వై. వి. ఎస్. చౌదరి (పూర్తి పేరు యలమంచిలి వేంకట సత్యనారాయణ చౌదరి) ప్రముఖ తెలుగు సినిమా రచయిత, దర్శకుడు, నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్జిబిటరు, ఆడియో కంపెనీ అధినేత. 1998వ సంవత్సరంలో అక్కినేని నాగార్జున నిర్మాణంలో "గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్" సంస్థలో రూపొందిన శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా విజయం తరువాత అక్కినేని నాగార్జున, నందమూరి హరికృష్ణ కథానాయకులుగా సీతారామరాజు, మహేష్ బాబు కథానాయకుడిగా యువరాజు సినిమాలను తెరకెక్కించాడు. తరువాత "బొమ్మరిల్లు వారి" నిర్మాణ సంస్థను స్థాపించి లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో నిర్మాతగా మారాడు. దాని తరువాత సీతయ్య, దేవదాసు, ఒక్క మగాడు, సలీమ్, రేయ్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. వీటిలో సలీమ్ మినహా మిగతా సినిమాలన్నింటినీ తానే నిర్మించాడు. చౌదరి ఇప్పటివరకు తొమ్మిది సినిమాలకు దర్శకత్వం వహించాడు. 2012లో రవితేజ కథానాయకుడిగా గుణశేఖర్ దర్శకత్వంలో నిప్పు సినిమాను నిర్మించాడు. మొదటి సినిమాతో వెంకట్, చాందిని, చందు అనే నటులను పరిశ్రమకు పరిచయం చేశాడు. లాహిరి లాహిరి లాహిరిలోతో ఆదిత్య ఓం, అంకిత లను పరిచయం చేశాడు. దేవదాసుతో రామ్, ఇలియానా, రేయ్ తో సాయి ధరమ్ తేజ్, సైయామి ఖేర్ లను పరిచయం చేశాడు. తరువాతికాలంలో వీళ్ళు తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటులుగా స్థిరపడ్డారు.
వై. వి. ఎస్. చౌదరి కృష్ణా జిల్లాగుడివాడ వాస్తవ్యులైన యలమంచిలి నారాయణరావు, రత్నకుమారి దంపతులకు ఆఖరి సంతానంగా జన్మించాడు. తండ్రి లారీడ్రైవరు, తల్లి గృహిణి. దిగువ మధ్యతరగతి కుటుంబం. తల్లితండ్రులిద్దరూ చదువుకోలేదు కానీ తండ్రికి సంతకం చేయడం తెలుసు. చౌదరికి ఒక అక్క వేంకట శివ గౌరి, ఒక అన్న సాంబశివరావు ఉన్నారు. బాల్యంలో చౌదరికి "అన్నే వేంకటేశ్వరరావు" అనే సంపన్న కుటుంబానికి చెందిన స్నేహితుడు ఉండేవాడు. కుటుంబ పరిస్థితుల రీత్యా చౌదరికి అతడి తల్లిదండ్రులు చేతి ఖర్చులకు డబ్బులివ్వకపోయేవారు. స్నేహితుడు రావుకి అవసరమైనప్పుడు తండ్రి నుండి 50 రూపాయలందేవి. అప్పట్లో 50 రూపాయలు చాలా పెద్ద మొత్తమని, ఆ డబ్బుతో తను, రావు కలిసి తమ అభిమాన నటుడు ఎన్టీఆర్ నటించిన సినిమాలను తప్పకుండా మొదటి ఆటలోనే చూసేవారని చౌదరి గుర్తుచేసుకుంటాడు.[3]
పాఠశాల చదువులో చౌదరి ముందుండేవాడు. ఆరు, ఏడు తరగతుల్లో పాఠశాల స్థాయిలో, ఎనిమిదవ తరగతిలో గుడివాడ పట్టణ స్థాయిలో మొదటి స్థానం సంపాదించాడు. తొమ్మిదవ తరగతిలో గుడివాడలో "ఎన్టీఆర్ అభిమాన సంఘం" స్థాపించి దానికి ప్రెసిడెంటుగా వ్యవహరించాడు. ఆ తరువాత ఎప్పుడూ డిష్టింక్షనే తప్ప మొదటి స్థానంలో రాలేకపోయానని చౌదరి చెబుతాడు.[3]
తొమ్మిదవ తరగతి చదివే సమయంలో ఎన్టీఆర్ కాకుండా మిగతా కథానాయకుల సినిమాలు కూడా చూడడం మొదలుపెట్టిన చౌదరి సినిమాలను విశ్లేషించి వాటిలోని మంచిచెడ్డలను తర్కించేవాడు. గుడివాడలోని ఓ పార్కులో అందరు కథానాయకుల అభిమానులు సమావేశమై సినిమా విషయాలు చర్చించే సమయంలో చౌదరి తన విశ్లేషణలతో వారిని మెప్పించేవాడు. ఓ సినిమా ఎన్ని రోజులు ఆడగలదు, ఎంత వసూళ్ళు రాబట్టగలదు అని అతడు వేసే అంచనాలు దాదాపుగా నిజమయ్యేవి. ఈ విషయం గమనించిన అతడి స్నేహితుడు, కృష్ణంరాజు అభిమాని అయిన "రాజులపాటి వీర వేంకట రవి ప్రసాద్ (ఆర్.వి.ఆర్)" సినిమాల్లో దర్శకుడిగా ప్రయత్నించమని చౌదరికి సలహా ఇచ్చాడు. అప్పుడే దర్శకత్వం వైపు ఆలోచనలు మొదలయ్యాయి. అభిమానుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఎన్టీఆర్ సినిమాలు ప్రదర్శించే ధియేటర్లను, ఎన్టీఆర్ కటౌట్లను పూలమాలలతో అలంకరించేవాడు. సినిమాల మీద వ్యామోహం ఎంత పెరిగిపోయిందంటే, ఎన్టీఆర్ వేటగాడు సినిమా గుడివాడలో 62 రోజులు ప్రదర్శించబడగా 59 సార్లు ఆ సినిమాను తాను చూశానని చౌదరి గుర్తుచేసుకుంటాడు.[3]
ఎన్టీఆర్ సినిమాల పట్ల ఉన్న వీరాభిమానం వల్ల చదువులో ఉత్తీర్ణుడు కాలేక లారీడ్రైవరుగా తండ్రికి సాయం వెళ్ళిన తన సోదరుడిని చూసి చదువుని అశ్రద్ధ చేయకూడదని చౌదరి నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టాలనుకొని గుడివాడలోని "ఏ.ఎన్.ఆర్ కాలేజీ"లో ఇంటర్మీడియట్ లో చేరాడు.[1]ఎంసెట్ పరీక్షలో వచ్చిన 1400వ ర్యాంకు ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ సీటు సంపాదించడానికి సరిపోలేదు. ఆ తరువాత మెరిట్ మీద మద్రాసు లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చేరాడు.[3]
మద్రాసులో చౌదరి అద్దెకు తీసుకున్న గది చుట్టుపక్కల సినిమాలో ఎడిటింగ్ విభాగానికి చెందిన పలువురు సాంకేతిక నిపుణులు ఉండేవారు. వారితో పాటు ఎడిటింగ్ రూముల్లోకి వెళ్ళి ఆ ప్రక్రియను గమనించేవాడు. చదువు కోసం ఇంటి నుండి డబ్బులందేవి. కానీ సినిమాల్లోకి వెళ్ళాలన్న కోరిక బలంగా ఉన్న ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్ధి చౌదరి, చదువు కోసం మరో మూడేళ్ళు వెచ్చించడం కన్నా ఆ సమయాన్ని సినిమాల మీద వెచ్చిస్తే ఎంతో నేర్చుకోవచ్చని, తల్లిదండ్రులకు తెలియకుండా కాలేజీ మానేశాడు. దాంతో చౌదరి చదువు ముగిసింది.[3]
సినీ ప్రస్థానం
సినిమా ప్రయత్నాలు
మద్రాసులో చౌదరికి పరిచయమైన ఎడిటర్లు దర్శకుడు కావాలనుకున్న వ్యక్తికి ఎడిటింగ్ విభాగం మీద మంచి పట్టుండాలని సలహా ఇచ్చారు. అలా చేస్తే అసిస్టెంట్ డైరెక్టరుగా కూడా అవకాశాలు సులువుగా వస్తాయని భావించి "నరసింహారావు" అనే ఎడిటర్ దగ్గర సహాయకుడిగా చేరాడు. అతడి దగ్గరే "త్రివేణి బీటెల్ నట్" సంస్థ నిర్మించిన "భయంకర ఖూనీకోరు" అనే ఓ అనువాద సినిమాకు పనిచేశాడు. ఆ పేరుకి సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో ఆ సినిమాను "టాప్ టక్కర్" అనే పేరుతో విడుదల చేశారు. అప్పుడే, మొట్టమొదటిసారిగా చౌదరి పేరు తెరపై పడింది.[3]
గిరిధర్ దర్శకత్వంలో గిరిబాబు, కన్నడ నటుడు రవిచంద్రన్ కథానాయకులుగా "అగ్గి పిడుగు" సినిమాకు నరసింహారావుకి ఎడిటరుగా అవకాశం వచ్చింది. ఆ సినిమాకు కూడా తనకు సహాయకుడిగా పనిచేసిన చౌదరిని గిరిధర్ కు పరిచయం చేశాడు నరసింహారావు. దాంతో ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేసే అవకాశం వచ్చింది. తక్కువ బడ్జెట్ సినిమా కావడంతో భోజనం, బస్సు ప్రయాణంలాంటి ఖర్చులన్నీ తనే పెట్టుకునేవాడు చౌదరి. తన ముఖ్య ఉద్దేశ్యం పని నేర్చుకోవడమని, పైగా చిన్న సినిమా నిర్మాతలకు బరువు కాకూడదని తన ఖర్చులను తనే భరించేవాడినని అతడు గుర్తుచేసుకుంటాడు.[3]
ఎడిటింగ్ విభాగంలో పనిచేసే సమయంలో ఓ పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నానని, డబ్బులు కాకుండా బియ్యం మాత్రం పంపించమని తల్లితండ్రులను అడిగాడు చౌదరి. గది దగ్గరున్న హోటలులో భోజనం మూడు రూపాయలకు దొరికేది, ఓ పది కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటలులో రెండున్నర రూపాయలకు దొరికేది. ఆ యాభై పైసలు ఆదా చేయడానికి పది కిలోమీటర్లు నడిచేవాడు.[1][3] ఎక్కువగా నడిస్తే ఆకలి కూడా ఎక్కువగా వేస్తుందని ఆ హోటలు దగ్గరే వేచివుండి ఒకేసారి రాత్రి భోజనం కూడా చేసి తిరిగొచ్చేవాడు. టిఫిన్ ఖర్చులను ఆదా చేయడానికి ఉదయాన ఆలస్యంగా నిద్రలేచేవాడు.[1]
తన అభిమాన నటుడు ఎన్టీఆర్ తో పలు విజయవంతమైన సినిమాలు తీసిన కె.రాఘవేంద్రరావు అంటే చౌదరికి చిన్నప్పటినుండి అభిమానం ఎక్కువ. అతడి దగ్గర అసిస్టెంటుగా పనిచేయాలన్న కోరికను అతడిని కలిసి చెప్పాడు. అయితే, అప్పటికే తన దగ్గర పదిహేడుమంది ఉన్నారని, వాళ్ళకు కూడా పూర్తిగా పని లేదని, ఓ ఏడాది తరువాత రమ్మని చెప్పాడు రాఘవేంద్రరావు. తరువాతి వారంరోజులపాటు ప్రతిరోజూ ఉదయం ఏడు గంటలకు, సాయంత్రం ఆరు గంటలకు రాఘవేంద్రరావు కంటపడేలా అతడి ఇంటిముందు నిలబడేవాడు. రాఘవేంద్రరావు ఇంట్లో పనిచేసే "బాబాయి" అనే వ్యక్తిదీ గుడివాడే కావడంతో అతడితో స్నేహం కుదిరింది. బాబాయి చౌదరి దస్తూరిని పరిశీలించడానికి ఓ పేపరు మీద తెలుగులో ఏదైనా వ్రాయమని అడిగాడు. తెలుగులో అతడి వ్రాత నచ్చిన బాబాయి తరువాత హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా వ్రాయించుకున్నాడు. వాటిని రాఘవేంద్రరావుకి చూపించగా,[3] అప్పటికే వారంరోజులపాటు కారులో వెళ్తూ చౌదరిని గమనించిన రాఘవేంద్రరావు[1] చౌదరిని పిలిపించి తన సమక్షంలో మళ్ళీ వ్రాయించుకొని, స్వయంగా పరిశీలించి తన దగ్గర పనిచేసే అవకాశమిచ్చాడు.[3] అలా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పట్టాభిషేకం సినిమాలో అవకాశం లభించింది.[1] అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్లకి "చేయి దస్తూరి" చాలా ముఖ్యమని చౌదరి గుర్తుచేసుకుంటాడు.[3]
పట్టాభిషేకం సినిమాకు చూపించిన పనితీరుకి ఫలితంగా రాఘవేంద్రరావు తరువాత తీసిన కలియుగ పాండవులు, సాహస సామ్రాట్, అగ్ని పుత్రుడు, దొంగ రాముడు, జానకిరాముడు, రుద్రనేత్ర, జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలకు పనిచేసే అవకాశం లభించింది చౌదరికి. మిగతా అసిస్టెంట్లు ఖాళీగా ఉన్న సమయంలో అతడికి మాత్రం ఎప్పుడూ పనుండేది. ఆ సమయంలో రాఘవేంద్రరావు సినిమాలకు గీతరచయితగా పనిచేసిన వేటూరి సుందరరామ్మూర్తి దగ్గరికి వెళ్ళి పాటలు వ్రాయించుకునే బాధ్యతను అతడిపైనే ఉండేది. జగదేకవీరుడు అతిలోకసుందరి సమయంలో అతడి పనితనం నచ్చిన సుందరరామ్మూర్తి అతడిని ఆ సినిమా నిర్మాత అశ్వినీదత్ కి పరిచయం చేశాడు. అశ్వినీదత్ చౌదరికి తన సంస్థ వైజయంతి మూవీస్ లో అవకాశం ఇస్తానని, అయితే తన సంస్థలో రాబోయే సినిమాల్లో కో-డైరెక్టరుగా పనిచేయాలని చెప్పాడు. రాఘవేంద్రరావు దగ్గర అనుమతి తీసుకొని వైజయంతి మూవీస్ సంస్థకు మారి, అందులో నందమూరి బాలకృష్ణ, శోభన్ బాబు కలయికలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అశ్వమేధం సినిమాకు కో-డైరెక్టరుగా పనిచేశాడు. ఆ సమయంలో వై.వి.ఎస్.చౌదరి వైజయంతి మూవీస్ సంస్థలో సినిమా చేయబోతున్నట్టు ప్రకటన ఇచ్చాడు అశ్వినీదత్. కానీ అశ్వమేధం పరాజయంతో అశ్వినీదత్ అవకాశం ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఆ తరువాత అదే సంస్థలో అక్కినేని నాగార్జున, శ్రీదేవి జంటగా రాంగోపాల్ వర్మ తీసిన గోవిందా గోవిందా సినిమాకు కో-డైరెక్టరుగా పనిచేశాడు చౌదరి. ఆ సినిమా కూడా పరాజయం పొందడంతో వైజయంతి మూవీస్ లో అతడికి సినిమా కుదరని పరిస్థితి వచ్చింది.[3]
గోవిందా గోవిందా సినిమా తరువాత తనకు బాలీవుడ్ మీద ఆసక్తి ఉందని, అక్కడ తెలిసినవారికి చెప్పమని అశ్వినీదత్ ని అడిగాడు చౌదరి. అయితే, హిందీ దర్శకుడు మహేష్ భట్అక్కినేని నాగార్జున తో కె.ఎస్.రామారావు నిర్మాతగా క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థలో క్రిమినల్ సినిమా తీయడానికి హైదరాబాద్ వస్తున్నాడని, కె.ఎస్.రామారావుకి అతడిని సిఫార్సు చేశాడు అశ్వినీదత్. దాంతో క్రిమినల్ సినిమాకు తెలుగు, హిందీ భాషల్లో పనిచేసే అవకాశం వచ్చింది. గోవిందా గోవిందా సినిమాకు పనిచేసే సమయంలో కృష్ణవంశీ తో పరిచయం తరువాత అతడి మొదటి సినిమా గులాబి లో పనిచేసే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఆ తరువాత వైజయంతి మూవీస్ సంస్థలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా "భూలోకవీరుడు" సినిమా కోసం అశ్వినీదత్ నుండి మళ్ళీ పిలుపొచ్చింది. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో వైజయంతి మూవీస్ సంస్థ నుండి బయటికి వచ్చాడు.[3]
తొలి అవకాశం, విజయం (1998)
చౌదరికి సినిమాలపై మంచి విశ్లేషణా జ్ఞానం ఉండేది. షూటింగ్ దశలో ఉన్నప్పుడే సినిమా విడుదలయ్యాక దాని భవిష్యత్తు గురించి అతడు వేసే అంచనాలు నిజమయ్యేవి. జగదేకవీరుడు అతిలోకసుందరి షూటింగ్ దశలో ఉన్నప్పుడు దాని భవిష్యత్తు గురించి నిర్మాత అశ్వినీదత్ అడగ్గా ఆ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని చెప్పాడు. అశ్వమేధం, గోవిందా గోవిందా సినిమాలు విజయం సాధించలేవు అని కూడా చెప్పాడు. ఆ అంచనాలు తరువాత నిజమవ్వడంతో అశ్వినీదత్ అతడు చెప్పిన మాటను అక్కినేని నాగార్జున కు, రాంగోపాల్ వర్మ కు చెప్పాడు. వారు ప్రశ్నించినప్పుడు, ఆ సినిమాలను విశ్లేషించి చెప్పాడు చౌదరి. అతడి విశ్లేషణను మెచ్చుకున్న నాగార్జున గోవిందా గోవిందా సినిమా విజయం సాధిస్తే దర్శకత్వం చేసే అవకాశమిస్తానని చెప్పాడు. చెప్పినట్టుగా ఆ సినిమా పరజాయం పొందింది. తరువాత క్రిమినల్ సినిమా భవిష్యత్తుని అంచనా వేయమని నాగార్జున అడగ్గా, ఆ కథ తెలుగు ప్రేక్షకులకు సరిపోదని, తన భార్య ఘోరమైన హత్యకు గురయ్యాక కథానాయకుడు ప్రతినాయకుడి మీద పగ తీర్చుకోవాలి, అది కోర్టు ద్వారా లేదా తనే ప్రతినాయకుడిని చంపడం ద్వారా అవ్వాలి తప్ప, కథానాయకుడే నేరస్తుడిలా దాక్కుంటూ, పారిపోవడం కృత్రిమంగా ఉంటుందని చెప్పి, ఆ సినిమా కూడా విజయం సాధించదని చెప్పాడు చౌదరి. ఆ విశ్లేషణ విన్న నాగార్జున క్రిమినల్ సినిమా విజయం సాధిస్తే దర్శకత్వం చేసే అవకాశమిస్తానని చెప్పాడు. అది కూడా పరాజయం పొందింది. అప్పుడు నాగార్జున కథల ఎంపికలో తన ఆలోచనలు పనిచేయడం లేదని, ఏ రోజైతే అవి పనిచేస్తాయో అప్పుడే దర్శకత్వం చేసే అవకాశమిస్తానని చెప్పాడు.[3]
అదే సమయంలో చౌదరి మిగతా హీరోలకు కథలు కూడా వినిపించేవాడు. మొదట రాజశేఖర్ కు ఓ కథను వినిపించాడు. తరువాత ఉపేంద్ర దర్శకత్వంలో నటించాలనుకుంటున్న చిరంజీవి కి ఓ కథను వినిపించాడు. ఆ తరువాత వెంకటేష్, జగపతిబాబు, డి. రామానాయుడు, పరిటాల రవి, జె.డి.చక్రవర్తి ఇలా చాలామందికి కథలు వినిపించినా ఏదీ కార్యరూపం దాల్చలేదు. శ్రీకాంత్ కు కథ వినిపించే ప్రయత్నం చేయగా, చేతిలోని చాలా సినిమాల వల్ల తనకు ఖాళీ లేదని కథ వినకుండానే తిరస్కరించాడు. పవన్ కళ్యాణ్ ని చూసి మూస హీరోలకు భిన్నమైన ఆహార్యం కలిగున్నాడని, ఏదో ఒక రోజు అతడు పెద్ద స్టార్ అవుతాడని ఊహించి, అతడికి కథను చెప్పడానికి వెళ్ళాడు చౌదరి. కళ్యాణ్ కోసం చెప్పిన కథను చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు విని మెచ్చుకొని, మంచి నిర్మాతను వెతుక్కొని రమ్మని పంపించారు. కానే అదీ కుదరలేదు. అప్పట్లో నందమూరి బాలకృష్ణ ని కలిసే అవకాశం ఉండేది కాదు. "మనం బెండకాయలు గురించి చెప్పడానికి వెళ్తే, వాళ్ళు వంకాయల గురించి వినడానికి ప్రిపేర్ అయ్యివుంటే మనం ఏమి చేయలేము" అని చేజారిపోయిన ఆ అవకాశాల గురించి గుర్తుచేసుకుంటాడు చౌదరి.[3]
ఇదిలావుండగా, గులాబి సినిమాకు పనిచేసిన పరిచయం వల్ల నిన్నే పెళ్ళాడతా సినిమాకు కూడా పనిచేయమని చౌదరిని అడిగాడు కృష్ణవంశీ. నాగార్జున గోవిందా గోవిందా, క్రిమినల్ సినిమాలు ఆడవని చెప్పడం, అది నిజం కావడం మూలాన మళ్ళీ నాగార్జున సినిమాకు పనిచేయడం పట్ల సుముఖత చూపలేదు చౌదరి. అయితే, కృష్ణవంశీ నాగార్జునతో మాట్లాడడం, నాగార్జున అందుకు ఒప్పుకోవడం వల్ల ఆ సినిమాకు పని చేశాడు. కథ విని ఆ సినిమా తప్పకుండ విజయం సాధిస్తుందని చెప్పాడు. అందుకు సంతోషించిన నాగార్జున, నిన్నే పెళ్ళాడతా సినిమా విజయం సాధిస్తే దర్శకత్వం చేసే అవకాశమిస్తానని మళ్ళీ చెప్పాడు. చౌదరి చెప్పినట్టే ఈసారి సినిమా విజయం సాధించింది. నాగార్జున చెప్పినట్టు దర్శకత్వం చేసే అవకాశమిచ్చాడు. అలా, దర్శకుడిగా చౌదరి మొదటి సినిమా శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి అక్కినేని నాగార్జున నిర్మాణంలో "గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్" సంస్థలో ప్రారంభమయ్యింది.[3]
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి సినిమాకు కొత్త నటీనటులు కావాలని చౌదరి నాగార్జునని అడగడం, అందుకు నాగార్జున ఒప్పుకోవడం జరిగాయి. ఓ ముఖ్యపాత్రను అక్కినేని నాగేశ్వరరావు పోషించాడు. ఆ సమయంలో, కొత్తవారితో సినిమాలు తీస్తే ప్రమాదమని నాగార్జునకు అతడి సన్నిహితులు సలహాలివ్వడం మొదలుపెట్టారు. అప్పుడు చౌదరి తేనెమనసులు సినిమాకు కృష్ణ, రామ్మోహన్ కొత్త నటులేనని, ఆ సినిమా విజయం సాధించిందని చెప్పాడు. అదే సమయంలో సీనియర్ దర్శకులు కె.రాఘవేంద్రరావు తీసిన పరదేశి, దాసరి నారాయణరావు తీసిన కళ్యాణ ప్రాప్తిరస్తు, కృష్ణవంశీ తీసిన సింధూరం పరాజయం పొందాయి. చౌదరి తీసిన శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి విజయం సాధించింది. ఆ విజయంతో ఒకేసారి 26 అవకాశాలు వచ్చాయి. మొదటి సినిమాతోనే అక్కినేని నాగేశ్వరరావు లాంటి స్టారుతో, వెంకట్, చాందినిలాంటి కొత్త నటులతో పని చేశానని, అందుకు నాగేశ్వరరావు అన్నివిధాలా సహకరించాడని గుర్తుచేసుకుంటాడు చౌదరి.[1][3]
సీతారామరాజు, యువరాజు (1999 - 2000)
మొదటి సినిమా శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి విజయం సాధించాక ఆ సినిమా నిర్మాత అక్కినేని నాగార్జున తాను కథానాయకుడిగా ఓ సినిమా తీయమని చౌదరికి అవకాశమిచ్చాడు. అలా, అతడి రెండో సినిమా సీతారామరాజు "గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్", "కామాక్షి మూవీస్" సంస్థల సంయుక్త నిర్మాణంలో నాగార్జున, డి. శివప్రసాద్ రెడ్డి నిర్మాతలుగా మొదలయ్యింది. పట్టాభిషేకం సినిమాకు పనిచేసే సమయంలో ఆ సినిమా నిర్మాత అయిన నందమూరి హరికృష్ణ తో ఏర్పడిన పరిచయం మూలాన, అప్పటికే ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన శ్రీరాములయ్య సినిమాలో చేసిన అతిథి పాత్రను చూసి, సీతారామరాజులో నాగార్జున అన్న పాత్రకు అతడిని సంప్రదించాడు చౌదరి. అందుకు హరికృష్ణ ఒప్పుకోవడం జరిగింది. హింసను నమ్ముకున్న మనిషి చివరికి ఆ హింసకే బలవుతాడన్నా కథాంశంతో రూపొందిన ఆ సినిమాకు "డోంట్ గెట్ ఇంటూ వయోలెన్స్" అనే శీర్షికను పెట్టాలనుకొని తరువాత విరమించుకున్నాడు చౌదరి. సీతారామరాజు సినిమాకు 45 రోజుల ముందే విడుదలయిన బి.గోపాల్ తీసిన సమరసింహారెడ్డి, కృష్ణవంశీ తీసిన అంతఃపురం సినిమాలతో గట్టి పోటీ ఉండేది. విడుదలకు రెండు వారాల ముందు హరికృష్ణ తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చి "అన్న తెలుగుదేశం" పార్టీని స్థాపించడం జరిగింది. దాంతో ఎన్టీఆర్ అభిమానుల మధ్య చీలికలు ఏర్పడ్డాయి. వీటన్నింటినీ దాటుకొని సీతారామరాజు సినిమా విజయం సాధించింది. సినిమా విజయంతో చౌదరికి 13 నిర్మాతల నుండి అవకాశాలు వచ్చాయి.[3]
సీతారామరాజు సమయంలో మహేష్ బాబు ని కలిసి ఓ కథను వినిపించాడు చౌదరి. అప్పటికింకా మహేష్ మొదటి సినిమా రాజకుమారుడు విడుదల కాలేదు. అరగంటలో కథ విని మహేష్ ఒప్పుకోవడం జరిగింది.[1] అదే యువరాజు సినిమా అయ్యింది. మొదటగా, ఆ సినిమాలో కథానాయికల పాత్రలకు ఇద్దరు కొత్త నటీమణులను తీసుకోవాలని అనుకున్నాడు చౌదరి. కానీ కొన్ని ఒత్తిళ్ళ వల్ల సిమ్రాన్, సాక్షి శివానంద్ లను తీసుకోవాల్సివచ్చింది. మహేష్ కన్నా కథానాయికలిద్దరూ పరిశ్రమలో సీనియర్లు కావడం, చిరంజీవిచూడాలని వుంది సినిమాలో అతడి కొడుకుగా చేసిన మాస్టర్ తేజ యువరాజులో మహేష్ కొడుకుగా నటించడం ప్రేక్షకులకు రుచించలేదు. కానీ రెండో సగంలో కథను డీల్ చేసిన విధానం సినిమా పంపిణీదారులకి లాభాలను తెచ్చిపెట్టింది. 2002 వరకు మహేష్ చేసిన సినిమాల్లో రాజకుమారుడు, యువరాజు సినిమాలు మాత్రమే పంపిణీదారులని సంతృప్తిపరిచాయని అప్పటి సినీ విశ్లేషకులు పేర్కొన్నారు.[3] అయితే, సరైన ప్రచారం లేకనే యువరాజు సినిమా ఆడలేదని, ఓ సినిమాకు సరైన రీతిలో ప్రచారం ఎంతో అవసరమని చెబుతాడు చౌదరి.[1]
ఇదిలావుండగా, యువరాజు సినిమా చిత్రీకరణ అనుకున్నదానికంటే ఎక్కువ రోజులు పట్టడంతో, చౌదరి సినిమా ఖర్చుని పెంచడానికే చిత్రీకరణను ఆలస్యం చేశాడని ఆరోపణలు వచ్చాయి. దాంతో, మొదటి సినిమాకు వచ్చిన 26 అవకాశాల్లో, రెండో సినిమాకు వచ్చిన 13 అవకాశాల్లో ఒక్కటి కూడా మిగలలేదని, సినిమా చేయడానికి ముందుకొచ్చిన కొత్త నిర్మాతలు కూడా ఎన్నో ఆంక్షలు పెట్టేవారని చౌదరి గుర్తుచేసుకుంటాడు. యువరాజు సినిమా ఆలస్యానికి తాను కారణమన్న ఆరోపణలు నిజం కాదని కూడా చెబుతాడు.[3]
నిర్మాతగా మారడం, లాహిరి లాహిరి లాహిరిలో (2002)
యువరాజు సినిమా ఊహించినంత విజయం సాధించకపోవడంతో, చౌదరితో తరువాత సినిమా చేయడానికి చెప్పుకోదగ్గ నిర్మాతలెవరూ ముందుకు రాలేదు. ఆ సినిమా సమయంలో తన మీద వచ్చిన ఆరోపణలు అవాస్తవాలని నిరూపించడానికి తనే నిర్మాతగా మారాలని నిర్ణయించుకొని "బొమ్మరిల్లు వారి" సంస్థను స్థాపించాడు చౌదరి. "స్నేహ చిత్ర" సంస్థను స్థాపించిన ఆర్.నారాయణ మూర్తి, "ఈ.వి.వి.సినిమా" సంస్థను స్థాపించి చాలా బాగుంది సినిమాతో విజయాన్ని అందుకున్న ఈ.వి.వి.సత్యనారాయణ తనకు ప్రేరణ అని చెబుతాడు.[3]
"బొమ్మరిల్లు వారి" సంస్థలో తొలి సినిమాను ప్రారంభించే సమయంలో కొన్ని ఇబ్బందులు చోటుచేసుకున్నాయి. యువతరం నేపథ్యంలో వచ్చే సినిమాల పోకడ అంతరించిపోయే సమయంలో, వేర్వేరు వయసులు గల మూడు జంటల మధ్య సాగే ప్రేమకథల నేపథ్యంతో సినిమాను ప్రారంభించాడు చౌదరి. కె.వి.రెడ్డి తీసిన మాయాబజార్ సినిమాలో అత్యంత ప్రాచుర్యం పొందిన, తనకెంతో ఇష్టమైన "లాహిరి లాహిరి లాహిరిలో" అనే పాట పేరునే తన సినిమాకు పెట్టుకున్నాడు. "ఒకసారి ప్రేమించి చూడండి" అనేది శీర్షిక. సినిమాలో ఒక కథానాయకుడిగా "అన్న తెలుగుదేశం" పార్టీ విఫలమై ఖాళీగా ఉన్న నందమూరి హరికృష్ణ ను ఎంచుకోవడం చౌదరి స్నేహితులకు నచ్చలేదు. కానీ చౌదరి హరికృష్ణ వైపే మొగ్గుచూపాడు. దాంతో, వారు సినిమాలో పెట్టుబడి పెట్టడానికి నిరాకరించారు. అప్పుడు చౌదరి తన ఇంటిని తాకట్టు పెట్టి ఎక్కువ వడ్డీకి డబ్బులు తెచ్చి తనే నిర్మాతగా "బొమ్మరిల్లు వారి" సంస్థలో సినిమాను మొదలుపెట్టాడు.[3]
అయితే, లాహిరి లాహిరి లాహిరిలో సినిమా నిర్మాణంలోనూ పలు అవాంతరాలు చోటుచేసుకున్నాయి. ముందుగా అనుకున్న నటీనటులు కుదరకపోవడం, కుదిరిన వారికి వ్యక్తిగత ఇబ్బందులు, సినిమాకు పనిచేసే సిబ్బందికి ప్రమాదాలు, ఇలా పలు సంఘటనలు చోటుచేసుకున్నాయి. దాంతో చిత్రీకరణ సమయంతో పాటు ఖర్చు కూడా పెరిగింది.[1][3] అయితే, నిర్మాతగా చౌదరి ఎక్కడా రాజీపడలేదు, ఖర్చులన్నీ తానే భరించాడు. తన సినిమాకు పనిచేసే సాంకేతిక నిపుణులు సైతం ఈ సినిమా విడుదలే కాదని, ఒకవేళ అయినా ఆడదని పందాలు కాసేవారు. వాటన్నిటినీ దాటుకొని సినిమాను ముగించాడు చౌదరి. సినిమా వందరోజులు ఆడుతుందని, ఆ వేడుకని తన స్వస్థలం గుడివాడ లో జరపాలన్న నమ్మకంతో ఉండేవాడు చౌదరి.[3]ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు చొరవతో 1 మే 2002 న సినిమా విడుదలై ప్రజాదరణను పొందింది. జెమినీ కిరణ్ సహాయంతో సినిమా ప్రచారం కూడా ముమ్మరంగా చేశాడు చౌదరి. ఆ సమయంలో మిగతా సినిమాల నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ ఈ సినిమా విజయం సాధించింది. అనుకున్నట్టుగానే గుడివాడలో వందరోజుల వేడుకను నిర్వహించాడు చౌదరి. ఈ సినిమా నిర్మాణం, విడుదల, విజయం కుటుంబ సభ్యుల సహకారం, రామోజీరావు ప్రోత్సాహంతోనే సాధ్యమైందని అతడు గుర్తుచేసుకుంటాడు.[3]
తరువాతి సినీ ప్రస్థానం (2003 - ప్రస్తుతం)
లాహిరి లాహిరి లాహిరిలో విజయం సాధించాక, ఆ సినిమా వందరోజుల వేడుకలో తన తదుపరి సినిమాలో నందమూరి హరికృష్ణ సోలో కథానాయకుడిగా చేయబోతున్నట్టు ప్రకటించాడు. అదే సీతయ్య సినిమా అయ్యింది. 22 ఆగష్టు 2003న ఈ సినిమా విడుదలై విజయం సాధించింది.[5]
సీతయ్య సినిమా తరువాత ఒకరిద్దరు హీరోలతో చేసిన సంప్రదింపులు కార్యరూపం దాల్చలేదు. స్రవంతి మూవీస్ అధినేత స్రవంతి రవికిషోర్ ని కలిసినప్పుడు అతడి తమ్ముడి కొడుకైన రామ్ పోతినేని ఫోటోలు చూసి అతడిని పరిచయం చేస్తూ దేవదాసు సినిమాను మొదలుపెట్టాడు చౌదరి. అతడికి జోడిగా ఫెయిర్ అండ్ లవ్లీ ప్రకటనలో నటించిన ఇలియానా ను ఎంచుకొన్నాడు.[6] 11 జనవరి 2006న విడుదలైన ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. 17 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ళతో[7] పాటు 17 సెంటర్లలో 175 రోజులు ప్రదర్శించబడింది.[8]హైదరాబాదు ఓడియన్ 70mm థియేటరులో ఏకంగా 205 రోజులపాటు ప్రదర్శించబడింది.[9]
దేవదాసు సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకునే సమయంలో నందమూరి బాలకృష్ణ ని కలిసి ఓ కథను వినిపించాడు చౌదరి. అది బాలకృష్ణకు నచ్చడంతో ఒక్క మగాడు సినిమా నిర్మాణాన్ని చేపట్టాడు. భారీ అంచనాల మధ్య 11 జనవరి 2008న విడుదలయిన ఈ సినిమా మొదటిరోజే సుమారు 7 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. పలుచోట్ల టికెట్లు అధిక మొత్తంలో బ్లాకులోనూ అమ్ముడుపోయాయి. అయితే, అంచనాలు అందుకోలేక ఈ సినిమా పరాజయం పాలైంది, మొదటివారం తరువాత థియేటర్లు ఖాళీగా కనిపించాయి.[10][11]
తరువాత మంచు విష్ణు, ఇలియానా, మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో సలీమ్ సినిమాకు దర్శకత్వం వహించాడు చౌదరి. ఈ సినిమా మోహన్ బాబు నిర్మాణంలో శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై తెరకెక్కింది. నిర్మాతగా మారిన తరువాత చౌదరి తన సొంత నిర్మాణ సంస్థలో చేయని సినిమా ఇదొక్కటే.[12] 12 డిసెంబరు 2009న విడుదలైన ఈ సినిమా కూడా ప్రేక్షకులతో పాటు విమర్శకుల మెప్పు కూడా పొందలేక పరాజయం పాలైంది.[13][14]
2012లో చౌదరి మొదటిసారి కేవలం నిర్మాతగా తన "బొమ్మరిల్లు వారి" సంస్థలో రవితేజ కథానాయకుడిగా గుణశేఖర్ దర్శకత్వంలో నిప్పు సినిమాను నిర్మించాడు. మద్రాసులో సినిమా ప్రయత్నాలు చేసే సమయంలో వీరు ముగ్గురు ఒకే భవనంలో నివాసముండేవారు.[15] 17 ఫిబ్రవరి 2012న విడుదలైన ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగా వచ్చినప్పటికీ, ప్రేక్షకుల, విమర్శకుల మెప్పును పొందలేక పరాజయం చవిచూసింది.[16][17]
2010లో చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సైయామి ఖేర్ లను పరిచయం చేస్తూ తన నిర్మాణ సంస్థలో రేయ్ సినిమాను మొదలుపెట్టాడు చౌదరి. ఆ సినిమాను 2011 వేసవిలో విడుదల చేయాలని సంకల్పించాడు.[18] పలు కారణాల వల్ల వాయిదా పడడంతో 2013లో విడుదల చేయాలని అనుకున్నాడు. అయితే, అప్పుడూ కుదరలేదు. ఆఖరికి 27 మార్చి 2015న విడుదలయింది.[4][19][20] ఈ సినిమా విడుదలయ్యేలోపే తేజ్ నటించిన రెండో సినిమా పిల్లా నువ్వు లేని జీవితం కూడా విడుదలైపోయింది. అయితే, రేయ్ సినిమా కూడా విజయం సాధించలేదు.[21]
రేయ్ తరువాత చౌదరి ఇప్పుడు తన తరువాతి సినిమా మొదలుపెట్టే పనుల్లో ఉన్నాడు. ఈ సినిమాతో మళ్ళీ కొత్త నటీనటులను పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నాడు.[22]
వ్యక్తిగత జీవితం
జానకిరాముడు సినిమాకు పనిచేసే సమయంలో తాను సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేస్తున్నానని తల్లిదండ్రులతో చెప్పాడు చౌదరి. అదే సమయంలో తన అక్క వేంకట శివ విజయ గౌరి కి పెళ్ళి కుదరడంతో తాను అప్పటివరకు కూడబెట్టిన అరవై ఐదువేల రూపాయలు ఇంటికి పంపాడు. సినిమాలకు పనిచేస్తున్నా కూడా అంత మొత్తంలో డబ్బు కూడబెట్టినందుకు తల్లిదండ్రులు కూడా ఏమి అనలేకపోయారు. తనకు ధూమపానం, మద్యపానం అలవాటు ఉండేవి కాదని, సంపాదించిన డబ్బుని తిండికి, సినిమాలకు మాత్రమే ఖర్చుపెట్టేవాడినని, అదే తన అక్క పెళ్ళికి ఉపయోగపడిందని చౌదరి గుర్తుచేసుకుంటాడు.[3]
నిన్నే పెళ్ళాడుతా సినిమాకు పనిచేసే సమయంలో, అందులో నాగార్జున చెల్లెలిగా నటించిన గీతను ప్రేమించాడు చౌదరి. పరస్పర అంగీకారంతో పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు. గీత తండ్రి బ్రాహ్మణ, తల్లి క్షత్రియ కులాలకు చెందినవారు. అయితే, ఆచార వ్యవహారాలపై బాగా పట్టింపు ఉన్న, కులాంతర వివాహాలపై అస్సలు అవగాహనలేని తల్లిదండ్రులను ఒప్పించి గీతను వివాహం చేసుకున్నాడు. నిన్నే పెళ్ళాడుతా సినిమా తనకు వృత్తి పరంగా దర్శకుడిగా మొదటి సినిమా ఇవ్వడానికి, వ్యక్తిగతంగా గీతతో వివాహం జరగడానికి కారణమైనందుకు మర్చిపోలేని సినిమా అని చెబుతాడు చౌదరి. గీత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సింధూరం సినిమాలో రవితేజ కు జోడిగా, భరత్ దర్శకత్వంలో వచ్చిన అయ్యిందా లేదా సినిమాలో అలీ కి జోడిగా నటించింది. చౌదరికి ఇద్దరు కూతుర్లు, యుక్తా చౌదరి, ఏక్తా చౌదరి.[3]
సీతయ్య సినిమా తరువాత అన్న సాంబశివరావు మరణం, పెద్ద కూతురు యుక్తా జననం వల్ల తదుపరి సినిమాకు ఓ ఏడాదిపాటు విరామం వచ్చింది.[6]
చౌదరికి పట్టాభిషేకం సినిమాకు పనిచేసే సమయంలో నందమూరి హరికృష్ణ తో ఏర్పడిన పరిచయం ఆ తరువాత మంచి అనుబంధంగా మారింది. హరికృష్ణ చౌదరిని అనేకసార్లు తోడుగా తీసుకొని వెళ్ళేవాడు. తనను స్టార్ హోటల్స్ కు తీసుకొని వెళ్ళేవాడని, అక్కడ ఎలాంటి పద్ధతులు పాటించాలి అనే అంశం నుండి చాలా విషయాలు హరికృష్ణ నుండే నేర్చుకున్నట్టు గుర్తుచేసుకుంటాడు చౌదరి.[1] "అన్న తెలుగుదేశం" పార్టీ తరఫున హరికృష్ణ పోటీ చేసి ఓడిపోయిన చోటే లాహిరి లాహిరి లాహిరిలో సినిమాకు సంబంధించిన వేడుకను ఘనంగా నిర్వహించి అతడికి ఎంతమంది అభిమానులున్నారో చూపించాడు చౌదరి.[5]
ప్రత్యేకతలు
చౌదరికి నందమూరి తారకరామారావు అంటే విపరీతమైన అభిమానం. అతడి స్ఫూర్తితోనే సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాడు. తన "బొమ్మరిల్లు వారి" సంస్థలో చేసిన ప్రతి సినిమా ఎన్టీఆర్ ఫోటోను చూపిస్తూ, అతడి మీద ప్రార్థనాగీతంతో మొదలై మళ్ళీ అతడి ఫోటోనే చూపిస్తూ ముగుస్తుంది.[23] ఆ ప్రార్థనాగీతాన్ని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి రచించి, స్వరపరిచి, పాడాడు.[24]
లాహిరి లాహిరి లాహిరిలో సినిమా మీద చౌదరికి గట్టి నమ్మకం ఉండేది. విడుదల రోజే వందరోజుల వేడుకని చేయబోయే తేదీని, వేదికను కూడా ఒకేసారి ప్రకటించాడు. అనుకున్నట్టే సినిమా విజయం సాధించింది, ప్రకటించిన రోజు, ప్రకటించిన ప్రదేశంలో వందరోజుల వేడుకను నిర్వహించాడు.[25]
సీతయ్య సినిమా పాటల విడుదల కార్యక్రమానికి తన అభిమాన నటుడు ఎన్టీఆర్ తో సినిమాలకు పనిచేసిన రచయితలను, దర్శకులను, నిర్మాతలను, నటులను ఆహ్వానించి ఒక్కొక్కరి చేత ఒక్కో పాటను విడుదల చేయించాడు.[26] ఈ సినిమా విడుదల సమయంలో కూడా దాని వందరోజుల వేడుక 1 డిసెంబర్ 200౩న అనంతపురంలో జరపనున్నట్టు ప్రకటించాడు. అయితే, అక్కడ వచ్చిన కరువు వల్ల అది జరగలేదు.[25]
చౌదరి తన పెద్ద కూతురు యుక్తా పేరిట "యుక్తా మ్యూజిక్" సంస్థను 2005లో స్థాపించి, దాని ద్వారా మొదటిసారిగా తన దేవదాసు సినిమా పాటలను విడుదల చేశాడు. ఆ సినిమా ముహూర్తపు కార్యక్రమానికి 36 పేజిల ఆహ్వానం, పాటల విడుదల కార్యక్రమానికి 24 పేజిల ఆహ్వానం పత్రికలను ప్రచురించాడు.[27]
చౌదరి తన సొంత ఊరు గుడివాడలోని గోపాలకృష్ణ థియేటరుని కొనుగోలు చేసి, దాన్ని పునరుద్ధరించి, తన నిర్మాణ సంస్థ అయిన “బొమ్మరిల్లు” పేరు పెట్టి, అందులో మొదటి సినిమాగా ఒక్క మగాడు విడుదల చేశాడు. గుడివాడలో మొట్టమొదటి ఏసి, డీటీఎస్ సౌకర్యాలు గల థియేటరు అదే.[10]