మిల్ఖా సింగ్ (1935 నవంబరు 20 - 2021 జూన్ 18) భారత్ కు చెందిన సిక్కుఅథ్లెట్. ఇతన్ని ఫ్లయింగ్ సిఖ్ అని పిలుస్తారు. అరుదైన, ప్రతిభావంతుడైన క్రీడాకారుడు. 2013 నాటికి, కామన్వెల్త్ క్రీడలలో బంగారు పతకం సాధించిన ఏకైక భారత క్రీడాకారుడిగా (అథ్లెట్) గుర్తింపు పొందాడు. భారత్ తరపున 1956 లో మెల్బోర్న్ నగరంలో జరిగిన వేసవి ఒలంపిక్స్ లోను, 1960 లో రోమ్ లో జరిగిన ఒలంపిక్స్ లోను, 1964 లో టోక్యోలో జరిగిన ఒలింపిక్ పోటీల్లోనూ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. భారత ప్రభుత్వం ఇతన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
1960 ఒలింపిక్ పోటీల్లో అతడు పాల్గొన్న 400 మీటర్ల పరుగు పందెం అతడి కెరీర్లో చిరస్మరణీయమైనది. అందులో మిల్ఖా 4 వ స్థానంలో నిలిచాడు. ఆపోటీలో అతడు చేసిన 45.73 సెకండ్ల పరుగు, భారతదేశ రికార్డుగా 40 ఏళ్ళ పాటు నిలిచింది.
దేశ విభజన సమయంలో అనాథగా మారిన మిల్ఖా సింగ్, తరువాత కాలంలో భారతదేశపు ప్రసిద్ధ క్రీడా చిహ్నంగా అవతరించాడు. 2008లో రోహిత్ బ్రిజ్నాథ్ అనే ఒక పాత్రికేయుడు, మిల్ఖా సింగ్ ను "భారతదేశపు అత్యుత్తమ క్రీడాకారుడి"గా అభివర్ణించారు. జులై, 2012లో "ద ఇండిపెండెంట్" అనే ఓ బ్రిటిష్ వార్తాపత్రిక,"మిల్ఖా సింగ్, భారత దేశపు అత్యుత్తమ క్రీడాకారుడు మాత్రమే కాదు, ఒక ఘనమైన పరాజితుడు కూడా" అని పేర్కొంటూ, అతడు సాధించిన విజయాలు అతి తక్కువని, వందకోట్లమందికి పైగా జనాభా ఉన్నప్పటికీ, భారతదేశం అతడి (మిల్ఖా సింగ్) ద్వారా 20 పతకాలు మాత్రమే సాధించగలిగిందని తమ పత్రికలో వ్యంగ్యంగా ప్రచురించింది.
జీవిత విశేషాలు
ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న గోవింద్‌పురాలో,[1] 15 మంది సంతానం కలిగిన ఒక సిక్కు రాథోడ్ రాజపుత్రుల కుటుంబంలో మిల్ఖా సింగ్ జన్మించాడు. [2]అందులోని 8 మంది దేశ విభజనకు ముందే చనిపోయారు. భారత విభజన సమయంలో జరిగిన హింసకాండలో తన తల్లిదండ్రులను, ఒక సోదరుడిని, ఇద్దరు సోదరీమణులను పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రుల మరణాన్ని తన కళ్ళ ముందే ప్రత్యక్ష్యంగా చూశాడు. అనాథగా పాకిస్తాన్ నుండి భారత్కు కాందిశీకులు వచ్చే రైలులో వచ్చాడు. 1947 లో, పంజాబ్ రాష్ట్రంలో హిందూవులు, సిక్కుల ఊచకోత తీవ్రంగా జరుగుతున్నటువంటి సమయంలో మిల్ఖా సింగ్ ఢిల్లీకు వలసవెల్లిపోయాడు. కొంత కాలం వరకు ఢిల్లీ లోని "పురానా కిలా" వద్ద ఉన్న శరణార్థ శిబిరంలో, అలాగే "షహ్దారా" లోని పునరావాస కేంద్రంలో మిల్ఖా సింగ్ నివసించాడు. తరువాత కొంత కాలం తన సోదరి (పేరు: ఇష్వర్) వద్ద నివసించాడు. టిక్కెట్టు లేకుండా రైలులో ప్రయాణం చేసినందుకు మిల్ఖా సింగ్ ను పోలీసులు తీహార్ జైలులో బంధించారు. తన తమ్ముడిని విడిపించుకోవడానికి ఇష్వర్, తన దగ్గర ఉన్న కొంత నగదును అమ్మి, మిల్ఖా సింగ్ ను విడుదల చేయించింది.[3][4]
మిల్ఖా సింగ్, తన దుర్భరమైన జీవితంపైన విరక్తి చెంది, ఒక దోపిడి దొంగగా మారాలని నిశ్చయించుకున్నాడు. [a] కానీ, తన సోదరుడు మల్ఖన్, మిల్ఖా సింగ్ ను ఒప్పించి, భారత సైన్యంలో చేర్పించాడు. 1951లో, మిల్ఖాసింగ్ విజయవంతంగా తన 4వ ప్రయత్నంలో సికింద్రాబాద్ లోని ఎలెక్ట్రికల్ (విద్యుత్) - మెకానికల్ (యాంత్రిక) ఇంజినీరింగు కేంద్రంలో ప్రవేశం లభించింది.[5] కాలక్రమేణా తను క్రీడలకు పరిచయమయ్యాడు. బాలుడిగా తన పాఠశాలకు రాను, పోను,10 కిలోమీటర్ల దూరం పరుగెత్తేవాడు. కొత్తగా నియమితులైన సైనికులందరికీ తప్పనిసరైన ఒక జాతీయ స్థాయి పరుగుల పోటీని భారత సైన్యం నిర్వహించగా, మిల్ఖా సింగ్ 6వ స్థానంలో పోటీని ముగించినందుకు భారత సైన్యం అతనికి వ్యాయామ క్రీడలలో ప్రత్యేక శిక్షణ కల్పించింది. తనను క్రీడలకు పరిచయం చేసిన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ మిల్ఖా సింగ్, "నేను ఒక మారుమూల పల్లెటూరు నుండి వచ్చాను. నాకు పరుగంటే ఏంటో,ఒలింపిక్స్ అంటే ఎంటో కూడా తెలీదు" అని అన్నాడు.[6][7]
మిల్ఖా సింగ్, 2021 మే 24 న కోవిడ్ సంబంధ శ్వాస సమస్యలతో చండీగఢ్ లోని ఆసుపత్రిలో చేరాడు. 91 ఏళ్ళ వయసులో 2021 జూన్ 18 రాత్రి 11:30 కి మరణించాడు.[8] అతని భార్య నిర్మల్ కౌర్ కూడా కోవిడ్ జబ్బు వల్లనే 2021 జూన్ 13 న మరణించింది.[9]
అంతర్జాతీయ కెరీర్
1956 మెల్బోర్న్ ఒలింపిక్స్ లో జరిగిన 200 మీటర్లు, 400 మీటర్ల పరుగుల పోటీలకు భారతదేశం తరపున మిల్ఖాసింగ్ ప్రాతినిధ్యం వహించాడు. తన అనుభవశూన్యత వల్ల, ప్రధాన పోటీకి అర్హత సాధించలేకపొయాడు. అప్పుడు జరిగిన (1956 మెల్బోర్న్ ఒలింపిక్స్) 400మీటర్ల పరుగుల పోటీలో విజేతగా నిలిచిన చార్ల్స్ జెన్కిన్స్తో మిల్ఖాసింగ్ కు పరిచయం ఏర్పడింది. అతడు (చార్ల్స్ జెన్కిన్స్) మిల్ఖా సింగ్ కు ప్రేరణనిచ్చి, వివిధ రకాల శిక్షణా పద్ధతుల గురించి వివరించి, గొప్ప లక్ష్యాలను సాధించడానికి సహాయపడ్డాడు.1956లో, కటక్ లో నిర్వహించిన జాతీయ క్రీడల్లో మిల్ఖా సింగ్ 200, 400 మీటర్ల పరుగుల పోటీల్లో స్వర్ణపతకం సాధించడమే కాక, అనేక రికార్డులు నెలకొల్పాడు. అదే సంవత్సరంలో (1958) జరిగిన ఆసియా క్రీడల్లో కూడా స్వర్ణపతకాన్ని గెలుపొందాడు. అలాగే, 1958 బ్రిటిష్ సామ్రాజ్యం, కామన్వెల్త్ సమాఖ్యలు సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ క్రీడల్లో, 46.6 సెకన్ల సమయంలో పరుగుల పోటీని పూర్తిచేసి స్వర్ణపతకాన్ని సాధించిన మిల్ఖా సింగ్, స్వతంత్ర భారతదేశం తరపున బంగారు పతకం సాధించిన మొట్టమొదటి క్రీడాకారుడిగా కీర్తి గడించాడు. 2013 నాటికి, కామన్వెల్త్ క్రీడలలో బంగారు పతకం సాధించిన ఏకైక భారత క్రీడాకారుడిగా (అథ్లెట్) గుర్తింపు పొందాడు.
1960 ఒలింపిక్ క్రీడలలో, మిల్ఖా సింగ్ 4వ స్థానంతో ముగించిన 400మీటర్ల పరుగుల పోటీ, అత్యంత చిరస్మరణీయమైనది. ఆ పోటీలో మిల్ఖా సింగ్ విజేతగా నిలుస్తాడని ముందునుంచే నిపుణులు, విశ్లేషకులు అంచనా వేశారు. పోటీ ప్రారంభమైన వెనువెంటనే మిల్ఖాసింగ్ ఆధిక్యంలోకి దూసుకువెళ్ళి పోటీ మీద తన పట్టు బిగించాడు. కొంత సమయం తరూవాత పోటీ మీద తన పట్టును సడలించడంవలన ఇతర క్రీడాకారులు తనను అధిగమించి, పోటీని దిగ్విజయంగా పూర్తిచేయగా మిల్ఖా సింగ్ 4వ స్థానంతో సరిపెట్టుకోవలసివచ్చింది. వివిధ రికార్డులు ఈ పోటీలో బద్దలయ్యాయి. ఓటిస్ డేవిస్ అని పిలవబడే ఓ అమెరికన్ క్రీడాకారుడు, కేవలం సెకెనుకు వందోవంతు తేడాతో కార్ల్ కాఫ్మన్ అనబడే ఒక జర్మన్ క్రీడాకారుడిని ఓడించి, పోటీలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మిల్ఖా సింగ్ 4వ స్థానంతో పోటీని ముగించినప్పుడు నమోదైన 45.73 సెకన్ల సమయం, భారత జాతీయ రికార్డుగా దాదాపు 40 ఏళ్ళు పాటు నిలిచింది.
↑Paan Singh Tomar, one of Singh's contemporaries in the Indian Army and as an athlete, did become infamous as a dacoit.[1]
మూలాలు
↑ 1.01.1D'Souza, Dipti Nagpaul (23 June 2013). "Will over matter". The Financial Express. Archived from the original on 24 July 2013. Retrieved 15 July 2013.