి అనే ఆయన తన పశువులలో ఒక పశువు ప్రతి రోజూ పాలను ఇవ్వడం లేదని గమనించి ఆ పశువు పాలు ఏమౌతున్నాయని తెలుసుకోవడానికి ఆ పశువు వెంట అడవికి వెళ్ళాడు. అక్కడ ఆ పశువు ఒక రాతి మీద తన పాలను తనకు తానే కార్చడం గమనించాడు. ముక్కంటి రెడ్డికి అక్కడ శివుడు తన నిజరూపంతో ప్రత్యక్షం అయ్యాడు. ముక్కంటి రెడ్డి ఆ శిల ఉన్న ప్రదేశంలో ఆలయనిర్మాణం చేసి అక్కడి శివలింగానికి మూలశాంత ఈశ్వరుడు అని నామకరణం చేసాడు. ఈ కారణంగా ఈ నగరం నెల్లూరు అయిందని విశ్వసిస్తున్నారు. ఈ ఆలయం ప్రస్తుతం నెల్లూరు లోని మూలపేటలో ఉంది.

జిల్లాలోని అధిక ప్రజలు గ్రామాలలో నివసిస్తున్నారు. మగవారు ట్రౌజర్లు, సూట్లు ధరిస్తారు. అలాగే చాలా మంది పంచలు, లుంగీలు మొదలైన సంప్రదాయ దుస్తులు కూడా ధరిస్తారు. స్త్రీలు అధికంగా చీరెలు ధరిస్తారు.

కళలు సాహిత్యము

నెల్లూరు జిల్లా ప్రముఖ కళాకారులను దేశానికి అందించింది. ప్రాచీన కవి తిక్కన సోమయాజి, ఆధునిక కవి ఆత్రేయలు ఈ జిల్లావారే. ప్రాచీన కవులైన తిక్కన, మొల్ల, మారన్న, కేతన్న ఇక్కడ జన్మించిన వారే. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో తిక్కన రెండవ వాడు. రామాయణాన్ని తెలుగించిన రెండవ కవయిత్రి మొల్ల. తిక్కన శిష్యుడైన కేతన్న దశకుమారచరితం రచన చేసి తన గురువైన తిక్కనకు అంకితమిచ్చాడు. కేతన ఆంధ్ర భాషా భూషణం అన్న వ్యాకరణ గ్రంథరచన కూడా చేసాడు. తిక్కన మరొక శిష్యుడైన మారన్న మార్కండేయ పురాణం రచన చేసాడు. ఈ జిల్లాలో జన్మించిన రామరాజభూషణుడు కృష్ణదేవరాయుని భక్తుడు. బ్రిటిష్ కాలంలో నెల్లూరు ఒక్కటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని విద్యాకేంద్రంగా ఉండేది.జిల్లాలో ప్రధాన వినోదం చలనచిత్రాలు. చలన చిత్ర గాయకుడైన ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం' నెల్లూరు జిల్లావాసియే. ప్రఖ్యాత చలనచిత్ర పాటల రచయిత ఆత్రేయను అందించిది నెల్లూరు జిల్లానే. ప్రముఖ కవి, చలన చిత్ర దర్శకుడు పట్టాభి రామిరెడ్డి డజన్ మెలోడీస్ పేరిట పన్నెండు పాటల రికార్డులో చోటుచేసుకున్న పాటలను నెల్లూరులోనే రచించాడు. ఆయన ఆ పాటలను మద్రాసు, నెల్లూరు నగరాలను పరిశీలించి వ్రాసాడు. ఆయన పెళ్ళినాటి ప్రమాణాలు అనే తెలుగు చలన చిత్రాన్ని నిర్మించాడు. ఆయన జాతీయ అవార్డు గ్రహీత. ఆయన సంస్కార, చండమారుత, శ్రింగారమాస, దేవరకాడు కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ప్రముఖ నటులైన రాజనాల, రమణారెడ్డి, వాణిశ్రీ చలనచిత్ర గాయని ఎస్.పి శైలజ, నెల్లూరు జిల్లాకు చెందిన వారే.

పండుగలు /తిరునాళ్ళు

నెల్లూరులో జరుపుకొనే ముఖ్యమైన పండుగలు:సంక్రాంతి,ఉగాది, వినాయక చవితి, దసరా, దీపావళి, శ్రీరామనవమి రంగనాథ స్వామి తిరునాళ్ళు, బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ. ప్రతి ఏటా  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూళ్లూరుపేటలో పక్షుల పండుగ నిర్వహిస్తుంది దీనికి ఫ్లెమింగో ఫెస్టివల్ అని నామకరం చేసారు.

పర్యాటక ఆకర్షణలు

దేవాలయాలు
ఘటిక సిద్ధేశ్వరం ఆలయ ధ్వజస్తంభం
సంగం ఆలయ రథం
ఇతరాలు
నెల్లూరు దగ్గరలో సముద్రతీరం
  • పినాకిని సత్యాగ్రహ (గాంధీ) ఆశ్రమం, పల్లిపాడు
  • నెల్లూరు లేక్ పార్క్: పొదలకూరు రోడు వద్ద బోటు సర్వీసులు, రెస్టారెంట్లు గలవు
  • కొత్త కోడూరు సముద్రతీరం: నెల్లూరు నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  • మైపాడు బీచ్ : నెల్లూరుకు 14 కిలోమీఓటర్ల దూరంలో గలదు. ఇసుక తిన్నెలకు రాక్షస అలలకు ప్రసిద్ధి.
  • కృష్ణపట్నం రేవు.
  • ఉదయగిరి కోట
  • నరసింహ కొండ
  • పెంచల కోన,
  • సంగం ఆనకట్ట.
  • సోమశిల ప్రాజెక్టు.

క్రీడలు

నెల్లూరు జిల్లాలో అధికంగా చూడబడుతున్న, ఆడబడుతున్న క్రీడ క్రికెట్. కబడి, బాడ్మింటన్, వాలిబాల్ మొదలైనవి ఈతర ప్రబలమైన క్రీడలు. చెస్, కేరమ్స్ వంటి ఇండోర్ గేమ్స్ కూడా నగరంలో ప్రాబల్యత సంతరించుకున్నాయి. 1982, 1996 జాతీయ అవార్డును సాధించి అలాగే 1982, 1996 ఒలింపిక్స్ క్రీడలలో భారతదేశం తరఫున పాల్గొని ల్యూసెన్నె, ఆర్మేనియా టి ఎన్ పరమేశ్వరన్ నెల్లూరు వాసియే. ప్రత్యేక సందర్భాలలో చిన్న గ్రామాలలో కోడిపందాలు, ఎద్దుల పందాలు జరుగుతుంటాయి.

స్థానిక పత్రికలు

జిల్లాలో ప్రాంతీయ పత్రికలలో ప్రధానమైనవి నెల్లూరు ఎక్స్‌ప్రెస్, లాయర్, జమీన్‌ రైతు, నెల్లూరు న్యూస్, గూడూర్ న్యూస్, నగరభేరి. వీటిలో అనేకం సాక్షి, ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి వంటి పత్రికల వలన తుడిచి పెట్టుకు పోయినా లాయర్, జమీన్‌ రైతుమాత్రం ఇప్పటికీ ప్రజాదరణతో ముందుకు సాగుతున్నాయి.

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 "నవశకానికి. నాంది". Eenadu. 2022-04-04. Retrieved 2022-04-06.
  2. EENADU (26 January 2022). "8 నియోజకవర్గాలతో కొత్త జిల్లా". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
  3. 3.0 3.1 "Nellore District renamed". The Hindu. 2008. Archived from the original on 2012-02-03. Retrieved 2010-08-08.
  4. చిలుకూరి వీరభద్రరావు (1910). "Wikisource link to ఐదవ_ప్రకరణము". Wikisource link to ఆంధ్రుల_చరిత్రము_-_ప్రథమ_భాగము. వికీసోర్స్. 
  5. A Manual of the Nellore District in the Presidency of Madras, Volume 4. 1873.
  6. 6.0 6.1 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
  7. "Handbook of Statistics SPS Nellore District 2018" (PDF). 2018. Archived from the original (PDF) on 2019-08-10.

బయటి లింకులు

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!