పొట్టి ప్రసాద్ పేరుతో సుపరిచితుడైన కవివరపు ప్రసాదరావు తెలుగు హాస్య నటుడు. ఈయన రంగస్థలం నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించాడు. సినిమాల్లో ప్రవేశించినా నాటకాలు వేయడం మానలేదు. చంటబ్బాయ్ సినిమాలో పత్రికా సంపాదకుడి పాత్ర, సాగర సంగమం లో పనివాడి పాత్ర, హై హై నాయక సినిమాలో అవధాని పాత్ర ఆయన పోషించిన కొన్ని ముఖ్యమైన పాత్రలు. చివరిసారిగా ఆయన నటించిన చిత్రం 1992లో వచ్చిన బృందావనం.
వ్యక్తిగత జీవితం
పొట్టి ప్రసాద్ అసలు పేరు కవివరపు ప్రసాదరావు. ఆయన భార్య రాజ్యలక్ష్మి. కుమారుడు జగన్నాథ రావు. మెదడు సంబంధిత వ్యాధితో మరణించాడు.
కెరీర్
పొట్టి ప్రసాద్ నాటకరంగం నుంచి వచ్చినవాడు. రంగస్థలంలో హాస్యం ఆయన ప్రత్యేకత. ఈయన హాస్య నటుడు రాజబాబుకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. ఇద్దరు కలిసి ఎన్నో నాటకాలు వేశారు.
ఒకసారి మద్రాసులో కె. వెంకటేశ్వరరావు బృందంలో బెల్లంకొండ రామదాసు రాసిన ఆకాశరామన్న అనే నాటకంలో నటించడానికి వచ్చాడు. ఈ ప్రదర్శనను చక్రపాణి చూడటం తటస్థించింది. చక్రపాణి ఆయన చిరునామా తీసుకుని పంపేశారు. ఇవన్నీ మామూలనుకున్న ప్రసాద్ కు ఒక నెల రోజుల తర్వాత సినిమాలో అవకాశం వచ్చింది. అలా వచ్చిన అవకాశమే ఆయన మొదటి సినిమా అప్పుచేసి పప్పుకూడు. ఇందులో నటి గిరిజను పెళ్ళి చూపులు చూడ్డానికి వచ్చే ఇద్దరిలో ఈయన ఒకడు, మరొకరు పద్మనాభం. ఇందులో ఒక్క సీన్ లో నటించినందుకు గాను నిర్మాతలు బి. నాగిరెడ్డి, చక్రపాణి ఆయనకు 1116/- రూపాయలు పారితోషికం ఇచ్చారు. అందుకు ఆయన చాలా సంతోషపడ్డాడు.[1]
ఈ సినిమా తర్వాత కూడా నాటకాలు వేస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు.[2]
చంటబ్బాయ్ సినిమాలో పత్రికా సంపాదకుడి పాత్ర, సాగర సంగమం లో పనివాడి పాత్ర, హై హై నాయక సినిమాలో అవధాని పాత్ర ఆయన పోషించిన కొన్ని ముఖ్యమైన పాత్రలు.