జగపతి బాబు

జగపతి బాబు
2013 లో 60వ దక్షిణాది ఫిల్ం ఫేర్ పురస్కారాల వేడుకల్లో జగపతి బాబు
జననం
వీరమాచనేని జగపతి బాబు

(1962-02-12) 1962 ఫిబ్రవరి 12 (వయసు 62)
ఎత్తు5 అ. 11 అం.
తల్లిదండ్రులువి. బి. రాజేంద్రప్రసాద్

జగపతి బాబుగా పేరొందిన వీరమాచనేని జగపతి చౌదరి తెలుగు సినిమా నటుడు. తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు అయిన వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారుడు. దాదాపు 100 చిత్రాలలో నటించి ఏడు నంది పురస్కారాలను అందుకున్నారు. కుటుంబ కథా చిత్రాలలో ఎక్కువగా నటించాడు. కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా పేరు గాంచినా కొన్ని సినిమాలతో ప్రయోగాలు కూడా చేశాడు. ఉదాహరణకు గాయం, అంతఃపురం, ప్రవరాఖ్యుడు, లెజెండ్, రంగస్థలం, శ్రీమంతుడు లాంటి సినిమాల్లో అతను పోషించిన పాత్రలు.

నేపథ్యము

జగపతి బాబు ఫిబ్రవరి 12, 1962న మచిలీపట్నంలో జన్మించాడు. మద్రాసులో పెరిగాడు. ఈయన తండ్రి జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ అధినేత, దర్శకుడు అయిన వి. బి. రాజేంద్రప్రసాద్.[1]

మద్రాస్ లోనే చదువు పూర్తిచేసిన జగపతిబాబు తర్వాత సినిమాల్లోకి ప్రవేశించాడు. చదువుకునే సమయంలో రోజుకు 3 - 4 సినిమాలు చూసిన జగపతిబాబుకి సినిమాల్లోకి రావాలని ఆలోచన ఉండేదికాదు. ఎందుకంటే 12 ఏళ్ళ వయసులో సినిమాల్లోకి వెళ్ళను అని ఆయన అమ్మగారు ఒట్టు వేయించుకున్నారు. చదువు అయ్యాక కొన్నిరోజులు విశాఖపట్నంలో ఉన్న బిజినెస్ చూసుకున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా సినిమాల్లోకి వెళ్ళాలని ఒక్క రాత్రిలో నిర్ణయించుకుని, నాన్నగారు పెద్ద నిర్మాత అయినా ఆయన ప్రమేయం లేకుండానే ప్రయత్నాలు కొనసాగించారు.

కో-డైరెక్టర్ ద్వారా విషయం తెల్సుకున్న రాజేంద్రప్రసాద్ గారు జగపతిబాబు ఇష్టాన్ని మన్నించి 1989లో సింహస్వప్నం సినిమా తీసి తెలుగు సినిమాకు పరిచయం చేశాడు. ఈ సినిమాలో కృష్ణంరాజు కథానాయకుడు. తొలి సినిమాలోనే ద్విపాత్రాభినయం చేసిన మొదటి నటుడు జగపతిబాబు. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ తరువాత చేసిన చాలాచిత్రాలు విఫలమయ్యాయి. కానీ పట్టుదలతో ప్రయత్నించిన జగపతిబాబుకు జగన్నాటకం, పెద్దరికం వంటి చిత్రాల విజయంతో నటుడిగా గుర్తింపు వచ్చింది. అయితే తన గొంతు బాగాలేదని ఇప్పటివరకు అన్ని సినిమాలకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించారు. పెద్దరికం సినిమాతో రాంగోపాల్ వర్మ దృష్టిలో పడ్డ జగపతి గాయం హిట్ తో హీరోగా స్థిరపడ్డారు. ఈ సినిమాకు మణిరత్నం రచయిత. ఈ సినిమాలో తొలిసారి డబ్బింగ్ చెప్పిన జగపతి తన గొంతుతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు కొత్తతరం యాంగ్రీ యంగ్ మ్యాన్ గా అతన్ని చూపించాయి. అప్పటికే జగపతి బాబు కొత్త పంథాలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేశాడు.

1994లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమాతో కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఎస్. వి. కృష్ణారెడ్డి, జగపతి బాబు కాంబినేషన్లో వచ్చిన మావిచిగురు, పెళ్ళి పీటలు మొదలైన చిత్రాలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి. మావిచిగురు సినిమాతో మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు. జగపతి బాబు, సౌందర్య జంట సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇదే దారిలో దాదాపు 80 చిత్రాలలో నటించారు. మహిళా ప్రేక్షకులను అధికంగా సంపాయించుకున్నాడు. అదే సమయంలోనే ఒకే మూసలో కాకుండా కొత్త పాత్రలతో ప్రయోగాలను చేస్తూ వచ్చారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం సినిమాలో చేసిన సారాయి వీర్రాజు పాత్రలో బాగా పేరు తెచ్చింది. ఈ సినిమాకు జగపతిబాబుకు ఉత్తమ సహాయనటుడిగా నంది పురస్కారం లభించింది. ఈ సినిమా తర్వాత హిందీలో శక్తి అనే పేరుతో పునర్నిర్మాణం అయింది. తెలుగులో జగపతి బాబు పోషించిన పాత్రను హిందీలో షారుఖ్ ఖాన్ పోషించాడు. తెలుగులో జగపతి చూపించిన ప్రదర్శనను తాను తిరిగి చేయలేకపోయానని షారుఖ్ ఖాన్ పేర్కొనడం గమనార్హం.[1] తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన మనోహరం సినిమాకుగాను ఆయన రెండోసారి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు. ఆ తరువాత సముద్రం వంటి చిత్రాలతో ప్రయోగాలు చేశాడు. కామెడీ పాత్రలు, కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూనే చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన అనుకోకుండా ఒక రోజు సినిమాలో పోలీసు ఆఫీసరుగా కనిపించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అలాంటి పాత్రలతో లక్ష్యం, హోమం, సిద్ధం సినిమాల్లో నటించాడు.

తర్వాత మళ్లీ తన పంథా మార్చుకుని 2006 లో మదన్ దర్శకత్వంలో వచ్చిన పెళ్ళైనకొత్తలో అనే కుటుంబ కథా చిత్రంలో నటించాడు. ఇందులో ప్రియమణి కథానాయిక. కొత్తగా పెళ్ళైన జంటకు వచ్చే చిన్న చిన్న గొడవలు ఈ సినిమాకు ప్రధాన కథ. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించి వీరిద్దరినీ హిట్ పెయిర్ చేసింది. తర్వాత రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కథానాయకుడు సినిమాలో జగపతి బాబు నటన ప్రశంసలు అందుకుంది.

25 సంత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదొదుకులను ఎదుర్కొన్న జగపతిబాబు, ఇక హీరోగా చేయడం మానుకొని నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్‌ చిత్రంలో ప్రతినాయకుని పాత్రను పోషించారు.

పురస్కారాలు

నంది అవార్డులు

ఫిల్మ్ ఫేర్ అవార్డులు

సైమా అవార్డులు

సినిమాలు

అవయవదానం

జగపతిబాబు 2022 ఫిబ్రవరి 12న తన 60వ పుట్టినరోజు నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో 2022 ఫిబ్రవరి 11న ఏర్పాటు చేసిన అవయవదాన అవగాహన సదస్సుకు చీఫ్ గెస్టుగా విచ్చేసిన జగపతిబాబు తన మరణాంతరం అవయవదానం చేస్తున్నట్టు ప్రకటించారు. వంద మంది అభిమానులు సైతం ప్రమాణపత్రంపై సంతకం చేసారు.[3]

మూలాలు

  1. 1.0 1.1 Southscope July 2010 - Side A (in ఇంగ్లీష్). Southscope.
  2. "RGV-Jagapati Babu team up for 'Golusu'". 123telugu.com. Archived from the original on 30 September 2017. Retrieved 10 January 2020.
  3. "అవయవదానానికి జగపతిబాబు సమ్మతి". EENADU. Retrieved 2022-02-12.

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!