కుంతీదేవి

గాంధారీ ధృతరాష్టులను అరణ్యానికి తీసుకువెళుతున్న కుంతి

కుంతీదేవి మహాభారతంలో పాండవుల తల్లి. పాండురాజు భార్య. కుంతీదేవి చిన్నతనంలో దుర్వాసుడు ఆమెకు ఒక వరం అనుగ్రహించాడు. ఈ వరం ప్రకారం, ఆమె తాను కోరుకున్నప్పుడు ఏ దేవుడైనా ప్రత్యక్షమయ్యి వారి వలన ఆమెకు సంతాన ప్రాప్తి కలిగేలా ఒక వరం ప్రసాదించాడు. ఆమె వరం నాకెందుకు ఉపయోగపడుతుందని అడగగా భవిష్యత్తులో అవసరమౌతుందని బదులిస్తాడు. ఆమె ఆ మంత్రాన్ని పరీక్షించడం కోసం ఒక సారి సూర్యుని కోసం ప్రార్థిస్తుంది. ఆమె తెలియక మంత్రాన్ని జపించాననీ, సూర్యుణ్ణి వెనక్కి వెళ్ళిపోమని కోరుతుంది. కానీ మంత్ర ప్రభావం వల్ల ఆమెకు సంతానం ప్రసాదించి కానీ తిరిగివెళ్ళలేనని బదులిస్తాడు. ఆమెకు కలిగే సంతానాన్ని ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలివేయమని కోరతాడు. అలా సహజ కవచకుండలాలతో, సూర్య తేజస్సుతో జన్మించినవాడే కర్ణుడు.[1]

కుంతి అంటే

కుంతి యాదవుల ఆడబిడ్డ. వసుదేవుని చెల్లెలు, శ్రీకృష్ణుని మేనత్త. ఆమె అసలు పేరు పృధ. కుంతిభోజుడనే రాజు సంతానము కనుక అందుచేత ఈమెకు కుంతీదేవి అనే పేరు వచ్చింది.

బాల్యం

పువ్వుపుట్టగానే పరిమలిస్తుంది. కుంతి చిన్ననాడే చాలా బుద్ధిమంతురాలనిపించుకుంది.ఆమెనుచూస్తే పెద్దలకు ముద్దు వచ్చేది.ఆమె దైవభక్తి, గురుభక్తి, మెచుకోదగ్గవి. ఆ ఇంట్లో కుంతి అంటే ఎంతో అనురాగం వెల్లివిరిసేది. తన తండ్రి కుంతిభోజుడు తమ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే కూతురుని పిలిచి ఆమె చేత వారికి పాదాభివందనం చేయించేవాడు, పరిచర్య చేయించేవాడు. ఆశీర్వదించమని అర్థించేవాడు. ఇలా కాలం గడుస్తూ ఉంది. చంద్రరేఖ వలె కుంతీకన్య వర్థిల్లుతూ ఉంది.

నీ ఓర్పుకిది గీటురాయి

ఒక నాడు కుంతిభోజుడు సభలో కొలువై ఉన్నాడు. ఆకస్మికంగా దుర్వాసుడనే ఋషి అచటికి వచ్చెను. ఆయన రుద్రాంశ సంభూతుడు. ఆయనను చూస్తే అందరికీ భయమే, ఆయనకు కోపం ముక్కుమీదే ఉంటుంది. ఆయన శపిస్తే తిరుగు లేదు. అటువంటి చండప్రచండుడైన ఋషికి ఆతిద్యమివ్వాలి. సపర్య చేయాలి. ఆ భారం కుంతిపై పడింది. తండ్రి బిడ్డ శిరస్సు నిమిరుతూ "తల్లీ! నీ ఓర్పుకిది గీటురాయి" అన్నాడు. కుంతి ఆనందంతో, అరమోడ్పు కన్నులతో " నాన్నా! మహర్షులకు సేవ చేసే భాగ్యం అందరికీ కలసి వస్తుందా? దుర్వాసుని సేవ నా జీవితానికి వెలుగు త్రోవ" అంటూ నమస్కరించి దీవెనలు పొందింది.

దుర్వాసుని మంత్రోపదేశం

దుర్వాసునడు కుంతిభోజుని ఇంట ఒక సంవత్సర కాలం పాటు ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళతాడో, ఏ వేళకు తిరిగి వస్తాడో ఎవరికీ తెలియదు. ఒక్కొక్క సారి ఫలానా ఆశ్రమానికి వెళుతున్నాను, రేపు సాయంత్రానికి తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళి, ఆ రోజు అర్ధ రాత్రికి తిరిగి వస్తాడు. వచ్చాడంటే, రానీలే, అక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, చాప ఉంది, త్రాగి పడుకుంటాడులే అనుకుంటానికి వీలు లేదు. ఫలహారమేమైనా ఉందా? అంటాడు. పండ్లు గట్టిగా ఉంటే పచ్చివంటాడు, మెత్తగా ఉంటే కుళ్ళినవంటాడు, విసిరి మొగాన కొడతాడు. అటువంటి మహానుభావుడికి కుంతి పరిచర్య చేసింది. ఓర్పులో భూదేవి వంటిదనిపించుకుంది. మునీశ్వరుని మనసు కరిగింది. " బిడ్డా! నీ పరిచర్య నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. నీకు ఏమి కావాలయునో అడుగు యిస్తాను" అన్నాడు. కుంతికి ఏ కోరిక లేదు. అవ్యాజంగా సేవ చేసింది. " మహాత్మా! నాకు కావలసింది ఏముంది? మీరు ప్రసన్నులయ్యారు. అదే నాకు పదివేలు, నా తండ్రి సంతోషిస్తాడు" అని నమస్కరించింది. ముని ఇలా అన్నాడు" నీవు పసిదానవు. నీకు తెలియదు, అడగలేకున్నావు, నీకు ఒక మంత్రాన్ని యిస్తాను తీసుకో. నీవు ఏ దేవుడిని పిలిస్తే ఆ దేవుడు నీ దగ్గరకు వస్తాడు, నీకు వరాన్ని ప్రసాదిస్తాడు". కుంతి మారాడకుండా మహా ప్రసాదమని మంత్రమును స్వీకరించింది. కుంతికి మంత్రోపదేశము చేసి, కుంతీభోజుని ఆశీర్వదించి దుర్వాసుడు తన దానిన తాను వెళ్ళిపోయాడు.

కోరిన వెంటనే

నవయవ్వనశ్రీతో నాలుగంచుల విరిసిన పద్మంలా కుంతి కాంతి వెదజల్లుతూ కూర్చుని ఉంది, ఒక నాడు ప్రొద్దుపొడుపు శోభ చూస్తూ ఉంది, ఆమె హృదయములో రాఘమధువు తొణికింది! ఓహో! సూర్యభగవానుని మూర్తి ఎంత సుందరంగా ఉంది, స్వామీ! సహజ కుండలాలతో, వజ్రకవచంతో మిరుమిట్లు గొలిపే తేజస్సుతో నీలాగే చూడముచ్చటగా ఉండే కుమారుని నాకు ప్రసాదిస్తావా? అంటూ అప్రయత్నంగా దుర్వాసుడిచ్చిన మంత్రం జపించింది. సంకల్ప మాత్రానా సరసిజ మిత్రుడు సమీపుడయ్యాడు. ఎంతోసౌమ్యంగా, ప్రసన్నంగా ఉన్నాడు. ఆ దివ్య పురుషుని చూసి కుంతి భయపడింది, పారిపోవాలని చూసింది. "బాలా! భయపడకు, నేను నీవు కోరిన వరమీయడానికి వచ్చాను, అంటూ బుజ్జగిస్తూ, రవి సమీపించాడు.

కుంతీ భయపడుతూ, చేతులు జోడించి, స్వామీ! ఒక బ్రహ్మ విభుడు నాకు ఈ మంత్రమును ఉపదేశించాడు, మంత్రశక్తి నాకు తెలియదు, చూద్దామని ఊరికే ఉచ్చరించాను. ఇంత పని జరుగుతుందని అనుకోలేదు, అజ్ఞానంతో ఈ పని చేసితిని, నన్ను మన్నింపుము అని ప్రణామము చేసింది. పద్మబంధుడు వినలేదు. నా దర్శనము వృదా కాదు, నీ అభిమానం నెరవేరుస్తాను అన్నాడు. " అయ్యో! నేను కన్యను, నేను గర్భవతినైతే, తల్లిదండ్రులు, చుట్టుపక్కలనున్న వారు నన్ను చూసి నవ్వుతారు, నేను బ్రతకలేను, నన్ను రక్షించు" అంటుంది కుంతి. అప్పుడు అ కర్మ సాక్షి, కమలాక్షీ! నీ కన్యత్వం చెడదు, నీకు లోకోపవాదం రాదు, నేను వరమిస్తున్నాను. ఇక మాట్లాడవద్దు అని రవి ముందుకు వచ్చాడు. కుంతి సత్యం, ధర్మం పాలించే ప్రభువు నీవు, నీకు ధర్మమని తోస్తే చేయి, నేనింక మాట్లాడను అని పారవశ్యం పొందింది. అంశుమంతుడు కుంతి అభిలషితం తీర్చి అంతర్హితుడయ్యాడు.

ఇప్పుడేం చెయ్యాలి

కుంతీభాస్వంతుల సమాగమ ఫలము కర్ణుడు. శిశువు కలిగాడు, వాని చెవులకు పుట్టుకతోనే రత్న కుండలాలున్నాయి, శరీరమంతా వజ్ర కవచమయము, రెండవ సూర్యుని లాగా ఉన్నాడు. కుంతికి కళ్ళు తిరిగాయి. మతి పోయింది. ఇటువంటి బిడ్డ లోకంలో ఎవరికైన జన్మిస్తాడా? నాకు జన్మించాడు. ఇది భాగ్యమనుకోవలెనా? పెళ్ళి కాని కన్యను నేను, వీడు నా కొడుకని చెప్పుకోలేను. ఏమి చేయాలి? అని లోలోపల కుమిలిపోయింది. లోకోపవాదం భయం ఆమెను దావాగ్నిలా చుట్టు ముట్టింది. ఆమె మనసులోఒక ఊహ మెరిసింది. వెంటనే ఒక పెట్టెలో బాలుని భద్రపరచి, అందులో కొంత ధనము కూడా ఉంచింది. తీసుకుపోయి, ఆ పెట్టెను అశ్వనది ప్రవాహములో వదిలింది. తానేమీ చేస్తున్నదో తనకే తెలియలేదు, పెట్టె వంక చూస్తూ నిలబడింది.

కుంతి ఆవేదన

జల తరంగాల మీద తేలుతూ, పెట్టె కనుచూపు మేర దాటి పయనిస్తుంది. మబ్బు కొంత విచ్చిపోయింది. కుంతి దిక్కులు చూసింది. ఎవరూ లేరు. బావురమని ఏడ్చింది. కడుపులోని దుఃఖమంతా వెళ్ళబోసుకుంది. నా చిన్ని తండ్రీ! మునీశ్వరుడు నాకెందుకు మంత్రమిచ్చాడు? నేనెందుకు తెలివిమాలి అరవిందసఖుని ఆహ్వానించాను. అతడు వచ్చి వద్దంటే సుతునెందుకు ప్రసాదించాడు? అబ్బా! సుతుడంటే సామాన్య సుతుడా? సహజ కర్ణ కుండలాల భూషితుడు. వజ్ర కవచ శోభితుడు. అలాంటి నా కన్నకొడుకు నాకు దక్కలేదు. అయ్యో! చేతులారా నదిలో త్రోశాను. నా బంగారు కొండ ఏ ఊరికి వెళుతున్నావు. ఏ తల్లి ఒడిలో చేరుతావు. నిన్ని ముద్దాడి పోషించే అదృష్టం ఏ సతికి సమకూరుతింది. ఎక్కడున్నా నీవు కనిపిస్తావులే. తళతళలాడే చెవిపోగులు, మిలమిల లాడే మైమరపు అందాలు చిందే ఆకారము నీవెక్కడున్నా చేయెత్తి చూపిస్తాయి. నీ అభ్యుదయం చూసి తల్లిగా సంతోషిస్తాను. నా నోము ఫలమింతే, అని వెను తిరిగి అంతఃపురికి వెళ్ళింది.

విధి విలాసం

ఆ పెట్టె అశ్వనదిలోనించి చర్మణ్వరిలోకి, చర్మణ్వతిలోనుండి యమునలోకి, యమునలోనుండి గంగలోకి అంచెలంచెలుగా ప్రయాణించింది. అలల్లో ఊయల ఊగుతూ, సూత దేశములోని చంపా పుర ప్రాంతములో పోతూ ఉంది. దృతరాష్ట్రుని సఖుడైన అతిరధుడనే సూతుడు భార్య సమేతంగ జల క్రీడలాడుచూ, పెట్టెను చూశాడు. అతని భార్య రాధ పెట్టెను తెరిచింది. మణికనక కాంతులతో ప్రకాశించే శిశువును ఇద్దరూ చూశారు, మనకు బిడ్డలు లేరు కనుక భగవంతుడు ఈ బిడ్డను యిచ్చాడు అని యదకు హత్తుకున్నారు. విధి విలాసమేమో! కుంతి కన్న కొడుకు రాధేయుడయ్యాడు. ఇది దేవత వర ప్రసాద కథ, లోకానికి తెలియదు.

ఆశ్రమ జీవనం

పాండురాజు పని అయిపోయింది. ఇక రాజ్యం వద్దు గీజ్యం వద్దు ముని వృత్తి అవలంభించి తపస్సు చేసుకొంటాను. కుంతీ! మాద్రీ! మీరు హస్తినాప్లురానికి వెళ్ళిపొండి. నేను సన్యసించానని పెద్దలందరికి చెప్పండి. అన్నాడు. కుంతీ మాద్రులు మిక్కిలి దుఃఖించారు. " మేం వెళ్ళం, ఇక్కడే ఉంటాం. మమ్మల్ని విడదీస్తే ప్రాణాలు విడుస్తాం" అని ఖండితంగా చెప్పారు. విధిలేక వారి సహవాసం అంగీకరించాడు. విలాస వస్తువులన్నీ విసర్జించి, ఎన్నో దాన ధర్మాలు చేసి మహామునులు నివసించే శతశృంగ పర్వత ప్రాంతానికి వెళ్ళి, ఆశ్రమం కట్టుకున్నాడు. ముని వృత్తితో జీవయాత్ర సాగిస్తున్నాడు. ఒక అమావాస్య రోజున మహర్షులంతా బ్రహ్మ సందర్శనానికి సత్యలోకం వెళుతున్నారు. మార్గం సమర్ధంగా ఉంది. పాండురాజు తాను కూడా భార్య సహితంగా వెళ్ళాలని ప్రయత్నించాడు కానీ, సాధ్యపడలేదు. "అపుత్రశ్యాగతిర్నాస్తి" అనే వేధ వచనం జ్ఞప్తికి వచ్చి బాధ పడ్డాడు. నా కేది దారి? అని మునివర్యులను అడిగాడు. యోగ దృష్టిధనులైన మునులు అయ్యా! నీవు అపుత్రడవు కావు, దైవ ప్రసాదముతో నీకు పుత్రులు కలుగుతారు, ప్రయత్నించు అన్నారు.

నా దగ్గర ఒక మంత్రముంది

పాండురాజుకు అదే చింత పడింది. కుంతిని పిలిచి ఏకాంతంలో తన మనోవ్యద వివరించాడు. మా తండ్రి విచిత్ర వీర్యుడు కామశ్య వనంలో ఎప్పుడో మృతి చెందాడు, నా తల్లికి ధర్మమయుడైన వ్యాసుని వల్ల నేను జన్మించాను, ఇప్పుడు నేను బ్రతికియుండి కూడా చచ్చిన వానితో సమానం. సంతతి కావాలంటే దేవర న్యాయమే దిక్కు. నీ చెల్లెలు శృతసేన ఋత్విజుల వల్ల కొమాళను కన్న విషయము నీకు తెలుసు. పుత్రుల వల్ల అనంత కోటి ఫలము కలుగుతుంది. కనుక ఈ ఆచారం ధర్మసమ్మతం. నా మాట విని, నీవు క్షేత్రజుడైన పుత్రుని నాకు సమర్పించాలి. పతి చెప్పిన పని చేస్తే పాపము రాదు. పుత్ర కాంక్షతో నీకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. కుంతి మెత్తబడింది. తను చిన్ననాడు దుర్వాసుడు తనకిచ్చిన మంత్రము ప్రయోగించవలసిన తన అవసరం తటస్ధించింది. మహర్షి భవిష్యద్విషయము తెలిసే కాబోలు మంత్రమిచ్చాడు. కుంతి తల ఎత్తి మగని ముగము చూస్తూ మహారాజ! భరత కుల శ్రేష్టుడైన నీకు భార్యనైన నేను ఒక మానవుని వల్ల సంతానము కనడమా? నేను ఒప్పుకోను అన్నది. పాండురాజు తల వంచుకుని అయితే కొంప ముగిసినట్లే అన్నాడు. కుంతి - కాదు మరొక మార్గముంది పాండు - అదేదో చెప్పు కుంతి - నా దగ్గర ఒక మంత్రముంది, నేను పిలిస్తే దేవతలు దిగి వస్తారు. పాండు - నిజంగానా కుంతి - అవును నిజం పాండు - నీవు ఆ మంత్రమును ఎలా సంపాదించావు ధర్మజుడుదయించాడు

కుంతి ఆ ఉదంతం చెప్పింది. పాండురాజు ఆనందంతో నిలువునా పులకించిపోయాడు. ఆలస్యమెందుకు? కానీయమన్నాడు. కుంతి ఏ దేవుని పిలవమంటారు అన్నది. ధర్మముతోనే కదా లోకం నిలిచింది, అన్నిటికంటే ధర్మము గొప్పది. నీవు ధర్మరాజునే ఆహ్వానించమన్నాడు పాండురాజు. కుంతి పతికి ప్రదక్షిణ నమస్కారము చేసి, ఏకాంతంగా కూర్చుని, ధర్మరాజును ఉద్దేశించి, దుర్వాసుడు యిచ్చిన మంత్రమును జపించింది. సమవర్తీ, యోగమూర్తి ధరించి వచ్చి వరమిచ్చి వెళ్ళాడు. ధర్మ ప్రసాదంతో కుంతి అంతర్వత్ని అయింది. ఏడాది నిండగానే కొడుకు జన్మించాడు. ఆ బిడ్డకు ఆకాశవాణి యుదిష్టరుడు అని నామకరణం చేసింది. భీమ జననం

పాండురాజుకు ఇంకొక పుత్రుడు కావాలని అనిపించింది. కుంతితో అన్నాడు, దేవీ! అనిల దేవుని వరముతో మహా బలవంతుడైన కొడుకొడిని కను. వాడు అందరిని కాపాడగల వాడు అవుతాడు. కుంతి అలాగే చేసింది. ప్రభంజనుడు ప్రత్యక్షుడై వరమిచ్చాడు. కుంతి వజ్రకాయుడైన కొడుకు కలిగాడు వాని పేరు భీమసేనుడు.

ఇంద్రానుగ్రహమే

తరువాత దృతరాష్టుడు గాంధారి వల్ల నూరుగురు కొడుకులను కన్నాడని పాండురాజు విన్నాడు. వారి వల్ల తన సంతతికి అపాయం కలుగ వచ్చునని అనుమానించాడు. తనకు త్రిలోక విజయుడైన కొడుకు కావలెనని ఇంద్రుని ఉద్దేశించి సంవత్సర కాలము ఘోర తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రసన్నుడై వరమిస్తానన్నాడు. ఇంటికి వచ్చి పాండురాజు కుంతితో ఇంతీ! ధనం, విద్య, సంతానం ఈ మూడు ఎంత లభించినా తృప్తి కలుగదు. ఇంకా కావాలని ఆశ చిగురిస్తూనే ఉంటుంది. ఇంద్రుని ప్రార్థించి ఒక పుత్రుని కను అన్నాడు. కుంతి సరే అన్నది. దేవతా సార్వభౌముని ఆహ్వానించింది. ఇంద్రుడు దిగి వచ్చాడు. కుంతి ఆ నల్లని మూర్తిని కనురెప్పల్లో బంధించింది. పురంధరుడు పుత్రుని ప్రసాదించాడు. ఇంద్ర నీల మణుల రాశిపోసి ప్రాణం పోశారా అన్నట్లు ఉన్నాడు పసికందు. ఆ కుర్రవాని పేరు అర్జునడన్నారు పెద్దలు. పాండురాజు త్రిలోక సాంబ్రాజ్యం సిద్దించినంత సంతానం కలిగింది. మువ్వురు కొమరులతో ఆడుకుంటున్నాడు. మాద్రి మనో వ్యధ

మాద్రి పాపం దీనురాలై చూస్తుంది. కుంతికి ముగ్గురు పుత్రులు పుట్టారు. అక్కడ గాంధారికి వంద మంది జన్మించారు. తనకు ఒక్క మొలక కూడా కలుగలేదు. నిరర్ధకమైన తన ఆడజన్మ గురించి ఆలోచిస్తూ, కుమిలిపోతూ ఒక నాడు ఏకాంతంగా చూసి, పతి సన్నిదానంలో పగల్పడి ఏడుస్తుంది. కుంతికి చెప్పి తనకు కూడా సంతానం కలిగే టట్లు చేయమని వేడుకుంటుంది. పాండురాజు తనకు కూడా ఈ అభిప్రాయముందని చెప్పి ఓదార్చి కుంతిని పిలిచి అశ్వని దేవతలను ఆహ్వానించి మాద్రికి సంతానం ప్రసాదింపచేయమని ఆదేశిస్తాడు. కుంతి ఆ పనిచేసింది. మాద్రికి కవలలు జన్మించారు. మాద్రికి సంతానాపేక్ష మిక్కుటంగా ఉంది. ఒక్క కొడుకుతో తృప్తి పడక, మరొక సారి కుంతినడిగితే ఆమె ఏమంటుందో ఒకేసారి దేవ వైద్యులను ఇద్దరిని పిలిపించి, కవలలు కలిగేలా చేశాడు పాండురాజు. ఆ బిడ్డలు నకుల సహదేవులు. కుంతికి ముగ్గురు, మాద్రికి ఇద్దరు వెరసి ఐదుగురయ్యారు. వీరే పంచపాండవులు. పాండురాజు పరలోక గమనం

వసంతకాలం వచ్చింది, పువ్వులు నవ్వుతున్నాయి, తుమ్మెదలు ఝుంకరిస్తున్నాయి, కోయిలలు పిలుస్తున్నాయి. మాద్రి అటు వెళ్ళింది. రాజు చూశాడు, మెల్లగా ఆమెను అనుసరించాడు. కుంతి ఎప్పుడు ఏమారదు. మాద్రి ఒక కంట చూస్తూనే ఉంటుంది. ఆనాడు బ్రాహ్మణుల సంతర్పణ చేయిస్తూ, ఆశ్రమ ప్రాంగణములో హడావుడిలో ఉంది. మాద్రి లోపలే కూర్చుని ఉందిలే అనుకుంది. మాద్రి, పాండురాజు ఇద్దరూ క్రొత్తగా పూచిన తీగలు పరిశీలిస్తూ, విహరిస్తున్నారు. రకరకాల పూలు అలంకరించుకుని, సతి మాద్రి రతీ దేవి వలె వయ్యారమొలుకుతూ ఉంది. విరితీవులు పీచోపులు వేస్తున్నాయి. చిన్న భార్య సింగారం రాజుకు మత్తెక్కించింది. ఆమె మెడలోని పొగడ పూదండ నాఘ్రాణీస్తూ చెక్కిలి ముద్దు పెట్టుకున్నాడు. మాద్రి భయపడింది. కుష్టురోగిని చూసి మొగము తిప్పుకునే త్రాచు పాము వలె తప్పుకోవడానికి చూసింది. రాజు అదిమి పట్టుకున్నాడు, వద్దు, వద్దు అని మాద్రి వారించింది. రాజు వినిపించుకోలేదు. మదోన్మాదం చెలరేగింది. అంతే బాణపు దెబ్బతో తృళ్ళిపడ్డ జింకవలె విగత జీవుడై పడిపోయాడు పాండురాజు. మాద్రి సహగమనం

పతిని పట్టుకుని బోరున ఏడుస్తూ ఉంది మాద్రి. ఆ ఆక్రందన ద్వని విని కుంతి పరుగెత్తుకు వచ్చింది. కొడుకులు కూడా వచ్చారు. శత్రశృంగ నివాసులైన మునులు వచ్చారు. శాపఫలం పొందిన రాజును చూసి శోఖిస్తున్నారు. కుంతి ముందుకు వచ్చి మాద్రిని ప్రక్కకు లాగి నేను పతి వెంటనే పోతాను, నీవు బిడ్డలను పోషిస్తూ ఉండు అని అన్నది, మాద్రి కుంతిని వెన్నక్కు త్రోసి నేనే పతి వెంట వెళతాను, నీవు మహారాజును స్వయంవరంలో చేపట్టావు, వంశము నిలిపావు, పుణ్యగతి కలిపించావు, అభీష్టం తీర్చావు, నేను కోరిక తీర్చలేకపోయాను. శాప విషయం తెలిసి కూడా ఏమరపాటున చేటు తెచ్చిన పనికిమాలిన దానను, ఇలాంటి నేను పుత్రులను సంరక్షించగలనా? వద్దు నన్ను వెళ్ళనీ, అన్య లోకంలో అయినా పతికి ప్రీతి కలించడానికి ప్రయత్నిస్తాను. అక్కా! నీవే బిడ్డలను రక్షించాలి. అని ధీనంగా వీడుకోలు పలికి మునీశ్వరులకు నమస్కరించి చితి ఎక్కి పతితో పాటు అగ్ని శిఖలలో లీనమై పోయింది. సతీ సహగమనమనేది విధి కాదు, యిచ్చికం. ఇష్టమున్నవాళ్ళు చితి ఎక్కవచ్చు. లేని వాళ్ళు మానుకోవచ్చు. శతశృంగవాసులు కుంతిని ఊరడించి, పాండుకుమారులను సముదాయించి, అందరిని హస్తినాపురికి తోడుకొని వచ్చి కురు వృద్ధులకు అప్పగించి వెళ్ళారు. కుంతి విదవ అయ్యింది. బిడ్డలు నేదరులు కనుక రక్షణ భారము, విద్యా శిక్షణ భారము రెండూ తానే వహించవలసి వచ్చింది.

కౌరవ - పాండవ విద్యాభ్యాసం

గాంధారేయులు, కౌంతేయులు కలసి విద్యాభ్యాసం చేశారు. దుర్యోధన, దుశ్శాసనాధులు గాంధారేయులు, యుదిష్టర, భీమార్జున, నకుల సహదేవులు కౌంతేయులు. నకుల సహదేవులు మాద్రేయులైనా, కౌంతేయుల క్రిందనే లెక్క. సంరక్షకురాలు కుంతీ దేవి కనుక. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు విద్యా గురువులు. ద్రోణునకు కౌంతేయుడైన అర్జుని పట్ల వాత్సల్యమెక్కువై విశేష అస్త్రాలెన్నో అనుగ్రహించాడు. కౌరవ, పాండవ కుమారులే కాక, మరెందరో చుట్టుపక్కల నుండి రాజ కుమారులు వచ్చి హస్తినాపురములోని అదర్వణ కళాశాలలో విద్యాభ్యాసం చేశేవారు. పిల్లలు ఎదిగారు. సమస్త విద్యలలో కాకలు తీరారు.

కుమార విద్యా ప్రదర్శనం

ఒక నాడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం జరిగింది. మహారాజు, గాంధారి ముందరి వరుసలో కూర్చుంది. గాంధారి ప్రక్కనే కుంతీ దేవి కూర్చుంది. వ్యాసాది భూసురులు విచ్చేశారు. భీష్ముడు, విధురుడు, శల్యుడు, శకుని, సోమదత్తుడు, మున్నగు వారు, కురువృద్ధులు, బంధు మిత్ర్రులు సభను అలంకరించారు. రంగస్ధలం రమణీయంగా అలంకరింపబడింది. రాకుమారులు తమ తమ ధనుర్విద్యా పాండిత్యం ప్రదర్శిస్తున్నారు. అర్జునుని వంతు వచ్చింది. నల్లని వాడు, పద్మనయనముల వాడు, ఇనుప కవచం తొడుక్కుని కరికలభం లాగా ఉన్నాడు. అతని హస్త లాగవం, అతని చిత్ర విచిత్ర భాణ ప్రయోగ చాతుర్యం, ఒక బాణం వేసి వాన కురిపించడం, ఒక బాణం వేసి గాలి పుట్టించడం, ఒక బాణం వేసి అగ్ని జ్వాలలు రేపడం చూసి సభ చప్పట్లు కొట్టి ప్రశంసిస్తూ ఉంది. అప్పుడు కుంతీ దేవి తనలో తాను ఆశలు త్రవ్వుకుంటూ పారవశ్యం పొందుతూ ఉంది. ఈ కాలంలో అర్జునుని మించిన విలుకాడు లేడు. అను అభినందన వాక్యాలు ఆకాశం నిండుతున్నాయి.

ఎవరో సభలో ప్రవేశించారు

ఆ తరుణములో కొండమీద పిడుగు పడ్డట్లు ఒక భయంకర ద్వని వచ్చింది. అందరు రంగ ద్వారము వైపు చూశారు. ఎవరో ప్రవేశద్వారము వద్ద నిలిచి, మల్ల అరిచాడు. వాడు భుజబలం ప్రదర్శించడానికి వచ్చాడు. పాండవులు ద్రోణుని అండ చేరారు. కౌరవులు, దుర్యోధనుని అండ చేరారు. ఉన్నత విగ్రహం, పసిడి మైచాయతో లోనికి వస్తున్నాడు. వాని చేతిలో పెద్ద ధనస్సు ఉంది. సరాసరి సభలోకి వచ్చాడు. కృపాచార్యులకు, ద్రోణాచార్యులకు నమస్కరించాడు. అర్జునుని వైపు తిరిగి ఇలా అనాడు. ఈ విద్యలు మాకు తెలుసు. మేమూ చూపగలం నీ వొక్కనివే నేర్పరివనుకోకు, ద్రోణాచార్యుడనుమతించాడు. అతడు తన నేర్పు ప్రదర్శిస్తున్నాడు. ఇంకా ఎన్నో అద్భుతాలు చూపుతున్నాడు. అర్జునునితో ద్వంద్వ యుద్ధం చేస్తానంటున్నాడు.

జౌను, వీడు నీ కొడుకే

కుంతి మనసు తట్టుకోలేక పోతుంది. వాడెవడో కాదు, తాను కని వరదలో పారవేసిన బాలుడే. వాడు తన కొడుకు, తన తమ్మునితో ఘర్షణ పడుతున్నాడు. పరిస్ధితి విషమిస్తూ ఉంది. తానే లేచి వెళ్ళి కౌగిలించుకొని, వీడు నా ప్రథమ పుత్రుడని ప్రకటిస్తే, ఆరుగురు పుత్రులు కలసి బ్రతుకుతారు. ఉపేక్షిస్తే చేయి దాటిపోతుంది. ఇంతలో కారు మేఘాలు వ్యాపించాయి, మబ్బు కమ్మింది, కుంతి మూర్చిల్లింది.

కర్ణుడు అంగరాజైనాడు

అర్జునుడు ఈ క్రొత్త వ్యక్తితో వాగ్యుద్ధానికి దిగాడు. నీవు పిలవని పేరంటానికి వచ్చి, అధిక ప్రసంగం చేస్తున్నావు. ఎవడవు? వెళ్ళిపో, అని కృపాచార్యులందుకున్నాడు. ఓయి! కొత్తబ్బాయి! నీ అంతస్తు తెలుసుకోకుండా వ్యవహరిస్తున్నావు. అర్జునుడు రాజ పుత్రుడు. రాజ పుత్రులతో ద్వంద్వ యుద్ధం చేసే అర్హత రాజ పుత్రులకే వుంటుంది. నీ నాయన రాజా? నీవు రాజువా? అని అడిగే సరికి బదులు చెప్పలేకపోయాడు. తల వంచుకున్నాడు. అప్పుడు ధుర్యోధనుడు ముందుకు వచ్చాడు. అర్జునునితో తలపడగల వీరుని కోసమే చూస్తున్నాను. కనుక అప్పటికప్పుడే తండ్రితో చెప్పి అంగరాజ్యమిప్పించి, అక్కడిక్కక్కడే పట్టాభిషేకము చేయించి, అతనికి రాజ లాంచనాలు కల్పించి రాజు అనిపిస్తాడు. స్వశక్తిచే పైకి వచ్చిన ఈ వ్యక్తియే కర్ణుడు.. కర్ణుడు దుర్యోధనునికి స్నేహ హస్తము అందిస్తాడు, కుంతి చూస్తూ ఉండగానే కర్ణుడు ప్రతిపక్షములో చేరాడు. కుంతి నిస్సహాయురాలై, నిట్టూర్పు విడిచింది. లక్క ఇంటిలో పాండవులు

పాండవులకు కౌరవులకు పడలేదు. పచ్చి గడ్డి వేస్తే భగ్గుమని మండుతుంది. దృతరాష్ట్రునికి కూడా మనసులో కష్టంగానే ఉంది. ఒక నాడు దుర్యోధనుడు తన మనో దుఃఖం తండ్రికి వెల్లడిస్తాడు. పాండవ ప్రాభల్యం పెరగకుండా, నిరోధించే ఉపాయం చూడమంటాడు. కుంతితో పాటు పాండవులను కొంత కాలం దూరంగా ఉంచడం శ్రేయస్కరం అని చెప్తాడు. తండ్రి అనుమతితో పాండవ నివాసం వారణావతమనే పట్టణానికి మార్పిస్తాడు. తల్లీ కొడుకులు నూతన గృహప్రవేశం చేశారు. అక్కడ వారి కోసం కొత్తగా భవనం కట్టించి పేట్టాడు. ఇంటి గోడలు మిస మిస మెరుస్తూ ఉన్నాయి. భీమునికి అనుమానం కలిగి గిల్లి చూస్తాడు. ఇల్లంతా లక్కతో నిర్మించాడు. నిప్పు చూపితే భగభగ మండిపోతుంది. సోదరులారా! అగ్ని భయం ఉంది. జాగ్రత్త అన్నాడు. విధురుడు పాండవ పక్షపాతి, దుర్యోధనుని ద్రోహ చింత అతనికి తెలిసి, అయ్యో! అన్యాయంగా పాండవులు బూడిదై పోతారే అని జాలిపడి, ఫలానా రోజు లక్క ఇంటికి అగ్గి పెడతారు. మీరు ఆ రాత్రి తప్పించుకోవలసిందిగా అని రహస్యంగా వార్త పంపిస్తాడు. అంతే కాకుండా ఒక సొరంగం త్రవ్వించి, లక్క ఇంట్లో నుండి బయట పడటానికి మార్గం కలిపిస్తాడు. పాండవులు జాగ్రత్త పడ్డారు. సురక్షిత ప్రదేశానికి

కుంతీ దేవిని సేవిస్తూ, వారణావతములో ఒక బోయత ఉండేది. ఆమె దుర్యోధనుని గూడచారిణి. ఇక్కడి సంగతులు అక్కడికి చేరవేస్తూ ఉండేది. శిల్పాచార్యుడు పురోచనుడు అనే వాడు కూడా ఆ ప్రాంతములోనే ఉండేవాడు. తన ప్రభువు ఆజ్ఞ ప్రకారం కృష్ణ చతుర్ధశి నాడు, అర్ధరాత్రి మీరిన తరువాత లక్క ఇంటిని తగులబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కృష్ణచతుర్ధశి వచ్చింది. కుంతీ దేవి ఆ రోజు ఊరిలో ఉండే ఇల్లాండ్రకంతా అన్నదానం సంతర్పణ జరిపింది. గూడచారిణి బోయతకు అయిదుగురు కొడుకులున్నారు. తల్లీ, కొడుకులు సుష్టిగా భోంచేసి, తప్ప తాగి, ఆనాడు అక్కడే లక్క ఇంటి పంచన పడుకుని నిద్ర పోయారు. అర్ధరాత్రి వేళ భీముడు లేచాడు. శిల్పాచార్యుని ఇంటికి ముందుగా నిప్పు పెట్టారు. కుంతిని ధర్మార్జునాధులను సొరంగం లోనికి పంపించి, లక్క ఇంటికి నిప్పు పెట్టాడు. సొరంగం దారిగుండా తాను, తన వారు సురక్షితంగా నిర్ఘమించారు. ఘటోత్కచుడు పుట్టాడు

నిద్రలేక, వడిగా నడవలేక తల్లి తూలుతొ ఉంది. సహోదరులు కూడా అలసి పోయారు. అది తెలిసి భీముడు తల్లిని, సోదరులను ఎత్తుకున్నాడు. తల్లి మెడ మీద కూర్చుంది. నకుల సహదేవులు చంకలో ఇరుక్కున్నారు. భీముడు ఐదుగురిని మోసుకుని పవన వేగంతో నడచి గంగానది దాటి, దుర్గమారణ్యం గుండా ప్రయాణించాడు. సాయంకాలమయింది. ఒక మర్రి చెట్టు క్రింద విశ్రమించాడు. ఆ ప్రక్కన కుంట ఉంది. నీళ్ళు త్రాగి వచ్చి కూర్చున్నాడు. అందరూ నిద్ర పోతున్నారు. భీముడు కూర్చుని ఆలోచిస్తున్నాడు. హిడింబి అనే రాక్షసి వచ్చింది. భీముని ప్రేమించింది. భీముడు తొణకలేదు. ఇంతలో హిడంబడు గర్జిస్తూ వచ్చాడు. భీముడు వాడిని పట్టుకుని చీల్చి ప్రోవు పెట్టాడు. హిడింబి భీముని వెంబడించింది. పెళ్ళి చేసుకొమ్మని అడిగింది. రాక్షసులు నమ్మదగిన వారు కాదు. నిన్ను కూడా చంపేస్తాను. పొమ్మను అంటాడు. హిడింబి కుంతీ దేవిని శరణు వేడింది. కుంతీ జాలిపడి హిడింబిని చేపట్టమని చెబుతుంది. తల్లి ఆజ్ఞాను పాటించి, హిడింబిని భార్యగా స్వీకరిస్తాడు. హిడింబి భీమ సేనుల వివాహ ఫలితమే ఘటోత్కచుడు. పాండవులకు పరలోక క్రియలు

వారణావతంలో లక్క ఇల్లు కూలిపోయిందని, అందులో ఒక స్త్రీ, ఐదుగురు పురుషులు దగ్దులయ్యారను వార్త హస్తినాపురికి వెళ్ళింది. అయ్యో1 కుంతీ సహితంగా పాండవులు మసి అయిపోయారని, ధృతరాష్ట్రుడు చాలా దుఃఖించి, వారికి పర లోక క్రియలు ఘనంగా చేయించారు. దుర్యోధనుడు పీడ విరగడయిపోయిందని సంతోషించాడు. నేను మాట యిచ్చాను

పాండవులు క్రమంగా ప్రయాణిస్తూ, ఏక చక్ర పురమనే అగ్రహారము చేరుకున్నారు. అక్కడ ఒక బ్రాహ్మణుల ఇంటి పంచలో దిగారు. వైదిక వృత్తిలో కాలక్షేపం చేస్తున్నారు. ఒక నాడు కుంతీ, భీముడు ఇద్దరే విడిదిలో ఉన్నారు. తక్కిన వారు భిక్షానికి వెళ్ళారు. ఒక పెట్టున ఆ ఇంటి వారంతా గొల్లుమన్నారు. పాపం వీరికి ఏమి కష్టమొచ్చిందో! మనకు ఆశ్రయమిచ్చారు. మంచివారు, వీరికి మనము ఏదయినా ప్రత్యుపకారము చేయాలి అని అనుకొంటూ ఉండేదాన్ని, అని అన్నది కుంతి. ఈ సమయములో మనము వారిని ఆదుకోవాలి అని చెప్పింది కుంతీ దేవి. తప్పకుండా చేద్దాము. వెళ్ళి విషయమేమిటో కనుక్కుని రమ్మని అన్నాడు భీముడు. కుంతీ దేవి వెళ్ళి వచ్చింది. నాయనా! భీమ సేనా! నేను వారికి మాట యిచ్చాను. నీవు నెరవేర్చాలి. ఇక్కడ యమునా నది గట్టుమీద భకుడనే రాక్షసుడున్నాడు. వాడు ఊరి మీద పడి ప్రజలను మారి మసిగినట్లు తినేవాడట. ఒక నాడు ఊరి పెద్దలంతా సభ చేసి ఒక కట్టడి చేసుకున్నారంట. రాక్షసుడు ఊరిమీదకు రాకూడదు, అక్కడే ఉండాలి, ప్రతి దినం ఒక ఇంటి వరుస ప్రకారం ఒక మనిషి, రెండు దున్నపోతులకు కట్టిన బండి నిండా అన్నము పంపిస్తాము అని. రాక్షసుడు బండెడు కూడు, రెండు దున్నలు, ఒక మనిషిని మొత్తం స్వాహా చేస్తాడట. ఈ దినం మన ఇంటి బ్రాహ్మణుని వంతు వచ్చింది. భకునికి ఆహారంగా నేను పోతాను అని గృహస్తు, వద్దు నేనే పోతానని ఇల్లాలు, మీరిద్దరూ వద్దు ఎప్పుడైనా ఇల్లు దాటి వెళ్ళే దాన్నే కదా అని కూతురు ఒకరినొకరు కౌగిలించుకుంటూ ఏడుస్తున్నారు. నేను మాట యిచ్చాను, నా కొడుకుని పంపుతానని. ఇదీ సంగతి అని చెప్పింది కుంతీ. నేనంత బుద్ధిలేని దాన్ని కాను

అంతా విని భీముడు ఇంతేనా, నేను పోతాను, నాకు కడుపునిండా అన్నము పెట్టించు అన్నాడు, ఉల్లాసంగా ఉన్నాడు. ఇంతలో భిక్షానికి వెళ్ళిన సోదరులువచ్చారు. భీముని వాలకము చూసేసరికి ధర్మరాజుకు అనుమానం కలిగింది. వీడు ఎవరితోనో పోట్లాటకు తయారైనాడే, అని తల్లిని అడిగాడు. సంగతి తెలుసుకున్నాడు. అమ్మా! నీకు వెర్రా? పిచ్చా?, భీముడు నీకు బరువయ్యాడా? తల్లికి నలుగురు కొడుకులుంటే దురదృష్టవశాత్తు వారిలో ఒకడు కుంటో, గుడ్డో అయితే తల్లి వాడిని కూడా ప్రేమిస్తుందే కానీ, పోగొట్టుకోవడానికి అంగీకరించదు. నీవు భీముని రక్కసునికి ఆహారముగా ఇస్తావా? అను ఆక్రోశించాడు ధర్మరాజు. భీముడు నవ్వాడు. తల్లి కూడా నవ్వుతూ, నీవు భీమ సేనుని ఆ ఏటి గట్టున ఉండే భకునికి లోకువ అని భావిస్తున్నావా? నేనంత బుద్ధి లేని దాన్ని కాదు. వీడు వజ్ర శరీరుడు. వీడు పుట్టిన పదవ రోజున నా చేతిలోనించి జారి క్రింద పడ్డాడు. అది కఠిన శిలా ప్రదేశము, వీడికి ఏమైనా దెబ్బ తగిలిందేమోనని భయపడ్డాను. తీరా చూస్తే వీడి శరీర భారానికి కొండ రాయి నుగ్గయిపోయింది. వీడు అంత గట్టి వాడు. మనకు నిలువ నీడ యిచ్చిన ఈ కుటుంబానికే కాదు, ఈ ప్రదేశానికి రాక్షస బాధ లేకుండా చేయాలని నా ఉద్దేశము, మీరేమి భయపడవద్దు అని సమాధానమిచ్చింది కుంతీ దేవి. భీముడు భకుని వధించాడు.

పాంచాల దేశానికి ప్రయాణము

పాంచాల పతి ద్రౌపతీ స్వయంవరం చాటించాడు. నానాదేశాదీసులైన రాజ పుత్రులు, ధృపద రాజ్యానికి వెళుతున్నారు. బ్రాహ్మణులు గుంపులు, గుంపులుగా బయలుదేరారు. కుంతీ దేవి కుమారులతో ఇలా అన్నది. నాయనలారా! మనమిక్కడికి వచ్చి చాలా రోజులు అయింది. ఒకే చోట పాదుకొని ఉండుట దేనికి, వెళదాము, దక్షిణ పాంచాల దేశము సుభిక్షంగా ఉందని, అక్కడి ప్రజలు బ్రాహ్మణులకు ఆప్యాంగా లడ్లు, పాలు, పెరుగు, భోజనము పెట్టి సత్కరిస్తారని, వింటున్నాము అని అన్నది. వారికి ముందే వెళ్ళాలని అభిప్రాయముంది. తల్లి హెచ్చరించేసరికి మూపులు మూడయ్యాయి. బయలు దేరారు. ధృపద పురం ఛేరుకున్నారు. ఊరంతా కిటకిటలాడుతూ ఉంది. ఎక్కడ చూసినా, పెద్దపెద్ద గుడారాలు, రాజబటులు, రథాలు ఒకటే సందడి. తమకి విడిది ఎక్కడ దొరుకుతుంది. ఒక కుమ్మరి శెట్టి ఇంట్లో దిగారు. మృగచర్మాలు, నార చీరలు, విభూది పట్టెలు, వేద ఘోష అచ్చంగా బ్రాహ్మణమూర్తులై నివురు గప్పిన నిప్పుల్లా ఉన్నారు. తల్లి విడిదిలోనే ఉంది. కొడుకులు ఐదుగురు స్వయంవర సభకు వెళ్ళారు.

ద్రౌపతి స్వయంవరం

ద్రౌపతి కలువ పువ్వు వంటి నల్లని మూర్తి, త్రిలోక సుందరి, తెల్లని పూదండ చేత బట్టుకుని, మన్మధుని ఆరవ బాణము లాగా నిలుచుని ఉంది. రాజ లోకమంతా మూగి ఉన్నారు. మంగళ వాది ద్వనులు రకరకాల జనుల సందడి, సముద్రపు ఘోషను అనుకరిస్తున్నాయి. ద్రౌపతి సోదరుడు దుష్టద్యుమ్నుడు ముందుకు వచ్చాడు. చెయ్యెత్తి నిశ్శబ్దముగా ఉండమని కోరాడు. అక్కడ గంధ, పుష్ప దీపార్చితమైన పెద్ద విల్లు, అమ్ములు, ఆకాశములో నిలిపిన కన్యక మత్శ్య యంత్రము చూపాడు. ఈ కార్ముకమునెక్కుపెట్టి ఐదు బాణాలతో ఆ లక్ష్యాన్ని ఎవరు చేదిస్తారో వారిని మా కన్య వరిస్తుంది అని ప్రకటించాడు. ఉత్సాహంతులైన రాజ పుత్రులందరూ ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. ఇక క్షత్రియ వీరులలో ముందుకు వచ్చే వారు ఎవరూ కనబడలేదు. అప్పుడు బ్రాహ్మణ్యములో నుండి బ్రాహ్మణ వేష దారి అర్జునుడు ముందుకు వచ్చాడు. విల్లు తీసుకున్నాడు. లక్ష్యము ఛేదించాడు. ద్రౌపతి అతనికి పూల దండ వేసింది. ఐదుగురు పంచుకోండి

బ్రాహ్మణులంతా ఉబ్బితబ్బిబ్బయి నాట్యము చేశారు. క్షత్రియులకు తల గొట్టినట్లయింది. కడుపుమంటతో కౌరవులు గలాటా చేశారు. కృష్ణ బలరాములు వినోదము చూస్తూ కూర్చున్నారు. సద్దుమణిగిన తరువాత భీమార్జునులు ద్రౌపతిని తోడ్కొని విడిదికి వెళ్ళారు. అంతకు ముందే ధర్మరాజు నకుల సహదేవులు వెళ్ళారు. గాండీవి ఉత్సాహంగా పొంగిపోతూ అమ్మా! భిక్ష తెచ్చా అన్నాడు. పెళ్ళికూతురు వెనుక ఉంది. కుంతి తల ఎత్తి చూడకుండా, ఎప్పటిలాగే ఐదుగురు పంచుకోండి నాయనా! అన్నది. తీరా చూస్తే భిక్ష కాదు మృగాక్షి. కుంతీ దేవి నాలుక కొరుక్కుని అయ్యో! నాయనా! ఎంత మాట అన్నాను!! భిక్ష అంటే భిక్షే అనుకున్నాను, నా మాట మీరెప్పుడు జవ దాటి ఎరుగరు. ఇప్పుడేటి మార్గము అని విచారించింది. ముందే వ్రాసిపెట్టాడు

ద్రౌపతి రంగు నలుపే అయినా, రూపు సచీ దేవికి పై చేయిగా ఉంది. ఆ కన్యను చూస్తే పాండవులు అయిదుగురికి అభిలాష కలుగుతూ ఉంది. భీముడు హిడింబిని స్వీకరించేటప్పుడు తక్కిన నలుగురు చూశారు కదా, ఎవరికి అటువైపు మనసు పోలేదు. ఇప్పటి పరిస్ధితి తద్భిన్నంగా ఉంది. ధర్మరాజు ఈ రహస్యం గ్రహించాడు. కుంతితో అన్నాడు అమ్మా! నీ మాట మేమెప్పుడు కాదనలేము. ఇప్పుడు కూడా కాదనము, ద్రౌపతిని మేము ఐదుగురము పెండ్లాడతాము, చిక్కు విడిపోయింది. కానీ ద్రుపదుడు ముక్కు నలుచుకున్నాడు. ఇదెక్కడి న్యాయమన్నాడు. అంతలో వేద వ్యాసుల వారు దయ చేశారు. ద్రౌపతి పుట్టు పూర్వోత్తరాలు వివరించి ఈ కన్యకు భర్తలు ఐదుగురు అని బ్రహ్మ ముందే వ్రాసిపెట్టినాడు, తల్ప్పు లేదు కానీవండి అని సలహా యిచ్చాడు, పెళ్ళి జరిగింది. కుంతి నోటి వెంట ఒక మాట వస్తే అది జరిగి తీరవలసిందే. పాండవులకు అర్ధరాజ్యం

పాండవులు ద్రుపద పురములో ఇష్టోపభోగాలు అనుభవిస్తూ ఉన్నారు. ఈ వార్త హస్తినాపురము చేరింది. పాండవులు బ్రతికి బయట పడటమే కాక, చుట్టాల ప్రాపు సంపాదించుకున్నారు. దుర్యోధనునికి నడుములు విరిగినంత పనయింది. తిరిగి కౌంతేయులకు చెరుపు చేయాలని చూశాడు. పాండవులు ఇంద్ర ప్రస్త పురం నిర్మించుకుని, దిగ్విజయం చేసి రాజసూయయాగం నిర్వహిస్తున్నారు. కన్నుకుట్టి దుర్యోధనుడు ఏడుస్తున్నాడు. పుత్రుని పట్టాభిషేకము జరిగింది. రాజసూయయాగం చూసింది కుంతీ దేవి. ధన్యురాలిననుకున్నది. కానీ అచిర కాలములోనే విధి వక్రించింది. శకుని మాయ జూదములో పాండవ సంపదనపహరించి దుర్యోధనునికి యిచ్చాడు. కుంతీ చెప్పరానంత బాధ అనుభవించింది. కుంతీ సందర్శనం

పాండవులు జూదములో ఓడి అడవుల పాలయినపుడు కుంతి హస్తినాపురములోనే ఉంది. పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసము, ఒక ఏడు అజ్ఞాత వాసము పూర్తి చేసి బయట పడ్డారు. తమని ఒక కంట చూడమని గుడ్డిరాజుకు విన్నవించుకొన్నారు. లాభము లేకపోయింది. యుద్ధానికి సిద్దపడుతూ ఎందుకైనా మంచిదని, శ్రీ కృష్ణుని రాయభారిగా హస్తినాపురికి పంపించారు. రాయభారం విఫలమయింది. శ్రీ కృష్ణుడు తిరిగి వెళుతూ కుంతీ దేవి గృహద్వారము వద్ద బండి నిలిపి లోపలికి పోయి ఆమెను సందర్శించాడు. సపరివారముగా దృతరాష్టుడు అక్కడికి వచ్చాడు. శ్రీ కృష్ణుడు కుంతీ దేవి పాద పద్మాలకు నమస్కరించి, కౌరవ సభలో జరిగిన కథను వివరించాడు. నేను తిరిగి వెళుతున్నాను, కొడుకులకు నేవేమి సందేశమిస్తావో ఇవ్వమంటాడు. సంకోచం లేని సందేశం

ఇన్నాళ్ళు దాయాదుల పంచలో పడి ఉండి పల్లెత్తి ఒక మాట కూడా అనకుండా ఉన్న కుంతీ, ద్రతరాష్టుడు మొదలైన పెద్దలు ఉన్నారని సంకోచించకుండా, పరమ కఠినముగా మాట్లాడింది. అయ్యా! కృష్ణా నేనొకటే మాట చెపుతాను. రాజులకు పరాక్రమ జీవనం వృత్తి. వంశధర్మం. పూర్వభూపతుల ముచికుందుడు, సృంజయుడు, మున్నగువారు ఎలా బ్రతికారో యుదిష్టరుడు విని ఉంటాడు. నీవు నడిపిన రాయబారము బాగానే ఉంది. కౌరవులకు పాండవులకు పొత్తు కుదరదు. సంధి చెడిపోవడము మంచికే జరిగింది. కొలువులో కొప్పు పట్టి ఈడ్చి ఇల్లాలిని అవమానించిన విషయం నాకొడుకులు మరచారా? ఆనాడు సభలో చేయి చేసుకోవడానికి వీలు లేకపోయింది. ఇప్పుడేమయింది. కీర్తిలేని బ్రతుకెందుకు, పౌరుషముతో బ్రతకండి అని చెబుతాను ఇంతకంటే చెప్పలేని అని అన్నది. శ్రీ కృష్ణుడు వెళ్ళాడు, యుద్ధము తప్పదని ధ్రువపడింది, కుంతి ఇటు పాండవులకు అపాయమయిన, అటు కర్ణుడికి అపాయమయినా ఓర్చుకోలేదు. నీవూ నాపుత్రుడివే

కుంతీ కర్ణుని కలవడానికి వెళ్ళి నాయనా! నీవు నా కుమారుడవు. పాండవులు నీకు సోదరులు అని జరిగిన వృత్తాంతమంతా వివరించింది. కనుక నీవు పాండవులకు హాని కలుగ చేయవద్దని కోరింది. కర్ణుడు హాని చేయనని మాట యిచ్చాడు. కుంతీ ఆ మాట అనగానే సూర్యబింబము నుండి ఒక

మూలాలు

  1. "కుంతిదేవి". www.padyalavaidyudu.blogspot.in/. Retrieved 2014-02-06.

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!