యూరీ గగారిన్ గా పేరు గాంచిన యూరీ అలెక్సెయెవిచ్ గగారిన్ (ఆంగ్లం : Yuri Alexeyevich Gagarin) (రష్యన్ భాష Юрий Алексеевич Гагарин ) (మార్చి 9, 1934 - మరణం మార్చి 27, 1968) ఒక సోవియట్వ్యోమగామి. రష్యన్లు ఇతడిని సోవియట్ హీరోగా పరిగణిస్తారు. 1961 ఏప్రిల్ 12 న, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడిగా చరిత్రపుటలకెక్కాడు, అలాగే మొదటి సోవియట్ కూడానూ. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించినవాడుగానూ రికార్డులకెక్కాడు. అంతరిక్షంలోకి ప్రయాణించినందుకు, ప్రపంచంలోని అనేక దేశాలు, పతకాలు, బహుమానాలు ఇచ్చి, ఇతడిని గౌరవించాయి.
అంతరిక్ష యాత్ర
ఏప్రిల్ 12 1961 న, గగారిన్, అంతరిక్షంలో ప్రవేశించిన మొట్టమొదటి మానవుడిగా నమోదయ్యాడు. ఇతడు ప్రయాణించిన అంతరిక్ష నౌక వోస్టోక్ 3KA-2 (వోస్టోక్ 1). అంతరిక్షంలో ఇతడి మొదటి మాట సంకేతం 'కెడ్ర్' (సెడార్; (రష్యన్ : Кедр).[1] తన ప్రయాణంలో ప్రసిద్ధ గీతం "ద మదర్ ల్యాండ్ హీయర్స్, ద మదర్ ల్యాండ్ నోస్" అంతరిక్షంలో పాడాడు. (రష్యన్ భాష "Родина слышит, Родина знает").[2][3]
అంతరిక్షనౌకలో భూమి చుట్టూ తిరిగేప్పుడు, మన గ్రహం ఎంత అందమైనదో చూశాను. ప్రజలారా! మనం ఈ అందాన్ని కాపాడుకుని, పెంపొందిద్దాం, నాశనం చేయొద్దు!
—యూరీ గగారిన్, Syny goluboi planety అన్న పుస్తకపు 3వ ఎడిషన్ వెనుక ఈ వాక్యం రష్యన్ భాషలో రాసి సంతకం చేశాడు
ఆ కాలంలో మీడియాలో గగారిన్ వ్యాఖ్య గురించి ఓ వార్త సంచలనాన్ని సృష్టించింది. "నేను యే దేవుడినీ ఇక్కడ చూడడం లేదు" అని గగారిన్ అంతరిక్షంలో అన్నట్టు కథనం. కానీ, అంతరిక్ష నౌకలో 'వెర్బాటిమ్ రికార్డర్' లో అలాంటి వ్యాఖ్యలు గాని శబ్దాలు గాని లేవు.[4]
ఏం అందం. దూరంగా ఉన్న ప్రియమైన భూమి మీద మబ్బులను, వాటి మెరుపుల నీడలను చూశాను... నీరు నల్లటి, చిన్న మిణుకుమనే చుక్కలా కనిపించింది... క్షితిజాన్ని చూసినప్పుడు లేతరంగు భూమి ఉపరితలానికీ, ఆకాశపు పూర్తి నిఖార్సైన నల్లరంగుకీ మధ్య ఉన్న వ్యత్యాసం కనిపించింది. భూమి విభిన్నమైన రంగులను చూసి ఆస్వాదించాను. దాన్ని లేత నీలం ప్రభామండలం చుట్టివుంటుంది, అది క్రమంగా నల్లబడుతూ, వైఢూర్య వర్ణంలోకి, గాఢమైన నీలం రంగులోకి, బొగ్గులా నల్లటి నలుపులోకి మారుతూంటుంది
—యూరీ గగారిన్, లూసీ బి. యంగ్ రాసిన ఎర్త్స్ ఆరా (1977)లోని వ్యాఖ్య
మరణం
గగారిన్ వ్యోమగాముల శిక్షణా స్థలి స్టార్ సిటీ లో ఉప-శిక్షణాధికారిగా నియమితుడయ్యాడు. అదే సమయంలో ఇతను ఫైటర్ పైలట్ గా తిరిగి అర్హతపొందేందుకు ప్రయత్నించసాగాడు. మార్చి 27 1968, చకలోవ్‌స్కీ ఎయిర్ బేస్ నుండి శిక్షణా విమానంలో ఎగురుతూ వుండగా, ఇతను, ఇతని శిక్షకుడు వ్లాదిమీర్ సెరిఓజిన్ మిగ్ -15UTI విమానంకిర్జాచ్ పట్టణం వద్ద కూలిపోయి మరణించారు. వీరిరువురినీ రెడ్ స్క్వేర్ లోని క్రెమ్లిన్ గోడలు లో ఖననం చేసారు.
Photo, Audio and Video with Yuri Gagarin, online version of CD created to his 70th anniv. on the homepage of Russian state archive for scientific-technical documentation (RGANTD).