కోర్స్ఎరా అనేది ఒక అంతర్జాల అభ్యాస వేదిక. ఇది 2012 సంవత్సరంలో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం కు చెందిన ఆండ్రూ ఎన్జి[2] ఇంకా డాఫ్నే కొల్లెర్ చేత స్థాపించబడింది. ఈ ప్లాట్ ఫామ్ MOOC కోర్సులు ,స్పెషలైజేషన్లు, డిగ్రీలను అందిస్తుంది.
ఇంజినీరింగ్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, మ్యాథమెటిక్స్, బిజినెస్, కంప్యూటర్ సైన్స్, డిజిటల్ మార్కెటింగ్, మెడిసిన్, బయాలజీ, సోషల్ సైన్సెస్, తదితర పలు సబ్జెక్టుల్లో ఆన్లైన్ కోర్సులు, స్పెషలైజేషన్లు, డిగ్రీలను అందజేస్తుంది.
నేపథ్యం
చరిత్ర
కోర్స్ ఎరా 2012[3]లో స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆండ్రూ ఎన్జి[4], డాఫ్నే కొల్లెర్[5]అనే కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్లచే ప్రారంభించబడింది. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం 2011 శరదృతువులో నిర్వహించిన ఆన్ లైన్ కోర్సుల అనుభవంతో వీరు ఆ సంస్థను వదిలివేసిన తర్వాత కోర్స్ ఎరాను స్థాపించారు.[6] ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం, మిషిగన్ విశ్వవిద్యాలయం, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ఈ ప్లాట్‌ఫాం ద్వారా కోర్సులను అందించిన మొదటి విశ్వవిద్యాలయాలు.[7]
ఆర్థికసహకారం
ఈ సంస్థ ప్రారంభంలో 16 మిలియన్ డాలర్ల మూలధనంతో ప్రారంభమైంది. క్లైనర్ పెర్కిన్స్ కాఫిల్డ్ & బేయర్స్, న్యూ ఎంటర్‌ప్రైజ్ అసోసియేట్స్ అనే సంస్థలు ఈ మూలధనాన్ని సమకూర్చాయి. 2013లో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ నేతృత్వంలో 63 మిలియన్ డాలర్ల పెట్టుబడి చేకూరింది. తరువాతి సంవత్సరాలలో ఇడిబి ఇన్వెస్ట్‌మెంట్స్, SEEK గ్రూపు, ఫ్యూచర్ ఫండ్ మొదలైన సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. 2020 జూన్ నాటి ఈ సంస్థ విలువ 2.5 బిలియన్ డాలర్లు.
భాగస్వామ్యం
2019 డిసెంబర్ నాటికి ఈ సంస్థలో 29 దేశాలకు చెందిన 200కు పైగా భాగస్వాములున్నారు. ఈ సంస్థ సాధారణంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలతో కలిసి పనిచేస్తుంది. దానితో పాటుగా గూగుల్ వంటి కార్పొరేట్ సంస్థలతోను, ప్రభుత్వాలతోను కలిసి పనిచేస్తుంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, బ్రెజిల్ లోని సావోపౌలో విశ్వవిద్యాలయం, ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లండన్, కొరియాలోని యోన్సై విశ్వవిద్యాలయం, ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, యేల్ విశ్వవిద్యాలయం వంటి విద్యాసంస్థలతో దీనికి భాగస్వామ్య సంబంధాలున్నాయి.
సేవలు
ఈ సంస్థ నాలుగు నుండి 12 వారాల వ్యవధి కల కోర్సులను ఆఫర్ చేస్తుంది. వారానికి రెండు గంటల విడియో పాఠాలుంటాయి. క్విజ్‌లు, అసైన్‌మెంట్లు, ప్రాజెక్టులు, పరీక్షలు నిర్వహిస్తారు. 2015 మే నాటికి 104 ఆన్ డిమాండ్ కోర్సులను ఈ సంస్థ ఆఫర్ చేసింది. 2017 నుండి ఈ సంస్థ ఇన్నొవేషన్ & ఎంట్రిప్రిన్యుయర్‌షిప్(OMIE), అకౌంటింగ్(iMSA), డేటాసైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(iMBA), వంటి విభాగాలలో పూర్తిస్థాయి మాస్టర్స్ డిగ్రీని నిర్వహిస్తున్నది.