కొత్తలూరు పల్నాడు జిల్లా శావల్యాపురం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన శావల్యాపురం నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వినుకొండ నుండి 15 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 439 ఇళ్లతో, 1824 జనాభాతో 1786 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 925, ఆడవారి సంఖ్య 899. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 496 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590111.[1]
గ్రామ భౌగోళికం
ఇది పల్నాడు జిల్లా, శావల్యాపురం మండలంలోని ఏల్చూరు నుండి నల్లగొండ వెళ్లు రోడ్డులో శావల్యాపురానికి పశ్చిమంగా 4 కి.మీ.ల దూరంలో కొంకేరు వాగు సమీపంలో ఉంది. ఈ కొంకేరు వాగు నల్లమల కొండల్లో పుట్టి, కొత్తలూరు వచ్చే సరికి 15 కి.మీ.తూర్పుగా ప్రవహించి, మార్గమధ్యంలో చవిటివాగు, అంగలేరు అనే రెండు చిన్న ఏరులను కలుపుకొని చివరకు గుండ్లకమ్మ అనే ఒక చిన్న నదిలో కలిసి బంగాళఖాతంలో చేరుతుంది. మొదటినుంచి కొత్తలూరు ఆర్థిక, సామాజిక సాంస్కృతిక జీవనం కొంకేరు వాగుతో ముడిపడి ఉంది. ఈ గ్రామం ఉనికి ఉత్తర అక్షాంశం 16.117803 డిగ్రీలు, తూర్పు రేఖాంశం 79.81201 డిగ్రీలపై ఉంది,
సమీప గ్రామాలు
ఉప్పరపాలెం 2 కి.మీ, గుర్రంవారిపాలెం 4 కి.మీ, శావల్యాపురం 4 కి.మీ*కొచ్చర్ల 5 కి.మీ, కనమర్లపూడి 5 కి.మీ
సమీప మండలాలు
ఉత్తరాన ఈపూరు మండలం, దక్షణాన వినుకొండ మండలం, తూర్పున రొంపిచెర్ల మండలం, పశ్చిమాన బొల్లాపల్లి మండలం
గ్రామ పంచాయితీ
గ్రామపంచాయతి వ్యవస్థ అనాదిగా, అనగా వేదకాలం నుండి ఏదో ఒక రూపంలో వున్నట్లు ఆధారాలున్నవి. ప్రజాస్వామ్యవ్యవస్థకు స్థానికుల చురుకైన భాగస్వామ్యము మూలస్తంభములాంటిది. ఈనాటి పంచాయతీలు 1935 నాటి భారత ప్రభుత్వచట్టం నుండి అవతరించినవి. ఇవి అభివృద్ధి కార్యక్రమాలు - రోడ్లు, మురికికాల్వలు, పారిశుధ్యము తదితర కార్యకలాపాలు నిర్వహిస్తూ వుండేవారు.పూర్వం ఓటు హక్కు కొంత కనీస పన్ను చెల్లించే భుకామందులకే పరిమితమైవుండేది. ఈ పద్ధతి క్రింద కొత్తలూరుకు ఇద్దరే ప్రెసిడెంట్ లుగ ఎన్నుకోబడ్డారు. వారు 1. శ్రీ దావులూరి చిన్నబసవయ్య 2. శ్రీ దావులూరి చినవెంకటసుబ్బయ్య లు. ఆ తర్వాత ఇప్పుడు సర్పంచ్ అనబడే పంచాయతీ ప్రెసిడెంట్, ఇతర సభ్యులతో సహా వయోజనులైన ఊరందరిచేత ఎన్నుకోబడేవారు. అయితే తొలుదొల్త చేతులెత్తే పద్ధతిపై ముడేండ్ల కాలపరిమితికి ఎన్నికయ్యేవారు. 1957లొ రహశ్య ఓటింగ్ విధానము అమలులోకి వచ్చింది. అయితే యీ పరోక్ష పద్ధతిలో మొదట ఓటర్లు మెంబర్లను ఎన్నుకుంటే, యీ మెంబర్లు సర్పంచ్ ను ఎన్నుకునేవారు. పదవీ కాలం ఐదేండ్లకు పెరిగింది.
ఈ క్రిందివారు కొత్తలూరు గ్రామానికి పంచాయతీ సర్పంచులుగా సేవలందించినట్లు తెలుస్తుంది.
- .దావులూరి చినబసవయ్య (1945కు పూర్వం)
- .దావులూరి చినవెంకటసుబ్బయ్య (1945-53, 1960-65)
- .దావులూరి కోటయ్య, గుర్రంవారి పాలెం ( 1953-1957)
- .పద్మనాభుని కోటిలింగం (1957-1960)
- .దావులూరి చినలక్ష్మయ్య (1965-1974)
- దావులూరి ఆంజనేయులు (1974-1985)
- కొత్తలూరి అనంతరామయ్య (1986 -1991)
- రాజు (ఎస్.సి రిజర్వుడు) తుమ్మలకుంట, (1991-1996)
- .బండారుపల్లి కోటేశ్వరరావు, తుమ్మలకుంట (1996-2001)
- .గోపు హైమవతి (మహిళ రిజర్వుడు (2001-2006)
- .పేరుపాక ఆశీర్వాదం (ఎస్.సి రిజర్వుడు (2006-2011)
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.
సమీప బాలబడి కనమర్లపూడిలో ఉంది.
సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల వినుకొండలోను, ఇంజనీరింగ్ కళాశాల నరసరావుపేటలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు నరసరావుపేటలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం నరసరావుపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.
అక్షరాస్యత
ఈనాటి నేపథ్యంలో చూస్తే ఆనాడు పాఠశాల విద్యలేదనే చెప్పాలి. కొత్తలూరులో 20వ శతాబ్దప్రారంభంలో ప్రథమ పాఠశాల ఏర్పడివుండవచ్చు. దీనికి ముందు కూడా గ్రామంలోని బ్రాహ్మణులకు యితర కులాల వారికి సత్సంబంధాలు వుండటంచేత అక్షరాస్యత శాతం ఎక్కువగా వుండేది. ఆనాడు ఐదవ తరగతి చదివిన వారికి రామాయణ, మహాభారత, తదితర గ్రంథాలలో మంచి ప్రావీణ్యం వుండేది. ఆనాడు ఒక ప్రత్యేక పాఠ్య ప్రణాళిక (సిలబస్) లేకపోయినా పాఠ్యపుస్తకాలు (Textbooks) మాత్రము అరుదుగావుండేవి. కాలానుగుణంగా క్రమంగా విద్యపై ప్రజలకు వున్న మక్కువ, నమ్మకం ఆధునిక విద్యావ్యాప్తికి దోహదం చేశాయి.
ఉపాధ్యాయ శిక్షణ పొంది, ఆంగ్ల భాషలో ప్రవేశం గల ఒక ఉపాధ్యాయుడు నాగులపాటి నారాయణ విద్యకు బీజాలు వేశాడని చెప్పొచ్చు. దీనికి ప్రథమ లబ్ధిదారుడు దావులూరి వెంకటసుబ్బయ్య 1940 ప్రాంతంలో ప్రభుత్వ సర్వీసు లోని సెంట్రల్ ఎక్సైజు శాఖలో ఉద్యోగంలో చేరిన తొలి కొత్తలూరి పౌరుడు వెంకటసుబ్బయ్య గారే. అతను గ్రామంలోని తల్లిదండ్రులందరికి స్ఫూర్తిదాయకం. ప్రభుత్వ సర్వీసులో చేరడానికి దారి చూపిన వ్యక్తి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
కొత్తలూరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.
సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
తాగు నీరు
సురక్షిత మంచినీటి పధకం
కొత్తలూరు గ్రామం ఫ్లోరైడ్ జోన్ లో వుండటం చేత ఇక్కడి ప్రజలు అనేక తరాలుగా బాధలు పడుతూ వచ్చారు. 2003 వ సంవత్సరంలో ప్రభుత్వం 20 లక్షల రూపాయిలతో ఒక ఓవర్ హెడ్ టాంక్ నిర్మించి త్రాగు నీరు అందించాలనే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. టాంక్ నుండి పైపులద్వారా వారందించిన నీరు ఫిల్టర్ చేయకపోవడం చేత తాగటానికి నిరుపయోగమైనది.
2009 సంవత్సరంలో శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించే ఉద్దేశంతో ఆ భూమి పుత్రులే 2.5 లక్షల మొత్తాన్ని సేకరించుకున్నారు. అందులో స్వర్గీయ శ్రీ దావులూరి వెంకటసుబ్బయ్య (తండ్రి అచ్చయ్య) గారి కుమారులే ప్రధానదాతలు. ఒక లక్ష రూపాయిలు విరాళంగా ఇచ్చారు. తమ తండ్రి పేరు మీద యీ పధకాన్ని ప్రారంభించవలసిందిగా వారి కోరిక. అయితే యీ సారి ఒక శుభ పరిమాణము గ్రామస్తుల స్వచ్ఛంద సహకారము. స్వచ్ఛమైన, శుభ్రమైన తాగునీటి విలువను అవసరాన్ని గ్రహించిన గ్రామస్థులు ముందుకు వచ్చి 1.10లక్షల రూపాయిలు వసూలు చేసుకొని యీ కార్య నిర్వహణకై ఒక కమిటీగా ఏర్పడ్డారు. ఆ కమిటీకి శ్రీ దావులూరి సత్యనారాయణ (తండ్రి అచ్చయ్య) అనే ఇంజనీర్ ను ప్రసిడెంట్ గ ఎన్నుకొన్నారు. ఈ కమిటీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సత్యం చారిటబుల్ ట్రస్ట్ తో ఒక అవగాహనకు వచ్చి R.O (Reverse Osmosis) సిస్టం ప్లాంటును ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్లాంట్ అనేక తరాలుగా కొత్తలూరి ప్రజలులోనౌతున్న బాధలకు ఒక చక్కటి పరిష్కారము. ఫ్లోరైడు బాధనుండి విముక్తి లభించింది. 24 లీటర్ల ఒక డబ్బాను చౌకగా కేవలం నాలుగు రూపాయల కే పొందుతున్నారు.
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
వ్యక్తిగత మరుగు దొడ్లు
బహిర్భూమికి దగ్గర పోలాలలోనికి వెళ్లి తేలిక పడటం యీ నాగరిక ప్రపంచంలో ఏ విధంగా కూడా సమర్దనీయంకాదు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులను దృష్టిలో పెట్టుకుంటే వాటి ఆవశ్యకత ఎంతైనా కనిపిస్తుంది. ఊరంతా 110 ఇండ్లకు యీ సౌకర్యం కల్పించవలసివుంది. దాదాపు సగం ఖర్చు ప్రభత్వమే భరిస్తుంది. గనుక మిగతా సగభాగం ఖర్చుకు 3.5 లక్షల రూపాయలు ఆవసరముంది.
మురుగు నీటి కాల్వలు
2004 వ సంవత్సరంలో సిమెంటు రోడ్లు వేయక పూర్వమే గ్రామంలో కొన్ని వీధులలో ఓపెన్ మురుగు కాలవలు కట్టించబడినవి. అయితే ఇంకాకొన్ని వీధులకు యీ సౌకర్యము లేదు. అందుచేత మురుగు కొన్నిచోట్ల నిల్చి పోయి ప్రజా ఆరోగ్యానికి సమశ్యగా పరిణమించింది. అదేగాక గ్రామంలో మురుగు నీరంతా గ్రామ చివరలకు చేర్చి, అక్కడ ఇంకి పోయే ఏర్పాట్లు చేయవలెను. దీనికి సుమారు 2 లక్షల రూపాయలు అవసరమౌతాయి. ఈ విషయంలో ప్రభుత్వ శాఖల సహాయం కోసం కృషి చేయవలసివుంది.
సమాచార, రవాణా సౌకర్యాలు
కొత్తలూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్ ఉంది. పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్, ఆటో సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ట్రాక్టరు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 10 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
ఈనాటి కొత్తలూరు
ఈ శతాబ్ది మొదటి దశకంలో కొత్తలూరి అభివృద్ధి గణనీయంగా ఉంది. హైదరాబాదులో స్థిరపడిన కొత్తలూరి వారు ఆ వూరి అభివృద్ధికై ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. దానిలో విద్య,ఆరోగ్యము,పారిశుధ్యము, రోడ్లు, పరిశుభ్రమైన త్రాగునీరు ప్రధానమైనవి.
కొత్తలూరు ఆవిర్భావము
ఎక్కడైనా మానవ సముదాయాలు నీటి లభ్యతను బట్టి ఏర్పాట వుతుంటాయి. కొత్తలూరు కూడా కొంకేరు వాగుకు తూర్పుగ ఇప్పుడు పాట్టిగడ్డ అని పిలువబడే చోట ఏర్పడిందట. ఇప్పటికీ భూమి దున్నకంలో మట్టికుండ పెంకులు, కొన్ని సందర్భాలలో బంగారు నాణేలు కూడా లభ్యమౌతుంటాయి. ఉత్తరంగా తుమ్మలకుంట, దక్షిణంగా గుర్రంవారిపాలెం అనే రెండు ఊళ్ళు శివారు గ్రామాలుగా కొత్తలూరు ప్రధానగ్రామంగా గుర్తింపు లభించింది. రెండు అధికార కేంద్రాలైన మునసబు, కరణములతో రెవెన్యు గ్రామంగా యీ గుర్తింపు లభించింది. కొంత కనీస శిస్తు వసూలు ప్రాతిపదికగా కొత్తలూరు ప్రభుత్వంచేత గుర్తింపు పొందింది. 19వ శతాబ్దం మధ్యభాగంలో యీప్రాంతం కృష్ణ జిల్లాలో భాగంగా వున్నప్పుడు 'కనీస శిస్తు వసూలు' ప్రాతిపదికగా ఈస్టిండియా కంపెనీ వారు శ్రీ దావులూరి పెదరామయ్యను కొత్తలూరు ప్రథమ మునసబుగా నియమించినట్లు తెలుస్తుంది. రెండవది, గ్రామంనసబుతో పాటుగా మరిద్దరు గ్రామసేవకులను - ఒకరు 'వెట్టి' అనే వానిని దళితుల నుండి, రెండవవారు 'మోతాదు' అనే వానిని ముస్లింల నుండి - నియామకం చేయడం చేత యీ వూరికి రెవెన్యూ గ్రామంగ గుర్తింపు లభించింది. ఈ పదవులన్ని వంశపారం పర్యమే. ఆనాటి సామాజిక చట్రంలో ప్రభుత్వపదవి ఏదైనా గౌరవప్రథమైనదే. కేవలం జీతభత్యాలే కాకుండా, శాంతిభద్రతలు కాపాడటం, రెవెన్యూ వసూళ్ళు వారి విధులు గనుక నిరక్షరాస్యులైన ఆనాటి ప్రజలు వారిని చూసి భయంతో గౌరవమర్యాదలిస్తుండేవారు. అధికార కేంద్రాలైన ఈ పదవులనలంకరించినవారు ఎక్కువగా వారిలో వారే అంటే యిరుగుపొరుగు గ్రామాలలో వుండే అదే పదవుల వారితో వివాహసంబంధాలను ఏర్పరచుకునేవారు.
శాంతి భద్రతల పరిరక్షణ
గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత పూర్తిగా గ్రామంనసబుదే. ఆయన మిగతా అధికారగణం సాయంతో - వెట్టి, మోతాదులతో - యీ బాధ్యత నిర్వహిస్తుండేవారు.గ్రామంలోకి ప్రవేశించే ఆగంతకుల కదలికలపై నిఘావుంచడం, పశువులు కొనుగోళ్ళు చేసినపుడు వాటిని తోలుకపోవడానికి అధికారికంగా ఒక చీటీ వ్రాసియివ్వడం, గ్రామస్థులు అసాంఘిక కార్యకలాపాలలో జోక్యం లేకుండా చూడటం మునసబు ప్రధాన విధులు. గ్రామంలో 'బందెలదొడ్డి' ఆయన ఆధీనంలో వుండేది. కాపలాలేని పశువులను దొడ్లో తోలితే వాటికీ బందే వసూలు చేసి విడిపించేవారు.
మొదట్లో కొత్తలూరుకు అంతమంచి పేరుండేది కాదు. దానికి కారణం యీ వూరికి చెందిన ఆనాటి కొంతమంది 'వడ్డెర' కుటుంబాల వారు కృష్ణా, గుంటూరు జిల్లాలలో అనేక గ్రామాలలో కన్నాలు వేసి ఇండ్లను దోపిడీ చేయడమే.
బాహ్యప్రపంచంతో సంబంధాలు
ఆ రోజుల్లో మచిలీపట్నం ఓడరేవును, మార్మగోవా రేవును కలుపుతూ ఒక రైలు మార్గం వుండేది. అదృష్టవశాత్తు కొత్తలూరు ఆ మార్గానికి సమీపంలో ఉంది. ఆధునిక రవాణా వ్యవస్థకు రూపకల్పన చేసేటప్పుడు బ్రిటిష్ వారు రైలు,రోడ్డు మార్గాలు ఒక దానికి మరొకటి సమీపంలో, సమాంతరంగా వుండేటట్లు ఏర్పరచారు. అదే ప్రకారం గుంటూరు నుండి కర్నూలు వెళ్ళే రోడ్డు మార్గం కొత్తలూరుకు 4 కి.మీ. సమీపంలో వున్న శావల్యాపురం గుండా వెళ్ళింది. తన్మూలంగా తాలూకా కేంద్రానికి గాని, జిల్లా కేంద్రానికి గాని వెళ్ళే వీలు కలిగింది. ఆ రోజుల్లో యితర గ్రామాలకు వెళ్ళడానికి కాలిబాటలు, బండ్లబాటలే మార్గాలు. 1960 దాక యిదే పరిస్థితి కొనసాగింది. ఆ సంవత్సరంలో కొత్తలూరును శావల్యాపురంతో కలిపే ఒక పక్కా మట్టి రోడ్డును కొత్తలూరు యువజన సంఘం వేసింది. 1960 దశకం మధ్యలో నాగార్జున సాగర్ కాల్వలు త్రవ్వడంతో శతాబ్దాల తరబడి వాడుకలో వున్న కాలిబాటలన్నీ తుడిచి పెట్టుకుపోయాయి. గ్రామాలను కలుపుతూ యిప్పుడు కాలిబాటలు లేవనే చెప్పొచ్చు.
పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు
సాధారణంగా సాంస్కృతిక కార్యక్రమాలకు, పండుగలకు, ఆలయాలే ప్రధాన కేంద్రాలు. 20వ శతాబ్దం చివరి వరకు కొత్తలూరులో చెప్పుకోదగ్గ దేవాలయం లేదు. ఉన్నవి మాత్రం రామాలయము, పోలేరమ్మ గుడి, అద్దంకమ్మ గుడి, ఉత్తరవీధి చివర వున్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహం. పొరుగు గ్రామాలలో జరిగినట్లు ఇక్కడ పండుగలు కూడా క్రమపద్ధతిలో జరిగేవిగావు. ఈ విధంగా చూస్తే కొత్తలూరు వెనుకబడే ఉంది. నిత్యపూజా కార్యక్రమాలతో రామాలయం 2001 లో విలసిల్లింది. 1960లలో పురాతన కట్టడాన్ని పడగొట్టి 1970లలో పున: నిర్మాణానికి నోచుకుంది. ధ్వజస్తంభంతో పాటు విగ్రహాల ప్రతిష్ఠ, వరండాలో గ్రిల్లు ఏర్పాటు అన్ని వూరి యువకుల చొరవతో 2001లో ఏర్పడ్డాయి.
ప్రజాజీవనం
ఉళ్ళో వున్న ఇండ్లన్నీ మట్టికట్టడాలే. సంపన్నులకు పెద్ద ఇండ్లు ఉండేవి. ఆ ఇండ్లలో బహుళ ప్రయోజనకారి అయిన ఒక పెద్ద హాలు, వంటగది, పూజ గది ఉండేవి. ఈనాడు మనకుండే స్నానాలగది గాని, మరుగు దొడ్లు గాని వుండేవిగావు. ధనికులు యిండ్లలో కనిపించే మంచి స్నానాలగది అంటే ఆడవారికి చాటుకోసం నిలబెట్టిన కేవలం ఒక బండ మాత్రమే. సమీప పొలాలలో ఉండే బహిర్భూములే ఆనాటి నుంచి యీనాటి వరకు మరుగుదొడ్లు. అందరి సహకారంతో తవ్వుకున్న బావులే గృహాలకు నీటి వనరులు. ఊరి మొత్తంమిద మహా అయితే పది బావులు ఉండేవి. ఊరంతటికి ఒక గిలక బావి మాత్రమే ఉంది.
వ్యవసాయ పద్ధతులు
19వ శతాబ్ది చివరివరకు పొలాలలో మోట బావులు ఉండేవి. రెండు ఎడ్ల జతల సాయంతో ఈ మోటతో బావి నుండి నీరు తోడేవారు. కొన్ని గ్రామాలలో 'పర్షియన్ చక్ర' పద్ధతిలో నీరు సులువుగా తోడేవారు. 20వ శతాబ్ధపు ప్రథమంలో కొత్తలూరులోని సేద్యపు బావులన్ని ఎండి పోయినవి. దీనికి తోడు సేద్యానికి వుపయోగపడే చెరువులు కూడాలేవు. కాబట్టి ఆహారధాన్యాలు పండించడానికి మెట్ట సేద్యమే శరణ్యమైంది. చాలా ఊళ్ళకు సొంత చెరువులు ఉండేవి.
నేలలు - పంటలు
గ్రామంలో అనేకరకాల నేలలు ఉండేవి. వాటిలో ఆనాటి ప్రధాన పంటలు అన్ని పండించేవారు. సాగులో వున్న మొత్తం భూమి విస్తీర్ణము సుమారు 1500ఎకరాలు. అందులో సుమారు 1000 ఎకరాలు మాగాణి భూమి. మిగిలిన 500 ఎకరాలు మెట్టభూములు, బీడుభూములు. 1967 లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు రాక పూర్వము మెట్ట పంటలైన జొన్నలు, సజ్జలు, కందులు, ప్రత్తి, ఆముదాలు తదితరాలు ప్రధానంగా పండేవి. నాగార్జున సాగర్ జలాలు రావడంతో గ్రామప్రజల ఆహార జీవన పద్ధతులలో విప్లవాత్మక మార్పులోచ్చినవని చెప్పవచ్చు. వరి ప్రధాన పంటగా అవతరించింది. మిగత పంటలు దాదాపు కనుమరుగైనవి.ఇప్పుడు కేవలం 5% భూమిలో మాత్రమే వ్యాపార పంటలైన పొగాకు, మిరప, మొక్కజొన్నలు పండిస్తున్నారు.గ్రామ రైతులు పొగాకు పంటపై ప్రత్యేక శ్రద్ధ చూపి నైపుణ్యం సంపాదించారు. వరి నుండి వచ్చే ఆదాయానికిది చేదోడుగా వుంటుంది.
ప్రజలు
కొత్తలూరు జనాభా సుమారు 1500. గ్రామంలో ప్రధాన కులాల వారందరూ ఉన్నారు. భూమి ఎక్కువగా వుండటం చేత ప్రజల జీవనం వ్యవసాయ తత్సంబంధమైన వృత్తులతో ముడిపడింది. ఆనాటి వలస పద్ధతుల కనుగుణంగ, అనేక కుటుంబాల వారు కాలక్రమేణ దక్షిణాది జిల్లాలైన చిత్తూరు, నెల్లూరు, నుంచే కాక తమిళనాడు నుండి గూడా వలసవచ్చి వినుకొండకు ఉత్తరంగా గల ప్రాంతాలలో స్థిరపడినట్లు తెలుస్తుంది. 1967 తర్వాత నాగార్జునసాగర్ జలాల రాకతో మరికొన్ని కుటుంబాలు కొత్తలూరు వచ్చి భూములు కొని, స్థిరపడి స్థానికులతో వివాహ సంబంధాలు ఏర్పరచుకొని వారిలో అంతర్భాగమైనారు. చదువుకొని, ఉద్యోగరీత్యా గ్రామం వదిలిన వారి స్థానాన్ని వీరు కొంతమేర భర్తీ చేశారు.
స్వతహ కొత్తలూరి ప్రజలు సాధు స్వభావులు, శాంతి కాముకులు. గ్రామంలో అనేక కులాలు, అన్ని మతాలూ ఉన్నప్పటికీ యీ భేదాల కారణంగా ఘర్షణలు జరిగినట్లు దాఖలాలులేవు. అందరు ప్రియ బంధువుల మాదిరి సు హృద్భావంతో మెలిగేవారు. దళితులు, ముస్లింలు కూడా హిందువులను అనేక వరుసలతో పిలుచుకునేవారు. ఒండొరులు వారి పండుగలు జరుపుకోవడంలో సహకరించుకోనేవారు. భూస్వామ్యపద్ధతి యితర గ్రామాలలో వున్న రోజుల్లో కూడా ఈ వూళ్ళో ధనిక, పేద తేడాలు లేకుండా వుండేవారు. అంటరానితనం నీలినీడలు ఎక్కడ కనుపించేవికావు.
గ్రామప్రజలు పోలీస్ స్టేషన్ల చుట్టుగాని కోర్టు చుట్టు గాని తిరిగినట్లు కనుపించదు. కొన్ని విభేదాలు వున్నప్పటికి సామరశ్యంగా వూరిపెద్దల జోక్యంతో పరిష్కరించుకునేవారు. కులాల కుమ్ములాటలుగాని, మత ఘర్షణలు గాని కానరావు. మొదట నుంచి కొత్తలూరు యొక్క ప్రత్యేకత సారా అలవాటు లేకపోవడం. 1940,50 దశకాలలో వూరి మొత్తం మీద ఇద్దరో, ముగ్గురో మాత్రమే అప్పుడప్పుడు తాగే వారు. వారిని చులకనగా చూసేవారు. తర్వాత 60, 70 దశకాలలో కూడా కొద్దిమంది సారా అమ్మటానికి ప్రయత్నించినా, ఆ దుకాణాలనే కొంతమంది పెద్దలు సాగనివ్వలేదు. ఈ నాటికీ కూడా మిగతా గ్రామాలలో సారా ఏరులైపారుతున్నా కొత్తలూరులో తాగేవారిని వేళ్ల ఫై లెక్కించవచ్చు.
చాలాకాలం వరకు రాజకీయ విభేదాలు పెద్దగా వుండేవి కావు. ఇటివలి కాలంలో రాజకీయ పార్టీలకు గ్రామంలో స్దానం లభించినా కేవలం ఆ భేదాలు ఎన్నికల సమయానికే పరిమితంగా వుండేవి. ఎన్నికల తర్వాత అందరు కలిసిమెలిసి వుండేవారు.
ఈరకమైన వాతావరణం వూరిలో వెల్లివిరియడం వలన ప్రజలు ఎక్కువగా నిర్మాణాత్మకమైన పనులవైపు శ్రద్ధ చూపగలిగారు. ఈ ప్రశాంతత విద్య వ్యాసంగాల పట్ల శ్రద్ధ చూపడానికి దోహదం చేసింది కనుకనే గ్రామంలో అక్షరాస్యత శాతం అధికంగా వుండటానికి విద్యావంతులు, ఉద్యోగస్తులు గణనీయంగా వుండటానికి వీలు కలిగింది.
ఆహారపుటలవాట్లు
కొత్తలూరు ప్రజలు మెట్ట పంటలు మాత్రమే పండించడం చేత గతంలో ముఖ్యంగా జొన్నలు, సజ్జలు, వరిగలు, కొర్రలు మాత్రమే తినేవారు.గ్రామానికి ఒక చెరువంటూ లేకపోవడం చేత వరి పండేది కాదు. పండుగలకో, బంధువులోచ్చినపుడు మాత్రమే వరి అన్నాన్ని తినేవారు. అయితే కొన్ని కుటుంబాల వారికి ప్రక్కవూరు ఉప్పరపాలెం చెరువు ఆయకట్టు క్రింద చిన్న కమతాలు ఉండేవి. నాగార్జునసాగర్ తర్వాతనే వరి అన్నం అందరికి అందుబాటులోకి వచ్చింది. వర్షాధార పంటలుగా పప్పుధాన్యలైన కందులు, శనగలు, మినుములు, పెసలు, వేరుశనగలను పండించేవారు. కనుక పప్పుధాన్యాలు అందరికి అందుబాటులో ఉండేవి. ఆనాటి తాగునీటి వనరు కొంకేరు వాగు ఒక్కటే. ఇసుక సైకతాలలో 'చలమల'నబడే గుంతలు త్రవ్వి, ఆ ఊట నీటిని బిందెలలోనికి సేకరించి తాగటానికి కొనిపోయేవారు.
భూకమతాలు
20వ శతాబ్ది ప్రారంభంలో పెద్ద పెద్ద భూకమతాలు ఉండేవి. భూమిని కౌలుకు తేసుకోవడమనేది తర్వాత వచ్చిన పద్ధతి. 60 నుండి 70 ఎకరాల భూమి కలిగిన కుటుంబాలు కొన్ని ఉండేవి. వారు మూడు,నాలుగు ఎడ్ల జతలతో (అరకలు) వ్యవసాయం చేసేవారు. స్త్రీల సంఖ్య, పిల్లలతో సహా కుటుంబ సభ్యులంతా పని చేసేవారు. భూమి దున్నకం, పశువుల మేత సేకరణ, బీడుభూములలో పశువులను మేపడం తదితర వ్యవసాయపనులు వారే చేసుకొనేవారు. వారితో పాటు సంవత్సర జీతంపైన జీతగాళ్ళను నియమించు కొని డబ్బు రూపంలోనో, ధాన్య రూపంలోనో చెల్లించే పద్ధతి అమలులోనికి వచ్చింది. ఆ తర్వాత జీతానికి వుండే వారి సంఖ్య తగ్గిపోవాడంతో నిర్ణీత కౌలు విధానం అమలులోనికి వచ్చింది. దీనిప్రకారము సంవత్సరానికి ధన రూపంలో గాని, ధాన్య రూపంలో గాని కొంత కౌలు ఇచ్చే పద్ధతి వచ్చింది. ఆ రకంగా యీనాటి "కౌలు రైతు" పద్ధతి ఆమలులోకి వచ్చింది.
కొత్తలూరు జీవన విధానంలో ఒక ప్రత్యేకాంశం "ప్రభ". సాధారణంగా ఫిబ్రవరి/ మార్చి నెలలో వచ్చే శివరాత్రి పండుగకు ప్రతి ఏటా తాత్కాలికంగా నిర్మించే, ఆలయ రథాలను పోలి వుండే, ఎత్తైన నిర్మాణమే ప్రభ. దాదాపు 30 అడుగుల ఎత్తు వరకు కర్రలతో కట్టి కాగిత పూలతో, కొన్ని సందర్భాలలో విద్యుత్ బల్బులతో అలంకరించేవారు. దానిపై నాదస్వర వాద్యగాళ్ళను గాని, నాట్యగతైలను గాని ఏర్పరచేవారు. ఆ సందర్భానికి గాను ఎంతో ప్రేమతో, శ్రద్ధతో పెంచి,చక్కగా అలంకరించిన నాలుగైదు జతల ఎడ్లను కట్టి సుమారు 25 కి.మీ. దూరంలో వున్న కోటప్ప కొండ అనబడే త్రికూటేశ్వర ఆలయ క్షేత్రానికి ఆ ప్రభను తోలుకెళ్ళేవారు. అమితకోలాహలంగా ఎడ్లబండ్లతో జనం అనుసరించేవారు. 1960 ప్రాంతంలో ఆ ప్రాంత గ్రామాలకు విద్యుదీకరణతో, విద్యుత్తీగలు ఆటంకంగాఉండేవి. కనుక తర్వాతి కాలంలో ఆ ఎడ్లతో లాగించే ప్రభల స్థానంలో ట్రాక్టర్లతో చేర్చే పద్ధతి అమలులోకి వచ్చింది. వ్యయప్రయాసలతో బాటు సమయము తగ్గింది. కొత్తలూరి వారి ఆధ్యాత్మిక, సామాజిక జీవనంలో భాగమైన యీ ఆచారం శతాబ్దికిపై బడి తు.చ తప్పకుండా యిప్పటికి వంతులు వారీగా అనుసరిస్తున్నారు.
కొత్తలూరి గ్రామ ప్రజల ఆర్థిక-సామాజిక జీవనంలో భాగమైన ఒక దురలవాటు "పేకాట". ఈ అలవాటు వారి జీవితం నుండి విడదీయరానిదైనది. కొత్తలూరు అంటే ముందు గుర్తొచ్చేది పేకాటే. 1940 ప్రాంతంలో ఈ గ్రామపుటల్లుడు ఒకరు యీ బీజాన్ని నాటాడని చెప్పుకుంటారు. అనతికాలంలోనే అది పెద్ద వటవృక్షమైంది. గ్రామానికి చెందిన సుమారు పది మంది సంపన్న కుటుంబాలవాళ్ళు కృష్ణా, గుంటూరు జిల్లాలలో గల పేకాట కేంద్ర గ్రామాలకు వెళ్లి ఆడుతుండేవారు. అదేమాదిరి ఆ గ్రామాలకు చెందిన పేకాట రాయుళ్ళబృందాలు కొత్తలూరు వచ్చి రోజులు తరబడి దివారాత్రులు తేడా లేకుండా ఆడేవారు. దీనిలో పెద్దమొత్తాలు చేతులు మారేవి. సమీప గ్రామాలైన వేల్పూరు,పో ట్లూరు, కొండ్రముట్ల నుండి కూడా యీ పేకాటరాయుళ్ళు వచ్చి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకొని ఆనందిస్తుండేవారు. ఈ ఖరీదైన అలవాటువలన గ్రామ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. వ్యవసాయం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనది. కుటుంబ విలువలు మంట గలిశాయి. ఆ సందర్భాలలో కొంతమంది ఆడవారే జీతగాళ్ళ సాయంతో వ్యవసాయాన్ని కొనసాగించేవారు. ఈ రోజుకీ యీ వ్యసనం తగ్గిన ప్రాభవంతో కొనసాగుతుంది.
గ్రామ పరిపాలన
మొదటి నుంచి గ్రామపాలన కోసం వంశపారంపర్య హక్కులతో కూడిన రెండు ఉద్యోగాలు ఉండేవి. 1. గ్రామంనసబు. 2. గ్రామకరణము. గ్రామంనసబుగా దావులూరి వారికే వంశపారంపర్య హక్కులు ఉండేవి. మొదటి మునసబు శ్రీ దావులూరి పెదరామయ్య వుండేవారు. ఆయన తర్వాత ఆయన కుమారుడు పెదబసవయ్య, అనంతరం ఆయన కుమారుడు శ్రీ హనుమయ్య ఆ పదవినలంకరించారు. హనుమయ్య గారి హయాంలోనే ఆ గ్రామానికే చెందిన 'వడ్డెర' కులస్థులతో కూడిన దోపిడీ ముఠా వారిని అణచివేయడం జరిగింది.గుంటూరు, కృష్ణ జిల్లాలలో అనేక చోట్ల ఇండ్లకు కన్నాలువేసి సంపదను దోచుకొని ఈ ముఠా భయోత్పాతం సృష్టిస్తుండేవారు. జిల్లా పరిపాలనాయంత్రాంగానికి యిదొక పెనుసవాలుగా మారడంతో గ్రామంనసుబు హనుమయ్య గారికి ఒక తుపాకి ఇచ్చారు.హనుమయ్య గారు వారి కదలికలపై కన్ను వేయడమే గాక ప్రతి రోజూ నడిజామున రిజిష్టరులో వారి సంతకం/వేలిముద్రలు తీసుకోవడం చేత వారి ఆటలు సాగవని గ్రహించి క్రమంగా వారి కార్యకలాపాలకు స్వస్తి చెప్పి వూరిని విడిచి వెళ్ళినారు. క్రమశిక్షణకు, నిజాయితికి మారుపేరైన హనుమయ్య గారు కఠినంగ వ్యవహరించి దొంగలను పూర్తిగా ఉక్కుపాదంతో అణచివేశాడు. ఈ వడ్డెరల ఆగడాల వలన, కొత్తలూరి వారు ఎక్కడకు వెళ్ళిన కనీసం తాగడానికి మంచి నీళ్ళు కూడా పుట్టేవి కాదని తమాషాగా చెప్పేవారు. హనుమయ్య గారి తర్వాత ఆయన కుమారుడు రామయ్య గారు మునసబు చేశాడు. రామయ్య గారు N.T. రామారావు గారి ప్రభుత్వం వంశపారంపర్య హక్కు రద్దుచేసే వరకు మునసబుగ వుండేవారు.
కరణం ఉద్యోగం 20వ శతాబ్ద ప్రారంభంలో చింతకుంట కుటుంబం వారు నిర్వహించేవారు. శ్రీ చింతకుంట శ్రీరాములు గారు యిప్పటి గ్రామస్తులెరిగిన మొదటి కరణము, వారి స్థానంలో వారి కుమారుడు భానుమూర్తి గారు, ఆయన మరణానంతరం, ఆ ఉద్యోగానికి శ్రీ దావులూరి పెదవెంకయ్య (తండ్రి అచ్చయ్య) గారు ఎంపికయ్యారు. ఆ పదవి రద్దయేంతవరకు పెదవెంకయ్య గారే కరణంగా వుండేవారు.
ఈ ఇద్దరు ఉద్యోగస్తులు - మునసబు,కరణము రెవెన్యూ పరిపాలనను చూసేవారు. భూమి శిస్తువసూలు,భూ సంబంధిత రికార్డులు, అకౌంట్లు వ్రాయడం, జనన మరణాల రిజిస్టరు నిర్వహించి, శాంతి భద్రతలు కాపాడేవారు.
గ్రామ ప్రత్యేకతలు
ఆధునిక కాలంలో యీ ప్రాంతంలో కొత్తలూరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనికి కారణం ఎక్కువ అక్షరాస్యత శాతం, విద్యప్రాశస్త్యాన్ని గుర్తించడము. పురాతన కాలం నుండి గ్రామంలోని కొన్ని కుటుంబాలు 3 'R' లు (చదవడం,వ్రాయడం, లెక్కలు) ప్రాముఖ్యతను గుర్తించి, మానవ జీవనంలో విద్య పాత్రను అర్ధం చేసుకున్నారు. అదృష్టవశాత్తు గ్రామంలో ఇద్దరు పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు 1. అన్నాప్రగడ సుందరరామయ్య 2. 'చిన్న పంతులు' అని ప్రేమగా పిలువ బడ్డ అన్నాప్రగడ వెంకటసుబ్బారావు వారి సేవలందించి విద్యార్థులకు తర్ఫీదు నిచ్చి 1950 ప్రాంతంలో అనేక బృందాలుగ హైస్కులు ప్రవేశానికి పంపించేవారు.వారి ఇండ్లు ప్రాచీనకాలంలో గురుకులాలను పోలివుండేవి. ఈ పాఠశాలలు ఇరుగుపొరుగు గ్రామాలైన పోట్లూరు, కొండ్రముట్ల, మతుకుమల్లిల నుండి విద్యార్థులను ఆకర్షించినవి. కొంతమంది అభ్యదయ భావాలూ కలిగిన కుటుంబాలు పేరు ప్రతిష్ఠలున్న ఉపాధ్యాయులను గ్రామానికి ఆహ్వానించి తమ పిల్లలకు చదువు చెప్పించుకున్నారు. వేల్పూరు గ్రామానికి చెందిన శ్రీ నాగులపాటి నారాయణ గారనే ఒక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు గ్రామంలో కొన్ని సంత్సరాలు ఉండి కొంతమంది సంపన్న కుటుంబాల పిల్లలకు చదువు చెప్పారు.
కొత్తలూరుకు గల ప్రత్యేక స్థానాన్ని ఆ ఊరికి చెందిన విద్యావంతుల నేపథ్యంలో చూడగలం. ఈ విద్యావంతులు జీవితభీమా, బ్యాంకులు,ఆరోగ్యం,విద్యాశాఖ, మేనేజ్ మెంటు తదితర రంగాలలో ఉన్నత పదవులనలంకరించి తమకుటుంబాలకు, గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తేవడం చేత ఊరు వారిని చూసి గర్వపడుతుంది. కీ.శే. శ్రీ దావులూరి వెంకటసుబ్బయ్య చేతిలోని ముల్లుగర్రను విసిరివేసి చదువుకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ సర్వీసులో చేరిన మొదటి వ్యక్తి వెంకటసుబ్బయ్య గారే. కేంద్ర సెంట్రల్ ఎక్సైజు శాఖలో ఉద్యోగం చేసి సూపరింటెండెంట్ గా రిటైరైనారు. ఈ గడ్డపై పుట్టిన వారు దేశంలో అనేక ప్రాంతాలలోనే గాక ఇతర దేశాలలో కూడా ఉన్నత పదవులు నిర్వహిస్తున్నారు. దాదాపు 20 మంది డాక్టర్లు, సాఫ్టువేరు (Software) ఇంజనీర్లు ఈ కుగ్రామం నుంచి విదేశాలలో ఉండటమే యీ ఊరికి గర్వకారణం. అందులో నలుగురు లేడి డాక్టర్లు అమెరికాలోనే ఉన్నారు.
హైదరాబాదులో స్థిరపడిన కొత్తలూరి వారు ఏడాదికో సారి సమావేశము:
హైదరాబాదులో కొత్తలూరికి చెందిన 30 కుటుంబాలవారు ఉన్నారు. వీరందరినీ కలిపేది తామంతా ఒక వూరి బిడ్డలము అనే భావన. 2009 సంవత్సరం నుండి ప్రతి ఏటా కార్తీకమాసంలో ఒక ఆదివారం వనభోజనాలు ఏర్పాటు చేసుకొని కలుస్తారు. ఈ కలయిక వెనుక ప్రధానవుద్దేశ్యం గ్రామాభివృద్ధి గురించి చర్చించి, దానికి అనుగుణంగా ఆ దిశలో ఏమేమి చర్యలు చేపట్టాలో అక్కడే ప్రణాళిక తయారుచేసుకోవడం జరుగుతున్నది. 2009 నవంబరులో జరిగిన వనభోజనాల కార్యక్రమంలో గ్రామంలో మంచినీటి సమస్యను చర్చించుకొని, దానికై ఒక RO ప్లాంట్ ను నెలకొల్పాలని, దానికి అవసరమైన నిధులు ఏరకంగా సమకూర్చుకోవాలో చర్చించారు. దాని పర్యవసానంగా 2010 మే నెలలో RO వాటర్ ఫిల్టర్ ప్లాంట్ స్థాపించబడింది.
2010 సంవత్సరం నవంబరులో జరిగిన వనభోజనాల సందర్భంగా యీ క్రింది విషయాలు చర్చకు వచ్చాయి.
గ్రామ ప్రముఖులు
మార్గదర్శి: కీ.శే శ్రీ దావులూరి అనంతరామయ్య
1960 సంవత్సరం కొత్తలూరు చరిత్రలో ఒక మలుపురాయి. ఈ సందర్భంగా అనంతరామయ్య గారి ముందు చూపు, సేవలు, కృషి గుర్తు చేసుకోవాలి. అనంతరామయ్య గారు జీవిత బీమ సంస్థలో పనిచేసి జోనల్ మేనేజర్ గ పదవీ విరమణ చేశారు. ఊద్యోగంలో చేరే ముందు ఒక సంవత్సర కాలము కొత్తలూరు అభివృద్ధికి పూర్తిగా కృషి చేశారు. ఊరి రూపురేఖలే మార్చారు. యువకులను ప్రోత్సాహపరిచి యూత్ క్లబ్ ను స్ధాపించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారు. క్రీడలు, నాటకాలు, కోలాటం,చెక్కభజనల ద్వారా యువతను ప్రోత్సాహపరిచి ఒకటిగా చేశారు. 1960 లో శ్రమదానం ద్వారా ఒక భవనాన్ని నిర్మించి అందులో లైబ్రరీని నెలకొల్పినారు. దానిలో పురాణాలు, నవలలు, అను శ్రుతికి సంబంధించి 500 గ్రంథాలను సేకరించారు. క్రీడా సంబంధమైన అనేక ఉపకరణాలు సేకరించి యువతలో క్రీడలపట్ల మక్కువ పెంపొందించారు. 4 కి.మీ దూరం శావల్యాపురం వరకు ఒక పక్కా రోడ్డు వేయడం చేత రైలు, రోడ్డు మార్గాలు దగ్గరైనవి. శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారిని ఆదర్శంగా తీసుకొని వారి స్ఫూర్తితో వినుకొండ తాలుకాలో కొన్ని భారత్ సేవక్ సమాజ్ శిబిరాలను ఏర్పరిచి, యువకులలో సేవాభావాన్ని,నాయకత్వ లక్షణాలను పెంపొందించారు. ఆ సంవత్సర కాలంలోనే ఒక గ్రామ కోర్టును ఏర్పరిచారు. వారితోపాటు శ్రీ కారంశెట్టి నరసింహారావు, శ్రీ చింతకుంట భానుమూర్తి గారిని సభ్యులుగా చేర్చుకొని ఎంతోకాలంగా ఉరికి సమశ్యగా తయారైన కొన్ని వివాదాలను పరిష్కరించ గలిగారు. గ్రామంలో పెద్దల నుండి విషయ సేకరణ చేసి ఒక మహత్తరమైన తీర్పును వెలువరించారు. ఈ తీర్పును ఊరివారు ఎంతో మెచ్చుకొని తు.చ. తప్పకుండ అనుసరించారు.
ఆరోగ్యశిబిరం
అనంతరామయ్య గారి సేవా నిరతికి మరో మచ్చుతునక యీ ఆరోగ్య శిబిరము. వినుకొండ వైద్యుల సంఘంతో అవగాహనకు రావడం చేత, ప్రతి ఆదివారం ఇద్దరు డాక్టర్లు వచ్చి ఉచిత సేవలందించేవారు. యీ శిబిరానికి ఇరుగుపొరుగు గ్రామాలనుంచి గూడా ఎంతో స్పందన లభించింది. అతి బీదవారికి ఉచితంగా కొన్ని మందులు కూడా అందజేశారు.నెలకు మందుల పై 10,000 /- ఖర్చు చేశారు. సమీపంలో గల ఆసుపత్రులతో అవగాహనకు వచ్చి 20 మందికి కండ్ల ఆపరేషన్లు గూడా ఉచితంగా జరిపించారు. ఈ ఆరోగ్య శిబిరం 2006 లో అనంతరామయ్య గారి మరణం వరకు కొనసాగింది.
వృద్ధాప్య ఫించన్లు
స్వర్గీయ అనంతరామయ్య గారు అమలు పరిచిన మరొక జనరంజకమైన అంశము వృద్ధాప్య పింఛన్లు. సుమారు 20 మంది నిరాశ్రయులైన వృద్దులను, ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన వారిని ఎంపిక జేసి నెలకు రూ.100/-లు పింఛనుగ యిచ్చే ఏర్పాటు చేశారు. ప్రభుత్వము యిచ్చే పింఛను దార్లు కాకుండా వీరు అదనం. ఈ పద్ధతి కూడా 2006 లో వారి మరణం వరకు కొనసాగింది. అనంతరామయ్య గారు కొత్తలూరి ప్రజల హృదయాలలో నిల్చిపోయినారు. కనుకనే వారిపై ప్రేమాభిమానాలతో కొత్తగా నిర్మించిన పాఠశాల భవనంలో వారి జ్ఞాపకార్ధం ఒక కాంశ్య విగ్రహాన్ని ఏర్పరచుకున్నారు.
ధర్శించవలసిన ప్రదేశాలు/దేవాలయాలు
1. రామాలయం.
కొత్తలూరులో అధిక భాగం హిందువులు. పండుగలు, ఉత్సవాలు ఎంతోభక్తి, శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. గ్రామం మధ్యలో కూలిన రామాలయం స్థానంలో ఒక ఆలయ నిర్మాణ ఆవశ్యకతను 1960 ప్రాంతంలోనే గుర్తించినప్పటికీ మరొక దశాబ్దం వరకు అది కార్యరూపందాల్చలేదు. 1970 ప్రాంతంలో గుడి నిర్మాణం జరిగినప్పటికీ, విగ్రహ ప్రతిష్ఠ జరిగి 2001 లోనే వాడుకలోకి వచ్చింది. గ్రామంలోని యువకులు నడుముబిగించి దేవాలయానికి అన్ని హంగులు ఏర్పరచి నిత్య పూజ కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామంలో కొంతమంది సత్యసాయిబాబా భక్తులు. మిగతా చోట్ల మాదిరి కొత్తలూరులో కూడా ఈశాఖ ఇటివలి పరిణామమే. వీరి సేవా ధార్మిక కార్యక్రమాలతో ప్రజలమన్ననలు పొందగల్గుతున్నారు. బీద విద్యార్థులకు బట్టలు, పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తూ, భజనకార్యక్రమాలు,సత్సంఘాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే వారి సేవా కార్యక్రమాలు,భజనలు ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోడానికి ఒక ఆలయ ఆవశ్యకత ఎంతైనా ఉంది.
గ్రామంలో దళితవాడలో గల 65 కుటుంబాలకు చెందినవారు క్రైస్తవులు. వారు ఒక పాకలో ప్రతి ఆదివారం సమావేశమై ప్రార్థనలు జరుపుకుంటారు. వారి కోర్కె మేరకు స్వర్గీయ దావులూరి అనంతరామయ్య గారు,వారి అన్నదమ్ములు తమకు చెందిన స్థలాన్ని చర్చి నిర్మాణానికి దానం చేసి రిజిస్టర్ చేసారు. కానీ చర్చి భవన నిర్మాణమనే తమ కల నెరవేర్చుకోడానికి ధన సహాయం కోసం భాహ్యప్రపంచం వైపు ఎంతో ఆశగా చూస్తున్నారు.
అభివృద్ధి కార్యక్రమాలు
సిమెంట్ రోడ్లు
కొత్తలూరు అభివృద్ధి ప్రణాళికలో మొదటిది సిమెంట్ కాంక్రీటు రోడ్లు. ఎన్నో తరాలుగా రోడ్లులేక బాధలనుభవిస్తున్నవారికి ఈ రోడ్లు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించినాయి. 2003వ సంవత్సరంలో కొత్తలూరు ఉద్యోగస్తులు జన్మభూమి పధకంలో ప్రభుత్వము ప్రజల మధ్య 70:30 నిష్పత్తిలో 4.6 లక్షల రూపాయిలు వసూలు చేసి జమ చేశారు. ఈ పనిని నిర్వహించడానికి శ్రీ చిమటా వెంకటేశ్వర్లు, రిటైర్డ్ లెక్చరర్, సెక్రటరీగా ఒక గ్రామకమిటి ఏర్పాటయింది. ఈ కాంట్రాక్టుతో గ్రామం మొత్తంలో 1 1/2 కిలోమీటర్ల దూరం, కేవలం 4 నెలల కాలంలో సిమెంట్ రోడ్డు నిర్మించుకున్నారు. ఈ రోడ్డు పనిలోని నాణ్యతను జిల్లా కలక్టర్ తన పర్యటనలో కొనియాడినారు. కాని దీనికి సంబంధించి ఒక చిన్నలోపము దళితవాడలో సిమెంట్ రోడ్డు వేయలేకపోవడం.
2003 సంవత్సరంలో సిమెంట్ రోడ్లు పూర్తియిన తర్వాత, గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాదాపు 500 మొక్కలు నాటి, వాటి రక్షణకై ఇనుప బుట్టలు ఏర్పరిచారు. ఈ మొక్కలకు నీరు పోయడానికి రెండేళ్ళపాటు నెలకు ఒక్కొకరికి రూ. 600/- ల చొప్పున ఇద్దరు మనుషులను ఏర్పాటుచేశారు. అవి పశువులకు అందకుండా చిన్న చెట్లుగా పెరిగేవరకు రక్షణ ఏర్పరచారు. ఈ కార్యక్రమానికి రూ. 35000/-లు వెచ్చించడమైనది.
పాఠశాల భవనం
ఏడు తరగతుల ప్రాథమికోన్నత పాఠశాలకు ఉన్నదల్లా శిథిలావస్థలో గల ఒకగది, దానితో పాటు రెండు గదుల పాకలు. 1960లో శ్రీమతి దావులూరి చిన అనంతమ్మ (భర్త లింగయ్య) ఒక ఎకరా స్థలాన్ని పాఠశాల భవన నిర్మాణానికి దానంగా ఇచ్చి ప్రభుత్వం పేరున రిజిష్టరు చేసారు. 2003సంవత్సరంలో రూ. 8.5లక్షల ఫండ్ ను సేకరించి కీ.శే దావులూరి అనంతరామయ్య గారి స్మారకార్ధము 5 గదుల భవనాన్ని నిర్మించుటకై ప్రయత్నాలు జరిగినవి. ఈ సారి హైదరాబాదు, ఇతర ప్రాంతాలలో స్థిరపడిన వారితో పాటు విదేశాలలో గల కొత్తలూరి వారి సహాయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ పనిని డాక్టర్ దావులూరి బసవయ్య తన భుజాలపై వేసుకొని, గ్రామస్థుల సహకారాన్ని కూడగట్టి మార్చి 2008 నాటికీ పూర్తి చేశారు. అన్ని విధాల నాణ్యత ప్రమాణాలను పాటించడం చేత విశాలమైన మైదానంలో యీ భవనము ఎంతో గొప్పగా, ఆకర్షణీయంగా ఒక సరస్వతి నిలయంగా ఊరి ముంగిట్లోనే దర్శనమిస్తు ఆహ్వానం పలుకుతుంది. అయితే దీనికి తోడు మిగతా వసతులు - ఫర్నిచర్, బోధనోపకరణాలు, లాబొరేటరీ పరికరాలు లాంటివి సమకూర్చుకోవాలి. మరిద్దరు ఆంగ్లభాష బోధనలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో బాటు, పిల్లల సంఖ్య కూడా పెంచవలసిన అవసరముంది.
ఆరోగ్య ఉపకేంద్రం.
కొత్తలూరిలో ఒకే నర్సుతో ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన. ఆ కేంద్రానికి కావలిసిన స్థలాన్ని దివంగత శ్రీ దావులూరి అనంతరామయ్య గారు, వారి కుటుంబీకులు దానం చేసి, దానిని ప్రభుత్వానికి రిజిస్టర్ చేశారు. ఇంతవరకు భవన నిర్మాణం జరుగలేదు.ప్రస్తుతం ఆ ఉపకేంద్రాన్ని లైబ్రరీ భవనంలో ఒక గదిలో ప్రభుత్వమే నడుపుతున్నది. ఈ ఉపకేంద్రానికి కావలసిన భవనాన్ని నిర్మించడానికి 3 లక్షల రూపాయలు అవసరమౌతాయి.
భవిష్యత్ కార్యక్రమాలు.
1.వీధి లైట్లు ఏర్పాటు
రాత్రి వేళల్లో మంచి వెలుగు కొరకై ప్రధాన గ్రామానికి,హరిజనవాడకు కలిపి కనీసం 25 మెర్క్యురీ వేపర్ లైట్లు అవసరమని గుర్తించడం జరిగింది. ప్రధాన కూడళ్ళలో అక్కడక్కడ వీటిని ఏర్పాటు చేయాలని తలంపు. దీనికి 1.5 లక్షల రూపాయలు అవసరమౌతాయి.
2.హరిజన వాడలో సిమెంట్ రోడ్లు
2003 వ సంవత్సరంలో హరిజనవాడలో కూడా సిమెంట్ రోడ్లు వేయాలని సంకల్పించి, దానికి గ్రామం తరపున చెల్లించవలసిన ధనం కూడా జమ చేయడం జరిగింది. కానీ నిధులు లేమి కారణంతో జిల్లా పరిషత్ వారు దీనిని తిరస్కరించారు.అప్పటి నుండి యీ పని కొరవగా మిగిలిపోయింది. గ్రామంలో భాగమైన దళితుల కాలనీని వదిలి వేయజాలము. దీనిని గ్రామస్తుల బాధ్యతగా స్వీకరించాలి. దీనికై కనీసం 5 లక్షల రూపాయలు అవసరమౌతుంది.
3.స్కూలు ఆవరణలో స్టేజి కట్టడం
పాఠశాల కై నిర్మించిన నూతన భవన ఆవరణలో పాఠశాలకు సంబంధించిన సమావేశాలు, పండుగలేగాక, సామాజిక జీవనంలో ఒక భాగమైన పాఠశాలలో గ్రామానికి సంబంధించిన ఉత్సవాలు, సభలు, సమావేశాలు జరుపుకోవడానికి ఆ విశాలమైన ఆవరణను సద్వినియోగం చేసుకోవడానికి సౌకర్యాలు కల్పించుకోవాలి.ఒక ఎకరం విస్తీర్ణంలో గల విశాలప్రాంగణంలో ఒక ఎత్తైన స్టేజి నిర్మించుకోవడానికి సుమారు 2 లక్షల రూపాయలు అవసరము.
4. ఇతర కార్యక్రమాలు
గ్రామంలో, పొలాలలో ఎన్నో విధ్వంసాలకు పాల్పడుతున్న కోతుల మూకను పారద్రోలడం.గ్రామ వీధులలో ఎక్కువ కాంతి వచ్చే మెర్క్యురీ వేపర్ లైట్లు ఏర్పరచడం. వ్యక్తిగత మరుగుదొడ్ల ఏర్పాటు.2010 డిసెంబరు నాటికీ స్థానికేతరులిచ్చిన ప్రోత్సాహంతో గ్రామస్తులే చేయిచేయి కలిపి అవసరమైన నిధులు సమకూర్చుకొని ఆ వానరమూకను పారద్రోల గలిగినారు.మిగిలిన సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
భూమి వినియోగం
కొత్తలూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 425 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 74 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 130 హెక్టార్లు
- బంజరు భూమి: 176 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 981 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 176 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 981 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
కొత్తలూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
గణాంకాలు
- 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 1691, పురుషుల సంఖ్య 849, మహిళలు 842, నివాసగృహాలు 401
మూలాలు
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".