నూజివీడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఏలూరు జిల్లా లోని ఒక ముఖ్య పట్టణం. మామిడి తోటలకు, వీణలకు ప్రసిద్ధి.
చరిత్ర
పూర్వం రాజుల పరిపాలనలో ఈ పట్టణం ఉండేది. నూజివీడు రాజుల కోట నుండి విజయనగర ఆస్థానం వరకు ఒక సొరంగం ఉండేది.అది ప్రస్తుతం కరెంటు ఆఫీసుగా ఉన్న రాజుల కోటకు ఆగ్నేయంగా ఉండేది.ఈ కోట కోడిగుడ్డు సొన, మినుప పిండి, సున్నం వేసి నిర్మించారు. తరువాత ఆ కోటలో ఆ.ప్ర సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలగా ఏర్పాటు చేసింది.
భౌగోళికం
జిల్లా కేంద్రమైన ఏలూరుకు వాయవ్యంగా 32 కి.మీ దూరంలో ఉంది. విజయవాడకి 50 కి.మీ దూరములో ఉంది. సముద్రమట్టానికి 28 మీ. ఎత్తు.[2]
విజయవాడ, ఏలూరు నుండి రహదారి వ్యవస్థ ఉంది. సమీప రైల్వేస్టేషన్ ఏలూరులో ఉంది.
విద్యా సౌకర్యాలు
ఐ.ఐ.ఐ.టి నూజివీడు:- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి, వై.యస్.రాజశేఖర రెడ్డిచే పేద విద్యార్థుల కోసం స్థాపింపబడిన ప్రతిష్ఠాత్మకమైన రాజీవ్ గాంధీ సాంకేతిక వైఙ్ఞానిక విశ్వవిద్యాలయం.
దర్మా అప్పారావు కాలేజీ:- ప్రతి యేడూ డీఏఆర్ కాలేజీలో బాస్కెట్ బాల్ పోటీలు, బాయ్స్ ఉన్నత పాఠశాలలో కబడ్డీ పోటీలు చాలా పెద్ద స్థాయిలో జరుగుతాయి.
కృష్ణ యునివర్శిటీ ఉన్నత విద్యా కేంద్రం
సారథి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్
శ్రీ దత్తాత్రేయ యోగ, వ్యాయామ పాఠశాల
దర్శనీయ ప్రదేశాలు
కుక్కల గేటు, గుర్రం గేటు: నూజివీడు జమీందారులచే నిర్మించబడినవి
శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరస్వామివారి ఆలయం: గొడుగువారిగూడెంలో వున్నది
శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివారి ఆలయం: బస్సుస్టాండ్ రహదారిలో ఉన్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు.
కోట శివాలయం: డి.ఏ.ఆర్.రహదారిపై ఉన్నది
శ్రీ ధన్వంతరీస్వామివారి ఆలయం: నూజివీడు పట్టణ శివారులలో ఉన్నది
సరస్వతి దేవాలయం: ఆంధ్రప్రదేశ్‌లో కేవలం రెండు సరస్వతీదేవి ఆలయాలు మాత్రమే వున్నవి, ఒకటి బాసర అయితే రెండవది నూజివీడు.
ఉత్పత్తులు
నూజివీడు మామిడి తోటలకు బాగా పేరున్న ప్రదేశం. పలు వందల రకాల మామిడి పళ్ళు ఇక్కడ లభించును. ప్రసిద్ధి చెందిన "నూజివీడు చిన్న రసం" పళ్ళకు నూజివీడు పుట్టినిల్లు.
నూజివీడు వీణలు
పట్టణంలోని వెంకటేశ్వర కోవెల ప్రాంతములో వీణల తయరీ దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ తయారుచేసిన వీణలకు, దేశంలోనే కాదు విదేశాలలో గూడా ప్రాచుర్యం ఉంది. రాజులకాలంలో ప్రారంభించిన వీణల తయారీదారులు ఇప్పటికీ తమ వృత్తిని కొనసాగించుచున్నారు. సరస్వతి, మయూర, విపంచి, డ్రాగన్, ఫోల్డింగ్, గోటు, మధుర వీణల తయారీలో షేక్ మాబు షేక్ మీరాసాహెబ్ నిష్ణాతులు. ఈ తండ్రీకొడుకులు రూపొందిన వీణలను ప్రముఖ వీణ చిట్టిబాబు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నేదునూరి కృష్ణమూర్తి, ద్వారం భవన్నారాయణ, డాక్టర్ పినాకపాణి, శ్యాంసుందర్ వంటి విద్వాంసులు తమ కచేరీలకు కొనుగోలు చేసేవారు.